Sunday, June 16, 2024

వ్యవసాయ సంక్షోభం : విభజనలు కావు, విన్-విన్ సొల్యూషన్ సాధించాలి

సాగు రంగ చట్టాల పై సామరస్య పరిష్కారాలు సాధించాలి
• గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకోకూడదు
• మూడు బిల్లులకు అతీతమైన సమస్యలు
• రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఆలోచించాలి
• రైతు ప్రయోజనమే పరమావధి కావాలి

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలపై దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది ఒకందుకు మంచిదే. ఇప్పటికైనా దేశ రైతాంగ దుస్థితిపై తప్పో ఒప్పో ఒక పెద్ద చర్చ జరగడానికి ఈ చట్టాలు మరో రకంగా దోహదపడ్డాయి. దేశ రాజధాని చుట్టుపక్కల పంజాబ్, హర్యానా రైతులు గత పదిహేను రోజులుగా ఢిల్లీ నగరాన్ని దిగ్బంధం చేస్తున్నారు. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాలు ఆరు మార్లు చర్చించాయి. కానీ కనుచూపు మేరలో పరిష్కారం మార్గం కనిపించడం లేదు. ఇక పోరు దారి తప్ప అన్ని దారులు మూసుకుపోయాయని రైతు సంఘాలు, ప్రతిపక్షాలు అంటున్నాయి. తాము తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలు అద్భుతమని రైతాంగ సమస్యలకు సమగ్ర పరిష్కారం చూపిస్తాయని కేంద్ర ప్రభుత్వం వాదిస్తుంటే, ఈ మూడు చట్టాల వల్ల రైతుల బతుకు చిద్ర మవుతుందని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు వాదిస్తున్నాయి.

పరస్పర విరుద్ధమైన వాదనలు
నిజానికి ఈ రెండు వాదనలు వాస్తవం కాదు. కేంద్ర ప్రభుత్వం ఈ మూడు వ్యవసాయ చట్టాలు తీసుకురాక ముందు రైతుల బతుకు అద్భుతంగా ఉందని కాదు. ఈ మూడు చట్టాలు రావడం వల్ల రైతుల బతుకు పూర్తిగా నాశనం అవుతుందనే వాదన కూడా అవాస్తవం. అందుకే ఈ మూడు చట్టాలను ఆహ్వానిస్తూనే ఇంకా లాభసాటి వ్యవసాయం కోసం అనేక సంస్కరణలు తీసుకు రావాలని మధ్యే వాదులు అంటున్నారు. కానీ వీరి గొంతు ఈ రణగొణ ధ్వనుల రొదలో వినిపించడం లేదు. పార్టీలకు అతీతంగా రైతు సమస్యలకు అసలు సిసలైన పరిష్కారాలు సూచించే విజ్ఞుల మాటలు రాజకీయవాదుల మభ్యపెట్టే మాటల మధ్యన అరణ్యరోదనే అవుతోంది. నిజం గడప దాటేలోగా అబద్ధం లోకంచుట్టి వస్తుంది. అందుకే రాజకీయ రణ రంగంలో రైతు బతుకు చితికి పోతుంది.

తమ మాటే నెగ్గాలా, రైతుల బతుకు మారాలా?
తమ మాటే నెగ్గాలి అన్న ప్రభుత్వం, ప్రతిపక్షాలు కొన్ని రైతు సంఘాల వాదనల మధ్య అసలు వాస్తవాలు మరుగున పడుతున్నాయి. సందట్లో సడేమియా లాగా ఇప్పటిదాకా మర్చిపోయిన విద్యుత్ రంగ సంస్కరణలు కూడా మళ్లీ ఈ వ్యవసాయ రంగ సంస్కరణల మధ్యన వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవాల ఆధారంగా జరగాల్సిన చర్చలు అపోహలు, అప నమ్మకాల మధ్య జరుగుతున్నాయి. తమ మాటే నెగ్గాలి అన్న ప్రభుత్వం, ప్రతిపక్షాలు పట్టువిడుపులతో సామరస్యంతో వ్యవహరించాలి. అంతిమంగా రైతు బతుకు మారాలని ఆలోచించాలి.

ఇదీ చదవండి:రైతు వ్యతిరేక బిల్లే కాదు, ప్రజా వ్యతిరేక బిల్లు అని ఎందుకు అనకూడదు?

చట్టాలలో ప్రస్తావించని అంశాలు చర్చకు ఎందుకు వస్తున్నాయి?
ఈ మూడు చట్టాలలో కనీస ప్రస్తావన లేని అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. ఉదాహరణకు మార్కెట్ యార్డు లను ప్రభుత్వం రద్దు చేస్తుందనే వాదన తో పాటు కనీస మద్దతు ధర ఇకముందు ఉండదని, గోధుమలు, వరి ధాన్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఇండియా వారు ఇక ముందు కొనడం మానేస్తారని ఇలాంటి వాదనలు తెరమీదికి తెస్తున్నారు. అలాగే కార్పోరేట్ లకు ప్రభుత్వం దాసోహం అంటుందని కార్పొరేట్ పదాన్ని ఒక బూతు పదంగా చిత్రీకరిస్తున్నారు. గత 70 సంవత్సరాలలో రైతు సమస్యల మీద పార్టీలకు అతీతంగా ఇప్పటిదాకా అధికారంలో ఉన్న పార్టీలు చిత్తశుద్ధి తో ఆలోచించలేదు. “తిలా పాపం తలా పిడికెడు” అన్నట్లు గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలను సమానంగా నిలదీయడం పోయి ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ని మాత్రమే నిలదీస్తున్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బిజెపి, బిజెపి అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ రైతుల పట్ల కపట ప్రేమ ఒలకబోస్తూ చేసిన దుర్మార్గపు చట్టాల ను ప్రశ్నించడం పోయి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెడదామన్న ఆలోచనతో ఉన్న రాజకీయ పక్షాలకు మేధావులు మద్దతు ఇస్తున్నారు. రైతు సంఘాలు వత్తాసు పలుకుతున్నాయి.

ఇదీ చదవండి:రైతు సంఘాలకు చట్ట సవరణలపై ప్రతిపాదనలు పంపిన కేంద్రం

రైతుకు సమస్యలు లేవా?
రైతులకు అసలే సమస్యలు లేవని కాదు. కానీ ఉన్న సమస్యలకు ప్రస్తుతం వీరు పోరాడుతున్న తీరు పరిష్కారం కాదన్న సంగతిని రైతు సంఘాలు గమనించాలి. వ్యవసాయంలో నష్టాలు వస్తున్నాయి “ప్రకృతి శాపం కాదు- పాలకుల పాపానికి” వ్యవసాయం బలిపశువుగా మారింది. పార్టీలకు అతీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటిదాకా అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలే రైతు కష్టాలకు కారణం అని గమనించలేక పోతున్నాము. అసలు సమస్యలను మరచి కొత్త సమస్యలతో రాజకీయ రణరంగాన్ని సృష్టిస్తున్నారు.

మూడు చట్టాల ప్రతిఘటనే పరిష్కారం కాదు
ఈ మూడు చట్టాలను వ్యతిరేకించడమే పరిష్కారం కాదు. వీటిలో అవసరమైన సవరణలు చేయడమే అసలు సిసలైన పరిష్కారం. అలాగే ఈ మూడు చట్టాల లో ప్రస్తావించని అనేక అంశాలను రైతుకు అనుకూలంగా మరికొన్ని అవసరమైన చట్టాలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాలి. అందులో మొదటిది భారతదేశంలో ఎగుమతి దిగుమతి విధానాన్ని మార్చడం. రెండోది రైతు పరపతిని పెంచడం. మూడవది పండిన పంటకు సరైన ధర లభించే మార్కెట్ ను ఏర్పరచడం. పంట పండినా పండకపోయినా రైతులు నష్టపోతున్నారు. పండిన పంటకు మార్కెట్ లో సరైన ధర రాక ఆయన కాడికి అమ్ముకుంటున్నారు. అమ్మబోతే అడవి కొనబోతే కొరివిలా రైతు పరిస్థితి మారింది. పంటల సాగు మొదలుపెట్టినప్పటి నుంచి పంట పండించే వరకు ఉన్న దోపిడీ వ్యవస్థను రద్దు చేయడం, లేదా సంస్కరించడం చేయాలి.

ఇదీ చదవండి :ఉధృతంగా రైతుల ఆందోళన-పోలీసులకు కరోనా

అసాంతం రైతు దోపిడీ
విత్తనం నుంచి మొదలుకొని పురుగు మందులు, ఎరువులు వీటిలో రైతులు దోపిడీకి గురవుతున్నారు. రైతు ను ఆదుకోవడానికి అవసరమైన పకడ్బందీ చట్టాలు చేయడం మాని ఇవాళ స్వేచ్ఛా మార్కెట్ వ్యతిరేకిస్తున్న శక్తులు మిగితా పనికిరాని అంశాల చుట్టూ తిరిగి డొంకతిరుగుడు వాదనలు చేస్తున్నాయి. ఇప్పటిదాకా దేశంలో రైతు సంఘాలు ప్రతిపక్షాలు డిమాండ్ చేసినట్లుగా ఈ మూడు చట్టాలలో ఏడు ఎనిమిది సవరణలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయినా సరే మేము ఈ మూడు చట్టాలను పూర్తిగా రద్దు చేసేంతవరకు మా ఉద్యమం ఆగదనీ రైతు సంఘాలు ప్రతిపక్షాలు భీష్మించుకు కూర్చున్నాయి. ఇది సరైంది కాదు. తెగేదాక లాగితే ఏమవుతుందో అటు ప్రభుత్వం ఇటు ప్రతి పక్షాలు, రైతు సంఘాలు గమనించాలి.

ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ప్రధానం కారాదు
అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఇదే అదునుగా సమయం వచ్చింది కదా అని ఇవాళ మొండికేస్తే రేపు ఇదే ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చిన తర్వాత అవే సమస్యలు మళ్లీ మళ్లీ ఆ ప్రతిపక్షాల వెంట కూడా పడతాయని గమనించాలి. “గోటితో పోయేదానికి గొడ్డలి” దాక తెచ్చుకునే మొండివైఖరి ఇరుపక్షాలు విడనాడాలి. సాగురంగ చట్టాలపై ఇప్పటికైనా మరొకసారి సమగ్ర చర్చ జరగాలి. ఇరుపక్షాలు భేషజాలకు పోకుండా సామరస్య పరిష్కారం సాధించాలి. ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనే మీమాంస లేకుండా “విన్ – విన్ సొల్యూషన్” సాధించాలి. అప్పుడే ఈ సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుంది.

ఇదీ చదవండి:ఆ చట్టాలు పైకి లాభసాటిగానే కనిపిస్తాయి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles