Friday, April 26, 2024

అప్పుడే చుట్టాలైపోయారా? ! …… టిడిపిలో పవనోత్సాహం!

జనసేన ఆవిర్భావ సభపై ఒకవర్గం మీడియా కవరేజీ చూస్తే జనసేన , టిడిపి మధ్య అప్పుడే ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరిపోయిందన్న ఆనందం టిడిపి నేతల్లో కనిపిస్తోంది. ఈ సభ జనసేనలో కన్నా తెలుగుదేశంలో పవనోత్సాహం కలగజేసిందని చెప్పవచ్చు. ఈనాడు  పత్రిక తెలుగుదేశం మినహా ఇతర పార్టీలు భారీ బహిరంగ సభలు పెడితే పెద్దగా కవరేజ్ ఇవ్వదు. అలాంటిది జిల్లా పేజీల్లో ప్రత్యేక కథనాలను ప్రచురించడం చూస్తే అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లు టిడిపి, జనసేన అప్పుడే చుట్టాలు  అపోయినట్లు  తాము అధికారంలోకి వచ్చేసినట్లు కూడా టీడీపీ నేతలు  కలల్లో తేలియాడుతున్నారు .

2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి భయపడుతున్న టిడిపికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఊరట కలిగిస్తోంది. ఈ సభలో పవన్ ప్రభుత్వంపై నిప్పులు చెరగడంతో పాటు, వైసిపి వ్యతిరేక ఓట్లు చీలనివ్వబోమని, వైసిపి వ్యతిరేక శక్తులు ఏకమవ్వాలని పిలుపునివ్వడం ద్వారా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటామని పరోక్షంగా స్పష్టంగా సంకేతాలు ఇచ్చారు. మరోవైపు వారికి ఎంతో ఇష్టమైన రాజధాని అమరావతిపై కూడా ఆయన అభయం ఇవ్వడం విశేషం. పవన్ ప్రకటనపై టిడిపి నేతలు తమ ఆనందాన్ని బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు .

బిజెపి ఒప్పుకుంటుందా?

వైసిపి వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలన్న పవన్ కల్యాణ్ పిలుపు వినడానికి బాగానే ఉన్నా … రోడ్డు మ్యాప్ ఇవ్వాల్సిన బిజెపి ఇందుకు అంగీకరిస్తుందా లేదా అన్నదే పెద్ద చర్చనీయాంశం. 2014 ఎన్నికల తరువాత బిజెపి పట్ల టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వ్యవహరించిన తీరు, పొత్తు విచ్చిన్నం తరువాత ప్రధాని నరేంద్రమోడీని వ్యక్తిగతంగా దూషించిన విషయాన్ని ఇప్పటికీ బిజెపి కార్యకర్తలెవరూ మర్చిపోలేదు. ప్రధాని మోడీయే చంద్రబాబునాయుడు అవినీతిని , వ్యవహారశైలిని తీవ్రస్థాయిలో తూర్పారబట్టారు. భవిష్యత్తులో టిడిపితో పొత్తు ప్రసక్తే లేదని హోమ్ హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ ధియోధర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేశారు. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో టిడిపికి ‘బి’ జట్టుగా వ్యవహరిస్తున్న  కాంగ్రెస్ , సిపిఐ పార్టీలు  సిద్ధాంతపరంగా బిజెపికి బద్ధవైరమన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జనసేన, బిజెపి కూటమిలోకి టిడిపి కూటమి చేరికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అధికారంలోకి వస్తే పవనే సిఎం ఆట

వైసిపి వ్యతిరేక శక్తులతో కలిసి అధికారంలోకి వస్తే రాష్ట్ర బాధ్యతను జనసేన తీసుకుంటుందని జనసేనాని పవన్ స్పష్టం చేశారు. తద్వారా ఒకవేళ వైసిపి వ్యతిరేక కూటమి అధికారంలోకి వస్తే తానే సిఎంగా బాధ్యతలు స్వీకరిస్తానని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఇందుకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అంగీకరిస్తారా అన్నది చర్చనీయాంశం. అయితే, ఈ కూటమి కనీసం సీట్ల పంపకం వరకైనా వస్తుందా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లను ప్రామాణికంగా తీసుకుని బిజెపి, టిడిపి పార్టీలు సీట్లను కేటాయిస్తే 10 శాతం సీట్లు కూడా జనసేనకు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు ఇప్పటికీ పార్టీ జెండాను పట్టుకుని మోస్తున్న టిడిపి కార్యకర్తలు సీట్ల కోసం పట్టుబట్టి, అసమ్మతి రాగాన్ని వినిపించే అవకాశాలు లేకపోలేదు.

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles