Saturday, October 5, 2024

సోషల్ మీడియా సామాజిక విప్లవమా?సమస్యల సమాహారమా?

  • వాట్సప్, ఫేస్ బుక్, యూ ట్యూబ్ ,ట్విట్టర్ ఒక వ్యసనం!!
  • తలలు పట్టుకుంటున్న దేశాధినేతలు

ఇటీవల  హత్యకు గురైన మదనపల్లి అలేఖ్య  ఓషో (రజనీష్) బోధనలు బాగా చదివి డిజార్డర్ లోకి వెళ్లి పోయిందా? అసలు సోషల్ మీడియాలో ఫిలాసఫర్లు చేసే బోధనలు నవ్య మానవులను తయారు చేస్తున్నాయా? లేక సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదనకు ఉపయోగ పడుతున్నాయా? అసలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అన్వయించుకోవడం వల్ల యువతపై దుష్ప్రభావం పడుతోందా? బంగారు భవిష్యత్ ఉన్న యువత ఈ ప్రబోధాలు విని పెడమార్గం పడుతోందా?  బ్రిటన్ లో మన దేశంలో యువత సామూహిక ఆత్మహత్యలకు వారు చూసే వీడియోలు, కొంత మంది చేసే ప్రబోధాలు ఆలకించి మానవ జీవితం వృధా అని భావించడం వల్లనేనా?

వేగంగా మారుతున్న జీవితాలు:

చాలా వేగంగా మారుతున్న జీవన విధానాలకు సోషల్ మీడియా కారణం కావడం వల్ల తల్లి దండ్రులకూ, పిల్లలకూ మధ్య సమన్వయ లోపం విపరీతంగా పెరిగి పోతోందా? ఇవన్నీ ప్రశ్నలు కాదు సమాధానాలు చెప్పుకోవలసిన సమస్యలు!  సోక్రటీసు, ప్లేటో,అరిస్టాటిల్ , జిడ్డు కృష్ణమూర్హి బోధనలు నవ సమాజం అర్థం చేసుకొని జీవించే విధంగా యువత ఆన్వయించుకోలేక పోతోందా? ఈ డిజార్డర్ (అపసవ్యత) ఎందుకు? యువత పయనం ఎటు వైపు? సీరియల్ కిల్లర్లు, సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా ద్వారా వేసే స్కెచ్ లు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తున్నాయి?

ఇది చదవండి: మదనపల్లి హత్యలు మానసిక వైకల్యానికి నిదర్శనం

మార్క్ కు అందనంత ఎత్తుకు

ఫేస్ బుక్ నిర్మాత మార్క్ జుగర్ బర్గ్ పై వివిధ దేశాల్లో నమోదవుతున్న కేసులు చూస్తుంటే ఆయన ఆలోచనకు అందనంత ఎత్తుకు ఎదిగిన సాంకేతిక విప్లవం వల్ల యువత జీవనం నడి సముద్రంలో  కెరటాల ఉధృతిలో చిక్కుకున్న నౌకలా ఉందని పరిశీలకులు అంటున్నారు.  అది గమ్యం చేరే దిశగా ఆలోచనలు సాగుతున్నాయి. ఇప్పటి యూత్ లో సోషల్ మీడియా ఒక వ్యసనం అయిపోయింది. మానవ సంబంధాలను, కుటుంబ వ్యవస్ధ ను కౌమార దశ విచ్చిన్నం చేస్తుంది. హ్యూమన్ సైకాలజీ గూగుల్ చుట్టూ ప్రదక్షణలు చేస్తూ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నది. ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు యూత్ ఫోన్ లకూ, లాప్ టాప్ లకూ అతుక్కుని పోతున్నారు.

మితిమీరుతున్న తెలివితేటలు:

బాల్యం కూడా మానవ చేతన విప్లవం అయిన కంప్యూటర్ వల్ల దుష్ప్రభావాలకు లోనై అతి తెలివి తేటలతో అంతు లేని పరిజ్ఞాన సంపాదించి వింత జీవనం గడుపుతున్నారు. సాంఘిక, రాజకీయ, ఆర్థిక పురోగతికి సోషల్ మీడియా ప్రతిబంధకం కాబోతుందని, మనిషి కూడా “రోబో” గా మారే రోజులు అతి దగ్గరగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. నేటి అత్యంత విజయవంతమైన సోషల్ నెట్‌వర్కింగ్ నడిపే సంస్థలు  యువత బలహీనతను డబ్బు చేసుకుంటున్నాయి. సైకాలజిస్టులు యువత వ్యవహార శైలి ఒక వైపు అధ్యయనం చేస్తుంటే మరొక వైవు ఆ బలహీనతను “ఆఫ్” లు రూపొందించడంలో పెట్టుబడిదారులు వేగంగా ముందుకు కదులుతున్నారు.

మావన బలహీనతలతో వ్యాపారం:

వెబ్‌సైట్‌లను నడుపుతున్న కంపెనీలు మానవ బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నాయి. ఒక యాప్ పట్ల ఆకర్షితులు అయ్యే విధంగా అందులో క్రియేటివిటీ (సృజన) ఉంటే చాలు. ఆ యాప్ కు వీక్షకులు పెరగడం వల్ల యాడ్స్ వస్తాయి. దానితో మంచికన్నా చెడే ఎక్కువ జరుగుతోంది. ఒక వ్యక్తి యాప్ ప్లాట్‌ఫామ్‌లో ఎంత సమయాన్ని వెచ్చిస్తారో అలా వ్యక్తుల సమూహం ఎక్కువ సమయం గడిపినప్పుడు ఆ యాప్ రూపొందించిన వారికి ఎక్కువ ప్రకటనలు వస్తాయి. ఆ కంపెనీకి వారి ఉత్పత్తి నుండి ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది. చివరకు ఇది వ్యాపార సూత్రం అయిపోయింది.

మనోభావాలతో చెలగాటం:

 వికృతంగా, నిర్దాక్షిణ్యంగా ప్రజల మనో భావాలతో కంపెనీలు చెలగాటం ఆడుతున్నాయి. టీనేజ్ వారే కాకుండా పెద్దలు కూడా 24 గంటల్లో  ప్రతి పది నిముషాలకు ఒకసారి  తమ ఫోన్ చూస్తారని తెలిసింది.  సోషల్ మీడియాకు మనం అధిక  ప్రాధాన్యత ఇవ్వడం వల్ల  అదే ప్రపంచం అయిపోయింది. అమెరికానే కాదు ఏ దేశం వెళ్ళకుండానే ఆన్ లైన్ లో పనులు చక్కబెట్టడం వల్ల మానవ సంబంధాలు కేవలం ఫోన్ తెరపై దోబూచులాడుతున్నాయి. భావోద్వేగం (ఎమోషన్), ప్రతిస్పందన (రియాక్షన్) లేని రోబో జీవితాలు అయ్యాయి. ఈ ఆన్‌లైన్ “ప్రదర్శన’  టీనేజ్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. దీని వల్ల ఆత్మగౌరవం మంట గలసిపోయి సమస్యలు, ఆందోళనలు ఎక్కువైపోతున్నాయి.

ఇది చదవండి: స్వర్గం ఒక భ్రాంతి.. ఐశ్వర్యం – పేదరికం – పురుషాధిక్యత!

క్షీణిస్తున్న ఆరోగ్యాలు:

సోషల్ మీడియా చాలా మంది టీనేజర్లకు మానసిక ఆరోగ్యం క్షీణించడానికి కారణం అవుతోంది. ఈ సాంకేతిక విప్లవం ఆన్‌లైన్ దూకుడుకు,  సైబర్ బెదిరింపులకు సులభమైన ఆట వస్తువై పిల్లలపైనా, పెద్దలపైనా మరింత మానసిక ప్రభావానికి గురి చేస్తుంది.

నేలవిడిచి సాము:

ఆన్‌లైన్ మీడియాకు  వ్యసనం వల్ల అందరూ సాధారణ స్థాయిని మరిచి పోయారు. నేల విడిచి సాము చేస్తున్నారు. ఇతరులతో పరస్పరం చర్చించుకోవడానికి కూడా టైం ఉండడం లేదు. విద్యా , వ్యాపార రంగాల్లో దీర్ఘ కాలిక ప్రయోజనాలు మృగ్యమయ్యాయి.  దీని వల్ల  భవిష్యత్తు అవకాశాలపై తీవ్ర ప్రభావం పడనుంది! ఇక సోషల్ మీడియా వాడకం వ్యసనం, స్థాయిల వల్ల ఇప్పటికే ఉన్న సంబంధాలపై ప్రతికూల ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  

జీవితంపట్ల తగ్గిపోతున్న ఆసక్తి:

చాలా మంది టీనేజర్లు నిరంతరం పరధ్యానం, జీవితం మీద శ్రద్ధ, ఆసక్తి లేకపోవడం వల్ల తమ భాగస్వామితో కూడా సరిగా గడప లేక పోతున్నారు. భార్యా, భర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో పదుల సంఖ్యలో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. బంధువులూ, స్నేహితులూ లేని ఒంటరి జీవితంలో ఆన్ లైన్ ప్రేమలకు అంకితం అవుతున్నారు. పదేళ్ల లోవు పిల్లలు, యువత, పెద్దలకు సోషల్ మీడియా ఓ వ్యసనంగా మారిపోయింది. అదో ప్రవర్తనా రుగ్మత, దీనిలో టీనేజ్ లేదా యువకులు సోషల్ మీడియా ద్వారా ఎక్కువ ఆకర్షితులవుతున్నారు.  స్పష్టమైన ప్రతికూల పరిణామాలు, తీవ్రమైన లోపాలు ఉన్నప్పటికీ ఆన్‌లైన్ మీడియా వినియోగాన్ని తగ్గించడం లేదా నిలిపివేయడం ఏ దేశానికి సాధ్యం కాదు!

పెరుగుతున్న సోషల్ మీడియా వ్యసనం:

చాలా మంది టీనేజర్లు రోజూ (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, వైన్, స్నాప్‌చాట్, వీడియో గేమ్‌లతో సహా) ఏదో ఒక రకమైన ఆన్‌లైన్ మీడియాలో నిమగ్నమై పోతున్నారు. టీన్ సోషల్ మీడియా వ్యసనం  వల్ల అధిక మీడియా వినియోగం మొదలైంది. పెరుగుతున్న మంచి అనుభూతినిచ్చే మార్గంగా సోషల్ మీడియాపై అందరూ ఆధారపడటం వల్ల వేగంగా దుష్ప్రభావం మొదలైంది. అశ్లీల చిత్రాలకు అదుపు లేక పోవడం వల్ల సోషల్ మీడియా అపశ్రుతులకు కారణం అవుతోంది. 

ఇది చదవండి: కరోనా ప్రపంచానికి నేర్పిన సంస్కారం మన నమస్కారం

వాళ్ళే ప్రభుత్వాలనూ నడిపిస్తున్నారా?

స్నేహం వల్ల నష్టాలు, శారీరక సామాజిక సంబంధాల్లో గ్యాప్,  పాఠశాల పిల్లల్లో ప్రతికూల ప్రభావం కనబడుతుంది. ఈ ప్రవర్తనను ఆపడానికి లేదా అరికట్టడానికి ఏ ప్రభుత్వాల వద్ద సరియైన ఆలోచన లేక పోవడమా? పెట్టుబడి దారుల ఉచ్చులో సోషల్ మీడియా చిక్కి ప్రభుత్వాలను వాళ్ళే నడిపిస్తున్నారా అర్థం కానీ ప్రశ్నగా మారిపోయింది.

Ramprasad Rao Bandaru
Ramprasad Rao Bandaru
Mr. Bandaru Rama Prasad has been a journalist since his 21st year. Starting with Andhra Bhoomi as a sub-editor he became desk in-charge at Andhra Prabha before becoming a freelancer and a script writer in electronic medium. Did his MA from Osmania University. He founded Amrita Tele Films..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles