Tuesday, November 5, 2024

ఆంధ్రుల ఆంతర్యం ఏమిటి?

  • పురపోరు ఫలితాలను ఎట్లా అర్థం చేసుకోవాలి?
  • వైఎస్ ఆర్ సీపీకి అంత ఘనవిజయం ఎట్లా దక్కింది?
  • ప్రతిపక్ష పార్టీల కర్తవ్యం ఏమిటి?

పురపోరులో అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీ ఘనవిజయం సాధించింది. ఎన్నికల గుర్తులు లేకుండా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలోనూ అదికార పార్టీదే విజయం. 21 మాసాలుగా అధికారంలో కొనసాగుతున్న జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ పట్ల ప్రజలలో వ్యతిరేకత అంతగా లేదని, ప్రతిపక్షానికి పట్టం కట్టడానికి వారు సిద్ధంగా లేరని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

అధికార పార్టీ పట్ల కనిపించని వ్యతిరేకత

దీనిని ప్రజల మధ్యంతర తీర్పుగా భావించాలి. 2019లో ఇచ్చిన తీర్పునకు భిన్నంగా 2021లో ఇచ్చిన తీర్పు లేదు. అప్పుడ వైఎస్ఆర్ సీపీకి బ్రహ్మరథం పట్టారు. టీడీపీని తిరస్కరించారు. ఇప్పుడూ అదే పని చేశారు. దీనిని సానుకూలమైన ఓటుగా, సకారాత్మకమైన ఓటుగా అధికారపార్టీ నాయకులు అభివర్ణిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత లేదని ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని అంగీకరించక తప్పదు. వ్యతిరేకత కనుక ఉన్నట్లయితే టీడీపీ పరిస్థితి మరీ ఇంత అన్యాయంగా ఉండేది కాదు. ఏ ఎన్నికలలోనైనా రెండు ప్రధాన పక్షాల మధ్య పోరాటం జరిగినప్పుడు అధికారపక్షం పట్ల ప్రజలలో వ్యతిరేకత ప్రబలితేనే ప్రతిపక్షానికి ఓట్లు పడతాయి. అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు.

Also Read : షర్మిల చరిష్మా బీజేపీని దెబ్బ తీయడానికేనా?

స్థానిక సమస్యలూ, స్థానిక నాయకులూ

స్థానిక సంస్థలలో, నగర పాలికల ఎన్నికలలో లభించిన అసాధారణమైన విజయాన్ని అమరావతిని రాజధానిగా తొలగించి, మూడు రాజధానులుగా విభజించాలన్న వైఎస్ఆర్ సీపీ నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించినట్టుగా అధికారపార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. అదే విధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ని ప్రైవేటు సంస్థలకు విక్రయించడం పట్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విధానాన్ని ఆమోదించినట్టు కూడా చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలను అపార్థం చేసుకుంటే అధికారపార్టీకీ, ప్రతిపక్షానికీ నష్టం జరుగుతుంది. ఈ రెండు అంశాల (అమరావతి, విశాఖ ఉక్కు) ప్రాతిపదికపైన ఎన్నికల ప్రచారం జరగలేదు. స్థానిక అంశాలూ, స్థానిక నాయకులూ ప్రాతిపదికగా ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర స్థాయి అంశాలూ, సమస్యలూ చర్చకు రాలేదు. అలసు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రచారం చేయలేదు. తన పార్టీకి ఓటు వేయమని ప్రజలకు విజ్ఞప్తి చేయలేదు.

విశాఖ ఉక్కుపై మెతక వైఖరి

ఎన్నికల ప్రచారంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంతో పోరాడతామని అటు ముఖ్యమంత్రి కానీ ఇటు ప్రతిపక్ష నాయకుడు కానీ అనలేదు. ముఖ్యమంత్రి రెండు లేఖలు ప్రధానమంత్రికి రాశారు. ప్రతిపక్ష నాయకుడు ఆ పని కూడా చేయలేదు. విశాఖ ఉక్కు విషయంలో ముఖ్యమంత్రి వైఖరికీ, ప్రతిపక్ష నాయకుడి వైఖరికి పెద్దగా తేడా లేదు. ఇక అమరావతి విషయంలో ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలు కానీ నిర్ధారణలు కానీ నిరూపణ కాలేదు.

Also Read : పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి – ఏపీ సీఎం

అమరావతి ఆరోపణలు నిరూపణ కాలేదు

భూముల విషయంలో నాటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు ఒడిగట్టారనే ఆరోపణ నిర్ద్వంద్వంగా నిరూపణ కాలేదు. కాలం కరిగిపోతోంది కానీ ఆరోపణలు ఆరోపణలుగానే మిగిలిపోయాయి. ఆరోపణలను సాక్ష్యాధారాలతో నిరూపించే ప్రయత్నం అధికారపక్షం చేయలేదు. అవినీతి, బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతం వంటి ఆరోపణల విషయం ఎట్లా ఉన్నప్పటికీ అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ప్రతిపాదనను అమలు చేయడానికి సైతం గట్టి ప్రయత్నం జరగలేదు. కొందరు న్యాయస్థానాలలో దావాలు వేశారు. అందువల్ల ప్రభుత్వం అడుగు ముందుక పడలేదు.

హామీల అమలు జయప్రదం

గడచిన 21 మాసాలలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కృతకృత్యుడైనారు. ఇదే స్థాయిలో హామీలన్నిటినీ అమలు చేయగల ఆర్థిక పరిపుష్టి ఆంధ్రప్రదేశ్ కు ఉంటే ఆయన అదృష్టవంతుడే. ప్రతిపక్షాల వైఫల్యం కూడా ఆయనకు కలసివచ్చిన అంశం.

Also Read : కొల్లు రవీంద్ర అరెస్టు, బెయిల్ మంజూరు

హైదరాబాద్ లో నివాసం, ఆంధ్రలో పోరాటం

తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానికంగా పోరాటం చేస్తున్నప్పటికీ వారికి విశ్వనియత పెరగలేదు. పార్టీ నాయకులు నారా చంద్రబాబునాయుడూ, లోకేష్ లు హైదరాబాద్ లో నివాసం ఉన్నంతకాలం పార్టీకి సమర్థమైన నాయకత్వం ఇవ్వజాలరు. వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు అన్నట్టు టూరిస్టుల మాదిరే కనబడతారు కానీ స్థానికంగా నివాసం ఉంటూ పార్టీని నడిపే నాయకులుగా పరిగణన పొందరు.

నింద ప్రజలపై వేయడం విజ్ఞతా?

ఇటీవల నారా చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లాలలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన పద్ధతి తప్పు. తనను ఓడించినందుకు ప్రజలను తప్పుపట్టి, వారిని నిందించడం విశేషమైన అనుభవం కలిగిన  నాయకుడు చేయవలసిన పనికాదు. ‘మీరు ఆయనకే ఓటు వేయండి, పాచి పనులు చేసుకుంటూ బతకండి’ అంటూ నిందాపూర్వకంగా ప్రజలతో మాట్లాడుతున్నారంటే 2019లో ప్రజలు ఇచ్చిన తీర్పును  జీర్ణించుకోలేదన్న మాట. అప్పటి ఓటమిని అర్థం సవ్యంగా చేసుకోలేదన్న మాట.

పరాజయాన్ని అర్థం చేసుకోవడంలో వైఫల్యం

జయాపజయాలను అర్థం చేసుకోకపోతే విజేతలకూ, పరాజితులకు కూడా రాజకీయాలలో వైఫల్యం తప్పదు. 2019లో వైఎస్ ఆర్ సీపీ కి అంత ఘనంగా ఓట్లూ, సీట్లూ రావడానికి కేవలం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర, ఆయన ఇచ్చిన హామీలు కారణం కాదు. ఈ రెండు అంశాలూ చాలా ముఖ్యమైన కారకాలే. అనుమానం లేదు. కానీ వాటికి తోడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పట్ల ఉన్న వ్యతిరేకత కూడా వైసీపీ విజయానికి దోహదం చేసింది. తన తప్పులను ప్రతిపక్షనాయకుడు తెలుసుకోకుండా, ఒప్పుకోకుండా, తనను ఓడించినందుకూ, తన ప్రత్యర్థిని గెలిపించినందుకూ ప్రజలను నిందిస్తున్నారు. అందుకని తిరిగి వైసీపీకే ప్రజలు ఓట్లు వేశారు. 2014 నుంచి 2019 వరకూ తన హయాంలో జరిగిన కార్యక్రమాలనూ, అమలైన నిర్ణయాలనూ ఒక్కసారి సింహావలోకనం చేసుకొని ఎక్కడ పొరపాట్లు జరిగాయో గ్రహించి తప్పులు ఒప్పుకొని ఉంటే చంద్రబాబునాయుడికి మరో అవకాశం ఇవ్వాలని ప్రజలు  భావించేవారేమో. అలవాటు లేని విధంగా ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయడం కూడా ఓటమికి గల కారణాలలో ఒకటి.

Also Read : విశాఖ ఉక్కుతో మీకేం సంబంధం?

ప్రతిపక్ష పాత్రకు అన్యాయం

జేపీ బలాన్ని తక్కువ అంచనా వేసి, కాంగ్రెస్ బలాన్ని ఎక్కువ అంచనావేసి, బీజేపీతో తెగతెంపులు చేసుకొని, కాంగ్రెస్ తో కొత్తబంధం పెట్టుకొని ఎన్నికల బరిలో ఒంటరిగా దిగడంలోని ఔచిత్యం ఏమిటో ఆలోచించుకోవాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పట్ల మెతక వైఖరి వహిస్తూ, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్మించకుండా ఉపేక్షించడం వల్ల ప్రతిపక్ష పాత్రకు అన్యాయం చేస్తున్న విషయాన్ని చంద్రబాబునాయుడు గ్రహించాలి. ఆయన , గ్రహించకపోయినా ప్రజలు గ్రహిస్తున్నారు.

ఇద్దరూ ఇద్దరే

జగన్ మోహన్ రెడ్డి లాగానే, చంద్రబాబునాయుడు కూడా బీజేపీ పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారనీ, ఉక్క కర్మాగారాన్ని రక్షించడం వీరు ఇద్దరి వల్లా కాదనీ నిర్ణయానికి వచ్చి ప్రజలే ప్రత్యక్షంగా ఉద్యమించాలని సంకల్పించుకున్నారు. కారణం ఏదైనా ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు ముఖ్యమైన పార్టీలూ ఉక్కు కర్మాగారం పట్ల నిర్లిప్తంగానే, నిస్సహాయంగానే, నిస్సత్తువగానే ఉన్నాయి. అధికారం వైసీపీ ప్రధానికి ఉత్తరాలు రాయడానికే పరిమితం అయింది. ప్రతిపక్ష టీడీపీ స్థానిక నాయకులకు ఈ విషయం అప్పగించింది కానీ పార్టీ అధ్యక్షుడు దృఢమైన వైఖరి తీసుకోవడం లేదు. బీజేపీ ఎట్లాగూ మౌనాన్ని ఆశ్రయించవలసిందే. బీజేపీ మిత్రపక్షమైన జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ సైతం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో నోరు మెదపడం లేదు. కాలు కదపడం లేదు. ఇంత ముఖ్యమైన సమస్య పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్న ప్రతిపక్షాలను గౌరవించవలసిన పని లేదని ప్రజలు నిర్ణయిస్తే అది వారి తప్పు కాదు.

Also Read : అమరావతిలో ఉద్రిక్తంగా మహిళా రైతుల నిరసన

ఒక సవాలు, ఒక అవకాశం

ఈ నేపథ్యంలో జరిగిన స్థానిక  ఎన్నికలలో, పురపాలక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ ఘనవిజయం సాధించడంలో ఆశ్చర్యం లేదు. ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు ఇదే మెతక వైఖరి కొనసాగిస్తే 2024లో జరగబోయే ఎన్నికల ఫలితాలు భిన్నంగా ఉండబోవు. బీజేపీ పట్ల భయం ఉన్నా, ప్రేమ ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఆమోదించరనీ, ముఖ్యంగా ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం మరగుతూ ఉన్నంత కాలం బీజేపీకీ, దానితో అంటకాగే పార్టీలకూ కష్టాలూ, నష్టాలూ తప్పవనీ గుర్తించాలి. ప్రతిపక్షాలు సైతం అధికార పార్టీ లాగానే ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో నిర్లిప్తంగా ఉన్నాయి కనుక ఎన్నికల హామీలను తరతమ భేదం లేకుండా అందరికీ వర్తించే విధంగా అమలు చేస్తున్న వైఎస్ ఆర్ సీపీకి ఓటు వేయడమే మంచిదని ప్రజలు భావించి ఉండాలి. ఈ పరిస్థితి మారాలంటే ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో టీడీపీ, జనసేనలు మనస్పూర్తిగా పాల్గొనాలి. విశాఖ ఉక్కు ఉద్యమం ప్రతిపక్షాలకు ఒక సవాలు, ఒక అవకాశం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles