Monday, June 24, 2024

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి బరిలో గెహ్లాట్, థరూర్

దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సిసలైన ఎన్నిక జరగబోతోంది. కాంగ్రెస్ పార్టీలో సర్వోన్నత పదవికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, తిరువనంతపురం లోక్ సభ సభ్యుడు శశి థరూర్ పోటీ పడనున్నారు. గెహ్లాట్ గాంధీ కుటుంబానికి నమ్మిన బంటు కాగా, థరూర్ రెండున్నర ఏళ్ళ కింద సోనియాగాంధీని పార్టీలో సంస్కరణలు ప్రవేశపెట్టాలని కోరుతూ లేఖ రాసిన 23 మంది నాయకుల సమూహంలో ఒకరు. సోమవారం ఉదయం సైతం పార్టీలో సంస్కరణలు పెద్ద ఎత్తున జరగాలంటూ యువకాంగ్రెస్ నాయకులు వందల సంఖ్యలో సంతకాలు చేసిన విజ్ఞాపన పత్రంపైన శశిథరూర్ కూడా సంతకం చేశారు.

1998లో సీతారాం కేసరి చేతుల్లోంచి బలవంతంగా పార్టీ పగ్గాలు లాగివేసుకొని సోనియాగాంధీకి పట్టం కట్టిన తర్వాత దాదాపు పాతికేళ్ళపాటు ఆమె లేదా ఆమె కుమారుడు రాహుల్ అధ్యక్ష పదవిలో ఉన్నారు. 2019లో పార్టీ ఘోరపరాజయం పాలుకావడంతో రాహుల్ నైతిక బాధ్యత స్వీకరించి పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. అప్పుడు తిరిగి పార్టీ నిర్వహణ బాధ్యతను అనారోగ్యంతో సతమతం అవుతున్నప్పటికీ సోనియాగాంధీ స్వీకరించవలసి వచ్చింది. కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత దీర్ఘకాలం ఉన్న వ్యక్తిగా సోనియాగాంధీ చరిత్ర పుటలలోకి  ఎక్కారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని తిరిగి స్వీకరించమని రాహుల్ ని కోరుతూ అరడజను పీసీసీలు తీర్మానాలు చేశాయి. కానీ సూత్రబద్ధమైన వైఖరి తీసుకున్న రాహుల్ ససేమిరా అన్నారు.

రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించడానికి నిరాకరించమే కాకుండా  ఈ సారి గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి పార్టీ అధ్యక్షుడు అవుతారని స్పష్టంగా చెప్పారు. అప్పుడే తాను పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని శశిథరూర్ సంకల్పించుకున్నారు. కానీ పోటీలో ఉన్నట్టా, లేనట్టా అనే విషయాన్ని తేల్చకుండా పార్టీ అధినేత సోనియాగాంధీని కలుసుకున్నతర్వాతనే ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన అనుకున్నారు. సోమవారం మధ్యాహ్నం విదేశాల నుంచి సోనియాగాంధీ తిరిగి వచ్చిన వెంటనే ఆమెను శశిథరూర్ కలుసుకున్నారు. ఇద్దరూ మాట్లాడుకున్నారు. పార్టీ పదవికి శశి థరూర్ పోటీ చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని సోనియాగాంధీ చెప్పారు.

శశి థరూర్, గ్రూప్-23కి చెందిన ముగ్గురు నాయకులు కలసి పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికను నిస్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. ఓటర్ల జాబితాను వెల్లడించాలని కూడా డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ కు కాంగ్రెస్ అధిష్ఠానవర్గం అంగీకరించింది. ఓటర్ల జాబితాను బహిరంగ పర్చుతున్నారు. కాంగ్రెస్ లో పరిస్థితులు అంత బాగుండని కారణంగా, అధిష్ఠానవర్గంలోనే స్పష్టత లేదేమోనని భావించినవారు కొందరు ఇప్పటికీ పార్టీ నుంచి నిష్క్రమించారు. గులాంనబీ ఆజాద్ పార్టీకి గుడ్ బై చెప్పి కశ్మీర్ లో సొంత కుంపటి పెట్టుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. కపిల్ శిబ్బల్, సునీల్ జాఖడ్, అమరీందర్ సింగ్, ఆర్ పీఎన్ సింగ్, అశ్వినికుమార్, హార్దిక్ పటేల్ వంటి పలుకున్న నాయకులు పార్టీ నుంచి నిష్క్రమించారు. ఇటీవలెనే గోవాలో ఎనిమిది మంది కాంగ్రెస్ శాసనసభ్యులు రాజీనామా చేశారు. పది రోజుల కిందట కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభించిన తర్వాత కాంగ్రెస్ గురించి కాస్త మంచిగా మాట్లాడుకోవడం ప్రారంభమైంది. అక్టోబర్ మూడో వారంలో పార్టీ  అధ్యక్ష పదవికి ఎన్నికలు కూడా సజావుగా జరిగితే పార్టీ బతికి బట్టకట్టడానికి అవకాశాలు ఉంటాయి. పార్టీ అధ్యక్షుడుగా గెహ్లాట్ అయినా థరూర్ అయినా ఒకటే. ఇద్దరూ సమర్థులే. గాంధీల ప్రేరణ, మార్గదర్శకత్వం ఎట్లాగూ ఉండనే ఉంటాయి. అధికార బీజేపీలో ఎన్నికలు జరగడం లేదు. నియామకాలే. కనుక ఎన్నికలు జరిపించుకున్నతర్వాత కూడా కాంగ్రెస్ అగ్రనాయకులు సఖ్యంగా ఉండి సమైక్యంగా పార్టీని ముందుకు నడిపిస్తే బీజేపీ కంటే కాంగ్రెస్ ఎక్కువ ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్న పార్టీగా మంచి పేరు తెచ్చుకుంటుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles