Monday, November 28, 2022

చారిత్రాత్మక అవార్డు వాపసీకి అయిదేళ్ళు!

అశోక్ వాజపేయీ

2015-17లలో వరుసగా జరిగిన రచయితల, హేతువాదుల హత్యల్ని తీవ్రంగా నిరసిస్తూ ప్రముఖ హిందీ కవి, లలిత కళా అకాడెమీ మాజీ చైర్మన్, భోపాల్ భారత్ భవన్ ట్రస్టీ, మాజీ ఐఏఎస్ అధికారి అశోక్ వాజపేయీ తన సాహిత్య అకాడెమీ అవార్డును వెనక్కి తిప్పి పంపారు. అంతకు ముందు, మొదట మరో హిందీ కవి ఉదయ్ ప్రకాష్ తన అకాడెమీ అవార్డును వెనక్కి పంపించారు. ఆ తరువాత నెహ్రూ మేనకోడలు నయనతారా సెహగల్ తన ఇంగ్లీషు రచనకు వచ్చిన అకాడెమీ అవార్డు తిప్పిపంపి, అకారణంగా హత్యలు జరుగుతూ ఉండడాన్ని తీవ్రంగా నిరసించారు. కర్ణాటకలో మరో ఆరుగురు రచయితలు తమ రాష్ట్రస్థాయి అవార్డుల్ని కర్ణాటక పరిషత్ కు తిప్పిపంపారు. ఎప్పుడో స్వీకరించిన అవార్డుల్ని ఇప్పుడు తిప్పి పంపడమేమిటని ఒక వాదన వినిపించింది. రచయితలుగా తమ అసంతృప్తిని, అసహనాన్ని ప్రభుత్వానికి బలంగా తెలియజేయడానికి వారు ఎన్నుకున్న మార్గమది. మూఢనమ్మకాల్ని వ్యతిరేకిస్తే హత్య, ఎవరో ఒకరు బీఫ్ తింటే హత్య, తమకు నచ్చనిది రాసినా, ప్రచారం చేసినా హత్యే- పరిష్కారమైతే, మరి దేశంలో భావస్వాతంత్ర్యమెక్కడ ఉన్నట్టూ? ధర్నా, హర్తళ్, నిరాహారదీక్ష, బంద్ ల్లాగా – చయితలు రచయితల్లాగా వారు  చేయాలనుకున్నది వారు చేశారు. తమ అభ్యంతరాన్ని నిరసనని ప్రభుత్వానికి నేరుగా తెలియజేశారు. ఆ స్వేచ్ఛ వారికుండాలి. తోటి రచయితలే కాదు, మామూలు ప్రజానీకమంతా వారికి వెన్నుదన్నుగా నిలబడ్డారు. సాహసోపేతమైన వారి చర్యను బలపర్చారు.

Also read: నాటి దీపదానోత్సవమే నేటి దీపావళి!

అశోక్ వాజపేయీ వైశిష్ట్యం

పరిపాలనా రంగంలో విశేషమైన అనుభవం గల అశొక్ వాజపేయీ దేశ రాజధానిలో సాంస్కృతిక శాఖ సెక్రటరీగా పని చేశారు. మహాత్మాగాంధీ అంతరాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్ గా ఉన్నారు. భోపాల్ లోని భారత్ భవన్ కు ట్రస్టీ మాత్రమే కాకుండా దానికి చైర్మన్ గా కూడా ఉన్నారు. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ అర్ట్స్ కు చైర్మన్ గా, సంగీత నాటక అకాడెమీకి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా – ఇలా చాలా సంస్థలకు ఊపిరియై తన బాధ్యతలను నిర్వహించారు. అంతటిపని ఒత్తిడిలో ఉంటూ కూడా ఇరవైకిపైగా కవితాసంపుటాలు ప్రచురించారు. పోలాండ్ కు చెందిన నలుగురు కవుల్ని హిందీలోకి అనువదించారు. పరిపాలనా బాధ్యతల్లో తలమునకలై ఉండి కూడా కవిత్వపు సున్నితత్వాన్ని, భావుకతను ఆయన నిలుపుకున్నారు. ‘‘కహీ నహీ వహీ’’ అనే కవితా గ్రంథానికి ఆయనకు సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. సీతాకాంత్ మహాపాత్ర, కేకీ ఎన్ దారూవాలా, సచ్చిదానందన్ ల లాగా సివిల్ సర్వెంట్ గా ఉంటూ అగ్రశ్రేణి కవిగా నిలబడగలిగారు. భోపాల్ భారత్ భవన్ ట్రస్టీగా ఉన్న రోజుల్లో జాతీయ సమావేశాలకు నన్ను రెండు సార్లు ఆహ్వానించారు. 1987, 89లలో భారత్ భవన్ అతిథిగా ఉంటూ రెండు వారాల పాటు ఆయన పరిపాలనా దక్షతను చూడగలిగాను. ఇతర భారతీయ రచయితలందరిలాగానే ఆయన ఆత్మీయతను అనుభవించగలిగాను.  ఒకటి రెండు సార్లు ఇంటికి పిలిచి విందులిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. రచన అన్నా, రచయితలన్నా ఆయనకు అమితమైన ప్రేమ. అందుకే దేశంలో జరుగుతున్న రచయితల హత్యలను ఆయన జీర్ణించుకోలేకపోయారు.

కేకీ దారూవాలా, నయనతారా సెహగల్

ప్రపంచ కవితోత్సవం

దేశ రచయితలే కాదు, విదేశీ రచయితలక్కూడా ఆయన ఆత్మీయుడే. ప్రపంచ కవుల్ని ఆహ్వానించి 1989 జనవరిలో భోపాల్ భారత్ భవన్ లో ప్రపంచ కవితోత్సవం నిర్వహించారు. నలభై దేశాల నుండి ప్రసిద్ధ కవుల్ని ఆహ్వానించి ఇక్కడ కవితోత్సవం నిర్వహించడమంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని? అది మామూలువారితో సాధ్యమయ్యే పనేనా? 1987లోవెళ్ళినప్పుడు ఆయన నా కవితల్ని, కథల్ని శ్రద్ధగా విన్నారు కాబోలు, రెండేళ్ళ తర్వాత మళ్ళీ 1989లో నేను తెలుగు సాహిత్యానికి ప్రాతినిథ్యం వహించినపుడు ఆయన అన్న మాటలు గుర్తున్నాయి. ‘‘దేవరాజ్ మాహారాజ్ కో బులాతే రహియే…మహారాజ్ ను ఆహ్వానిస్తూ ఉండండి. కవిత్వం, కథ, వ్యాసం అన్నీ వరసబెట్టి చెప్పిపోతాడు’’ అని జోక్ చేశారు అధ్యక్షస్థానం నుండి అశోక్ వాజపేయి. సభికులు గొల్లుమన్నారు. అరనిముషమాగి కళ్ళద్దాల పై నుండి సభికుల్ని చూస్తూ ‘‘ఆయన రచనలో నిజాయితీ ఉంది. దానికి మీరు నవ్వలేరు’’- అని ఈ సారి సభికుల్ని జోక్ చేసి ఆయనొక్కరే నవ్వారు. వేదిక మీద ఉన్నా, ప్రేక్షకుల్లో ఉన్నా సాహిత్య చర్చల్ని రసవత్తరం చేస్తూ ఉండడం ఆయన నైజం! ఉన్నత పదవులు చేపట్టి ఉన్నత స్థాయికి చేరినవారు దేశంలో చాలా మందే ఉన్నారు. కాని ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు దిగివచ్చి, బాధితుల పక్షాన నిలబడడం విలువల్ని పరిరక్షించే బాధ్యతను తీసుకోవడం చాలా కొద్దిమందే చేస్తారు.అలాంటి కొద్దిమందిలో అశోక్ వాజపేయీ ఒకరు!

Also read: శాస్త్రీయ అవగాహన పెంచిన కొడవటిగంటి వ్యాసాలు

‘‘మారే జాయేంగే రావణ్, జయ్ హోంగే రామ్

పర్ జో పూల్ బనాయింగె ఓ ఇతిహాస్ మె బందర్ కహలాయింగె’’

ఆధునిక హిందీకవి ‘ఆజ్ఞేయ’ కవితా చరణాలు అవి! రావణుడు చంపబడతాడు. రాముడు విజయుడవుతాడు. వంతెన నిర్మించినవారు మాత్రం ‘కోతులు’గా పిలవబడతారు. ఇప్పుడు సమాజంలో రచయితల విషయం అలాగే ఉంది. నిరంతరం జాగరూకులై స్వేచ్ఛకోసం, విలువల కోసం సంఘర్షిస్తున్న రచయితల కృషిని తక్కువగా చేసి చూపడం జరిగింది. అందుకు ఉదాహరణలుగా నాటి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ మాటలూ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాటలూ గమనించొచ్చు. ‘‘అవార్డులు వాపస్ చేస్తున్న రచయితలంతా ఇక ముందు రాయడం ఆపేస్తారా?’’ అని ప్రశ్నించారు శర్మ. ఈప్రశ్నతో మనకు అంతకు మందు జరిగిన ఒక సంఘటన గుర్తుకు వస్తోంది. ఒక రచయిత మీద ఒత్తిడి తెచ్చి ‘‘రచయితగా నేను చచ్చిపోయాను’’ అని ప్రకటన ఇప్పించిన సంగతి గుర్తుకు తెచ్చినట్లయింది. అంటే ‘ఈ రచయితలిక రాయకూడదు. వీరి భావజాలం ప్రజల్లోకి పోకూడదు. ప్రజలు చైతన్యవంతులు కాకూడదు’- అనే భావన మంత్రిగారి మనసులో బలంగా ఉండబట్టే అలాంటి వ్యాఖ్య వెలువండిందని భావించవలసి వస్తోంది! ఇక జైట్లీగారి వ్యాఖ్యలూ విడ్డూరంగానే ఉన్నాయి. గతంలో ఆయన సుప్రీంకోర్టు న్యాయవాది. అంటే వాదనలో ఆయన తిమ్మిని బమ్మి చేయగల సమర్థులు. కాని, తమ అసమర్థ పాలనను సమర్థించుకోవడానికి అనుభవసారమంతా రచయితల మీద వెళ్ళగక్కతే ఎలా? వెళ్ళగక్కినా విఫలమయ్యారు!

Also read: ఇన్సాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా!

నయనతార సెహగల్ నేపథ్యం

ఆ రోజుల్లోనే కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును తిప్పిపంపిన నయనతార సెహగల్ కు గొప్ప నేపథ్యమే ఉంది. ఆమె నెహ్రూ చెల్లెల్లు విజయలక్ష్మీపండిట్ కూతురు. స్వతంత్ర్య వ్యక్తిత్వంతో రాణించారు. వదినగారైన ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఎమర్జెన్సీ విధించినప్పుడు నయనతార తీవ్రంగా నిరసించారు. ఫలితంగా ఇందిర కోపానికి గురై, ఇటలీ రాయబారి కాబోయేదల్లా-కాకుండా పోయారు. వాజపేయి ప్రదానిగా ఉన్నప్పుడు ‘‘రిచ్ లైక్ అజ్ ’’ అనే పుస్తకానికి సాహిత్య అకాడెమీ అవార్డు స్వీకరించిన ఆమె, మోదీ నేతృత్వంలో గుజరాత్ అల్లర్లను కూడా దుయ్యబట్టారు. ఆయన నేతృత్వంలో నడుస్తున్న నేటి ఈ ప్రభుత్వానికి ఆ అవార్డు తిప్పిపంపి, తన నిరసన తెలియజేశారు.

Also read: దళితుల రక్షణకోసం అవార్డు వాపసీ

ఆర్ఎస్ఎస్ చీఫ్ రచయితలనుద్దేశించి ఓ మాట అన్నారు. ‘‘ఏ లోగ్ సెక్యులర్ హాతోమే ఖేల్ రహేహై.’’ వీళ్ళు సెక్యులర్ వాదుల చేతుల్లో ఆటబొమ్మలయ్యారు అని ఆయన భావం. అంటే, తను, తన పార్టీ అకారంలో ఉన్నవాళ్ళూ ఎవరూ సెక్యులర్ కాన్న మాటేనా? అంటే భారత దేశాన్ని బలవంతంగా హిందూ దేశంగా మార్చదలిచారా? అధికారంలో ఉన్న పెద్దలు కాస్త ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడ్డ భారతీయుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘‘నాకు మీ సర్టిఫికేట్ కావాలి!’ అని అడుక్కున్న దేశప్రధాని, దేశంలోని మేధావుల అసంతృప్తిని పట్టించుకోవడం లేదేమిటీ? ప్రతి చిన్న విషయం మీద పెద్ద ఉపన్యాసాలిచ్చే ఆయన గారికి ఈ పెద్దవాళ్ళ హత్యలు చిన్నవిగా కనిపించాయా? జాతి నుద్దేశించి ‘మన్ కీ బాత్’ వెల్లడించొచ్చుకదా? తనకూ కెమెరాకూ మధ్య అడ్డొచ్చిన ఎంతటి వీవీఐపీలనైనా పక్కకు తొలగించే ప్రధాని, ఈ అతిముఖ్యమైన విషయాన్ని కూడా పక్కకు నెట్టేసి ముందుకు సాగాలని అనుకున్నారా? ‘‘కనుమరుగౌతున్న భావస్వేచ్ఛను నిరసిస్తూ భారతీయ రచయితలు తమ అత్యున్నత పురస్కారాలను వెనక్కి పంపించారు. ఒక రకంగా అది మోదీ ప్రభత్వంపై అసంతృప్తే!!’’ అపి టైమ్స్ (TIMES) పత్రిక ప్రచురించింది. దాంతో ప్రపంచ దేశాలకు ఒక సందేశం వెళ్ళింది. ప్రభుత్వ విధానమేమిటో దేశప్రజలకు కూడా తెలిసింది. అయితే రచయిత ఒత్తిళ్ళకు, నిరసనలకు తలఒగ్గి, కేంద్ర సాహిత్యఅకాడెమీ హత్యల్ని ఖండించి సంతాప తీర్మానం చేయాల్సి వచ్చింది. ఇది ఒక రకంగా భారతీయ రచయితల విజయం.

Also read: బహుజన చక్రవర్తి అశోకుడు ఎందుకు ‘గ్రేట్’?  

Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles