Thursday, November 30, 2023

దేవకి, యశోద ‌- దివ్యమైన నారాయణ మంత్రాలు

  • గోదా గోవింద గీతం 25

నేపథ్యం

గోపికలు ఆదేశిస్తే సింహాసందాకా నడిచి వచ్చి అధిరోహించిన భక్త పరాధీనుడు శ్రీకృష్ణుడు. తనకు మంగళం పాడారు గోపికలు నిన్నటి పాశురంలో. తాను సర్వశక్తిమంతుడినని తెలిసినా, నాకు ఏ దృష్టి దోషమూ రావద్దని కోరుకుంటున్నారు. నాశక్తికి బలానికి, ఆయుధాలకు లోపం రాకూడదని మంగళం పాడుతున్నారు. ఎంత ప్రేమ? ఎంత ఆదరణ? అనుకుంటూ వీరిని ఆదుకోవలసిందే అడిగింది ఇవ్వవలసిందే అని భావిస్తున్నాడట. ఈ పాశురంలో కంసుడి గుండెల్లో భయం నిప్పు పెట్టిన శ్రీకృష్ణుడు అని గోదమ్మ వర్ణిస్తారు. గుండెల్లో నిప్పు ఎవరైనా తనకు తానే పెట్టుకుంటారు. శ్రీకృష్ణుడి పట్ల ద్వేషం పెట్టుకున్నది కంసుడు, భయపడ్డది కంసుడు. అందువల్ల అంతమైపోయింది కూడా అతనే. తమ చర్యల పర్యవసానాలే ఉంటాయనే జీవిత పాఠం మనకు వినిపిస్తుందీ గీతం.  ఇదే శ్రీకృష్ణావతార రహస్యం.

ఒరుత్తి మగనాయ్ పిఱందు ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ యొళిత్తు వళర
తరిక్కిలానాకి త్తాన్ తీంగు నినైంద
కరుత్తై పిరైప్పిత్తు కంజన్ వైత్తిల్
నెరుప్పెన్న నిన్న నెడుమాలే ఉన్నై
అరుత్తిత్తు వందోం పఱై తరుతియాగిల్
తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యాంపాడి
వరుత్తముమ్ తీరుంద్ ముగిరుంద్-ఏలోర్ ఎంబావాయ్

ఒక తల్లికి (ఒరుత్తి) మగనాయ్ (పుత్రుడిగా) జనించి (పిఱందు) పుట్టిన రాత్రే మరొక తల్లికి (ఒరుత్తి) కొడుకుగా (మగనాయ్) రహస్యంగా పెరుగుతున్న కాలంలో (ఒళిత్తువళర) ఒక రాక్షసుడు (త్తాన్) సహించని వాడై (తరిక్కిలానాగి) కీడు తలపెట్టి (తీంగు నినైంద) కంసుని యొక్క (కంజన్) దురాలోచనను (కరుత్తై) భగ్నం చేసి (పిరైప్పిత్తు) ఆతని కడుపులో (వయిట్రిల్) నిప్పై నిలిచిన (నెరుప్పు నిన్ఱ) సర్వాధికుడా (నెడుమాలే) నిన్ను (ఉన్నై) కావలసిన వాటిని అడగడానికి వచ్చినాము (అరుత్తిత్తువందోమ్) మాకోరికను తీర్చేట్లయితే (పఱై తరుదియాగిల్) శ్రీమహాలక్ష్మి కూడా కోరదగిన నీ ఐశ్వర్యాన్ని (తిరుత్తక్క శెల్వముమ్) నీ శౌర్యసౌశీల్య లక్షణాలను (సేవగముమ్) మేము పాడి, స్తుతించి (యామ్ పాడి) నిన్ను ఎడబాసిన దుఃఖము తొలగిపోగా (వరుత్తముమ్ తీర్ న్దు) సంతోషిస్తాము (మగిఝిన్దు).

బొమ్మకంటి శ్రీనివాసాచార్యుల వారి తెలుగు సిరినోము పద్యం

ఒక తల్లి బిడ్డవై యొదవి రాత్రికి రాత్రి

          వేరొక అమ్మకు తలబిడ్డవగుచు

గుప్తమ్ముగా పెరుగుచు నున్న నోర్వక

          తాన్ నిను పరిమార్చు తలపుతొడ

ఎన్నెన్ని పన్నెను పన్నాగము లవెల్ల

          వమ్మొనర్చుచు కంసు రొమ్ము మీది

కుంపటి వైన హే గోపాల: నిన్ను మే

          మర్థించ వచ్చితి మంబుజాక్ష

కూర్మిమై మా ‘డక్కి’ మాకనుగ్రహింపవే

          అల పిరాట్టికి భోగ్యమగు విభవము

పాడుచు: నీ మహత్త్వమ్ము నెంచుచు మేము

          పరవశించి మరచి విరహ బాధ.

గజేంద్రమోక్షంలో ఒక భక్తుడిని కాపాడడానికి వచ్చినట్టు రావడం కాదు కృష్ణావతారం అంటే, ఒక తల్లి కడుపులో పుట్టి తన అవతారాన్ని ప్రారంభించి మరో తల్లి ఇంట పెరిగినాడు శ్రీ కృష్ణుడు. శ్రీరాముడు యువకుడిగా ఎదిగిన తరువాత రాక్షసులతో యుద్ధం చేయవలసి వచ్చింది. కాని శ్రీ కృష్ణుడి పుట్టుకే శత్రుస్థావరంలో జైల్లో జరిగింది. పుట్టిన వెంటనే మౌనంగా జైలునుంచి తరలిపోయి రహస్యంగా మరొక తల్లి దగ్గర పెరగాల్సివచ్చింది. ఏడో రోజునుంచే రాక్షసులతో పోరాటం తప్పలేదు. అందుకే తల్లి పేరు చెప్పకుండా, ఎక్కడ పుట్టాడో ఎవరో ఎవరి దగ్గర పెరుగుతున్నాడో, అతనికి ఎవరివల్ల భయం ఉందో ఆతని పేరు దాచి మాట్లాడుకుంటున్నారు భయం భయంగా గోపికలు. కాలం గడిచిపోయినా శ్రీ కృష్ణ ఆవిర్భావ సమయంలో ఉన్న పరిస్థితులు అప్పుడే ఉన్నట్టు భావించి ఆందోళన పడుతున్నారు. ఇదీ గోపికల భక్తి ప్రేమాతిశయం. భగవంతుడికి జన్మనిచ్చిన సంతోషం కన్న ఆయన్ను కంసుడేంచేస్తాడోనన్నభయంతో పసికందును అర్ధరాత్రి తల్లి తీసుకుపొమ్మని ఇచ్చేసింది. కన్నతండ్రే కొడుకును తరలించవలసి వచ్చింది.

Also Read : జ్ఞానదశనుంచి ప్రేమాతిశయంతో భక్తి దశలోకి….

ఆ మాతలిద్దరూ అద్వితీయులే

దేవకీ, యశోద ఎంత పుణ్యం చేసుకున్నారో? పోనీ నంద గ్రామంలోనైనా ప్రశాంతంగా పెరిగాడా అంటే అదీ లేదు. ఎప్పుడు ఏ రాక్షసుడు దాడిచేస్తాడో తెలియని భయానక పరిస్థితులే ఎప్పుడూ. ఆ సమయంలో పుట్టిన ప్రతి శిశువును సంహరించాలని కంసుడి ఆదేశం. దాన్ని పాటించాలని ఇంకా ఎక్కడైనా పసికందు కనిపిస్తాడా అని చూస్తూ పాలిస్తాననే నెపంతో బయలుదేరిన పూతన, అమాయకంగా బండిలో దూరిన శకటాసురుడి వంటి రాక్షసులు ఎందరు ఊళ్లో తిరుగుతున్నారు, మరెందరు వ్రేపల్లెకు వస్తున్నారో తెలియదు. అటువంటి క్రూరాత్ముడైన కంసుని గుండెల్లో నిప్పై కూర్చున్నాడు శ్రీకృష్ణుడు. అంతటి ఉద్రిక్త పరిస్థితులలో సైతం శత్రువులకు భీతి గొల్పుతూనే భక్తులకు ఆశ్రితులకు ఆనందం కలిగించే లీలలు చేసిన శ్రీకృష్ణుడి కి భక్తుల పట్ల తీవ్రమైన వ్యామోహం ఉందట. ఈ కష్టాలన్నీ స్వీకరించిందే భక్తుల కోసం. ‘‘మాకోసం నీవు జన్మలెత్తాల్సిన పని లేదు. ఎక్కడికో రావలసిన అవసరం లేదు. మేమే నీకోసం వచ్చాము. మాకు ఇతర ప్రయోజనాలేవీ లేవు. మీ దర్శనం చాలు. మాకు నీవే కావాలి’’. అన్నారు గోపికలు.

శ్రీకృష్ణుడు: ‘‘నా కోసం వచ్చానంటున్నారు, పఱై (డక్కి అనే వాయిద్య పరికరం) అడుగుతున్నారు ఏమిటిది?’’ అని పరమాత్ముడు ప్రశ్నించాడు.

గోపికలు: ‘‘అన్నీ నీసంకల్పమే కదా. మేము అడిగినదివ్వాలి కాని మేము ఏమని అడగగలం. నీవు పఱై ఇస్తానంటున్నావు, తీసుకుంటాం. వద్దంటే మేమే స్వతంత్రించి నిర్ణయిస్తున్నామనుకుంటారు. కాని శ్రీ మహాలక్ష్మి కూడా అడిగేంతటి నీ ఐశ్యర్యాన్నినీ సౌశీల్య లక్షణాలను గానం చేస్తాం. నిన్ను ఎడబాసిన కష్టాలు తొలగినాయి. కంసుని భయానికి నీ పేరు చెప్పడానికీ వెనుకాడాం. ఇప్పుడా బాధ లేదు. నోరారా నీ నామాలను కీర్తిస్తాం. ఎంత భాగ్యం’’.

మన హృదయాలలో అంతర్యామి యై భగవంతుడు కనిపించకుండా కాపాడుతూ ఉంటాడు. బయటకు వస్తే భగవంతుడు కాడని మనవాళ్లే వాదిస్తారు కదా అని గోదాదేవి అంటూ అద్భుతమైన భక్తి సూత్రాలను వివరిస్తున్నారీ గోవింద గీతికలో. శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు ఈ పాశురార్థాన్ని చాలా హృద్యంగా వివరించారు.

Also Read : వేదగుహలలో ప్రకాశించే పరమాత్ముడే శ్రీకృష్ణ సింహము

అద్వితీయం

దేవకీదేవి వంటి మరొక వ్యక్తిత్వం లేదు. అదేవిధంగా యశోద  కూడా అద్వితీయమైన వ్యక్తిత్వం కలిగిన తపోశాలి.  ఎందరో కలిసి క్షీరసాగర మథనం చేస్తే అమృతం వచ్చింది. కాని దశరథుడికి సులువుగా యజ్ఞం ద్వారా లభించింది. నలుగురు అద్భుతమైన తనయులను పొందాడు. ఇక్కడ దేవకి, వసుదేవుడు, యశోద, నందులు నలుగురు తపస్సు చేస్తే వారందరి తపః ఫలముగా ఒక్క అద్భుతమైన తనయుడు జన్మిస్తాడు. నలుగురి తపఃఫలాన్ని గర్భంలోదాల్చిన దేవకి వంటి ధన్యజీవి వ్యక్తి మరొకరు ఉంటారా? అంత పుణ్యం చేసుకున్నా శ్రీ కృష్ణుడి వైభవమైన బాల్యాన్ని ఆమె అనుభవించలేకపోయింది. ఆ వైభవానుభవమంతా యశోదకే దక్కింది. యశోద వంటి వారు మరొకరు ఎవరైనా ఉండే అవకాశం ఉందా? ఆ ఇద్దరు తల్లులూ అద్వితీయమైన వ్యక్తులని ప్రత్యేకత గలవారనీ విశేషమయిన వ్యక్తులనీ భావం. దేవకికి ఎంత గర్వం కృష్ణుడిని వంటి పుత్రుడిని కన్న తల్లిని ఈ మహావిశ్వాంతరాళంలో నేనొక్కతినే అని.

ఉగ్రసేనుడంతటి ఉత్తముడికి కంసుడి వంటి రాక్షసుడు పుట్టడమేమిటి అని మనందరికీ అనుమానం వస్తుంది. ఇది చాలా సరైన అనుమానం. అందుకు కారణం ఇది. కంసుని తండ్రి ఉగ్రసేనుడు. కంసుని తల్లిని ఉగ్రసేనుడి రూపంలో మోసం చేసి విమలుడనే రాక్షసుడు వంచించడం వల్ల ఆమె గర్భం నుంచి పుట్టాడు కంసుడు. మరో వైపు శ్రీకృష్ణుడు పుట్టుకతోనే తల్లిదండ్రులకు తన నిజ చతుర్భుజ రూపమును చూపి తండ్రి కాలి గొలుసులు తెంపి గోకులానికి వెళ్లేందుకు అన్ని సౌకర్యాలు కల్పించి. చివరకు తాను గోకులంలోనే పుట్టి గోకులంలోనే పెరిగినట్టు పెరుగుతాడు శ్రీ కృష్ణుడు.

ఇక యశోద భాగ్యం వర్ణించడం సాధ్యమా. మొత్తం చరా చర జగత్తునే నియమించి నియంత్రించే పరమాత్ముడిని అదుపు చేసిన తల్లి యశోద. కంసుడిని చంపడానికే పుట్టినా. అందుకు తగిన సమయం కోసం, తనకు కావలసిన వయసు రావడం కోసం ఎదురుచూస్తూ శ్రీ కృష్ణుడు వ్రేపల్లెలో బృందావనంలో చూపిన లీలలు అద్భుతం కదా. అంతా రహస్యమే. వెళ్లిన రాక్షసులు వెళ్లినట్టు సమసిపోతున్నారు. నెలల పిల్లవాడు రాక్షసులను చంపడం ఏమిటి? నమ్మశక్యం కాని మాట. కనుక కంసుడు నమ్మడు. తల్లిదండ్రులు నంద యశోదలకు కూడా ఏదో జరిగిందనుకుంటున్నారు కాని గండం గడిచిందని సంతోషిస్తున్నారు కూడా. వారికీ తెలియదు శ్రీ కృష్ణుడు పరమాత్ముడని. అందుకే ఆయన్ను కాపాడుకోవడానికి వివరాలన్నీ రహస్యంగా దాస్తుంది. భయపడుతుంది. ఆందోళన చెందుతుంది. నందుడుకూడా అంతే అయ్యో శ్రీ కృష్ణుడు విష సర్పంతో పోరాడుతున్నాడే అని భయపడి బాధపడతాడు. కాని యశోదకు శ్రీ కృష్ణుడు భయపడతాడు. 

ఎవరికి పుట్టాడో ఆమె పేరుని చెప్పటం లేదు, ఎందుకంటే అయ్యో కంసుడికి తెలిస్తే ఎలా, కంసుని కాలం గడిచి పోయినా సరే, స్వామిపై అంత ప్రేమ. పుట్టిన చోటు అద్వితీయం. కన్న తల్లి అద్వితీయం, పుట్టిన రాత్రి ఇంకా అద్వితీయం. తల్లి ఒడిలో తల్లికడుపులో దాక్కునే అదృష్టం పరమాత్మకే లేదా? ఎవ్వరికి తెలియకుండా నందగోకులం చేరి, “ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్ యొళిత్తు వళర” మరొక అద్వితీయురాలికి కొడుకువై రహస్యంగా పెరిగావు. ఆమె ఎంత అదృష్టవంతురాలు. “తరిక్కిలానాకి” సహించలేక పోయాడు ఆ “త్తాన్” ఆ నీచుడు, కంసుడు అని వాడి పేరుకూడా చెప్పడం లేదు. కొందరి పేర్లు చెబితేనే నోరు పాడై పోతుంది అని. ఏం చేయ్యాలని అనుకున్నాడంటే “తీంగు నినైంద” కృష్ణుడికి చెడుపు చెయ్యాలని తలపెట్టాడో, “కరుత్తై పిరపిత్తు” అది వారికే జరిగేట్టు చేసాడు. “కంజన్ వైత్తిల్ నెరుప్పెన్న నిన్న” కంసుని గుండెల్లో నిప్పులా ఉండిపోయాడు. వెన్నతిన్న చల్లని కృష్ణుడు నిప్పు కావడమేమిటి. కృష్ణుడిపై కంసుడు పెట్టుకున్న ద్వేషమే నిప్పుగామారిన కడుపు మంట. అదే ప్రేమ అయితే తరించి కంసుడు పోయేవాడు. ద్వేషం కనుక దహించుకుపోయాడు.

స్వామి ప్రేమతో చూస్తున్నాడు. ఆయన కళ్లల్లో ప్రేమను గుర్తించింది ఆండాళ్ తల్లి. “నెడుమాలే” ఆయన దీర్ఘమైన వ్యామోహం,  ప్రేమ కల్గినవాడు తనను ఆశ్రయించుకున్నవాళ్ళ యందు, అందుకే మనం తెలియక ఎన్ని దోషాలు చేసినా అనుకూల గుణాలుగా భావిస్తున్నాడు. ఇన్ని రోజులు వీళ్ళంతా ‘తమకే ప్రేమ ఉంది, కృష్ణుడికి తమపై ప్రేమలేదు’ అనుకుంటూ ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు కదా, ‘మనం ఆత్మలం కదా మనకుండే ప్రేమ అణుమాత్రం, ఆయన విభువు , ఆయన కుండే మనపై ప్రేమ విభువంతా’.

Also Read : చల్లని తమ్మిరేకుల సారసపు కన్నులు మెల్లమెల్లనే విచ్చి మేలుకోనవేలయ్యా?

హనుమంతుడు జానకి హృదయంలో రగులుతున్న అగ్నిని తీసుకుని లంకను దహించడాట. యశోదా నందుల హృదయంలో శ్రీకృష్ణుడికి ఎప్పుడేం జరుగుతుందో కదా అని నిరంతరం భయం భయం గా ఉండేవారు. ఆ భయాన్నీ తీసి శ్రీకృష్ణుడు కంసుడి గుండెల్లో పెట్టాడట. కంసుడిని భయపెట్టి భయపెట్టి క్షణం క్షణం చంపేశాడు శ్రీ కృష్ణుడు. ముష్ఠిఘాతాలతో అతని కాయాన్ని చంపే సమయానికి కంసుడు భయంతో మిగిలిన జీవచ్ఛవం వంటి వాడే. అందుకి కంసుని గుండెల్లో నిప్పు శ్రీ కృష్ణుడు అని గోదమ్మ ఈ పాశురంలో అంటున్నారు. కంసుని పూర్వ జన్మపాపాలను దహిస్తున్నాడని మరో అర్థం. ఆ పాపాలను అనుభవించి వదిలించుకోవాలంటే భయపెట్టడం ఒక్కటే మార్గం. మరణించి వాని ప్రియులకు అతని పుణ్యకర్మలు, అతని శత్రువులకు అతని పాపకర్మలు పంచుతారట.

సీత హనుమతో ‘‘రావణుడు నాకు కేవలం రెండు మాసాల గడువిచ్చాడు, రాముడితో చెప్పు ‘మార్తా దూర్దం న జీవిష్యే’ నేను ఒక నెల కంటే ఎక్కువ ఎడబాటును ఓర్వలేను’’ అని చెప్పమంది. హనుమ ఈ విషయం చెప్పగానే, రాముడు ఆశ్చర్యంతో “యది మాసం దరిష్యతి చిరంజీవతి వైదేహి” అయితే మాసం రోజులు ఉండగలిగితే ఇక ఎంతకాలమైన ఉండ వచ్చును. మరి తనో, “నజీయేయం క్షణమపి వినాతాం అశితేక్షణాం” నేను క్షణ కాలం కూడా ఆమెను విడిచి జీవించగలనా’ అన్నాడు, విభువైన వాడు ఆయన కనుక ఆయన కుండే ఆర్తి మనపై కొండంత. వీళ్లు ఈ రోజు ఆయన కళ్లల్లో అంత వ్యామోహం చూసారు.

‘సరే ఇంకా ఏంకావాలి’ అని స్వామి అడిగాడు.

“ఉన్నై అరుత్తిత్తు వందోం”  మేం నిన్ను కోరి వచ్చాం. “పఱై” వ్రత పరికరాలు “తరుతియాగిల్” నీ విస్తానన్నావు కాబట్టి తీసుకుంటాం. అన్నారు.

స్వామి వీళ్ళను ‘‘పాపం ఎంతో శ్రమ పడి వచ్చారే’’ అని అనగానే,

“తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యాంపాడి వరుత్తముమ్ తీరుంద్ ముగిరుంద్” లేదు మేం సంతోషంతో వచ్చాం. నీ నామం పాడుతూ వచ్చాం కదా, మాకు ఏ శ్రమా లేదు హాయిగా వచ్చాం అంటూ స్వామి అవతార రహస్యాన్ని తెలుపుతున్నారు ఆండాళ్, ఆమె గోష్టి లో ఉన్న గోపికలు అని జీయర్ స్వామి మనసులను హత్తుకునేట్టు వివరించారు. ఇంతకన్న ఏం వాఖ్యానం ఉంటుంది. ఏ వాక్యాలుంటాయి. అంతటి ప్రేమను గోదమ్మ ఈ నాటికీ తట్టి లేపుతున్నది.

Also Read : ఎన్నాళ్లు ‘నేను నాది’ అంటారు, ఇకనైనా ‘మేము మనమూ’ అనండి

నిద్రిస్తున్న మానవాళిని తట్టి, భక్తి ప్రేమాభిమానాలను మేల్కొల్పడమే తిరుప్పావై. పొంగే భక్తే అసలైన పొంగలి కాని తినే పదార్థమా. కాదు, అది బ్రహ్మపదార్థం,

ఇద్దరు తల్లులూ రెండు మంత్రాలూ

శ్రీకృష్ణునికి ఇద్దరు తల్లులున్నట్టు నారాయణ తత్వాన్ని తెలిపే మంత్రాలు రెండు ఉన్నాయి. నారాయణాష్టాక్షరి, వాసుదేవ ద్వాదశాక్షరి. అష్టాక్షరిలో నారాయణతత్త్వం ప్రకాశిస్తే వాసుదేవ మంత్రంలో సర్వవ్యాపకత్వమే గూఢముగా ఉన్నదని, దేవకి నారాయణాష్టాక్షరి అయితే యశోద వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రమని కందాడై రామానుజాచార్యులు వివరించారు. ఒకటి గాయత్రీ మంత్రమైతే మరొకటి నారాయణాష్టాక్షరి అని వివరించే వారూ ఉన్నారు. వారు గాయత్రీ మంత్రము దేవకీ దేవి అనీ నారాయణాష్టాక్షరి యశోదాదేవి అని అన్వయిస్తారు.

కంసుడంటేనే అహంకారం. అంటే ఆత్మ శరీరం వేరనుకోవడం, తనకన్న పరమాత్ముడు వేరే లేడనుకోవడం, అతని గుండెలో నిప్పుగా మారి శ్రీకృష్ణుడు అతని అహంకారాన్ని లోనుంచి కాల్చేస్తాడు.

వీతరాగ భయ క్రోధాః మన్మయా మామ్ ఉపాస్రితాః

బహవో జ్ఞాన తపసాః పూతాః మద్భావ మాగతాః

శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన విషయం…‘‘వీతరాగభయక్రోధాః = అనురాగం, భయం, క్రోధం లేనివాళ్ళు ; మన్మయాః = నాలోనే స్థితమైనవారు ; మాం, ఉపాశ్రితాః = ‘ నన్ను ’ ఆశ్రయించిన వారు ; బహవః = అనేకమంది ; జ్ఞానతపసా = జ్ఞాన తపస్సుచేత ; పూతాః = పవిత్రులై ; మద్భావం, ఆగతాః = నా స్వరూపాన్ని పొందారు’’. మనను భగవంతుడినించి విడదీస్తే రాగం, భయం, క్రోధం ఏర్పడతాయనీ, అవి మనను వదులుకొంటే భగవంతుడు చేరువవుతాడు. వాటంతట అవే తొలగిపోవాలంటే ఏం చేయాలి. దీపం వెలిగిస్తే చీకటి దానంతట అదే తొలగిపోయినట్టు, భగవత్తత్వానికి సంబంధించి జ్ఞానం సాధిస్తే రాగ భయ క్రోధాలు తొలగి పోతాయి.  మా కర్మల పట్టు తొలగింది, మాకిప్పుడు మీతో సామ్యం ‘‘మద్భావ మాగతః కావాలని గోపికలు కోరారు.  మాకిప్పుడు మీరెవరో తెలిసింది. అంటూ గోపికలు శ్రీ కృష్ణుడి తల్లుల గురించివి వరిస్తున్నాయి.

గోదమ్మ తన శ్రీవిల్లిపుత్తూరునే వ్రేపల్లె చేసుకుంది. అక్కడి ఆలయంలోని మూల మూర్తి వటపత్రశాయే రంగడు లేదా కృష్ణుడు. ఉన్నచోటే రంగడిని వలచింది. ఆయనే పల్లకీ పంపేంతగా ప్రేమించింది. యుగాల కిందటి కృష్ణలీలలను రాసలీలలను తన ఊళ్లోనే చూసింది. నిజంగా నమ్మితే నిలువెత్తు అర్చామూర్తి  పరబ్రహ్మమై ఆదుకొంటాడని రుజువుచేసి చూపింది. రామానుజులు కూడా విగ్రహాన్ని బొమ్మ అనుకోకండి అది సనాతనబ్రహ్మ అని తెలుసుకోండి అని ప్రభోదించారు. అదే తిరుప్పావై గొప్పతనం.

Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles