Saturday, April 20, 2024

గోదా వధువు చేయి పట్టిన గోపాలుడు

బృందావనం

6 వారణమాయిరమ్ (గోదా సహస్రం)

ఇంతకుముందు మధురాధీశుడు మాధవుడు గంభీరగతిలో భూమి అదిరే పాదముద్రలతో అడుగులువేస్తూ వివాహ వేదికకు సమీపించినాడు. ఇక పాణిగ్రహణమే తరువాయి.

మత్తళం కొట్ట వరిశజ్ఞం నిన్ఱు ఊద

ముత్తుడైత్తామనిరైతాళ్ న్ద పన్దఱ్కీళ్

మైత్తునన్ నమ్బి మదుశూదన్ వన్దెన్నై

కైత్తలంపట్రి క్కనాక్కణ్డేన్ తోళీ నాన్

ప్రతిపదార్థములు

మత్తళం కొట్ట = మృదంగము వాయింపగ, వరిశజ్ఞం నిన్ఱు ఊద = రేఖలున్న శంఖములను స్థిరంగా నిలిచి ఊదగా, ముత్తుడైత్తామనిరైతాళ్ న్ద = ముత్యాలహారముల వరుసలు తలకుతగులుతూ ఉండేట్లు అత్యున్నతంగా అమర్చియున్న, పన్దఱ్కీళ్ = పందిరి యందు, మైత్తునన్ = మేనరిక బాంధవ్యం ఉన్న,  నమ్బి= కల్యాణ గుణ పరిపూర్ణుడగు,  మదుశూదన్ = మధువనే రాక్షసుని సంహరించిన శ్రీ కృష్ణుడు,  వన్దు = తనంత తానువచ్చి, ఎన్నై= నన్ను, కైత్తలంపట్రి = పాణిగ్రహణం చేసికొన్నట్లు, క్కనాక్కణ్డేన్  కలగంటినే, తోళీ = చెలీ, నాన్= నేను.

తెలుగు భావార్థ గీతిక

సన్నాయిమృదంగ కాహళుల మంగళ ధ్వనులు మ్రోగ తెలి

వన్నెల శంఖనాదములు చెలరేగ, పెళ్లపందిళ్ల వేలాడు ముత్యపు

వెన్నెలలు విరజిమ్మ, మా అత్తకొడుకు, ఆ దానవుమధువు బీల్చిన

వెన్నుడిదిగొ యిటు వచ్చినా చేయి పట్టినట్లు నే కలగన్నానే చెలీ.

ఓవైపు మృదంగ కాహళాది మంగళ వాద్యములు మ్రోగుతూ ఉంటే, మరోవైపు ఎన్నెన్నో శంఖ నాదాలు ప్రతిధ్వనిస్తూ ఉండగా,  అందాల పెళ్లి పందిరినిండా అమర్చిన ముత్యాల హారాలు ఊగుతూ వధూవరుల తలలకు తాకుతూ ఉంటే ఆ వివాహ మంటపం కింద, అత్తకొడుకు మేనబావ, పరిపూర్ణకల్యాణ గుణపరిపూర్ణుడు, మధుసూదనుడైన శ్రీకృష్ణుడు నా కుడి చేయిపట్టి, పాణిగ్రహణము చేసినట్లు నేను కలగన్నానే చెలీ అని వివరిస్తున్నారు గోదాదేవి.

Also read: మధురాధిపతేరఖిలం మధురం

ఎవరీ మధుసూదనుడు?

మధుకైటభులెత్తుకుపోయిన వేదాలను తిరిగి బ్రహ్మకు ఇస్తున్న హయగ్రీవుడు

ఈ పాశురంలో గోదాదేవి తన ప్రియుడిని మధుసూదనుడని సంబోధిస్తున్నారు. మధు అనే రాక్షసుడిని సంహరించిన వాడని ఒక అర్థం.

శ్రీకృష్ణావతారంలో ఆయన మధుసూదనుడనే రాక్షసుడిని చంపనే లేదు. అయినా పలు సందర్భాలలో ముఖ్యంగా భగవద్గీతలో అర్జునుడు పదేపదే మధుసూదనా అని పిలుస్తాడు. సృష్ఠి ఆరంభానికి ముందు ఆదిశేషశయ్యపై యోగనిద్రలో ఉన్న హరి నాభినుంచి తామర తూడు ఉద్భవిస్తుంది. అది పెరుగుతూ పెరుగుతూ చివరకు తామర పూవై వికసిస్తుంది. అందులోంచి చతుర్ముఖ బ్రహ్మపుట్టుకొస్తాడు. వస్తూనే నారాయణుడికోసం తపస్సుచేసి వేదాలు పొంది కొత్త లోకాలను తయారుచేసే పనిలోకి నిమగ్నమైపోతాడు బ్రహ్మ. సరిగ్గా అదే సమయంలో యోగనిద్రలోనున్న హరి చెవులలోనుంచి కారిన మాలిన్యం నుండి ఇద్దరు రాక్షసులు మధు, కైటభులు ఉద్భవిస్తారు. వారు అమ్మవారిని ప్రార్థించి తపస్సు చేసి ఆమె కరుణ సంపాదిస్తారు. ఆమె ఏ వరంకావాలని అడుగుతుంది.

Also read: గోదారంగనాథ కల్యాణ కంకణ ధారణ

తాము కోరుకున్నపుడే తమకు మృత్యువు రావాలని మహాలక్ష్మీని వరం అడుగుతారు. ఆమె ఆ వరం ఇచ్చేస్తారు. వరం వల్ల వచ్చిన అమితమైన బలంతో అహంకరించి క్రూరమైన రాక్షసులుగా మారి అల్లకల్లోలాలు సృష్టిస్తున్నారు. బ్రహ్మమీదనే దాడిచేస్తారు. ఆయన దగ్గరనుంచి నాలుగు వేదాలు లాక్కుని, సముద్రంలో లోతుల్లో దాచిపెడతారు. బ్రహ్మాండాలను సృష్టించడానికి ఉపయోగపడే వేదాలు చేతిలోలేక పోవడం వల్ల బ్రహ్మ నిస్సహాయుడవుతాడు. మహావిష్ణువును కరుణించమని ప్రార్థిస్తాడు. కాని విష్ణువు యోగనిద్రనుంచి మేలుకొనక పోవడంతో ఆయన మహాలక్ష్మిని ఆశ్రయిస్తాడు. దయామయి అయిన లక్ష్మీదేవి బ్రహ్మకోసం శ్రీ మహావిష్ణువును యోగనిద్రనుంచి మేల్కొలుపుతారు. లేచి బ్రహ్మ మొర విని పరిస్థితి గమనించిన శ్రీ మహావిష్ణువు మధుకైటభులతో పోరాడి ఓడించి వారినుంచి వేదాలను తీసుకుంటారు. వాటిని తిరిగి బ్రహ్మకు అప్పగిస్తారు. కాని వారితో పోరాటం ముగియదు. ఎంత భీకరంగా యుద్ధం చేసినా వారిని ఓడించడం సాధ్యంకాదు. లక్ష్మీదేవి వరాలతో బలగర్వితుడైనాడని వారి చావు వారి చేతుల్లోనే ఉందని గమనించిన విష్ణువు మధు కైటభుల బల పరాక్రమాలను తెలివి తేటలను ప్రశంసిస్తాడు. పొగడ్తలకు పొంగిపోయిన మధుకైటభులు శ్రీహరినే ఏదైనా వరం కోరుకోమంటారు. ఏ వరం అయినా ఇస్తాం అర్థించు అంటారు. శ్రీహరి థన్యవాదాలు తెలియజేస్తూ మీ ప్రాణాలే నాకు వరంగా ఇవ్వండి అని అడుగుతాడు. సరే అనగానే వారి చేతుల్లోనే ఉన్న వారి మరణం వెంటనే సంభవిస్తుంది. ఎంతో ఉపాయంతో అజేయులైన రాక్షసులను సంహరించిన హరి మధుసూదనుడవుతారు.

Also read: దిగి వచ్చిన ఇంద్రుడు దుర్గామాత

మధుసూదనుడంటే మరో అర్థం కూడా ఉంది. మనసులో నెలకొన్న అహంకారమే తీయని తేనె వంటి మధువనీ దాన్నీ శ్రీ హరి హరించాడు. మధు అంటే తేనెటీగ అనీ అర్థం. పూవులనుంచి మధువును మధు పీల్చినట్టే శ్రీ కృష్ణుడు భక్తులను ప్రేమను గ్రహిస్తాడంటారు. శ్రీల రూప గోస్వామి అనే 16వ శతాబ్దపు వైష్ణవ యోగి రచించిన విదగ్ధ మాధవ అనే ఆధ్యాత్మికనాటకం అయిదో అంకంలో మధుసూదనుడనే అర్థాన్ని కమనీయంగా వివరించారు.

Also read: పెళ్లిపందిరికి వరరంగడు చేరినాడు

బృందావనంలో ప్రేమ సరోవరం

ఓసారి రాధాకృష్ణులు ఒకరి ఒడిలో మరొకరు కూర్చుని ఉన్నారు. ఒక తేనెటీగ కమలం వంటి ముఖం కలిగిన రాధ ముఖం చుట్టూ తిరుగుతూఇబ్బంది పెడుతూ ఉన్నది. అది గమనించి శ్రీకృష్ణుడు ఆ తేనెటీగను పారద్రోలాలని తన మిత్రుడిని అడుగుతాడు.  ఆ పని చేసిన మిత్రుడు. మధు వెళ్లిపోయాడు అని చెబుతాడు. మధు అంటే తేనెటీగ అనీ మాధవుడని రెండర్థాలు కదా. రాధ మాధవుడునుకుని విలపిస్తుంది. తాను మాధవుడి ఒడిలోనే ఉన్నప్పడికీ తనను వదిలేసి వెళ్లాడనుకుని విప్రలబ్ద భావంతో విలవిలలాడుతూ ఉంటే చూడలేక శ్రీకృష్ణుడు కూడా అయ్యో రాధకేం కష్టం వచ్చిందో అని విలపిస్తాడట. వీరి కన్నీళ్లతో అక్కడ ఒక సరస్సు ఏర్పడిందట. అదే నేటికీ బృందావనంలో ఉన్న ప్రేమ సరోవరం. గోదాదేవి కూడా మరింత ప్రేమతో శ్రీరంగని మధుసూదనా అని ఈ పాశురంలో పిలుస్తున్నారు.

Also read: గోదాదేవి రచించిన వారణమాయిరమ్‌ – వేయేనుగుల కల

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles