Friday, June 2, 2023

‘సీతమ్మను చూశాను,’ జాంబవంత, అంగదాదులతో హనుమ

రామాయణమ్ 160

జాంబవంతునకు ,అంగదునకు నమస్కరించి “చూశాను సీతమ్మను” అని పలికినాడు హనుమస్వామి.

అప్పుడు అంగదుడు తనచేతిలో చేయి వేసుకొని తీసుకొని వెళ్ళి హనుమను ఒక రమణీయమైన ప్రదేశమున కూర్చుండబెట్టెను.

చూశాను సీతమ్మను, స్నాన సంధ్యాదులు లేక మలిన వస్త్రముతో తైలసంస్కారములు లేని కేశపాశములతో ఏకవేణియై రామదర్శనము కొరకు తహతహలాడు సీతమ్మను చూశాను.

Also read: హనుమ పునరాగమనం

ఘోర రక్కసుల కావలిలో

చిక్కిశల్యమైన సీతమ్మను చూశాను.

చూశాను అని చెప్పగానే కొందరు వానరులు సింహనాదములు చేశారు. మరికొందరు కిచకిచలాడారు. మరికొందరు చకచక ప్రతిగర్జనలు చేశారు. మరికొందరు దగ్గరగా వచ్చి పర్వతాకారుడైన పావని శరీరాన్ని స్పృశించారు.

అప్పుడు జాంబవంతుడు వివరముగా చెప్పమని కోరగా జరిగిన విషయములన్నీ పూసగుచ్చినట్లు వివరించాడు మారుతి …ఒక్క విషయము తప్ప …అది రామునకు సీతమ్మ పంపిన సందేశము…

‘‘తాతా,  ఇటనుండి పయనమై వెళ్ళు నాకు మైనాకుడు కనపడి కాసేపు సేదతీరి వెళ్ళమన్నాడు. ఆతని కోరిక మన్నింపక ముందుకు సాగుతున్న నన్ను …

Also read: లంకాదహనం

నాగమాత సురస నా గమనాన్ని అడ్డుకొని విధాత ఇచ్చిన విందుభోజనము నీవు, నిన్ను మింగుతాను అని ముందుకు రాగా ఉపాయముతో తప్పించుకొని ఆమెను మెప్పించి ముందుకు వెళుతుండగా పట్టి లాగింది సింహిక, దానిని చంపి వేసి లంక కోట మీద అడుగుపెట్టిన నాకు లంకిణి అడ్డు వచ్చినది….దాని పీచమణచి లంకలో ప్రవేశించి లంక మొత్తము జల్లెడ పట్టినా ఫలితము లేకపోయె!

‘‘అప్పుడు ఇక మిగిలిన అశోకమునందు గాలించవలెనని అనుకొని అటు వెడలి చూడగా అట కనుగొంటినయ్యా తల్లి సీతమ్మను. ఇంతలో రాక్షసేశ్వరుడు వచ్చి ఆమెతో పరుషముగా మాటలాడి రెండుమాసములు గడువొసంగినాడు….అతని ప్రేలాపనలను లెక్కచేయ్యక వాడిని పుల్లక్రింద తీసిపారవేసి వానిని హెచ్చరించింది సీతమ్మ. వాడికి కోపము హెచ్చి రక్కసిమూకలకు పెక్కు ఆజ్ఞలు జారీచేసి తాను అంతఃపురమునకు తిరిగి వెళ్ళినాడు.

Also read: హనుమ తోకకు నిప్పంటించి వీధులలో తిప్పుట

‘‘రావణుడువెళ్ళగానే అదను చూసుకొని అమ్మను కలిసి ఆమె నన్ను రావణుడేమోనని  బెదరకుండా జాగ్రత్తగా శ్రీరామ సందేశమును వినిపించి ఆమె ఇచ్చిన ఆనవాలు స్వీకరించినాను.

‘‘సీతమ్మవద్ద సెలవు తీసుకొని బయలుదేరవలనని అనుకొన్న నాకు ఒక ఊహ తటస్థించెను. రావణుని బలమెంత, వాని బలగమెంత తెలుసుకొన్నచో రాబోవు సంగరమునకు సమాయత్తమగుట తేలిక కదా! అందుకు ఆలోచించి రాక్షస రాజును రెచ్చగొట్టుట కొరకై అశోకవన విధ్వంసము చేసి అడ్డు వచ్చిన రాక్షసాధములను యమపురికంపి రావణుని కోపము మరింత పెంచితిని. వాడు తన కొడుకైన ఇంద్రజిత్తును పంపగా ఆతను ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు కట్టుబడినాను.

‘‘రావణ సభామధ్యములో అతనిని తేరిపార చూసి సభికుల సమక్షములో అతనికి సుద్దులు చెప్పితిని. అందుకు రావణుడు కోపించి నన్ను వధించమని ఆజ్ఞ ఈయగా ఆతని తమ్ముడు విభీషణుడు వారించెను. అప్పుడు రాక్షసులు నా తోకకు నిప్పంటించగా నేను అంతులేని కోపముతో రావణభవనముతో సహా లంకకు నిప్పుపెట్టి భస్మీపటలము గావించి మరల సీతమ్మ క్షేమము కనుగొని ….ఇదిగో మీ ముందు వ్రాలితిని’’ అని తాను చేసిన కార్యమును యధాతథముగా మారుతి జాంబవదాదులకు విన్నవించెను.

Also read: రావణుడికి విభీషణుడి హితవు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles