Monday, May 27, 2024

దశరథ మహారాజు అస్తమయం

రామాయణమ్43

రాణీ కౌసల్య పేల్చేమాటల తూటాలు దశరథుడి హృదయకవాటాలను భేదిస్తున్నాయి. ఆవిడ పలికే ఒక్కొక్క పలుకు ములుకై గుండెలను గుచ్చుతున్నాయి. పాపం ఆ ముసలి రాజు తట్టుకోలేక పోతున్నాడు. ఇంద్రియాలు పట్టుతప్పుతున్నాయి. మాటిమాటికి మూర్ఛిల్లుతు‌న్నాడు. మరల తేరుకుంటున్నాడు.

‘‘కౌసల్యా! పూర్వమెప్పుడో నేను చేసిన పాపం నన్ను పట్టిపీడిస్తున్నది. నీ వంటి ధర్మదృష్టిగల వనితాశిరోమణి, పెద్దచిన్నతారతమ్యము తెలిసినదానివి, ఎంత దుఃఖములో ఉన్నప్పటికీ భర్తను నిందించడం నీవంటిదానికి  తగునా?’’

పల్లెత్తుమాట ఏనాడూ తను తన భర్తను అని ఎరుగదు.

Also read: దశరథుడిపై కౌసల్య హృదయవేదనాభరిత వాగ్బాణాలు

‘‘ఈనాడు తనకీ దురవస్థ సంప్రాప్తించినదని ఇన్నిమాటలు అన్నానే! అని ఒక్కసారిగా ఉబికిఉబికివచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ భర్తచేయిని తన తలమీద ఉంచుకొని, ‘‘రాజా నీవు ఒక్కమాటతో నన్నుప్రాణములేని దానిని చేసి వేశావు గదయ్యా! నేను క్షమార్హము కాని అపరాధము చేసినాను. మహారాజా నాకు ధర్మములన్నీ తెలుసు. నీవు ధర్మము తప్పని వాడవనీ తెలుసు. అయినా నన్ను ఆవరించిన శోకం నాలోని ధైర్యాన్నీ, విజ్ఞతను, శాస్త్రపరిజ్ఞానాన్నీ, నశింపచేసినదయ్యా. శోకాన్ని మించిన శత్రువు లేదుకదా!

శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శృతమ్

శోకో నాశయతే సర్వం నాస్తి శోక సమో రిపుః

శత్రువుకొట్టిన దెబ్బనైనా సహింపవచ్చును కానీ హఠాత్తుగా వచ్చిమీదపడిన శోకాన్ని అది ఎంత చిన్నదైనా కానీ తట్టుకోవడం కష్టం..

‘‘ఓ వీరుడా! ధర్మవేత్తలూ, శాస్త్రజ్ఞులూ, అన్నిసంశయాలు తొలగిన సన్యాసులు కూడా శోకాన్ని తట్టుకోలేరయ్యా! ఓ నా ప్రాణనాధా, నాప్రియ పుత్రుడు అడవికి వెళ్ళి నేటికి అయిదవ రోజు అయినా నాకు అయిదు సంవత్సరములవలే ఉన్నది. రాముడిని తలుచుకుంటున్నకొద్దీ నాలో దుఃఖము కట్టలు తెంచుకొంటున్నదయ్యా!’’ అని తన మనసులోని వేదనను వెలిబుచ్చింది కౌసల్య.

Also read: వాల్మీకి మహర్షి ఆశ్రమంలో పర్ణశాల నిర్మాణం

వీరిలా మాటలాడుకుంటూనే ఉన్నారు, సమయమెంత గడిచిందో ఇరువురికీ స్పృహలేదు. సూర్యకిరణాల వెలుగు మసకబారి రాత్రి వచ్చింది. శోకముతోటే నిద్రలోకి జారుకున్నాడు దశరథుడు…

ఆ నిదుర కలతనిదుర ..

‘‘కౌసల్యా! మూఢత్వము మూర్తీభవిస్తే అది దాల్చే రూపము నేనే!

కౌసల్యా! బాలుడు మూఢుడూ ఒకటే! (పిల్ల చేష్టలంటామే అవి).

గురులాఘవమర్ధానామారమ్భే కర్మణాం ఫలమ్

దోషం వా యో న జానాతి స బాల ఇతి హోచ్యతే

ఒక పని చేసేటప్పుడు మంచి, చెడ్డలు ఎంచి చూడకుండా,

దాని వలన కలిగే ఫలితాన్నిగానీ, అందులో ఏదైనా దోషముంటే గ్రహించకుండా ఎవడు ప్రవర్తిస్తాడో వాడు “బాలుడు”(మూఢుడు).

Also read: భరద్వాజ మహర్షి ఆతిథ్యం, మార్గదర్శనం

‘‘నాలాంటి వాడొకడు అందమైన పూలు పూస్తున్నది గదా దాని పండ్లు ఇంకా బాగా రుచిగా ఉంటవేమో అని తలచి అప్పటికే ఉన్న మధురఫలాలనిచ్చే మామిడి తోట నరుక్కొని మోదుగ వృక్షాలను నాటి శ్రద్ధగా పెంచుకొన్నాడట. చివరకు దాని పళ్ళుచూసి హతాశుడైనాడట! అలాంటి వాడిని నేను.

‘‘నవయువకుడిగా ఉన్నరోజులలో నా విద్యమీద నాకు ఉన్న వల్లమాలిన గర్వంతో గాఢాంధకారమావరించి, లోకులంతా నిదురిస్తున్న వేళ వర్ష ఋతువులో  వేటకు బయలుదేరాను. శబ్దవేది విద్యలో నా నైపుణ్యము చాలా గొప్పది అని జనులంతా పొగుడుతుంటే ఆ పొగడ్తల మాయలో పడి అడవిలో రాత్రివేళ ధనుర్బాణాలు ధరించి సంచరిస్తూ గమనిస్తున్నాను.

 ఎక్కడ నుండో ఒక శబ్దం వినపడ్డది. చెవులు రిక్కించి ఆ శబ్దాన్ని శ్రద్ధగా ఆలకించాను సందేహంలేదు అది ఒక ఏనుగు నీళ్ళు త్రాగే శబ్దం. మనసును పూర్తిగా అటువైపే కేంద్రీకరించాను. ఆ శబ్దము, దాని ఉత్పత్తి స్థానము నా మనోనేత్రం ముందు స్పష్టంగా కనిపించాయి. ధనుస్సు ఎక్కుపెట్టి ఆ దిశగా పదునైన బాణమొకటి సంధించి విడిచాను.

Also read: కల్లోల సాగరమై, తేరుకొని, దృఢమైన రాముడి మనస్సు

ఆ బాణం లక్ష్యాన్ని తాకిన మరుక్షణం అయ్యో అయ్యో అని మనిషి అరిచినట్లుగా ఉంది. దగ్గరకు పోయి చూద్దును కదా అది ఒక ముని బాలకుడి స్వరం! నేను విడిచిన బాణం అతని గుండెలను చీల్చివేసింది. ఆ బాలుడు నరకయాతన అనుభవిస్తూ కనపడ్డాడు. నేనెవరికి అపకారం చేశానని నన్ను బాణంతో కొట్టారు? అని అంటూ బాధతో మూల్గుతున్నాడు. అతని వద్దకు వెళ్ళిన నన్ను చూసి, చనిపోతున్నందుకు నాకు బాధలేదు కానీ ముసలి వారు, అంధులు అయిన నా తల్లితండ్రుల పరిస్థితి తలుచుకుంటే నాకు దిక్కుతోచటంలేదు’’ అని బాధపడుతూ, ‘‘దశరథా  ఈ కాలిబాట వెంట వెళ్ళి వారిని తక్షణమే శరణు వేడు, లేకపోతే వారిచ్చే శాపానికి గురికావలసి వస్తుంది’’ అని పలికి నా చేతులలో ప్రాణాలు విడిచాడు.

దశరథుడి బాణం తగిలి మునిబాలకుడు మరణించాడు.

భయము, భయముగా ఆ ముని బాలకుడి తల్లిదండ్రులను సమీపించి నా వలన తెలియక జరిగిన అపరాధము మన్నించమని వేడుకున్నాను.

విషయము తెలిసిన ఆ తల్లిదండ్రుల శోకము వర్ణనాతీతము! వారి కోరిక మీద వారి కుమారుడు పడిపోయిన ప్రదేశానికి తీసుకువెళ్ళగా వారు అతని దేహాన్ని స్పృశిస్తూ, వారుకూడా మరణానికి దగ్గర అవుతూ ఉన్నవారివలే వణికిపోతూ, ‘‘రాజా ! మావలెనే నీవుకూడా పుత్రవియోగ దుఃఖముతో మరణించగలవు’’ అని శపించి ప్రాణము విడిచిపెట్టారు.

Also read: గుహుడిని గుండెకు హత్తుకున్న రాముడు

‘‘కౌసల్యా! నేడు ఆ సమయమాసన్నమైనది. నాకు కళ్ళుకనపడటంలేదు దృష్టి మందగించింది  యముని మహిషపు లోహఘంటానాదం నా చెవులలో మారు మ్రోగుతున్నది. ఇక అందమైన నా రాముని ముఖం చూడగలిగే అదృష్టం నాకులేదు..

‘‘అయ్యో రామా, అయ్యో మహాబాహూ, అయ్యో నా దుఃఖ నాశకా, అయ్యో పితృప్రియా, అయ్యో మద్రక్షకా, అయ్యో నా కుమారా ఎక్కడున్నావురా నీవు?’’ అంటూ గుండెలవిసేలా ఏడ్చిఏడ్చి నిద్రలోనే తుదిశ్వాస విడిచాడు దశరథుడు.

హా రాఘవ మహాబాహో హా మమాయాసనాశన

హా పితృప్రియ మే నాధ హాద్య క్వాసి గతః సుత.

హా కౌసల్యే నశిష్యామి హా సుమిత్రే తపస్విని

హా నృశంసే మమామిత్రే ( మమ + అమిత్రే) కైకేయీ కులపాంసని.

ఒక చక్రవర్తి అస్తమించాడు.

Also read: గంగానదీ తీరం చేరిన సీతారామలక్ష్మణులు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles