Monday, May 6, 2024

ప్రతిపక్ష ఐక్యతకు మతత తూట్లు

  • అనూహ్యంగా మారుతున్న తృణమూల్ అధినేత్రి వైఖరి
  • ప్రతిపక్షాలను ఏకం చేస్తారనుకున్న నేత దూరం జరుగుతున్నారు
ఇటీవల డార్జిలింగ్ లో మాజీ గవర్నర్ జగదీప్ ఢంఖడ్, అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మతో సమాలోచన జరుపుతున్న మమతా బెనర్జీ

భారత దేశంలో ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు ఏమి చేస్తారో, ఎప్పుడు ఏమంటారో, ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటారో తెలియదు. ఎవరి ప్రయోజనాలు వారివే. ఎవరి అహంకారం వారిదే. ఎవరి ఆలోచనలు వారివే. వాటికీ కట్టుబడి ఉండాలన్న నియమం లేదు. ఇప్పుడు ఇటు ఉన్నవారు కాసేపటికి అటు వెళ్ళవచ్చు. నిలకడ లేదు. నిబద్ధత లేదు. సమైక్యత లేదు.  అందుకే బీజేపీ ప్రభ అప్రతిహతంగా వెలిగిపోతోంది.

Also read: ఎట్టకేలకు గొటబాయ రాజీనామా, లంకలో శాంతికి సోపానం

రాజకీయ పరిశీలకుల దిగ్భ్రాంతి

ప్రతిపక్ష సమైక్యతను తాజాగా దెబ్బతీసిన రాజకీయవేత్త పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ. ఉపరాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరిస్తామంటూ ఆమె ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే  ప్రకటన ఒకటి అలవోకగా చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఆమె మాట మార్చడం, రూటు మార్చడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రతిపక్షాలకు నాయకత్వం వహించే శక్తియుక్తులు ఉన్నాయని భావించిన మమతాబెనర్జీ తాజా వైఖరి చూసి రాజకీయ పరిశీలకులు నిర్ఘాంతపోతున్నారు. ప్రతిపక్ష సౌధానికి గల మూల స్తంభాలలో ముఖ్యమైన స్తంభం అని భావించిన తృణమూల్ కాంగ్రెస్  బీటలువారడం పరిశీలకులకు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. త్రిణమూల్ కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు చేయకుండా బహిష్కరించడం అంటే మమతా బెనర్జీ బద్ధశత్రువును గెలిపించడానికి దోహదం చేయడమే. తనను 2019 నుంచి వేధించుకు తింటూ పశ్చిమబెంగాల్ గవర్నర్ గా మొన్నటి దాకా పని చేసిన జగదీప్ ధన్ ఖడ్ కి మేలు చేయడమే.

Also read: నికార్సయిన సంపాదకుడు కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యం

అంతుబట్టని మమత వైఖరి

మమత విధానాలు అంతుబట్టడం లేదు. ఆమె వైఖరి అర్థం కాదు. ఇటీవల ఆమె డార్జిలింగ్ లో దన్ ఖడ్ తోనూ, అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మతోనూ సమావేశమైనారు. అక్కడ ఏమి జరిగిందో, ఏమి మాట్లాడుకున్నారో తెలియదు. దాని తర్వాత మమతాబెనర్జీ చేసిన ప్రకటన చూసినవారికి డార్జిలింగ్ ఏదో జరిగి ఉంటుందని అనుమానం కలుగక మానదు. ఇటీవలి కాలంలో మమతాబెనర్జీ పోకడలు వింతగా కనిపిస్తున్నాయి. బీజేపీతో నిత్యం పోరాడుతున్న సీనియర్ నాయకుడు యశ్వంత్ సిన్హాను తృణమూల్ కాంగ్రెస్ లోకి సగౌరవంగా ఆహ్వానించి పార్టీకి ఉపాధ్యక్షుడిగా నియమించారు. యశ్వంత్ సిన్హా ఐఏఎస్ అధికారిగా తన ప్రస్థానం ప్రారంభించి, ముందస్తు పదవీ విరమణ చేసి, రాజకీయాలలో చేరి, జనతాదళ్ లో కొంతకాలం పని చేసి,అనంతరం బీజేపీలో చేరారు. పాతిక సంవత్సరాలు ఆ పార్టీలో ఉన్నారు. వాజపేయి మంత్రిమండలిలో ఆర్థిక, విదేశ వ్యవహారాల శాఖలను జయప్రదంగా నిర్వహించారు. అడ్వానీ, మురళీమనోహర్ జోషిల కంటే చిన్నవాడైన సిన్హా వారితో కలసి నాయకత్వ స్థానంలో ఉండేవారు. 2014లో నరేంద్రమోదీ ప్రధానిగా ఎన్నికైన తర్వాత, పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా పగ్గాలు అందుకున్న తర్వాత చాలామందికి జరిగినట్టే సిన్హాకూ పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయింది. అడ్వానీకీ, మురళీమనోహర్ జోషీకీ గౌరవంగా మార్గదర్శక మండలిలో సభ్యత్వం ఇచ్చారు. యశ్వంత్ సిన్హా ఇంకా తాను రాజకీయ రణక్షేత్రంలో పోరాడే శక్తి ఉన్న నాయకుడినని అనుకుంటున్నారు. తనను పక్కన పెట్టినా తన కుమారుడికి మంత్రిమండలిలో స్థానం ఇవ్వడంతో సిన్హా సమాధాన పడతారేమోనని మోదీ-షా ద్వయం అనుకొని ఉంటారు. కానీ సిన్హా మోదీపైన విమర్శలు ఎక్కుపెట్టడం ఆపుచేయలేదు. తన వల్ల తన కుమారుడు జయంత్ సిన్హా మంత్రి పదవి ప్రమాదంలో పడుతోందన్న ధ్యాస లేకుండాస సిన్హా మోదీ, షా ద్వయంపైన విరుచుకుపడుతూనే ఉన్నారు. 2019 ఎన్నికల తర్వాత జయంత్ సిన్హాకు మంత్రిమండలి నుంచి ఉద్వాసన చెప్పారు. అయినప్పటికీ  ఖాతరు చేయకుండా యశ్వంత్ సిన్హా ప్రభుత్వాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా దుయ్యపడుతూనే ఉన్నారు. బీజేపీ నుంచి బహిష్కరించే సమయం ఆసన్నమైంది. 2018లో బీజేపీకి బైబై చెప్పారు. అటువంటి సందిగ్ధ సమయంలో తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు.

Also read: సెతల్వాడ్, శ్రీకుమార్ అరెస్ట్ ల వెనుక కక్షసాధింపు ధోరణి

యశ్వంత్ సిన్హాకూ సహాయ నిరాకరణ

రాష్ట్రపతి పదవికి అభ్యర్థిని నిర్ణయించే విషయంలో మమతా బెనర్జీ చొరవ తీసుకున్నారు. ఆమె నిర్వహణలోనే ప్రతిపక్షాల సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా హాజరైంది. యశ్వంత్ సిన్హాను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిర్ణయించారు. కానీ మమతా బెనర్జీ అంత ఉత్సాహంగా సిన్హా అభ్యర్థిత్వాన్ని బలపరిచినట్టు, ప్రచారం చేసినట్టు కనిపించదు. పైగా ద్రౌపది ముర్మును ప్రతిపాదిస్తున్నట్టు నరేంద్రమోదీ ప్రభుత్వం తనతో సంప్రతించి ఉంటే తాను ఆమెనే బలపరిచేదాన్నంటూ ఒక ప్రకటన చేశారు. పశ్చిమబెంగాల్ లో ఆదివాసీల ప్రభావం ఉంటుంది కనుక అటువంటి ప్రకటన చేశారనుకోవాలి. ఓటింగ్ మాత్రం యశ్వంత్ సిన్హాకి అనుకూలంగానే వేశారు.

తనను సంప్రదించలేదంటూ దబాయింపు

ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించేందుకు ప్రతిపక్షాల సమావేశాన్ని నేషనలిస్టు కాంగ్రెస్ అధినేత శరద్ పవార్ అధ్యక్షతన జరిగింది. 17పక్షాలు హాజరైనాయి. తృణమూల్ కాంగ్రెస్ పక్షాన ఎవ్వరూ రాలేదు. ఆమె అభిప్రాయం కనుక్కునేందుకు సోనియాగాంధీ, శరద్ పవార్ లు విడివిడిగా ఫోన్ చేశారు. ప్రతిపక్షాలు ఏ అభ్యర్థిని నిర్ణయించినా తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఇస్తుందంటూ ఇద్దరితోనూ మమతా బెనర్జీ చెప్పారు. అంతలోనే మాట మార్చి తాము ఉపరాష్ట్రపతి పోలింగ్ ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. మార్గరెట్ అల్వాను అభ్యర్థిగా నిర్ణయించే ముందు తనను సంప్రదించలేదని మమతా బెనర్జీ దబాయిస్తున్నారు. అటువంటి విషయాలు చర్చించుకునే సమయం ఇది కాదనీ, ప్రతిపక్షాలు సమైక్యంగా ముందుకు సాగే సమయమనీ మార్గరెట్ అల్వా బెనర్జీకి సమాధానంగా చెప్పారు. అయినప్పటికీ బెంగాల్ సింగం మమతాబెనర్జీ గర్జించడం మానలేదు.

Also read: బుల్డోజర్ పాలన కోర్టు ధిక్కారం

మార్గరెట్ అల్వాతో విభేదాలకు ఆస్కారం లేదు

నిజానికి మార్గరెట్ అల్వా అభ్యర్థిత్వం పట్ల ఎవరికైనా అభ్యంతరం ఉండాలంటే అది కాంగ్రెస్ అధిష్ఠానవర్గానికి ఉండాలి. గవర్నర్ పదవుల నుంచి వైదొలిగిన తర్వాత మార్గరెట్ అల్వా ఇండియా టుడే కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనియాగాంధీనీ, రాహుల్ గాంధీని ఎడాపెడా విమర్శించారు. రాజకీయ జీవితం నుంచి వైదొలుగుతున్నానన్న ధీమాతో ఆమె అటువంటి విమర్శలకు దిగి ఉండవచ్చు. ఎప్పుడో భవిష్యత్తులో ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయవలసి వస్తుందనీ, అప్పుడు కాంగ్రెస్ మద్దతు అవసరం ఉంటుందనీ అప్పుడు ఊహించి ఉండకపోవచ్చు. అల్వా విమర్శలను సోనియాగాంధీ, రాహుల్ గాంధీ అంతగా పట్టించుకోకుండా ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. రాజకీయాలంటే అలాగే ఉండాలి. అటువంటి ఇబ్బంది కూడా మమతా బెనర్జీకి లేదు. ఆమెకూ, అల్వాకూ స్పర్థలు ఉండే అవకాశమే  లేదు. రాష్ట్రపతి ఎన్నికలలో కంటే చురుకుగా ఉపరాష్ట్రపతి ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పాల్గొంటుందనీ, తనను వేదించిన మాజీ గవర్నర్ ధన్ ఖడ్ ను ఓడించేందుకు మార్గరెట్ అల్వాకు మరింత బలంగా ప్రచారం చేస్తారని ఊహించిన రాజకీయ పరిశీలకులు మమతా బెనర్జీ వాలకం చూసి ఆశ్చర్యబోతున్నారు.

ప్రతిపక్షాల తీరే అంత

దేశంలో ప్రతిపక్షాల తీరు ఇలాగే ఉంటోంది. మొన్నటి దాకా బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి కడతానంటూ పర్యటనలు చేస్తూ ప్రసంగాలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ మధ్య కాంగ్రెసేతర కూటమి అనడం మానివేశారు. రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నుకున్న ప్రతిపక్షాల సమావేశానికి కాంగ్రెస్ హాజరువుతున్నదనే కారణంగా టీఆర్ఎస్ గైర్ హాజరైంది. మొన్న ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నుకోవడానికి జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో కాంగ్రెస్ పాల్గొన్నది. టీఆర్ఎస్ తరఫున పార్లమెంటు సభ్యుడు కె. కేశవరావు పాల్గొన్నారు. ప్రతిపక్షాల సమైక్యతకు కేసీఆర్ కలిసి వస్తున్నారని అనుకునే సమయంలో కేసీఆర్ కంటే ఎక్కువమంది పార్లమెంటు సభ్యులూ, శాసనసభ్యుల బలం ఉన్న మమతాబెనర్జీ దూరంగా జరగడం ప్రారంభించారు. మహారాష్ట్రలో జరిగిన నాటకీయ పరిణామాలు సరే సరి. నడుస్తున్న ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం తటాలున పడిపోయింది. ఠాక్రే నాయకత్వంలోనే అప్పటి వరకూ ఉన్న శివసేన కాస్తా రెండుగా చీలిపోయింది. చీలక వర్గం నాయకుడు ఏక్ నాథ్ శిందే బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మొన్నటి వరకూ ప్రభుత్వంలో భాగస్వాములైన కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ లతో ఉద్ధవ్ స్నేహం కొనసాగుతుందో, తెగిపోతుందో తెలియదు. ఉద్ధవ్ ను మనసు కుదుట చేసుకొని బీజేపీతో స్నేహం చేయవలసిందిగా ఆయన పార్టీలో మిగిలి ఉన్న నాయకులు కూడా కోరుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో తన వర్గానికి చెందిన పార్లమెంటు సభ్యుల మాట మన్నించి ద్రౌపది మున్రును బలపరచాలని నిర్ణయించుకున్నారు. తీరా రాష్ట్రపతి ఎన్నికలలో ఓటింగ్ జరిగిన వెంటనే ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని వర్గాన్న వీడి శిండే నాయకత్వంలోని వర్గంలో పార్లమెంటు సభ్యులు చేరిపోయారు. రాజకీయ అమాయకత్వం ఉద్ధవ్ ఠాక్రేలో కనిపిస్తున్నది. గడుగ్గాయిగా, పులిగా, ఘటనాఘటన సమర్థుడిగా పేరుతెచ్చుకున్న బాలాసాహెబ్ ఠాక్రే కుమారుడు ఇంత మెతకగా, ఇంత పేలవంగా తేలిపోవడం ఆశ్చర్యంగా ఉంది. పులి కడుపున పిల్లిపుట్టిందా అని లోకులు కాకులై మాట్లాడుకుంటున్నారు. మొత్తం మీదికి ప్రతిపక్ష ప్రభుత్వం అధినేతగా ఉండిన ఉద్ధవ్ ఠాక్రే స్వపక్షంలోనే అనామకుడిగా మిగిలిపోయాడు. శక్తిమంతురాలైన మమతాబెనర్జీ అహంకారంతోనో, తొందరపాటుతోనో ప్రతిపక్ష ఐక్యతకు విఘాతం కలిగిస్తుంటే, బుద్ధిమంతుడైన ఉద్ధవ్ అసమర్థత వల్లనో, రాజకీయ చాకచక్యం లేనికారణంగా తాను దెబ్బ తిని ప్రతిపక్ష ఐక్యతను కూడా దెబ్బతీశారు. ఈ లోగా బీజేపీ తన అజెండాను అమలు పర్చుతూ, ప్రతిపక్షాలను చీల్చుతూ, పార్లమెంటు సభ్యులకూ, శాసనసభ్యులకూ కాషాయ కండువాలు కప్పుతూ, అధికారంలో కొనసాగడం ఎలా అనే యావలో కొత్తపుతలు తొక్కుతూ రాజకీయాల స్థాయిని దిగజార్చుతూ రొమ్ము విరుచుకొని ముందుకు సాగిపోతూ ఉన్నది. ఈ రాజకీయ నాటకంలో ప్రేక్షకపాత్రధారులైన పరిశీలకులు కార్యకారణ సంబంధాలు అంతుబట్టక జుట్టు పీక్కుంటున్నారు.  

Also read: తెలంగాణ ప్రజల ఎనిమిదేళ్ళ అనుభవం ఏమిటి? 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles