Friday, April 26, 2024

చైనా వెనకడుగు నమ్మదగినదేనా?

  • అనేక దశల్లో శాంతి చర్చలు జరిగిన ఫలితం
  • సామ్రాజ్య విస్తరణ కాంక్షతో రగులుతున్న జిన్ పింగ్ ను నమ్మేదెలా?

భారత్ – చైనా సరిహద్దుల్లో నిన్నటి వరకూ  ఉద్రిక్తతలు పెద్ద ఎత్తున రాజ్యమేలాయి. పెద్ద యుద్ధమే వస్తుందని ఒక సమయంలో అందరం భయపడ్డాం. ఇరు దేశాల మధ్య అనేక దశల్లో శాంతి చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో భారీ ఎత్తున మోహరించిన సైన్యాన్ని వెనక్కు మళ్లించాలని ఉభయ దేశాలు అనుకున్నాయి. అడ్డదిడ్డంగా జరిపే కాల్పులు, అక్రమ ఆక్రమణల పట్ల భారత్ గట్టిగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చైనా మెల్లగా సేవలను ఉపసంహరించడం మొదలు పెట్టింది. చైనా బలగాలు సుమారు 3 కిలోమీటర్ల మేరకు వెనక్కు జరిగినట్లు ఉపగ్రహ తాజా చిత్రాలు రుజువు చేస్తున్నాయి. నిజంగా చైనా చిత్తశుద్ధితో ప్రవర్తిస్తే మంచిదే. సహజ శాంతికాముక దేశమైన భారత్ కోరుకునేది, మొదటి నుంచీ ఆచరిస్తున్నది శాంతిపర్వమే. కాకపోతే చైనాను ఏ మేరకు నమ్మగలం?  నయా సామ్రాజ్య కాంక్షతో రగిలి పోతున్న ఆ దేశ అధినేత జిన్ పింగ్ ను నమ్మేదెట్లా?

Also read: నగర పరిరక్షణలో తమిళనాడు ఆదర్శం

చరిత్ర అపనమ్మకం కలిగిస్తోంది!

మనం తీసిన ఉపగ్రహ చిత్రాల్లో విస్తుపోయే దృశ్యాలు కంటపడ్డాయి. వాస్తవాధీన రేఖ వెంట భారీ సైనిక స్థావరాలను ఏర్పాటుచేసినట్లు ఆ దృశ్యాలు చెప్పాయి. యుద్ధానికి అనుగుణంగా కొన్ని నిర్మాణాలు కూడా  చేపట్టినట్లు తెలుసుకున్నాం. గోగ్రా – హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో కీలకమైన పెట్రోలింగ్ పాయింట్ (పీపీ)-15 నుంచి చైనా సైన్యం కొంత వెనక్కు వెళ్లినట్లు కనిపిస్తున్నా, దెస్సాంగ్ తో పాటు గోగ్రాకు ఉత్తరాన ఉన్న ప్రాంతాల్లో ఇంకా ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది.ఆ ప్రాంతంలో భారత గస్తీ దళాలను చైనా సైన్యం అడ్డుకుంటూనే ఉందని సమాచారం. ఆ ప్రాంతాల్లో కూడా బలగాల ఉపసంహరణ జరగాలని చర్చలు జరుగుతున్నా ఎటువంటి పురోభివృద్ధి లేకపోవడం గమనార్హం. ఒప్పందాలకు తిలోదకాలివ్వడం, దొంగదెబ్బలు తీయడం చైనాకు బాగా అలవాటైన సంస్కృతి. మన చేదు అనుభవాలు మనకు ఎట్లాగూ ఉన్నాయి. గడచిన యుద్ధాలు, అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన అక్రమాలు, ఆక్రమణలు మనకు పెద్ద గుణపాఠాలు. లడ్డాఖ్ సరిహద్దులతో పాటు అరుణాచల్ ప్రదేశ్ లోనూ మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే.ఈ దిశగా భారత్ సరికొత్త యుద్ధనీతిని రచించుకుంటోంది. అది చారిత్రక అవసరం కూడా. చైనా సరిహద్దులున్న అరుణాచల్ ప్రదేశ్ లో మరిన్ని మౌలిక వసతుల కల్పన దిశగా అడుగులు మొదలుపెట్టడం సందర్భోచితం,సముచితం. అక్కడ రోడ్లు, టెలికాం వంటి మౌలిక వసతుల అభివృద్ధి, ఐ బీ జీ ( ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్ ) ఏర్పాటుపై భారత్ దృష్టి సారించింది. దీని ద్వారా సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో శతృ స్థావరాలపై మెరుపు వేగంతో దూసుకెళ్లే శక్తి స్థాపన జరుగుతుంది. బీ గ్రేడ్ కంటే కూడా కొంచెం పెద్దవిగా ఉండే ఐబీజీ లో 3,500 నుంచి 4వేలమంది సైనికులు ఉంటారు. చాలా తేలికైన బరువు గల శతఘ్నులను శరవేగంగా అనుకున్న ప్రాంతాల్లో మోహరించడంఐబీజీ వ్యూహాల్లో ఒక భాగం. పెద్ద పెద్ద నదులు, లోయలు, ఎత్తైన పర్వత ప్రాంతాలతో అరుణాచల్ కమ్ముకొని ఉంటుంది. అక్కడి భౌగోళిక పరిస్థితులు కూడా భిన్నంగా ఉంటాయి. భౌగోళిక పరమైన ఇబ్బందులను ఎదుర్కుంటూ ముందుకు సాగడం సైన్యం ముందున్న అతిపెద్ద సవాల్.

Also read: పుతిన్ పైన మరోసారి హత్యాయత్నం

భౌతిక వసతులను ఏర్పాటు చేసుకోవాలి

గతంలో నిర్వహించిన ‘హిమ విజయ్’ విన్యాసాల్లోనూ ఇదే అంశంపై కసరత్తు చేయాల్సి వచ్చింది.  ఐబీజీకి అనుగుణంగా సరిహద్దు ప్రాంతాల్లో వేగంగా మౌలికవసతులను కల్పించుకోవడం అత్యంత కీలకం. రోడ్లు, వంతెనలు, సొరంగాలు, హెలిపాడ్లు, ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్ నెట్ వర్క్ ఏర్పాటు ఇందులో భాగం కాబోతున్నాయి. అక్కడి గ్రామాలను అభివృద్ధి చేయడం అన్నింటి కంటే ముఖ్యం. సరిహద్దు గ్రామవాసులలో భారతదేశ భక్తిని,ప్రభుత్వాల పట్ల విశ్వాసాన్ని పెంచడం అత్యంత కీలకం.ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ లోని చాలామంది పౌరులకు చైనా ఎరవేసింది. అరుణాచల్ భూభాగం తనదేనని కదా మొదటి నుంచీ చైనా వాదన!అక్కడి ప్రజల్లో చైనా పట్ల ప్రేమ, భక్తి కలగడానికి చైనా నిరాఘాటంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి.మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భం. నిఘా సామర్ధ్యాన్ని మనం పెద్దఎత్తున పదును పెట్టుకోవాలి. రాడార్లు,డ్రోన్లు,ఉపగ్రహాలను ఇంకా పెద్దఎత్తున రంగంలోకి దించాలి. చైనాను నమ్మడానికి వీలులేదు. లడ్డాఖ్ లో మౌనం పాటించిందంటే అరుణాచల్ ప్రదేశ్ లో అలజడి సృష్టిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ లో స్తబ్దతగా ఉందంటే లడాఖ్ ప్రాంతంలో ఏవో కుట్రలు పన్నుతూనే ఉంటుంది.మొత్తంగా మన సరిహద్దుల్లో, సముద్రం మొదలు అన్ని మార్గాల్లో చైనా ఏదో ఒక కవ్వింపు చర్య చేస్తూనే ఉంటుంది. అక్రమం, ఆక్రమణలు ఆ దేశానికి వెన్నతో పుట్టుకొచ్చిన వ్యసనాలు.

Also read: త్రిభాషాసూత్రమే భారతీయులకు భూషణం

సమర్ ఖండ్ లో సమావేశం

మధ్య మన దేశంలోని మహాబలిపురం తర్వాత ఇటీవలే భారత ప్రధాని నరేంద్రమోదీ – చైనా అధినేత జిన్ పింగ్ ఒక వేదికపై కలిశారు. మొన్న 16 వ తేదీన ఉజ్ బెకిస్థాన్ (సమర్ ఖండ్) లో జరిగిన ఎస్ సీ ఓ ( శాంఘయ్ కోఆపరేషన్ ఆర్గనైజషన్) సదస్సులో ఈ ఇద్దరు అధినేతలు ఒకే వేదికను పంచుకున్నారు. లడాఖ్ లో, గల్వాన్ వ్యాలీలో తీవ్ర పరిస్థితులు నెలకొని ఇరుదేశాల మధ్య అలజడి చెలరేగిన చాలా నెలల తర్వాత ఈ ఇద్దరు పెద్దలు కలవడం ఇదే తొలిసారి. ఇద్దరు నేతలు చేతులు చేతులు కలుపుకోకపోయినా, చిరునవ్వులు చిందించుకోక పోయినా  ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు చిరు ఆశలు చిగురించాయని కొందరు భావించారు. భావించినట్లుగానే లడాఖ్ లో బలగాల ఉపసంహరణ పర్వం ఊపందుకుంది. అమెరికాకు దగ్గరవుతున్నామని, రష్యాతో బంధాలు మళ్ళీ దృఢపడుతున్నాయనే ఏడుపు మనపైన చైనాకు ఎలాగూ ఉంటుంది. అందుకే మొన్నటి వేదికలో జిన్ పింగ్ ఎడమొహం పెట్టుకొని కూర్చున్నాడు. ఎంతకాదన్నా చైనా,భారత్ రెండూ సరిహద్దు దేశాలు. ప్రపంచంలో జనాభా పరంగా అతిపెద్ద దేశాలు. కాస్త అటుఇటుగా ఒకే సమయంలో ఆధునిక ఆర్ధిక ప్రస్థానాన్ని ప్రారంభించిన దేశాలు. నిజంగా ఈ రెండు దేశాలు కలిస్తే అద్భుతాలు జరుగుతాయి. అంత మనసు, ఓపిక ఆ దేశానికి ఉండాలి కదా!  ఏది ఏమైనా చైనా వెనకడుగు వేసిందా, వేసినట్లు నటిస్తోందా కాలంలో ఎలాగూ తెలుస్తుంది. నిజంగా మారితే మంచిదే.

Also read: గంగానది ప్రక్షాళన

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles