Thursday, May 2, 2024

వాలంటీర్లు బలమా?….బలహీనతా?

వోలేటి దివాకర్

గడప, గ్రామం దాటకుండానే ఠంచన్ గా 1వ తేదీన పెన్షన్ల పంపిణీ,  సంక్షేమ పథకాలు, సేవలు లభించడంతో వలంటీర్ల వ్యవస్థ పట్ల  ప్రజల్లో కూడా సంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవై పు వలంటీర్ ఉద్యోగాల ద్వారా ఉపాధి దొరకడంతో నిరుద్యోగులు కూడా ఆనందంగా ఉన్నారు. వైఎస్సార్సిపి ప్రభుత్వానికి వలంటీర్ల వ్యవస్థ ఎంత బలమో…అంతే బలహీనతగా మారే అవ కాశాలు ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఏ వ్యవస్థలోనైనా లోటుపాట్లు సహజమే. దీన్ని ప్రతిపక్షాలు అవకాశంగా తీసుకుని విమర్శలు చేస్తున్నాయి. వలంటీర్ల సేవలు ఎంత పారదర్శకంగా, వేగంగా ఉంటే ప్రభుత్వానికి అంత పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. వచ్చే ఎన్నికల్లో ఇది పార్టీకి కలిసి వచ్చే అంశం. ఇందుకోసం వలంటీర్ల వ్యవస్థను మరింత సమన్వయం, ఆజమాయిషీ చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థ గాడి తప్పితే మాత్రం పార్టీకి తీరని నష్టమనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు తమను కాదని సంక్షేమ ఫలాల పంపిణీ పెత్తనాన్ని వలంటీర్లకు అప్పగించడం కూడా పార్టీ శ్రేణులకు కాస్త రుచించడం లేదు.  

 నడుస్తున్న రాజకీయం

ఎన్నికల వేళ వైఎస్సార్సీపి ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వలంటీర్ వ్యవస్థపై  రాజకీయం నడుస్తోంది. పార్టీకి, ప్రభుత్వానికి ఆయువుపట్టుగా ఉన్న వలంటీర్ వ్యవస్థపై తొలి నాళ్లలో ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా దుష్ప్రచారం సాగించాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయితే ఏకంగా రాష్ట్రంలో వలంటీర్ల ద్వారానే మానవ అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కూడా ఇంట్లోకి చొరబడి సమాచారాన్ని తస్కరిస్తున్నారని వలంటీర్లపై ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని కూడా ఆయన ఒకదశలో చెప్పారు. అయితే ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్న వలంటీర్ల వ్యవస్థకు ప్రజల మద్దతు ఉందని తెలుసుకున్న పవన్, చంద్రబాబు ఆ తరువాత కాస్త వెనక్కి తగ్గారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని టిడిపి స్పష్టం చేయడం గమనార్హం.

తాయిలాల పంపిణీ

 అధికార పార్టీ నాయకులు మాత్రం ఈఎన్నికల్లో ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగిన  వలంటీర్ వ్యవస్థనే వినియోగించుకుని ఓట్లు దండుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లను మంచి చేసుకునేందుకు తాయిలాలు పంపిణీ చేస్తున్నారు. వైసిపి నిర్వహించే ర్యాలీలు, సభల్లో కూడా వలంటీర్లను ఎడాపెడా వాడేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత రాజమహేంద్రవరంలో వైసిపి అభ్యర్థి మార్గాని భరత్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న 23 మంది వలంటీర్లపై టిడిపి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఫిర్యాదు మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ వేటు వేశారు. ప్రతిపక్షాల తీరుకు నిరసనగా రాజమహేంద్రవరంలో వలంటీర్లు రాజీనామా చేసి, నేరుగా వైసిపికి మద్దతు పలకడం విశేషం.  మరోవైపు  వైసిపి ప్రభుత్వం నియమించిన వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచడంలో  ప్రతిపక్షాలు విజయం సాధించాయి. ఇది ఒక విధంగా అధికార పార్టీకి పెద్ద  మైనస్ గానే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా వలంటీర్లు వైసిపి ప్రభుత్వానికి ప్లస్సా..మైనస్సా అన్నది రానున్న ఎన్నికల ఫలితాలు తేల్చేస్తాయి. మరోసారి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే వలంటీర్ల వ్యవస్థ వల్లే ఇది సాధ్యమని చెప్పుకోకతప్పదు. టిడిపి కూటమి అధికారంలోకి వస్తే ఈవ్యవస్థలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. 

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles