Monday, October 7, 2024

పరలోకంలో జిఎస్ టి అప్లయ్ అవుతుందా?

ఒక చర్చి భక్తుడికి, పాస్టర్ కు మధ్య జరిగిన సంభాషణ యథాతథంగా ఇక్కడ నమోదు చేశాను. ఇది ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాలోనిది. ప్రాంతాలు వేరు కావొచ్చు. మతాలు వేరు కావొచ్చు. భక్తులు, పూజారులు వేరువేరు కావొచ్చు. అన్నిటికి కేంద్రకం ఒక్కటే. ఈ సంభాషణ చదివిన తర్వాత ఎవరికి వారు విశ్లేషించుకుంటే చాలా విషయాలు అర్థమవుతాయి. మన దేశంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలు పరిచిన జిఎస్ టటి కూడా ఈ భక్తిమార్గంలో తన స్థానాన్ని దృఢపరుచుకోవడం విశేషం –

—————————————

ఆ….వందనాలండయ్య గారు

ఆ…వందనాలమ్మా- ఎవరూ?

ఆ….అయ్యగారు నేనండి! శ్రీనువాసండయ్యగారు

ఆ….శ్రీను వాసూ! ఎలా ఉన్నావు నాన్నా?

బావున్నానయ్యగారూ! మీరెలా ఉన్నారయ్యగారూ?

నేను బావున్నానాన్నా…అమ్మగారూ, నాన్నగారూ అందరూ బావున్నారా?

ఆ…. అందరూ బావున్నారండయ్య. మీ దయవల్లయ్యగారూ..

ఆ…మరేంటి చర్చికి రావడం మానేశావ్. అప్పుడే రెండు మూడు వారాల నుంచి కనిపించట్లేదూ…?

ఊ… ఏవో చిన్న చిన్న పన్లుండి రాలేకపోతున్నానయ్యగారు

ఇప్పుడూ – మన పనులెన్నో ఉంటయ్ నాన్నా… అలా పనులున్నాయని మానేస్తే మరి పర్లోకం ఎల్లాల కదా?

అదేనండయ్యగారూ మీరే ఏదో మార్గం చూడాలయ్యగారూ

చూడాలంటే…ఎలా… అవుతుంది చెప్పూ? రావాలి, మన భక్తి జీవితాన్ని మనం చూపించుకుంటే మరలోకం ఎల్తాం.

అదేనండయ్యగారూ- మరి భక్తి లేకుండా మరో మార్గమదీ లేదండయ్యగారూ? (నసుగుతూ)

(కోపాన్ని అణుచుకున్న విసుగుతో) ఆ…ఏంటమ్మా?

అదే – భక్తి మార్గం కాకుండా వేరే మార్గంతో పంపించడం కుదరదండయ్యా?

(కొంచెం ఆలోచించి) వేరే మార్గమంటే, ఉం…దనుకో!(నసుగుతూ) అందరికీ చెప్పగూడదది..

ఛెప్పండయ్యగారూ కొంచెం … మీరా మార్గం

(ఇష్టం లేనట్టు)ప్చ్ ….డబ్బులవుతయ్ నాన్నా మరి?

ఎంతవుతుందో…మరి మీరే చూడాలండయ్యగారు

ఊ….అదీ ….మామూలుగా అయితే – అటు మల్కిపురంవైపేతే చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. మనకైతే…ఊ…మనకైతే ఇక్కడ ఓ పదివేలవుతయి నాన్నా.

పదివేలా? మరీ ఎక్కువ గదండయ్యగారూ!

పదివేలంటే అంతే మరి నాన్నా…నేనేం తీసుకోనయి-మరి పరలోకం తాళం చెవులు ఎవరి దగ్గరుంటయ్?

పీటర్ దగ్గరుంటయ్

ఆ… పీటర్ గారి దగ్గరుంటయి. మరి ఆయన కివ్వాలి కదా?

పదివేలంటే ఎక్కువ గదండయ్యగారూ

ఎక్కువంటే నాన్నా…నేనేం తీసుకోనయ్యి. ఐదువందలో, వెయ్యో తీసేసుకుని…మరి కనబడ్డప్పుడు పీటర్ గారికిచ్చేస్తాను.

అంతంటే మరి మీరే చూడాలండయ్యగారూ

అంతంటే ఎట్లానమ్మా? మరి ఆయన కూడా….ఇరవై నాలుగు మంది పెద్దలకివ్వాల్సి ఉంటది. ఇక అన్నీ ఆయన చూసుకుంటాడింక. మనకేమీ సంబధముండదు.

నాతో పాటు ఐదారుగురు కుర్రాళ్ళున్నారు. మనవాళ్ళండయ్యగారూ. కొంచెం నాకు తగ్గించడయ్యా

ఆహా… నీతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురుంటే కొంచెంతగ్గించొచ్చు.

అయితే పదివేలకి మనకి ఫెసిలీటీస్ అవీ బావుంటాయి గదండొయ్యా – పర్లోంకంలోనూ?

నేనున్నాను కదా? నీకన్నీ చూస్తాను.

మల్కిపురం పాస్టర్ గారు ఎనిమిదివేలకి పంపిస్తామంటున్నారయ్యగారు

ఇదిగో ఎనిమిదివేలకి అయిదువేలకీ పంపిస్తామంటే…మరి ఆల్లెక్కడ కూచోబెడతారో నీకెట్లా తెలుస్తుందీ? నువ్వే అంటావ్ అక్కడి కెల్లాక అయిబాబోయ్ మీ పాస్టర్ గారు పంపించారిక్కడ చాలా బావుంది- అని ఆ కింద కూచున్నోల్లను చూసి! నీకక్కడ మంచి ప్లేస్ దొరుకుతుంది.

అయ్యగారూ కాషివ్వాలా? క్యాష్ ట్రాన్స్ ఫర్ చెయ్యాలా?

అదీ…మన పీటర్ గారి నడగాలి. దాన్తో పాటు టాక్సులు పెరిగినయి.

మనవాళ్ళు మరో పదిమందిని తీసుకొస్తానయ్యా. నా సంగతి మీరే చూసుకోవాల. మీకందుబాటులో ఉండే ఓణ్ణి.

ఎందరున్నా నాన్నా చాలా సీక్రెట్ గా జరగాల. ఇలా పాస్టర్ గారికి డబ్బులిచ్చానంటే బావుండదు. నేను తీనేది కాదది. రేటు ఇంతని అప్పుడే ఎవరికీ చెప్పమాక. అనవసరంగా నాకు ‘బ్యాడ్’ ఒస్తుంది.

అబ్బె లేదండయ్యా. ఎవరికీ చెప్పనండయ్యా! నన్ను మీరే చూసుకోవాలండయ్యా

నువ్వు పరలోకం ఎల్లినా నేను మాట్లాడతాను కదా? నీకెందుకూ? పీటర్ గారితో పరలోకం తాళం తీయించి, నిన్ను జాగ్రత్తగా పంపించే బాధ్యత నాది. అయితే ఈ విషయం నీకూ, నాకూ మధ్యనే ఉండాలి!

అలాగేనయ్యగారూ…అయితే అయ్యగారూ… ఈ జిఎస్ టి వల్ల నాకు టాక్సు పడుతుదయగారూ?

(ఫ్రశ్న రెండు సార్లు అడిగించుకుని ఆలోచించుకుని పాస్చర్ ఇలా చెప్పాడు)

ఆ… బైబిల్ ఏం చెపుతుంది నాన్నా? ముందు మనం మన చట్టాల్ని గౌరవించాలి అ చెపుతుంది! చట్టాలకు లోబడి ఉండాలని చెపుతుంది బైబిల్. అందువల్ల జిఎస్ టి ఉంటుంది కద నాన్నా. అక్కడ పరలోకంలో కూడా జిఎస్ టి అప్లయ్ అవుతుంది. తప్పకుండా అప్లయ్ అవుతుంది. అయితే..నీకు చెప్పినంతే తీసుకుంటాను. ఎక్కువేమీ తీసుకోను. మిగతా వాళ్ళకంటావా? ఆలోచించి చెపుతాను. నువ్వేమీ చెప్పొద్దు. సరేనా?

సరేనండయ్యా. నాకు ప్లేసదీ బాగుండేట్టు చూడండయ్య.

ఆ….ఆ….నువ్వే అంటావు. పాస్టర్ గారి దయవల్ల మంచి ప్లేస్ దొరికిందని! మన ద్వారా ఎల్లిన వాల్లంతా హేపీ నాన్నా…నీకూ తెలుస్తాది. ఆయ్ –

శీనూ…విషయం బయటికి  రానీబాకు. అనవసరంగా బ్యాడ్ ఒస్తాది. కుర్రాళ్ళను తీసుకురా…మాట్లాడతా..సరే. రేపోసారి కనబడు- చెప్తాను! థాంక్యూ!

అలాగేనండయ్య – వందనాలండయ్య – ఉంటానండయ్య.

Also read: విద్యావంతులు సరే, వివేకవంతులు ఎక్కడా?

——————————————

ఇలాంటిదే మరొక మోసం ఇటీవల టి.వి. వార్తల్లో వచ్చింది. వరంగల్ లో ఓ బాబా ఉన్నాడు. పేరు మస్తాన్ అలీ. అతను స్వర్గానికి అడ్వాన్స్ బుకింగ్ చేస్తున్నాడు. డబ్బులిచ్చినవాళ్ళకు అతను ‘సర్టిఫికేట్’ ఇస్తాడు. ఆ సర్టిఫికేట్ ఉన్న ఆసామి చనిపోయినప్పుడు  అతని వారసులు దాన్ని (సర్టిఫికేట్ ను) అతని సమాధిలో పెట్టాలి – అంతే!! ఆ ఆసామి నేరుగా స్వర్గానికి పోతాడు. అంటే ఎవరికి వారు బతికి ఉన్నప్పుడే స్వర్గంలో సీటు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు – అలా తనకూ, తన భార్యకూ, తన కూతుర్లకూ. ఇంట్లో అందరికీ రెండు లక్షలు చెల్లించి సర్టిఫికేట్లు తీసుకున్న ఓ చదువుకున్నమూర్ఖుడు టి.వి. విలేఖరికి చిక్కాడు. అతను వరంగల్ నిట్ లో యం.టెక్. చదివి, ఉద్యోగం చేస్తున్నవాడు….ఇక జనంలో ఉన్న మూర్ఖత్వం గురించి ఏమందాం చెప్పండి?

Also read: ఆలోచనా విధానం మారితే మనోభావాలు దెబ్బతినవు

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles