Thursday, September 19, 2024

నికార్సయిన సంపాదకుడు కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యం

కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యంను సత్కరిస్తున్న రామచంద్రమూర్తి. చిత్రంలో సి. రాఘవాచారి, గోపాలస్వామిని చూడవచ్చు.

ఉస్మానియి విశ్వవిద్యాలయంలో జర్నలిజం కోర్సు పూర్తయిన వెంటనే నాకు ఉద్యోగం రాలేదు. సింగరేణి కాలరీస్ లో గ్రేడ్-2 క్లార్క్ పోస్టులకు రాతపరీక్ష పెడితే ఉబుసుపోక రాశాను. పరీక్షలో మంచి మార్కులు వచ్చాయి. ఉద్యోగం గోదావరిఖని రెండో ఇంక్లెయిన్ లో ఇచ్చారు. ఉద్యోగంలో చేరే ముందు కొత్తగూడెం హెడ్డాఫీసుకు వెళ్ళి గోపాలశాస్త్రిగారిని కలుసుకొని, ఆ తర్వాత గోదావరిఖని వెళ్ళాను. రాజయ్య కాంపౌండ్ లో నేనూ, మాధవరావు, గురజాల సుబ్బారావు అనే ఇద్దరు మిత్రులూ కలిసి ఒక పోర్షన్ లో అద్దెకు ఉండేవాళ్ళం. పిట్ అసిస్టెంట్ ఉద్యోగం. గనిలోకి వెళ్ళే కార్మికుల హాజరు తీసుకోవడం, వారి సెలవులూ గట్రా చూడటం, మేనేజర్ రాజారాం ఏదైనా పని అప్పజెప్పితే చేయడం.

కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యంగారు లబ్ధప్రతిష్ఠులైన జర్నలిస్టు. కాంగ్రెస్ పార్టీ పత్రిక ఆంధ్రజనతకు సంపాదకులుగా చేశారు. వరదాచారిగారు, అజంతాగారూ, పొత్తూరి వెంకటేశ్వరరావుగారూ, విశ్వేశ్వరరావుగారు వంటి హేమాహేమీలంతా ఆయన శిష్యులే. వల్లూరి బసవరాజుగారు ఆత్మీయులు. ఆంధ్రజనత మూసివేసిన తర్వాత జలగం వెంగళరావుగారి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ అనే పత్రికకు సంపాదకుడుగా చేశారు. చాంబర్స్ ఆఫ్ పంచాయతీరాజ్ కు జలగంవారు అధ్యక్షులు. అప్పటికే ఆయన కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో హోంమంత్రిగా పని చేశారు. శ్రీకాకుళం నక్సలైట్ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేశారు. ఆ తర్వాత జలగం వెంగళరావు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. రామనాథ్ గోయెంకాతో మాట్లాడి భావి సంపాదకుడుగా కూచిమంచివారి పేరు సిఫార్సు చేశారు. మొదట బెంగళూరులో అసిస్టెంట్ ఎడిటర్ గా కూచిమంచివారు చేరారు. అప్పటికి ఆంధ్రప్రభ సంపాదకులుగా పండితారాథ్యుల నాగేశ్వరరావుగారు ఉండేవారు. ఆయన ఉబ్బసం వ్యాధితో అనారోగ్యంగా ఉన్నారు. కొన్ని రోజులు బెంగళూరులో పని చేసిన తర్వాత ఎప్పుడు పండితారాధ్యులవారు తప్పుకుంటే అప్పుడు సంపాదక బాధ్యతలు తీసుకునే విధంగా గోయెంకా సుబ్రహ్మణ్యంగారికి చెప్పారు. కూచిమంచివారూ, మా అన్నగారు డాక్టర్ కొండుభట్ల రామసత్యం మంచి స్నేహితులు. మా అన్నగారు నా సంగతి చెప్పారు. వెంటనే పంపించమని కూచిమంచివారు చెప్పారు. గోదావరిఖని నుంచి తల్లాడ వెళ్ళి, అమ్మానాన్నలకు విషయం చెప్పి,  హైదరాబాద్ వచ్చి బెంగళూరు ఎక్స్ ప్రెస్ లో వెళ్ళాను. అది ఫిబ్రవరి ఒకటో తేదీ. ఒక పీటీఐ వార్త ఇచ్చి తెలుగులోకి తర్జుమా చేయమన్నారు. పదినిమిషాలలో చేసి ఇచ్చాను. అనువాదం చూసి మెచ్చుకోలుగా నాకేసి చూసి ‘‘పనికొస్తావోయ్. చాలా స్పీడుగా, చక్కగా చేశావ్. ఉద్యోగంలో వెంటనే చేరిపో. నీకు అక్కడ ఎంత వస్తోందో తెలియదు. ఇక్కడ మాత్రం నెలకు రెండువందలు స్టైఫండ్ ఉంటుంది. రెండేళ్ళ ప్రొబేషన్ తర్వాత ఆరువందల పైచిలుకు జీతం ఉంటుంది. భవిష్యత్తు బాగుంటుది. నువ్వు జర్నలిజం కోర్సు చేశావు కాబట్టి రాణిస్తావు. వెంటనే చేరిపో’’ అని చెప్పారు. నాకు గోదావరిఖనిలో 750 రూపాయల జీతం. దాన్ని వదులుకొని బెంగళూరులో ఫిబ్రవరి 5న చేరాను. మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. జర్నలిజం వృత్తిగా దాదాపు అయిదు దశాబ్దాలు పూర్తి చేయబోతున్నాను వచ్చే సంవత్సరం.

కూచిమంచివారు మితభాషి. చమత్కార సంభాషణ అంటే ఇష్టం. తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ సమానమైన అధికారంతో రాసేవారు. ఆంధ్రజనత కంటే ముందు చెన్నైలో ఇంగ్లీషు స్వతంత్రలో పని చేశారు. ‘ఎర్రబాబు’ అనే కలం పేరుతో (ఆయన ఎర్రగా ఉండేవారు) వ్యంగ్యరచనలు చేసేవారు. ఆంధ్రప్రభలో క్రమం తప్పకుండా రాసేవారు.  వారానికి ఒకరోజు నా చేత సంపాదకీయం రాయించేవారు. నాకంటే సీనియర్లూ, ప్రతిభావంతులూ బెంగళూరు ఆఫీసులో లేకపోలేదు. నండూరిపార్థసారథి, గంటికోట వెంకటేశ్వర్లు వంటి ప్రతిభావంతులు ఉన్నారు. కానీ ఎందుకో నా చేతనే సంపాదకీయాలు రాయించేవారు. ప్రతి శుక్రవారం నేను సంపాదకీయం రాసేవాడిని. సబ్జెక్టు వారే కిందటిరోజు చెప్పేవారు. సాయంత్రం ఆయన భోజనం చేసి వచ్చేసరికి సంపాదకీయం రాసి ఆయన టేబుల్ పైన పెట్టేవాడిని. రాగానే దాన్ని తిరగేసి కంపోజింగ్ కి పంపించేవారు. నేను అప్రెంటీస్ గా ఉండగానే సంపాదకీయాలు రాసే అవకాశం ఇచ్చిన మహానుభావుడు ఆయన. కూచిమంచివారి అంచనాలకు తగినట్టు ఎదగాలని నేను కృషి చేసేవాడిని.

కొంతకాలం తర్వాత పండితారాధ్యుల నాగేశ్వరరావు పదవీవిరమణ చేశారు. కూచిమంచివారు విజయవాడ వెళ్ళి సంపాదకులుగా బాధ్యతలు స్వీకరించారు. నాగరాజుగారు (బాలాంత్రపు రజనీకాంతరావు బావగారు) అసిస్టెంట్ ఎడిటర్ గా బెంగళూరులో బాధ్యతలు తీసుకున్నారు. ఆయన తర్వాత పొత్తూరి పుల్లయ్యగారు వచ్చారు. పుల్లయ్యగారు నాకు చాలా స్వేచ్ఛ ఇచ్చారు. ఎప్పుడు కావాలంటే అప్పుడ రిపోర్టింగ్ కి వెళ్ళేవాడిని. అక్కడ ఆంధ్రప్రభకు పత్యేకించి విలేఖరులు లేరు. తెలుగు ప్రముఖులు వచ్చినా, ఇంకేదైనా ముఖ్యమైన ఘటన జరిగినా నేను రిపోర్టింగ్ కి వెళ్ళేవాడిని. నేను చేరకముందు నంద్యాల గోపాల్ ఈ పని చేస్తుండేవారు. నేను చేరిన తర్వాత ఆయన ఆ బాధ్యత నాకు అప్పగించారు. కర్ణాటక ముఖ్యమంత్రి దేవరాజ్ అర్స్ ని ఇంటర్వ్యూ చేశాను. ఇండియన్ ఎక్స్ ప్రెస్ బ్యూరో చీఫ్ సుబ్బారావుగారు నన్ను బాగా ప్రోత్సహించారు. అరుణ్ శౌరీ సహాయక బృందంలో పనిచేసే అవకాశం లభించింది. డాక్టర్ చెన్నారెడ్డి ముఖ్యమంత్రి హోదాలో నందీహిల్స్ వస్తే అక్కడికి వెళ్ళి ఆయనను ఇంటర్వ్యూ చేశాను. నాలుగేళ్ళు బెంగళూరులో పని చేసిన తర్వాత  హైదరాబాద్ కి బదిలీ కోసం ప్రయత్నించాను. పొత్తూరి వెంకటేశ్వరరావుగారు అక్కడ రెసిడెంట్ ఎడిటర్. ఆయన ఆమోదించారు. శంకరన్ నాయర్ అని మేనేజర్ ఉండేవాడు. ఆయన దగ్గరికి బదిలీ ఉత్తర్వుల కోసం వెళ్ళాను. ‘‘సేఠ్ జీ (రామనాథ్ గోయెంకా) ఫోన్ చేశారు. వైట్ హౌస్ లో పుట్టపర్తి సాయిబాబా నలభై రోజులపాటు ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. రేపు ప్రారంభ సభను రిపోర్ట్ చేయాలి. మర్నాడు వచ్చి ఆర్డర్ తీసుకోండి,’’ అని చెప్పారు. నేను వైట్ హౌస్ కి వెళ్ళి బాబా ప్రసంగం నోట్ చేసుకొని రిపోర్టు చేశాను. మర్నాడు శంకర్ నాయర్ దగ్గరికి వెళ్ళాను. ‘‘బాబా సేఠ్ జీకి ఫోన్ చేశారట. నిన్న వచ్చిన రిపోర్టర్ నే తక్కిన రోజులు కూడా పంపమని అడిగారు. అందువల్ల మీరు ఈ నలభై రోజుల కార్యక్రమం పూర్తిగా రిపోర్ట్ చేసిన తర్వాతే హైదరాబాద్ వెళ్ళాలి. మీ ఆర్డరు నా దగ్గర సిద్ధంగా ఉంటుంది,’’ అని చెప్పారు. అదే విధంగా మొత్తం శిక్షణ తరగతులు పూర్తయ్యే వరకూ వైట్ ఫీల్డ్ కు ప్రతిరోజూ వెళ్ళివచ్చేవాడిని. ఆఫీసువారే కారు ఏర్పాటు చేశారు. చివరి రోజు బాబా తనను కలవమని చెప్పారు. మా కుటుంబ సభ్యులం, మా అన్నగారూ, వదినగారూ వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాం. చాలాసేపు కబుర్లు చెప్పారు. వచ్చే ముందు, ‘‘స్వామీ నేను బదిలీపైన హైదరాబాద్ వెడుతున్నా. మీ సభల కోసమే నెలన్నరగా ఆగాను,’’ అని చెప్పాను. ‘లేదు బంగారూ, నువ్వు బెజవాడ వెడుతున్నావు. హైదరాబాద్ కాదు,’’ అని బాబా అన్నారు. ఆర్డరు సిద్ధంగా  ఉన్నదనే విషయం బాబాకు చెప్పకుండా చిరునవ్వుతో సెలవు తీసుకున్నాను. మర్నాడు శంకర్ నాయర్ దగ్గరికి వెడితే, ‘మిస్టర్ మూర్తీ, మీ కోసం ఎడిటర్, రెసిడెంట్ ఎడిటర్ ఇద్దరూ ప్రయత్నించారు. సహజంగానే ఎడిటర్ మాట నెగ్గింది. అందువల్ల మీరు విజయవాడ వెడుతున్నారు. హైదరాబాద్ కాదు,’’ అని చెప్పాడు. బాబా మాట నిజమైనందుకు నాకు ఆశ్చర్యం కలిగింది. నాకు హైదరాబాద్ రావాలని గట్టిగా ఉంది. కానీ సంపాదకుడి మాటకు ఎదురు చెప్పలేను. ఆయన దగ్గర పని చేయడం ఒక అవకాశంగా భావించి విజవాడ వెళ్ళాను. విజయవాడలో పదేళ్ళు పని చేశాను. వృత్తిరీత్యా మంచి అభివృద్ధి సాధించాను. విజయవాడ అంటే ఇష్టం పెంచుకున్నాను. అక్కడ చాలామంది స్నేహితులైనారు.

విజయవాడ వచ్చిన తర్వాత షిఫ్టు ఇంచార్జిగా పని చేశాను. బ్యానర్ రాయడం నా బాధ్యత. రెంటాల గోపాలకృష్ణగారు ఒక షిఫ్ట్ ఇంచార్జిగా ఉండేవారు. సంపాదకీయాలు కూడా అప్పుడప్పుడు రాసేవారు. దీక్షితులుగారు మొత్తం డెస్క్ పనిని పర్యవేక్షించేవారు. వారిపైన అజంతా ఉండేవారు. కూచిమంచివారి సంపాదకీయాలు వస్తునిష్టంగా ఉండేవి. సరళంగా, సూటిగా, విశ్లేషణాత్మకంగా, ప్రబోధకంగా ఉండేవి. ఉదాహరణకు ఇక్కడ ఆంధ్రప్రభ 29 మార్చి 1979 సంచికలో వెలువడిన సంపాదకీయం చదవండి. అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్టు ఎంత సరళంగా ఉందో చూడండి.

ఎవ‌రి త‌ప్పు?

న్యాయ ప‌రిష్కారం స‌కాలంలో జ‌ర‌గ‌కపోతే అస‌లు న్యాయం జ‌ర‌గ‌నట్లే. ఇందుకు ఎన్న‌యినా దృష్టాంతాలు చూప‌వ‌చ్చు. ఏదో గార‌డీ చేసి ఒక పేద‌వాని పంట భూమిని ఒక మోతుబ‌రి క‌బ్జా చేసుకుంటాడు. న్యాయం జ‌రిపించండి మ‌హా ప్ర‌భూ అంటూ పేద‌వాడు కోర్టుకు వెడ‌తాడు. ఫిర్యాదు చేసిన వ్య‌క్తి ఇక ఒక ఏడాదికి క‌న్నుమూస్తాడ‌న‌గా కోర్టు తీర్పు వెలువ‌డితే ఏమి లాభం? అంత వ‌ర‌కూ ఆ నిర్భాగ్యుడు అడుక్కుతిన‌వ‌ల‌సిందేనా?

మ‌న దేశంలో, ముఖ్యంగా మ‌న రాష్ట్రంలో ఈ ర‌కంగా ర‌జ‌తోత్స‌వాలు, స్వ‌ర్ణోత్స‌వాలు, వజ్రోత్స‌వాలు జరుపుకున్న కేసులు కోకొల్ల‌లు. న్యాయానికి సంబంధించిన వ్య‌వ‌హారాల‌లో జాప్యం విష‌తుల్యం అనే మాట నిజ‌మే అయినా దీనితో మ‌రొక న్యాయ సూత్రం కూడా ముడివ‌డి ఉన్న‌ది. ఏమిట‌ది? కేసు ప‌రిష్కారం కొంచెం ఆల‌స్య‌మైనా ప‌ర‌వాలేదు కానీ నిర‌ప‌రాధికి శిక్ష ప‌డ‌కుండా చూడ‌డం చాలా అవ‌స‌రం. న్యాయ వ్య‌వ‌స్థ ఔన్న‌త్యానికి ఇది గీటురాయి. ఈ ల‌క్ష్యం దెబ్బ‌తిన‌కుండా ఉండాలంటే కేసుల‌ను సావ‌ధానంగా ప‌రిశీలించాల్సి ఉంటుంది. తొంద‌ర ప‌నికిరాదు. న్యాయ‌మూర్తులుకూడా మాన‌వ మాత్రులే. ఎంత స‌దుద్దేశంతో కేసుల‌ను ప‌రిశీలించినా,అప్ప‌డప్పుడు పొర‌పాట్లు జ‌ర‌గొచ్చు. అందుచేత‌, ఒక న్యాయ‌మూర్తి ఇచ్చిన తీర్పును పై స్థాయిలో మ‌రొక‌రు తిరిగి క్షుణ్ణంగా ప‌రిశీలించ‌డానికి అవ‌కాశం క‌ల్పించ‌డం అవ‌స‌రం. అప్పీల్ చేసుకునే హ‌క్కు క‌ల్పించ‌డానికి కార‌ణం ఇదే. ఈ రెండు ష‌ర‌తులూ మంచివే. వాటిని అవ‌శ్యం పాటించ‌వ‌ల‌సిందే. వాటిని కాల‌ద‌న్న‌డం వ‌ల్ల అత్య‌యిక ప‌రిస్థితిలో ఎటువంటి దారుణాలు, వైప‌రీత్యాలు జ‌రిగాయో అంద‌రికీ తెలుసు. న్యాయ‌మూర్తి శ్రీ ఆవుల సాంబ‌శివ‌రావుగారు చెప్పిన‌ట్లు అత్య‌యిక ప‌రిస్థితిలో ఒక్క న్యాయ వ‌వ‌స్థ‌కే గ్ర‌హ‌ణ స్థితి వంటిది దాపురించింది. న్యాయం స్థంభించిపోయిందా అనిపించిన గ‌డ్డుకాల‌మ‌ది. మామూలు ప‌రిస్థితి నెల‌కొన్న ప్ర‌స్తుత త‌రుణంలో పై రెండు సూత్రాల‌కూ భంగం క‌లుగ‌ని రీతిన కేసుల‌ను ప‌రిష్క‌రించ‌డానికి న్యాయ‌స్థానాలు, ప్ర‌భుత్వం, న్యాయ‌వాదులు ఎలా చ‌ర్య‌లు తీసుకోవాలన్న‌ది ప్ర‌శ్న‌.  కోర్టుల‌లో నానాటికీ కేసులు పెరిగిపోతున్నాయ‌నేది నిర్వివాదాంశం. ఈ విష‌యాన్ని రాష్ట్ర ప్ర‌ధాన న్యాయ‌మూర్తి శ్రీ ఎస్. ఓబుల‌రెడ్డి గారు స‌హితం అంగీక‌రించారు. అయితే ఈ స్థితికి బాధ్యులెవ‌రు? న్యాయ‌మూర్తులా? ప్ర‌భుత్వ‌మా? న్యాయ‌వాదులా? కోర్టు ప‌క్షులా? న్యాయ‌మూర్తుల‌కు న్యాయ దృష్టి మెండు. త‌మ‌వాద‌న‌ల‌ను వినిపించ‌డానికి అన్ని ప‌క్షాల‌కూ త‌గినంత అవ‌కాశం క‌ల్పించి,వివిధ అంశాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించి,తీర్పు చెప్ప‌డం వృత్తిరీత్యా న్యాయ‌మూర్తుల ప్ర‌ధాన క‌ర్త‌వ్యం. దీనివ‌ల్ల ఒక్కొక్క‌ప్పుడు కొంచెం ఆల‌స్యం జ‌ర‌గ‌వ‌చ్చు. కానీ న్యాయ‌మూర్తులు కావాల‌ని అదే ప‌నిగా కేసుల‌ను అప‌రిష్కృతంగా ఉంచుతున్నారన‌డం గ‌ర్హ‌నీయం. త‌గిన‌న్ని కోర్టులను ఏర్పాటుచేయ‌క‌పోవ‌డం వారి త‌ప్పా? ఉన్న కోర్టుల ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌కుండా ఉండ‌డం ఎందుకు జ‌రిగింది? అందుకు బాధ్యులెవ‌రు?  ట్రిబ్యున‌ల్స్ కు స‌భ్యుల‌ను నియ‌మించ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ సంస్క‌ర‌ణ‌ల అమ‌లు దెబ్బ‌తింటే అందుకు బాధ్య‌త వ‌హించ‌వ‌ల‌సింది ప్ర‌భుత్వం కాదూ! గాలి వెలుతురు చొర‌ని అద్దె కొంప‌ల్లో కోర్టుల‌ను ఏర్పాటు చేస్తే నిర్వ‌హ‌ణ సామ‌ర్థ్యం దెబ్బ‌తిన‌కుండా ఉంటుందా? ప్ర‌ధాన న్యాయ‌మూర్తి శ్రీ ఓబుల‌రెడ్డి వేలెత్తి చూపిన ఈ విష‌యాలు నిజం కావ‌ని ప్ర‌భుత్వం భావించ‌గ‌ల‌దా?

అయితే, కేసుల ప‌రిష్కారంలో జాప్యం జ‌ర‌గ‌డానికి ఈ లోపాల‌తో పాటు మ‌రికొన్ని కార‌ణాలు కూడా ఉన్నాయి. చ‌ట్టాల‌లో తిక‌మ‌క‌లు ఎక్కువ‌. రాజ్యాంగ అంశాలు కూడా జ‌టిలం. విచార‌ణ విధానం క్లిష్టాతిక్లిష్టం. వీట‌న్నింటిని స‌ర‌ళ‌త‌రం చేస్తే త‌ప్ప కేసుల ప‌రిష్కారంలో జాప్యాన్ని నివారించ‌డం క‌ష్టం. అప్పీళ్ళ సంఖ్య‌ను త‌గ్గించ‌డం స‌త్వ‌ర ప‌రిష్కారానికి మార్గం. బీద‌సాద‌ల‌కు ప్ర‌భుత్వ‌ప‌రంగా త‌గిన చేయూత ల‌భిస్తే త‌ప్ప, న్యాయ‌మ‌నేదానికి అస‌లు అర్థ‌మే ఉండ‌దు. ఖ‌ర్చుల‌ను త‌ట్టుకునే స్తోమ‌తు లేక న్యాయం త‌మ ప‌క్షాన ఉన్నా కేసుల‌ను విర‌మించుకున్న అభాగ్యులు ఎంద‌రో ఉన్నారు. వారికి నిజంగా న్యాయం జ‌రిగిన‌ట్లు భావించ‌గ‌ల‌మా? అందుచేత బీద‌వారికి న్యాయ స‌హాయం అంద‌జేసే ప‌థ‌కాన్ని మ‌రింత విస్తృత‌స్థాయిలో అమ‌లు ప‌ర‌చడం అవ‌స‌రం. న్యాయ వ్య‌వ‌స్థ‌కు అవ‌స‌ర‌మైన సిబ్బందిని ఎంచుకునే అధికారం న్యాయ‌శాస్త్రంలో నిష్ణాతులైన వారికి ఇవ్వ‌డం మంచిద‌న్న సూచ‌న కూడా ఎంతో విలువైన‌ది. ఇందుకొర‌కు జ్యుడిషియ‌ల్ సర్వీస్ అనే పేరుతో ఒక ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌డం  అభిల‌షణీయం. (బుధ‌వారం, 1978 మార్చి 29)

ఆ నాటి హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ ఓబుల రెడ్డి వెలువ‌రించిన అభిప్రాయాల‌కు సమర్థిస్తూ సంపాదకీయం  రాశారు. న్యాయ‌వ్య‌వ‌స్థలో లోపాలను ఎలా దిద్దుకోవాలి అనే దిశ‌గా సూచ‌న‌లు చేశారు. నేటి మార్పులు ఆనాడు కూచిమంచివారు సూచించిన‌వే అనేది ఈ సంపాదకీయం చెప్ప‌క‌నే చెబుతుంది. ఆయన సంపాదకీయాలు మంచి ప్రమాణాలకు ఒరవడి పెట్టేవి. ఆయన కొన్నేళ్ళు పని చేసి విరమించిన తర్వాత సంపాదక బాధ్యతలను పొత్తూరి వెంకటేశ్వరరావుగారు స్వీకరించారు. కూచిమంచివారు ఒక ఇంగ్లీషు పత్రిక నడిపారు. అనంతరం ‘కోస్తావాణి’ పేరుతో రాజమహేంద్రవరం నుంచి ఒక తెలుగుదినపత్రికను నిర్వహించారు. నూటికి నూరుపాళ్ళు పాత్రికేయుడైన సత్యసుబ్రహ్మణ్యంగారు అంతిమ శ్వాస వరకూ జర్నలిజంలోనే కొనసాగారు. ఆయన విలువలకు కట్టుబడిన సంపాదకుల కోవలోకి వస్తారు. భార్య, ముగ్గురు కుమార్తెలు. చివరి ఇద్దరు కుమార్తెలూ జర్నలిజంలో ఉన్నారు.

(జూలై 9 కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యంగారి 95వ జయంతి)

Related Articles

2 COMMENTS

  1. It is excellent. It covers about Sri Kusumanchi contribution to the field of Telugu journalism. His dedication and the quality of editorials are well acknowledged. You gave space to present your entry in to the field of journalism and association with the great personality. It is deserving contribution on the occasion of Sri Kusumanchi 95th birth anniversary.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles