Friday, December 2, 2022

గోద పాదాలతో సన్నికల్లు తొక్కించిన శ్రీకృష్ణుడు

8. వారణమ్ ఆయిరమ్ (గజసహస్రం)

ఇమ్మైక్కుమ్ ఏళేళ్ పిరవిక్కుమ్ పట్రావాన్

నమ్మై ఉఢైయవన్ నారాయణన్ నమ్బి

శెమ్మై ఉఢైయ తిరుక్కైయాల్ తాళ్ పట్రి

అమ్మి మిదిక్క క్కనా క్కండేన్ తోళీ నాన్

ఈ జన్మలోనూ ఏడేడు జన్మలలోనూ రక్షకుడుగా నా స్వామి నారాయణుడు పూర్ణుడు ఎర్రని కాంతికల పవిత్రమైన తన శ్రీహస్తములతో నా పాదాన్ని పట్టుకుని  జాగ్రత్తగా సన్నికల్లు మీద త్రొక్కించి నా కాలి వేలికి మెట్టెను తొడిగినట్టు నేను కలగన్నానని గోదాదేవి చెలికి వివరిస్తున్న స్వప్నవివాహ వృత్తాంతం ఇది.

ఇమ్మైక్కుమ్ =  ఈజన్మమునకు, ఏళేళ్ పిరఱక్కుమ్ = ఏడేడు జన్మలకును పట్రావాన్ = తోడుగా రక్షగా ఉండేవాడు, నమ్మై ఉఢైయవన్ = మనకు స్వామియైన వాడును, నారాయణన్ = నారాయణావతారుడైన శ్రీకృష్ణుడు, నమ్బి = కల్యాణగుణపూర్ణుడూ అయిన, శెమ్మై ఉఢైయ= తామరరేకులవలె ఎఱ్ఱనై మనోజ్ఞములై  తిరుక్కైయాల్ = శ్రీహస్తములచే, తాళ్ =నా కాలిని, పట్రి = పట్టుకుని, అమ్మి మిదిక్క సన్నికల్లు ఉలూఖము రోటి మీదినుంచి తొక్కించనట్టుగా, క్కనా = కలను, క్కండేన్ = కన్నానే, తోళీ= చెలీ, నాన్ = నేను.

తెలుగు భావార్థ గీతిక

ఏడడుగులు నడిచి ఏడేడు జన్మలనేలేటి రేపల్లె రేడు

వేడిన వీడని సకల కల్యాణ గుణ సంపూర్ణ స్వరూపుడు

నీడయై నిలచి తోడుగా కాచి నా పాదములనాతని శ్రీహస్తముల

తోడ సన్నగా సన్నికల్లు తొక్కించినాడని చెలీ, నే కలగంటి నే.

Also read: అగ్ని సాక్షి, గోదా రంగనాథుల ఏడడుగులు

ఈ జన్మలోనే కాదు, ఎన్నిజన్మలకైనా వెన్నంటి ఉండే వెన్నుని కీర్తిస్తున్న పాశురం ఇది. అంతటి విష్ణువే తోడుంటే జగద్రక్షకుడే రక్షకుడైతే ఇంకేంకావాలి నారాయణా? ఏడేడు అంటే ఎన్ని జన్మలని? ఏడును ఏడుతో గుణిస్తే 49 జన్మలని అర్థం. అంటే దాదాపు కాలతత్వమున్నంత వరకు ఆ నారాయణుడే రక్షకుడు. నాకు మోక్షము పరమపదం అంటే తెలియదు. ఆ సాధనా మార్గాలూ తెలియవు. కాని స్వయంగా ఆ నారాయణుడే జన్మజన్మలకు నన్ను ఆదుకుని నడిపించే వాడై నిలిస్తే ఎన్ని జన్మలైతేనేమి అనే గోదాదేవి భక్తి భావం ఇందులో తొణికిసలాడుతూ ఉంటుంది. ఆయనే మనకు స్వామి, తమిళంలో నంబి అంటే సంపూర్ణుడు అని అర్థం.  సకల కల్యాణ గుణ సంపూర్ణుడు, శ్రీకృష్ణావతారుడు, ఆయన తన ఎఱ్రని మనోజ్ఞమైన సంపత్కరమైన చేతులతో నా పాదాన్ని నెమ్మదిగా ఎత్తి, జాగ్రత్తగా సన్నికల్లురాయిమీద పెట్టి తొక్కించి నా కాలివేలికి మెట్టెను తొడిగినట్టు కలగన్నానని తన చెలికి అందమైన స్వప్నవివాహ వృత్తాంతాన్ని గోదాదేవి వివరిస్తున్న ఎనిమిదో పాశురం ఇది. శ్రీకృష్ణావతారుడైన నారాయణుడు అంతకుముందు రామావతారంలో కాలు తాకితే చాలు అహల్యగా మారింది కదా, తనతో పాటు కాలుమోపుతూ ఉంటే ఆ సన్నికల్లు ఏమవుతుందోనని చాలా ఆసక్తితో గోదాదేవి చూస్తున్నదట. సన్నికల్లుమీద వధువుకాలితో వరుడు తొక్కించడం వెనుక, ఏడడుగులు నడిచి ఏర్పరచుకున్న ఈ పవిత్ర బంధం ఏడేడేజన్మలదాకా ఈ విధంగానే రాయంత దృఢంగా ఉండాలని. తనను ఎందరు తొక్కినా చలించకుండా ఉండే రాయివలె దాంపత్యజీవన కష్టాలను భరించాలని ఇది సంకేతం.

Also read: గోదా వధువు చేయి పట్టిన గోపాలుడు

దీన్ని సన్నికల్లు తోయం అంటారు. సన్నికల్లు జంటరాళ్లు. సన్నికల్లు పొత్రం కలిసి ఉండాలి, కలిసి ఉంటాయి. వధూవరులలో ఎవరుసన్నికల్లు ఎవరు పొత్రం అంటే చెప్పలేము. రెండు కలిసిలేకపోతే ఉపయోగం లేదని మాత్రం అర్థమయితే చాలు. సన్ని కల్లు పొత్రం ఒకటి లెకపొతే రెండోది పని చెయ్యదు, సన్ని కల్లు పొత్రం వలె జంటగా కలిసి ఉండాలని దీని సంకేతం. సన్నికల్లును శివ స్వరూపంగా కొందరు భావిస్తారు, దాన్ని మోసుకు రావటం కష్టం కనుక సన్నికల్లు మీద తొక్కించే పని చేయకూడదని అనేవాళ్లూ ఉన్నారు. వివాహ బంధానికి అగ్ని ఒక సాక్షి శివస్వరూపమైన సన్నికల్లు మరొక సాక్షీ అనీ అంటారు.

Also read: మధురాధిపతేరఖిలం మధురం

ఏ కష్టాలు వచ్చినా ఎదుర్కొనడానికి నవదంపతులను సంసిద్ధత తెల్పడానికి సంకేతంగా సన్నికల్లు తొక్కిస్తారు. అగ్నిహోత్రానికి ఉత్తరం వైపు సన్నికల్లు ఉంచి వధువు కుడికాలు చేత తొక్కిస్తారు. ఈ జంటపైకి వారి ఇంటిపైకి కలహానికి ఎవరైనా వస్తే వారిని కూడా నీవు దృఢంగా ఎదుర్కోవడానికి రాయి వలె గట్టిగా ఉండాలనే అనే సంకేతం ఇది. వధూవరుల కాళ్ల క్రింద రాయి పెట్టి కుడికాలుతో ఎడమ కాలును ఒకరితో ఒకరు మూడుసార్లు తొక్కించడం కూడా ఉంది. దీనివలన  ఆ జంటలో పరస్పర స్పర్శాధారితప్రేమ బీజాంకురాలు కలుగుతాయి.

సన్నికల్లు తొక్కించడం

image.png

Also read: గోదారంగనాథ కల్యాణ కంకణ ధారణ

Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles