Thursday, April 18, 2024

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు
  • అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
  • ఎస్ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభుత్వం
  • సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం?

ఆంధ్రప్రదేశ్ లో  పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు దశల్లో జరగనునర్న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న తేదీలను ఆయన ప్రకటించారు. జనవరి 23 న తొలిదశ, జనవరి 27న రెండోదశ, జనవరి 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగో దశ నోటిఫికేషన్ విడుదల చేస్తామని నిమ్మగడ్డ ప్రకటించారు.

ఫిబ్రవరి 5 న తొలిదశ ఎన్నికలు, ఫిబ్రవరి 7 న రెండోదశ ఎన్నికలు, ఫిబ్రవరి 9న మూడో దశ ఎన్నికలు, ఫిబ్రవరి 17 న నాలుగో దశ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 6.30 గంటలనుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు షెడ్యూల్ లో తెలిపిరు. పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి వచ్చినట్లు ఎస్ఈసీ తెలిపారు.

తొలిదశ :

  • నోటిఫికేషన్ జారీ – జనవరి 23
  • నామినేషన్ల స్వీకరణ – జనవరి 25
  • నామినేషన్లు సమర్పించేందుకు చివరి తేది – జనవరి 27
  • నామినేషన్ల పరిశీలన – జనవరి 28
  • నామినేషన్ల ఉపసంహరణ – జనవరి 31
  • ఎన్నికల పోలింగ్ మరియు కౌంటింగ్ – ఫిబ్రవరి 5

 రెండో దశ :

  • నోటిఫికేషన్ జారీ – జనవరి 27
  • నామినేషన్ల స్వీకరణ – జనవరి 29
  • నామినేషన్లు సమర్పించేందుకు చివరి తేది – జనవరి 31
  • నామినేషన్ల పరిశీలన – ఫిబ్రవరి 1
  • నామినేషన్ల ఉపసంహరణ – ఫిబ్రవరి 4
  • ఎన్నికల పోలింగ్ మరియు కౌంటింగ్ – ఫిబ్రవరి 9

మూడో దశ :

  • నోటిఫికేషన్ జారీ – జనవరి 31
  • నామినేషన్ల స్వీకరణ – ఫిబ్రవరి 2
  • నామినేషన్లు సమర్పించేందుకు చివరి తేది – ఫిబ్రవరి 4
  • నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 5
  • నామినేషన్ల ఉపసంహరణ – ఫిబ్రవరి 8
  • ఎన్నికల పోలింగ్ మరియు కౌంటింగ్ – ఫిబ్రవరి 13

నాలుగో దశ :

  • నోటిఫికేషన్ జారీ – ఫిబ్రవరి 4
  • నామినేషన్ల స్వీకరణ – ఫిబ్రవరి 6
  • నామినేషన్లు సమర్పించేందుకు చివరి తేది – ఫిబ్రవరి 8
  • నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 9
  • నామినేషన్ల ఉపసంహరణ – ఫిబ్రవరి 12
  • ఎన్నికల పోలింగ్ మరియు కౌంటింగ్ – ఫిబ్రవరి 17

నిమ్మగడ్డతో అధికారుల బృందం భేటీ:

అంతకు ముందు హైకోర్టు ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు సీఎస్ ఆదిత్యనాధ్ దాస్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ లతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం   ఎస్ఈసీ నిమ్మగడ్డతో సమావేశమయ్యారు. కరోనా పరిస్థితులు, కొవిడ్ టీకా షెడ్యూల్ ఉన్న ప్రస్తుత తరుణంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని వివరిస్తూ నివేదిక సమర్పించారు. అయితే అధికారులతో చర్చించిన వెంటనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కార్యాలయం పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది.

నిమ్మగడ్డ నిర్ణయంపై మండిపడ్డ రాష్ట్ర ప్రభుత్వం:

రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంపై ప్రభుత్వం మండిపడింది. కరోనా ఉధృతి కొనసాగుతున్నా ఎన్నికలు నిర్వహించాలనే మంకు పట్టుదలను ఎస్ఈసీ వదలకపోవడం విచారకరమని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు.  ప్రజా సంక్షేమం పట్టని ఎస్ఈసీ  షెడ్యూల్ విడుదల చేశారని ద్వివేది విమర్శించారు. ఈ నిర్ణయం సర్వోన్నత న్యాయస్థానం తీర్పును ఉల్లంఘించినట్లేనని తెలిపారు. కొవిడ్ టీకా ప్రక్రియలో తలమునకలైఉన్నామని చెబుతున్నా ఎస్ఈసీ మొండివైఖరితో వ్యవహరిస్తున్నారని ద్వివేది విమర్శించారు. గత సంవత్సరం మార్చిలో  రాష్ట్రంలో కరోనా కేసులు లేకున్నా కుంటి సాకులు చెప్పి ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేశారని ద్వివేది విమర్శించారు.

సర్వోన్నత న్యాయస్థానం ఆశ్రయించనున్న ప్రభుత్వం:

ఎస్ఈసీ నిర్ణయంపై తాడో పేడో తేల్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.  కరోనా నేపథ్యంలో ఫిబ్రవరిలో ఎన్నికలకు సన్నద్ధం కాలేమని రాష్ట్ర ప్రభుత్వం వివరించినా షెడ్యూల్ విడుదల చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది.

ఇదీ చదవండి:ఏపీలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles