Saturday, December 7, 2024

షర్మిల చరిష్మా బీజేపీని దెబ్బ తీయడానికేనా?

* తెలంగాణ కాంగ్రెస్ పక్షులు వలస పోతాయా?

* వైఎస్సార్ కూతురి ఇమేజ్ కేసీఆర్ కే లాభమా?

తెలంగాణకు గట్టిగా అడ్డుపడ్డది అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి…రాష్ట్రపతి ఉభయ సభల్లో తెలంగాణ ఇవ్వడం తధ్యమన్నా కూడా విభజనను వ్యతిరేకించి చాలా కాలం తెలంగాణ రాకుండా కాంగ్రెస్ అధిష్టానాన్ని వైఎస్ఆర్ అపగలిగాడు…”ఒక వేళ తెలంగాణ మీరు ప్రకటిస్తే నేను వేరే కుంపటి పెడతానని” కూడా ఆనాడు సోనియాకు కరాఖండిగా చెప్పినట్టు వార్తలు వచ్చాయి… వైఎస్సార్ అనుంగు అనుచరుడు కేవీపీ రామచందర్రావు  అప్పటి పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి. వైఎస్సాఆర్ మరణానంతరం కాంగ్రెస్ ధైర్యం చేసి తెలంగాణ ప్రకటించడం విభజన తో ఆంధ్ర పార్టీలతో పాటు కాంగ్రెస్ కూడా కాల గర్భంలో కలసి పోయాయింది.

తెలంగాణ సెంటిమెంట్ తో టీఆర్ఎస్ రాజ్యం

తెలంగాణ సెంటి మెంట్ తో టీఆర్ఎస్ ఏడేళ్లు గా  రాజ్యం ఏలుతోంది. ఐదేళ్లు కేసీఆర్ పాలనకు బ్రహ్మరథం పట్టిన తెలంగాణ ప్రజలు రెండో సారి కూడా కేసీఆర్ వైపే మొగ్గు చూపారు.  తెలంగాణ కాంగ్రెస్ సొత్తు అని గెలిచిన కాంగ్రెస్ శాసన సభ్యులు కూడా ఎన్నో ప్రలోభాలకు లోనై టీఆర్ ఎస్ కు ఫిరాయించారు. కాంగ్రెస్ కు ప్రతి పక్ష హొదా కూడా లేకుండా చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇంకా మూడేళ్లు పదవీ కాలం ఉండగానే తన కుమారుణ్ణి సిఎం చేయాలనే ఆలోచన  కేసీఆర్ కు రావడంతో తెలంగాణ టిఆర్ఎస్ సీనియర్ శాసన సభ్యుల్లో కలవరం మొదలైంది. ఉద్యమం మొత్తంలో మా పాత్రను వాడుకొని ఇప్పుడు కుటుంబ పాలన తెస్తున్న కేసీఆర్ పై తిరుగుబాటు జెండా ఎగురవేసే వ్యూహాలు మొదలు అయ్యాయి. ముప్ఫై మంది టిఆర్ఎస్ శాసన సభ్యులు వేరు కుంపటి పెట్టుకునే దిశగా మంతనాలు జరుగుతున్న దశలో కేసీఆర్ కొడుకు పట్టాభిషేకాన్ని వాయిదా వేశారు.  తన రాజకీయానికి పదును పెట్టాడు.

Also Read : పీవీ కుమారుడిని పార్టీలు ఏకాకిని చేస్తున్నాయా?

తెలంగాణకు పోవాలంటే వీసా తీసుకోవాలా?

ఒక వైపు బిజెపి ఎదుగుదల, మరో వైపు పెరుగుతున్న పార్టీ నెగిటివ్ ఓటు బ్యాంకు నుండి దృష్టి మరల్చే ఏకైక మార్గం షర్మిల రూపంలో కేసీఆర్ ఎంచుకున్న అస్త్రం అని కొందరు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. “తెలంగాణకు పోవాలంటే వీసా తీసుకోవాలా?” 2009 ఎన్నికలలో తెలంగాణలో పోలింగ్ పూర్తయిన తర్వాత ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో పోలింగ్ జరగడానికి ముందు ఆంధ్ర ఎన్నికల సభలో ఎలుగెత్తిన వైఎస్సార్ తనయ ఏ వీసా లేకుండా ఇక్కడ ఏకంగా పార్టీ పెట్టే వ్యూహ రచనకు కేసీఆర్ అండ దండలు ఉన్నాయని రేవంత్ రెడ్డి లాంటి వారు అనడం చూస్తే ఇప్పుడు ఎదుగుతున్న బిజెపికి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తుంది షర్మిల ఎంట్రీ.

హైదరాబాద్ రూపురేఖలు మార్చిన వైఎస్ ఆర్

వైఎస్సార్ హయాంలో హైద్రాబాద్ రూపు రేఖలు మారాయి. ఆయన హయాంలో 90 లక్షలు ఉన్న హైద్రాబాద్ జనాభా ఇప్పుడు కోటి దాటింది. వేగంగా విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన పై వై ఎస్ ఆర్ ఆనాడే దృష్టి పెట్టారు..ఏనాడో చంద్రబాబు హయాంలో ప్రతిపాదనల్లో ఉన్న శంషాబాద్ ఎయిర్ పోర్టు ను వైఎస్సార్ అగమేఘాల మీద కార్య రూపం దాల్చేలా చేసారు. ఈ ట్రాఫిక్ సమస్య లను ఛేదించుకుని విమానాశ్రయం వెళ్ళేసరికి విమానం వెళ్లి పోతుందనే విమర్శ చేసిన వారి నోళ్ళు మూయిస్తూ పివీ నరసింహారావు హైవే ను నిర్మించారు. భాగ్యనగర ట్రాఫిక్ ఇబ్బందులను దూరం చేసేలా ఎన్నో  ఒడి దోడుకులు ఎదురైనా నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేసి ట్రాఫిక్ కష్టాలు లేకుండా చేశారు. ఇక మొత్తంగా హైద్రాబాద్ నగరం అన్ని మూలాల మెట్రో రైలు వెళ్లేలా బృహత్తర పథకం కార్య రూపం దాల్చేలా సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు.

Also Read : వాణిదేవి సేఫ్ గేమ్ ఆడారా?

షర్మిల సుదీర్ఘ పాదయాత్ర

చంద్రబాబు హయాంలో మూడు నాలుగు ఫ్లై ఓవర్లు ఉంటే వైఎస్సార్ ఏకంగా 12 ఫ్లై ఓవర్లు ఏర్పాటు చేసి హైద్రాబాద్ ను సుందర నగరంగా చేశారు. అలాంటి వైఎస్సార్ పాద యాత్ర కూడా ఆయన వ్యక్తి గత ఇమేజ్ ని పదింతలు పెంచింది! కాలం ఆయనను మరిచిపోలేదని ఆంధ్రలో ఎట్టకేలకు ఆయన కొడుక్కి పట్టం కట్టేలా చేసింది.  అన్నను ముఖ్యమంత్రి చేయడానికి సుదీర్ఘ పాద యాత్ర చేసిన షర్మిల తండ్రికి మించిన తనయగా నిరూపించుకున్నది. సుదీర్ఘ పాదయాత్ర ముగించి సోదరుణ్ణి అధికార పీఠం మీద కూర్చో బెట్టడంలో కూడా షర్మిల పాత్ర అమోఘం, అద్వితీయం.  అలాంటి షర్మిల ఆంధ్రలో అధికార పీఠానికి జగన్ దూరంగా ఉంచడమే కాకుండా కనీసం చట్ట సభల్లో ప్రాతినిధ్యం కూడా లేకుండా చేశారు.  కుటుంబ గౌరవంతో పాటు అసమ్మతి రాగం లేకుండా షర్మిల సమన్వయం పాటించారు. చంద్రబాబు రెచ్చగొట్టినా కూడా తన మనోభావాలు బయటకు వ్యక్తం చేయకుండా గొప్ప రాజనీతిజ్ఞత పాటించిన షర్మిల ఒక్క సారిగా తెలంగాణలో పార్టీ పెట్టడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది.

జగన్ కి కేసీఆర్ పరోక్ష సహకారం

జగన్ అధికారంలోకి రావడానికి  ప్రగతి భవన్ వేదిక అయిందంటూ స్వయంగా చంద్రబాబే ఆరోపణలు చేశాడు. కేసీఆర్ డబ్బు ప్రవాహం ఆంధ్ర ఓటర్ల మనసును మార్చిందో లేదో కానీ మొత్తానికి జగన్ అధికారంలోకి రావడానికి కేసీఆర్ పరోక్ష సహకారం దోహదం చేసింది. ఇద్దరూ మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు. తన రాజకీయ అనుభవాన్ని జగన్ కు జోడించడంలో కేసీఆర్ ఫలప్రదం అయ్యారు. తన రాజకీయ ఎదుగుదలను ఆపాలని చూసిన చంద్రబాబుకు ఆంధ్రలో కూడా రాజకీయ మనుగడ లేకుండా చేయడంలో కేసీఆర్ కృతకృత్యులు అయ్యారు. ఇలాంటి దశలో బిజెపి తెలంగాణలో బలపడుతుండడం , ఏకంగా తన కూతురుని బిజెపి అభ్యర్థి ఓడించడం కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారు.

Also Read : రాజకీయాల్లోనూ అసమానతలు

మూడు పార్టీల వ్యవస్థే కేసీఆర్ కి కీలకం

రాష్ట్రంలో మూడు పార్టీల వ్యవస్థ ఉంటేనే కేసీఆర్ లబ్ధి పొందుతాడు. కమ్యూనిస్టులు అడ్రస్ లేకుండా పోయారు. హైద్రాబాద్ లో బలం ఉన్న ఎంఐఎం ఎలాగూ కేసీఆర్ మిత్రపక్షమే. ఆ పార్టీ కూడా హైద్రాబాద్ వరకే తన పరపతి చూపగలుగుతుంది. ఇలాంటి దశలో తెలంగాణ రాష్ట్రంలో అంతో ఇంతో ఇమేజ్ ఉన్న నాయకుడు వైయస్సార్.  ఆయన కుతూరిని రంగంలోకి దింపితే తన స్థానం మెరుగువుతుందనే మూడేళ్ళ దీర్ఘకాలిక రచనకు శ్రీకారం చుట్టారు కేసీఆర్. ఇది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.

షర్మిల వ్యూహం ఏమిటి?

ఇప్పుడు షర్మిల వ్యవహారం చూద్దాం. 1973 లో జన్మించిన షర్మిల 47 ఏళ్ల వయసులోనే బోలెడంత రాజకీయ అనుభవం సముపార్జించారు. బ్రదర్ అనిల్ కుమార్ బోధనకు ఆకర్షితురాలై ఆయనను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా గృహిణిగా ఇంటికి పరిమితం కాకుండా  తెలంగాణ లో 2012 లో కొండ సురేఖ కు ప్రచారం చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు వంద బహిరంగ సభల్లో తన వాగ్ధాటిని వినిపించిన షర్మిల కోటి మందిని కలుసుకున్నట్టు పరీశీలకుల అంచనా. ఇలాంటి దశలో జగన్ మళ్ళీ జైలుకు వేళ్ళవలసి వస్తే జరిగే పరిణామాల్లో షర్మిల ఆంధ్ర ముఖ్యమంత్రి పీఠం అధిష్టించవచ్చనే పుకార్లు వచ్చాయి.

Also Read : షర్మిల కొత్త పార్టీపై ఏప్రిల్ 9 న ప్రకటన

రెడ్డి సామాజికవర్గం రెడీ

జగన్ నిలదిక్కుకుని పరిపాలన పై దృష్టి పెడుతున్న సమయంలో తెలంగాణ లో చెల్లెలి పార్టీ హడావిడి జగన్ కు తెలియదు అనుకోవడం భ్రమ. అశేష తెలుగు ప్రజలను జగన్ మభ్యపెడుతున్న మాట వాస్తవం. జగన్…సన్నిహితులతో పాటు జగన్ కు కేసీఆర్ చేసిన వ్యూహ రచన అర్థమయ్యాకే అన్న ఆమోదంతోనే షర్మిల తెలంగాణలో ఎంట్రీ అయ్యారు.  రంజైన రాజకీయం మొదలయింది. కాంగ్రెస్ కి చెందిన రెడ్డి సామాజికవర్గం నాయకులు షర్మిల వైపు కదులుతున్నారు… నిన్న మొన్న కేసీఆర్ ను ధిక్కరించి బిజెపికి వెళ్లిన టిఆర్ఎస్ అగ్రజులు కూడా షర్మిల పార్టీ పై దృష్టి పెట్టారు. వారికి అక్కడ సరైన స్థానం లభించలేదు.. బిజెపి జాతీయ పార్టీ. వేరే పార్టీల నుంచి వచ్చే వారికి వాళ్ళు ప్రాధాన్యత అంతగా ఇవ్వరు. ఇలాంటి దశలో కాంగ్రెస్ కల్చర్ ఉన్న షర్మిల గూటికి రావాలని టీఆర్ఎస్ మాజీలు ప్రయత్నిస్తున్నారు.

కాంగ్రెస్ కు సాగర్ ఉపఎన్నిక కీలకం

ఇక కాంగ్రెస్ “సాగర్” ఎన్నికల్లో ఓటమి చవిచూస్తే గాంధీ భవన్ వైపు వెళ్లే వాళ్లు కూడా ఉండరు. అప్పుడు అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్ శిబిరం ఖాళీ కావడం తధ్యం. కాంగ్రెస్ నాయకులు షర్మిల వైపు వెళ్లడానికి పావులు కదువుతున్నారు…కేసీఆర్ కు కావల్సింది అదే! వైఎస్ ఆర్ తనయగా ఆమె తెలంగాణలో నిలదొక్కుకున్నా కేసీఆర్ కు పెద్దగా నష్టం లేదు. ఎందుకంటే బిజెపి ని దెబ్బ కొట్టాలంటే తెలంగాణలో మూడో పార్టీ అవసరం. దానికి తోడు బిజెపిని తిడితే హిందుత్వ ఓట్లు పోకుండా ఆంధ్ర పార్టీలు తెలంగాణలో సమైక్య  ఎత్తుగడలు వేస్తున్నాయని కేసీఆర్ తిట్టడానికి టాపిక్ దొరికింది.

Also Read : సొంత మీడియా ఏర్పాటుకు షర్మిల సన్నాహాలు

షర్మిల ఎంట్రీ కేసీఆర్ ఎన్నికల ప్రచారాస్త్రం

అసంబ్లీ లో వై ఎస్ సార్ మాట్లాడిన వీడియో రికార్డులు…తెలంగాణ వ్యతిరేకి అయిన వై ఎస్ ఆర్ కూతురు వస్తే మళ్ళీ నీళ్ళు నిధులు నియామకాలకు గండి పడ్డట్టే అని కేసీఆర్ విమర్శలకు పదును షర్మిల ద్వారా దొరికినట్టే. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇతివృత్తం లేకుండా ఊకదంపుడు సాగిస్తున్న కేసీఆర్ కు ఖమ్మంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎంట్రీ ఇవ్వడం ద్వారా ఎటువంటి అవకాశం ఇచ్చారో ఇప్పుడు షర్మిల ద్వారా అటువంటి అవకాశమే వస్తుందని అనుకుంటున్నారు. పోయిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే టీఆర్ఎస్ కు అత్తెసరు స్థానాలు దక్కేవి. కాంగ్రెస్ చరిత్ర మరో విధంగా ఉండేది. జగన్ కేసీఆర్ రహస్యంగా కలిసి ఆడుతున్న ఈ సినిమా బ్యాలెట్ బాక్స్ ని బద్దలు కొడుతుందా లేక ప్లాప్ అవుతుందా అన్నది  కాలమే నిర్ణయిస్తుంది.

Also Read : కేసీఆర్ పై షర్మిల విమర్శనాస్త్రాలు తొందరపాటు చర్యా?

Ramprasad Rao Bandaru
Ramprasad Rao Bandaru
Mr. Bandaru Rama Prasad has been a journalist since his 21st year. Starting with Andhra Bhoomi as a sub-editor he became desk in-charge at Andhra Prabha before becoming a freelancer and a script writer in electronic medium. Did his MA from Osmania University. He founded Amrita Tele Films..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles