Thursday, December 8, 2022

ఇదే మన ప్రస్తుత భారతం!

మన దేశం ప్రస్తుతం ఇలా నడుస్తున్నదని చెప్పడానికి దృష్టాంతాలనదగ్గ కొన్ని విషయాలు ఈ జూలై మాసంలోనే జరగడం యాదృచ్చికమే కావచ్చు కాని, వాటిని ఒక దగ్గర పెట్టి చూడడం కొన్ని కొత్త ఆలోచనలకు తావిస్తోంది. ఘనత వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఏలుబడిలో ఉన్న గోవా రాష్ట్రపు కళలు, సాంస్కృతిక శాఖ మంత్రి గోవింద గావుడే తన ధ్వంస పాలన కొనసాగిస్తూనే ఉ న్నారు. పంజిమ్ లో ఉన్న ఓపెన్ ఆడిటోరియంను కూల్చేందుకు సిద్ధమయ్యారు. ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ ఛార్లెస్ కొర్రీ మన దేశంలో రూపొందించిన మొదటి భవనం ఈ కళా అకాడెమీయే. ఇప్పటివరకు సాంస్కృతిక రంగంలో గోవాకే కాకుండా, మన దేశానికే ఒక సంతకం మాదిరిగా ఉన్న ఈ భవనాన్ని సంరంక్షించుకోవాల్సింది పోయి, కూల్చేద్దామనే నిర్ణయానికి వచ్చారు అక్కడి ఏలికలు. అలాంటి భవన నిర్మాణానికి సదరు మంత్రిగారు టెండర్లు పిలవ లేదు. అడిగితే, ‘తాజ్మహల్ కట్టడానికి షాజహాన్ టెండర్లు పిలిచాడా?’ అని తిరిగి ప్రశ్నిస్తున్నాడు. ప్రజాస్వామిక స్ఫూర్తికి మన ప్రభుత్వం ఇస్తున్న అమిత ప్రాధాన్యం చూస్తే ఎవరికయినా కళ్లమ్మట నీళ్లు రాక మానవు! ఇలాంటి వాటికి సమర్దనగా వాట్సాప్ యూనివర్శిటీలో వెంటనే సందేశాలు చేరిపోతాయి. పార్టీ క్యాడరు మానసిక స్థైర్యాన్ని ఇచ్చే పని చేపడతాయి.

Determined to rejoin college as haven't violated any rules: Professor  Saibaba | Latest News India - Hindustan Times
ప్రొఫెసర్ సాయిబాబా, భార్య వసంత

ప్రమాదకరంగా ఫేక్ న్యూస్

మనం పెద్దగా పట్టించుకోని ఒక వార్తను రెస్ట్ ఆఫ్ వరల్డ్ డాట్ ఆర్గ్ అన్న వెబ్ పత్రిక ప్రచురించింది. రేజర్ పే అన్న పేమెంట్ వెబ్ సైట్ తమ సంస్థద్వారా విరాళాలు, చందాలు కట్టినవారి వివరాలను ప్రభుత్వానికి అందించిందట. అంటే ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్న ది వైర్ లాంటి వెబ్ పత్రికలకు ఆర్థిక సహాయం ఏ రూపంలో అందుతున్నా, ప్రభుత్వం దానిపై నిఘా వేస్తోందన్న మాట. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. న్యాయం అందడానికి మన దేశంలో ఏళ్లకు ఏళ్లు పట్టే మాట నిజమే కాని, ప్రస్తుతం కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య కోటిని దాటిందని ఈ నెలలోనే మనకు తెలిసింది. ఈ పెండింగ్ కేసులలో అంటే కోర్టులలో విచారించడానికి ఇంకా సమయం పడుతున్న కేసుల్లో 76 శాతం మంది జైళ్లల్లో మగ్గుతున్నారు. వారిలో చాలామంది నేరగాళ్లు ఉండవచ్చు కాని కొంతమందైనా నిర్దోషులు ఉంటారు. వారు జైళ్లలోనే ఉంటూ తమ నిర్దోషిత్వం నిరూపించుకునే అవకాశం కూడా పొందడం లేదు. ఇందులో సగానికి పైగా రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టబడిన వారే కావడం విశేషం. 2019 తరువాత అక్రమ నిర్బంధాల సంఖ్య ఏటికేడాది పెరిగిపోతోంది. రెండు కాళ్లూ పనిచేయకుండా చక్రాల కుర్చీకే పరిమితమైన సాయిబాబా మహారాష్ట్రలో దొంగతనం చేసి ఢిల్లీ పారిపోయాడని కేసు పెట్టి నాలుగేళ్లుగా అండాసెల్ లో బంధించారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా చితికిపోయింది. ఆయన జీవితకాలాన్ని కుదించిన నేరం మన ప్రభుత్వానిదే. జైలులో సరైన సౌకర్యాలు లేక వృద్ధుడైన స్టాన్లీస్వామి ఎంతో యాతన పడి మరణించారు.

Also read: వారు చేసే తప్పు.. మనం చేస్తే ఒప్పు

వారు చేసిన నేరమల్లా గొంతులేని ప్రజలకు గొంతునివ్వడమే. ఇలాంటి వారిని పట్టించుకునే నాధుడే లేడు. అందులో బాగా పేరుపొందిన వారి గురించి అంతర్జాతీయ సమాజం భారతదేశాన్ని నిలదీసి అడుగుతోంది. ఆ వివరాలు మాత్రమే పత్రికలలో వస్తే ప్రజలకు తెలుస్తున్నాయి. మిగలిన వారి విషయంలో అతీగతీ లేదు. అలా వివిధ దేశాల మేధావివర్గం వివిధ రూపాలలో తీస్తా సెతల్వాద్ విషయంలో ప్రభుత్వంపై బాగా వత్తిడి తెస్తున్నది. కాంగ్రెస్ నేతృత్వపు ప్రభుత్వం వినాయక్ సేనను అరెస్టు చేసినప్పుడు ఇదే జరిగింది. ఇప్పుడు ఈ ఆక్రమ అరెస్టులు వందల సంఖ్యలో జరుగుతుండడం విచిత్రం. వ్యక్తుల చర్యలు ప్రభుత్వాలను వణికించేలా చేస్తున్నాయి. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో తీస్తా సెతల్వాద్ ప్రత్యేక చొరవతో అనేక కోర్టులను కదిలించి బాధితులకు న్యాయం జరిగేలా చేసిన కృషికి ప్రభుత్వం అందించిన బహుమతి ఈ అక్రమ అరెస్టు. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించకూడదని భీష్మించుకు కూర్చున్న న్యాయమూర్తులు తీర్పులు కూడా యథా రాజా తథా న్యాయం అన్న నానుడిని నిజం చేస్తున్నారు.

Falling Rupee A Mixed Bag For Industry, Software Companies Set To Gain -  Goodreturns
డాలర్ పెరుగుతోంది, రూపాయి తరుగుతోంది

రోజురోజుకూ అట్టడుగుకు!

గోరుచుట్టు మీద రోకటి పోటులా రూపాయి రోజు రోజుకూ డాలర్తో పోటీపడలేక విలువను దిగజార్చుకుంటూ ఈ మాసంలో 80 రూపాయలకు చేరుకుంది. దీనికి కూడా వాట్సాప్ యూనివర్శిటీ తప్పుడు గణాంకాలతో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసింది. హార్వర్డ్ గోల్డ్ మెడలిస్ట్ (అంటే మన్మోహన్ సింగ్) హయాంలో 2008లో డాలర్ 39 రూపాయలు ఉండగా 2014 నాటికి 68 రూపాయలకు చేరిందని, చాయ్ వాలా (అంటే మోదీ) హయాంలో 2014లో 68 రూపాయలు ఉన్న డాలర్ విలువ 69 రూపాయల వద్ద నిలకడగా ఉందని శుద్ధ అబద్దం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నిజం ఏమిటంటే, 1947 లో (జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో) డాలర్ మారకవిలువ 3 రూపాయలు ఉండగా, 1966 నాటికి (ఇందిరాగాంధీ హయాంలో) ఏడున్నర రూపాయలకు, 1984 నాటికి (రాజీవ్ గాంధీ హయాంలో) పన్నెండు రూపాయలకు, 1991 నాటికి (పివి హయాంలో) 17 రూపాయలకు, 1996 నాటికి (వాజ్ పేయి హయాంలో) 32 రూపాయలకు, 2004 నాటికి (మన్మోహన్ సింగ్ అధికారం చేపట్టినపుడు) 43 రూపాయలకు 2014 నాటికి (మన్మోహన్ పదవి వైదొలగి, నరేంద్ర మోడీ అధికారం చేపట్టేనాటికి) 59 రూపాయలకు చేరుకున్న డాలర్ విలువను స్వయంగా మోదీసార్ కరోనా రాకముందుకే 70 రూపాయలకు దిగ్విజయంగా చేర్చి, ఈ రెండేళ్లలో 80 రూపాయలకు పట్టుకెళ్లారు.

Also read: సభ ముగిసింది.. సందేశం చేరింది..

జమ్ము- కశ్మీర్ లో జులై 13న అమరవీరుల దినోత్సవం జరుపుకోకుండా మోడీ ప్రభుత్వం ఇన్నాళ్లుగా వస్తున్న ఆచారాన్ని బ్రేక్ చేసింది. ఆ రోజు పబ్లిక్ సెలవుదినాన్ని వారి కాలెండర్‌నుంచి రద్దు చేసింది. 13 జులై 1931న డోగ్రా పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న ఒక ర్యాలీని చెల్లాచెదురు చేస్తూ జరిపిన కాల్పులలో 22మంది యువకులు చనిపోయారు. వీరిని స్వతంత్ర కశ్మీరం కోసం అమరులైన తొలి వీరులుగా కశ్మీర్ ప్రజలు భావిస్తారు. ఆ సందర్భంలో స్థానిక నేత అబ్దుల్ ఖాదిరను అరెస్టు చేశారు. దీనిపై పెల్లుబికిన నిరసన యావత్ రాష్ట్రమంతా అల్లుకుని ముస్లిం కాన్ఫరెన్సుగా, తదనంతరం నేషనల్ కాన్ఫరెన్స్ గా ఎదగడం మనకు తెలిసిందే. ఆ తొలి అమరవీరులను స్మరించుకోవడానికి వచ్చిన సందర్భపు సెలవుదినాన్ని సైతం మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. నోట్ల రద్దు కలిగించిన తీవ్రఘాతం నుంచే ఇంకా తేరుకోలేని భారత ప్రజలు ఇలాంటి చిన్నచిన్న షాకుల గురించి పట్టించుకోవడం మానేశారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా దేశమంతా లా డౌన్ విధించి, కోట్లాది వలస కార్మికులు కాలి నడకన ఇంటికి చేరేలా చేసి, కూలిజనం పిట్టల్లా రాలి చనిపోయినప్పుడు కనీస మాత్రంగా పట్టించుకోని మోదీ ప్రభుత్వాన్ని క్షమించేసి మరోసారి అందలమెక్కించిన భారతీయ ప్రజలను ఓ పట్టాన అర్థం చేసుకోలేం.

Who is Ajit Doval, NSA Ajit Doval, National Security Advisor Ajit Doval

లోగుట్టు ఎవరికెరుక!

చాలా రోజుల కిందట జరిగిన ఒక సమావేశం గురించి ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ఒక వార్త ప్రచురించింది. కరోనా రావడానికి కొద్ది రోజుల ముందు అంటే 2020 ఫిబ్రవరిలో పారిస్ లోని అథెనీ ప్లాజా హోటల్ లో అమెరికాకు చెందిన కొంతమంది వ్యాపార ప్రతినిధులు మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో రహస్యంగా సమావేశమయ్యారు. ఆ వ్యాపారస్తులు భాగస్వాములుగా ఉన్న దేవాస్ మల్టీమీడియా కంపెనీతో కుదుర్చుకున్న ఒక టెలికాం కాంట్రాక్టును 2011లో భారత ప్రభుత్వం రద్దు చేసింది. దానిపై వారు ఏళ్ల తరబడి ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తున్నారు. అప్పుడే ట్రిబ్యునల్ వెలువరించిన ఒక తీర్పులో డామేజ్ చార్జీల కింద 500 మిలియన్ డాలర్లతో పాటు వడ్డీ కింద మరిన్ని వందల మిలియన్ డాలర్ల జరిమానాను ట్రైబ్యునల్ విధించింది. మొత్తానికి ఆ మీటింగ్ అయిన తరువాత ప్రభుత్వం వేసిన ఒక సిబిఐ విచారణ ఆగిపోయింది. ఏదో అంగీకారం జరిగినట్టుగానే ఉంది. తరువాత దేవాస్ అడ్రస్ ఇండియాలో లేదు.

Also read: కార్పొరేట్ల మాయ.. గ్రేడ్ల గారడీతో విద్యావ్యవస్థకు తుప్పు

Meet Indian scientist Hashima Hasan, who helped launch NASA telescope
డాక్టర్ హషీమా హాసన్

పంజాబ్ యూనివర్శిటీ ఎమ్మే పొలిటికల్ సైన్స్ సిలబస్ లో జర్నైల్ సింగ్ బింద్రన్ వాలేను టెర్రరిస్టుగా అభివర్ణించారని శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. కేంద్రం కొత్తగా ప్రవేశపెడుతోన్న అగ్నిపథ్ మిలిటరీ నియామకాల పథకంలో దేశ యువత నుంచి కేంద్ర ప్రభుత్వం ఊహించని రీతిలో నిరసన వ్యక్తమైంది. అయితే మిలటరీ ఉద్యోగులకిచ్చే జీతాల కంటే పెన్షన్లకు అయ్యే ఖర్చు ప్రభుత్వాలను భయపెడుతోంది. దీనినుంచి ఎలా తేరుకోవడమో తెలియని ప్రభుత్వం ఒక నమూనాతో ముందుకొచ్చింది. దీనికంటే మెరుగైన ప్రత్యామ్నాయాలను సూచించని ప్రతిపక్షాలు ఊరికే నిరసనలు తెలిపితే సరిపోదు. దీనికి భిన్నంగా ఈ అగ్నిపథ్ ద్వారా 1947 త్రైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారని, భారతీయ గూర్ఖాల నియామకాల్లో మునుపటి నిబంధనలను అతిక్రమిస్తున్నారని నేపాల్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇప్పటివరకు మనిషి నిర్మించిన అతిపెద్ద అంతరిక్ష టెలిస్కోపు జేమ్స్ వెబ్ స్పేస్ అందించిన విశ్వపు ఫోటోలు ముచ్చట గొలుపుతున్నాయి. దీనిని నిర్మించిన ముగ్గురు శాస్త్రవేత్తలలో ఒకరు భారతీయురాలు. లక్నోలో పుట్టిన డాక్టర్ హషీమా హాసన్ కు జయహోలు.

Also read: మనిషి నిజనైజం పోరాడడమే!

దుప్పల రవికుమార్

రవికుమార్ దుప్పల
దుప్పల రవికుమార్ సిక్కోలు బుక్ ట్రస్ట్ ప్రధాన సంపాదకులు. ఆంగ్ల అధ్యాపకులు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మొబైల్ : 99892 65444

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles