Friday, June 2, 2023

సముద్ర తీరానికి బయలుదేరిన వానరసేన

రామాయణమ్ – 164
హనుమా !
తపస్సు చేతగానీ
సేతువు నిర్మించిగానీ
సమస్త సంద్రాన్నీ ఎండగట్డించి గానీ
మనము సముద్రము దాటగలము.

నీవు లంకనంతా చూచినావు కదా, అసలు అచట ఎన్ని దుర్గములు ఉన్నవో నేను తెలుసుకొనదలుచుకున్నాను ..అని రాముడు ప్రశ్నించెను..

సైన్య పరిమాణమెంత?
ఎన్ని ద్వారములున్నవి?
దుర్గనిర్మాణ శైలి ఎలా ఉన్నది?
లంక యొక్క భద్రతా ఏర్పాట్లు, రక్షణపటిష్టత, యుద్ధసన్నద్ధత …నీవు పరిశీలించినావు కదా అన్నీవివరముగా చెప్పుము.

(ఈ ప్రశ్న ఊహించి అశోకవన విధ్వంసము, లంకా దహనము చేసినాడు హనుమంతుడు. ఆయనను చేయమన్న పని సీతమ్మను వెదకమని మాత్రమే. అదీ హనుమ స్వామి గొప్పదనం).

‘‘ఆ నగరమునకు విశాలమైన పెద్దవైన నాలుగు ద్వారములున్నవి
వాటి తలుపులు చాలాదృఢమైనవి అవి పెద్దపెద్ద గడియలతో బంధింపబడియున్నవి.
అచట బాణములను మరియు పెద్దపెద్ద బండరాళ్ళను అతివేగముగా విసర గల పెద్దపెద్ద యంత్రములున్నవి .
ఇనుముతో తయారుచేయబడిన శతఘ్నులు వందలకొలదీ సదా సిద్ధముగా యున్నవి వాటిని ఉపయోగించగల సుశిక్షితులైన రాక్షసులు వాటి వద్ద సదా సిద్ధముగా యున్నారు.
లంకా నగర స్వర్ణప్రాకారము ఎవరూ ఆక్రమించలేనటువంటిది .వాటిచుట్టూ భయంకరమైన పరిఖలలో మొసళ్ళు మీనములు నివసిస్తూ ఉంటాయి.
ఆ కందకముల పైన నాలుగు వంతెనలు వాటిపై అనేక యంత్రములు అమర్చబడియున్నవి. ఆ నాలుగు వంతెనలు అతిదృఢమైనవి.
ఇక రావణుడికి ఎప్పుడూ యుద్ధసన్నద్ధతే! ఆతని మనస్సులో భయము, జంకు లేనే లేవు.
ఇంత రక్షణ వ్యవస్థతోపాటు అసలు లంకానగరమంతా ఒక ఎత్తైన పర్వత శిఖరము మీద కలదు…
ఆ నగరములోనాలుగు దుర్గములు
చుట్టూ లోతైన నది ప్రవహిస్తున్నది కావున నదీ దుర్గము
పర్వతములు ఆవరించియుండుట చేత పర్వత దుర్గము
దట్టమైన అరణ్యము ఆనగరము చుట్టూ యుండుట వలన అరణ్య దుర్గము
కట్టబడ్డ ఎత్తైన ప్రాకారములుండుట చేత కృత్రిమదుర్గము …ఈ విధముగా నాలుగు దుర్గములు ఆ లంక చుట్టూ యున్నవి .

ఇదియూ కాక లంకకు నౌకా మార్గము కూడా లేదు. ఏ వైపునుండీ వార్తలు పంపు అవకాశమే లేదు.
అంటూ హనుమంతుడు లంకానగర రక్షణ వ్యవస్థ గురించి ఇంకా చెపుతూనే ఉన్నాడు.
లంకానగర దక్షిణద్వారము వద్ద లక్షమంది యోధులు, పశ్చిమద్వారము వద్ద పది లక్షల సైనికులు, ఉత్తరద్వారమువద్ద కోటి మంది భటులు, తూరుపు ద్వారము వద్ద పదివేల మంది రాక్షసులు కాపలా కాయుచున్నారు.
నేను నాలుగు వంతెనలను, ప్రాకారములను మహావీరులైన రాక్షస సైన్యములో ఒక భాగమును నశింపచేసితిని.
మనము, మన సైన్యము సముద్రము ఏదోవిధముగా దాటినచో లంక నాశనమైనట్లే!
అయినా ! రామచంద్రా సైన్యమెందులకు?
నేను, పనసుడు, అంగదుడు, మైందుడు,ద్వివిదుడు, జాంబవంతుడు,
అనలుడు,నీలుడు …మేము అందరమూ ఆకాశమార్గాన వెళ్ళి లంకను నాశనము చేసి సీతమ్మను తీసుకొని రాగలము’’ అని హనుమంతుడు పలికిన మాటలు విని రాముడు ఇట్లనెను.

‘‘సుగ్రీవా ఇదే తగిన మూహూర్తము ఈ ముహూర్తము పేరు విజయము!
ఇప్పుడే బయలు దేరెదము! సూర్యుడు ఆకాశ మధ్యమున ఉన్నాడు! నేడు ఉత్తరఫల్గునీ నక్షత్రము! సకల సైన్యములనూ బయలుదేరదీయుము. శకునములన్నియు అనుకూలముగా యున్నవి’’ అని రాముడు అనగానే సుగ్రీవుడు అందులకు అంగీకరించెను .

‘‘ముందుగా ఒక లక్షసైన్యము బయలు దేరవలే! ఆ సైన్యము మార్గమును సుగమము చేయుచూ వెడలును. దానికి నీలుడు నాయకత్వము వహించును.

‘‘నీలా నీవు వెంటనే బయలుదేరుము మన మార్గములో కల ఆహారములు, జలములు, ఫలములు, మూలములు రాక్షసులు కలుషితములు, విషపూరితములు చేసిన చేయవచ్చును. కావున వాటిని సంరక్షిస్తూ యుండుట నీవు నీసైన్యము చేయవలెను.’’

‘‘శత్రుసైనికులు, గూఢచారులు ఎవరైనా ఉన్నారో లేదో గమనిస్తూ యుండ వలెను.

‘‘బలహీనులైన వారంతా కిష్కింధలోనే యుండిపోండి. మనము చేయుకార్యము చాలా క్లిష్టమైనది.
జట్లు,జట్లుగా సైన్యమును నడిపించవలే. అందులకు గాను గజ, గవయ, గవాక్షులు పూనుకొనవలె.
సమస్త సైన్యమునకు గంధమాధనుడు ఎడమవైపు ఉండి రక్షించవలె!
నేను హనుమంతుని మీద ఎక్కి ప్రయాణించెదను, లక్ష్మణుని అంగదుడు తీసుకు రాగలడు.
సేన మధ్యభాగములో నేను ఉండెదను.
జాంబవంతుడు ,సుషేణుడు సేన మధ్యభాగమును రక్షించ గలరు.’’
అనుచూ సమస్త సైన్యము ఏ విధముగా ప్రయాణము చేయవలెనో రాముడు చెప్పగా అందుకు తగినట్లు సుగ్రీవుడు అందరినీ ఆజ్ఞాపించెను.
ఆ వెంటనే వానర సైన్యమంతా గుహలనుండి, శిఖరములనుండి లేచి ఒక్క సారిగా గాలిలోకి పైకి ఎగిరిరి.

ఆ వానర సేన అంతా రాముని అనుసరించి ఉత్సాహముగా బయలుదేరిరి.

వూటుకూరు జానకిరామారావు

Also read: సముద్రము దాటే ఉపాయం కోసం అన్వేషణ

Also read: సీతమ్మను చూసినట్టు శ్రీరామునికి తెలిపిన హనుమ

Also read: ‘సీతమ్మను చూశాను,’ జాంబవంత, అంగదాదులతో హనుమ

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles