Tuesday, September 17, 2024

సెతల్వాడ్, శ్రీకుమార్ అరెస్ట్ ల వెనుక కక్షసాధింపు ధోరణి

శ్రీకుమార్, సెతల్వాడ్, సంజీవ్ భట్

  • సుప్రీంకోర్టు తీర్పుపైన అమిత్ షా వ్యాఖ్యానించిన వెంటనే అరెస్టులు
  • అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలను వాడుకున్న పోలీసులు

నేరపూరితమైన కుట్రతో సహా ఐపీసీ కింద అనేక సెక్షన్ల ప్రకారం నేరాలు చేశారంటూ హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాడ్, గుజరాత్ మాజీ డీజీపీ ఆర్ బి శ్రీకుమార్ లను అరెస్టు చేసి వారిపై వెనువెంటనే ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం వెనుక పాలకుల కక్షసాధింపు ధోరణి ఉన్నట్టు అనుమానించవలసి వస్తోంది. గోధ్రా దారుణం తర్వాత గుజరాత్ లో చెలరేగిన మతకలహాలలో బాధితుల తరఫున దాఖలైన కేసులను లోతుగా దర్యాప్తు చేయించడంలో ప్రధాన పాత్ర పోషించిన సుప్రీంకోర్టు అనుకోకుండా పోలీసుల చేతిలో ఒక ఆయుధంగా మారడం విశేషం. సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ – ప్రత్యేక దర్యాప్తు బృందం) గుజరాత్ అల్లర్ల విషయంలో నాటి గుజరాత్ ప్రభుత్వం దోషం ఏ మాత్రం లేదంటూ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని శుక్రవారంనాడు సుప్రీంకోర్టు బలపరిచింది. ఈ నిర్ణయం ప్రకటిస్తూ పిటిషనర్లని తప్పు పట్టుతూ అనేక వ్యాఖ్యలు చేసింది. వీటిని ఉపయోగించుకొని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనవైన వ్యాఖ్యలు చేశారు. సెతల్వాడ్, శ్రీకుమార్, ఇతర అధికారులు కావాలని, నరేంద్రమోదీని బదనాం చేయాలన్న దురుద్దేశంతో ఈ కేసును ముగించకుండా కొనసాగిస్తున్నారని అమిత్ షా అన్నారు. నరేంద్రమోదీ గరళకంఠుడనీ, ఇరవై ఏళ్ళుగా ఈ విషాన్ని మింగకుండా, కక్కకుండా తన గొంతులో దాచుకున్నధీశాలి అనీ దేశీయాంగమంత్రి అభివర్ణించారు.

దేశీయాంగమంత్రి వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలలోనే అహ్మదాబాద్ లో రిటైర్ డీజీపీ శ్రీకుమార్ (75 సంవత్సరాల వయస్సు)ను అదుపులోనికి తీసుకున్నారు. యాంటీ టెర్రర్ యూనిట్ నుంచి గుజరాత్ పోలీసులు హుటాహుటిన ముంబయ్ వెళ్ళి హక్కుల కార్యకర్త సెతల్వాడ్ ను అరెస్టు చేశారు. ఇద్దరినీ అయిదు రోజుల రిమాండ్ కు పంపించారు. ఇద్దరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరో ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ ఇప్పటికే జైలులో ఉన్నారు.

బాధితుల హక్కుల కోసం పోరాడినవారిపై పోలీసులు విరుచుకుపడటం హక్కుల కార్యకర్తలకు భయం కలుగజేస్తుంది. అత్యాచారాలకు గురైనవారి తరఫున నిలబడి వాదించే వారే కరువు అవుతారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు జకియా జాఫ్రీ పట్ల నిర్దయను ప్రతిబింబిస్తున్నాయి. 2002 ఫిబ్రవరిలో అహ్మదాబాద్ లోని గుల్బర్గ్ సొసైటీలో జరిగిన నరమేధంలో జకియా భర్త, మాజీ ఎంపీ ఇహషాన్ జాఫ్రీని దుండగులు నిర్దాక్షిణ్యంగా నరికి చంపేశారు.

సెతల్వాడ్ నూ, శ్రీకుమార్ నూ జైల్లో పెట్టి, వారిపైన వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టడం వల్ల హక్కుల కార్యకర్తలలో గుబులు గూడుకట్టుకుంటుంది. నిజానికి సెతల్వాడ్ వంటి కార్యకర్తల కారణంగానే సుప్రీంకోర్టు ఈ విషయంలో వివరంగా దర్యాప్తు చేయించడానికి అవసరమైన అనేక చొరవలు తీసుకున్నది. ఇటువంటి చొరవలలో సిట్ నియామకం ఒకటి. సుప్రీంకోర్టు చొరవ లేకపోతే గుజరాత్ అల్లర్ల బాధితులకు ఎంతో కొంత న్యాయమైనా జరిగి ఉండేది కాదు. అల్లర్లు జరిగినప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా నేటి ప్రధాని నరేంద్రమోదీ ఉన్న సంగతి విదితమే. గోధ్రా దగ్గర సబర్మతి రైలుకు దుండగులు నిప్పు పెట్టిన ఫలితంగా 56 మంది అమాయకులు కాలిమసైపోయారు. అందరూ హిందువులే. ఈ దారుణం జరిగిన వెంటనే గుజరాత్ అంతటా అల్లర్లు మూడు రోజుల పాటు జరిగాయి. దాదాపు వెయ్యిమంది మరణించారు. వీరిలో అత్యధికులు ముస్లింలు. అల్లర్లు జరిగిన వెంటనే మోదీని బర్తరఫ్ చేయాలని నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి తలపోసినట్టు, దాన్ని నాటి ఉపప్రధాని లాల్ కృష్ణ అడ్వాణీ నివారించినట్టు అప్పట్లో కథనాలు వచ్చాయి. రాజధర్మం నెరవేర్చాలంటూ మోదీకి అటల్ జీ హితవు పలికారు. గుజరాత్ అల్లర్ల సందర్భంగా అమిత్ షా కూడా అరెస్టు అయినారు.

నరేంద్రమోదీనీ, ఇతరులనూ నిర్దోషులుగా ప్రకటిస్తూ సిట్ సమర్పించిన నివేదికను సుప్రీంకోర్టు సమర్థించింది. సిట్ నివేదికను తప్పుపడుతూ అల్లర్ల వెనుక విస్తారమైన కుట్రకోణం ఉన్నదంటూ పిటిషనర్లు వాదించారు. దీనిపైన తీర్పు వెలువరిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇలా వ్యాఖ్యానించారు: ‘‘గుజరాత్ రాష్ట్రంలో కొందరు అసంతృప్త అధికారులు, మరికొందరితో కలిసి ఈ కేసు ముగిసిపోకుండా కుండ సలసల కాగుతూ ఉండేవిధంగా ఉంచేందుకు, సంచలనం సృష్టించేందుకు ఈ పిటిషన్లు వేసి ఉంటారు. వారికి ఏదో దురుద్దేశం ఉన్న సంగతి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. న్యాయసంవిధానాన్ని దురుపయోగం చేసిన అటువంటి వారిపైన చట్టబద్ధమైన చర్యలు తీసుకోవలసి ఉంటుంది.’’ కుండను సలసల కాగించింది ఎవరు? సుప్రీంకోర్టు కాదా? సెతల్వాడ్ వంటి హక్కుల కార్యకర్తల పిటిషన్ల ఫలితంగా అల్లర్లకు సంబంధించిన కేసులపైన లోతుగా విచారణ జరింపించింది సుప్రీంకోర్టు మాత్రమే. అది మంచి పనే. వాస్తవానికి శ్రీకుమార్ కు సమర్థుడైన పోలీసు అధికారిగా మంచి పేరు ఉంది. గుజరాత్ డీజీపీగా పని చేయడమే కాకుండా మోదీ ఇష్టపడే అధికారులలో శ్రీకుమార్ ఒకరు. అల్లర్లపైన నివేదికలు సమర్పించేటప్పుడు తనకు నిజమని తోచిన అంశాలను యథాతథంగా నివేదించినప్పటి నుంచి శ్రీకుమార్ కష్టాలు మొదలైనాయి. అప్పటి నుంచి రిటైర్ అయ్యేవరకూ ఒక మారు మూల పోస్టింగ్ లో కాలక్షేపం చేయవలసి వచ్చింది.

పోలీసులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ రెచ్చిపోతున్నారు. వారిని అదుపు చేయవలసిన బాధ్యత కూడా న్యాయస్థానాలదే. హక్కుల కార్యకర్త, పోలీసు అధికారి ఫోర్జరీ చేసినట్టు ఆరోపణలు వచ్చినా, ఇతరత్రా ఆరోపణలు వచ్చినా చట్టప్రకారం నిర్ధారించుకోవలసిందే. చర్యలు తీసుకోవలసిందే. కానీ అమిత్ షా అన్నారు కదా అని పోలీసు వ్యవస్థ శ్రుతిమించి వ్యవహరిస్తే చట్టం చట్టుబండలు అవుతుంది. అన్యాయం విజయవిహారం చేస్తుంది.

Related Articles

1 COMMENT

  1. వేల మందిని చంపి లక్షల మందిని వెళ్లకొట్టిన కాశ్మీరీయత్ గురించి రాసే దమ్ము, ధైర్యం, నిజాయతీ ఎప్పటికి వస్తాయి బ్రదర్ .. ఇస్లాం, క్రిస్టియానిటీ వ్యాప్తి గురించి కోట్ల మంది అమాయకులని చంపిన ప్రపంచ రక్త చరిత్రలు తెలుసుకో, మననం చేసుకో… తప్పు చేసినా ఒప్పుకొని సరిదిద్దుకొనే హిందుమత పయనం ధ అర్ధం చేసుకో మిగతా మతాలతో పోల్చి చూసుకో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles