Friday, July 19, 2024

ఎట్టకేలకు గొటబాయ రాజీనామా, లంకలో శాంతికి సోపానం

పలాయనం చిత్తగించిన గొటబాయ దంపతులు

  • వారంలోగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక
  • అప్పటి వరకూ రణిల్ విక్రమసింఘే కొనసాగింపు
  • వీధులలోకి సైన్యం, శాంతిస్తున్న నిరసనకారులు

శ్రీలంక అధ్యక్షపదవికి గొటబాయ రాజపక్సే గురువారం సాయంత్రం రాజీనామా సమర్పించడంతో ఒక ఘట్టం ముగిసింది. శ్రీలంక సంక్షోభం చల్లారడానికి మార్గం కనిపిస్తోంది. ప్రధాని రణిల్ విక్రమసింఘే కూడా ఆ తానులో ముక్కేననీ, అతడు సైతం రాజీనామా చేయాలనీ శ్రీలంకలో నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. రణీల్ ను నియమించింది గొటబాయ కనుక ఆయనపైన కూడా నిరసనకారులు ఆగ్రహంతో ఉన్నారు. శాంతిభద్రతల పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఏది అవసరమో అది చేయవలసిందిగా రణసింఘే సైన్యాధిపతిని కోరారు. సైన్యం రంగంలోకి దిగింది. నిరసనకారులు అధ్యక్ష భవనం నుంచీ, ప్రధాని నివాసం నుంచీ వైదొలిగారు. తాము శాంతియుతంగా నిరసనోద్యమాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. గాలలాఫేస్ లోనూ, అధ్యక్ష కార్యాలయంలోనూ నిరసన ప్రదర్శనలు కొనసాగుతాయని వారు చెప్పారు. గొటబాయా, ఆయన భార్య, ఇద్దరు బాడీగార్డులతో సహా శ్రీలంక విమానంలో ముందు మాల్దీవులకు పరారైనారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళారు. సింగపూర్ లో సందర్శకుడుగా కొన్ని రోజులు ఉంటారు కానీ శరణం ఇవ్వడం తమ దేశానికి ఆచారం లేదని సింగపూర్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. గొటబాయ, ఆయన భార్య సింగపూర్ నుంచి మరోో దేశం వెళ్ళవచ్చు. రాజపక్సే కుటుంబ పాలన నుంచి శ్రీలంక విముక్తమైంది.

Sri Lanka PM Ranil Wickremesinghe becomes acting president after Gotabaya  Rajapaksa flees to Maldives | World News | Zee News
రణిల్ విక్రమసింఘే

తమిళ సంహారం

మూడు దశాబ్దాలు సాగిన అంతర్యుద్ధం అంతిమ ఘట్టంలో తమిళ తిరుగుబాటు నాయకుడు ఎల్ టీటీఈ అధినేత ప్రభాకరణ్ సహా కొన్ని వేలమంది తమిళులను ఘోరంగా చంపివేయడాన్ని సింహళీయులు మెజారిటీగా ఉన్న శ్రీలంక పౌరసమాజం హర్షించింది. ప్రధాని మహింద రాజపక్సే తనకూ, తన కుటుంబ సభ్యులకూ శాశ్వతంగా అధికారం కొనసాగుతుందని ఆశించాడు. కానీ 2015 ఎన్నికలలో చంద్రికా కుమారతుంగ వ్యూహరచనా సామర్థ్యం వల్ల ప్రతిపక్ష కూటమి చేతుల్లో రాజపక్సే సోదరులు ఓడిపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత కూటమిలో చీలికలు రావడంతో కూటమి ప్రభుత్వం పడిపోయింది. గొటబాయ రాజపక్సే 2019 నవంబర్ లో అధ్యక్ష పదవిని స్వీకరించారు. 2020 ఆగస్టులో జరిగిన ఎన్నికలలో రాజపక్సే సోదరులకు ఘనవిజయం లభించింది. చంద్రికా కుమారతుంగ రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక తమకు తిరుగులేదనీ, శ్రీలంక సమాజం తమ నాయకత్వాన్ని ఆమోదించిందనీ, తమిళులు మళ్ళీ తలఎత్తే అవకాశం లేకుండా చితికిపోయారనీ రాజపక్సే సోదరులు భావించారు. అధికారమదాంధకారం తలకెక్కింది. కన్నూమిన్నూ ఎరగకుండా వ్యవహరించడం ప్రారంభించారు.

అన్ని పదవులూ వారికే

గొటబాయ అధ్యక్షుడు. మహింద ప్రధాని. వారి సోదరుడు బసిల్ ఆర్థిక మంత్రి, మహింద తనయుడు నమల్ మరో మంత్రి, మహింద మరో సోదరుడు చమల్ నీటిపారుదల మంత్రి, అతడి కుమారుడు శేషేంద్ర వ్యవసాయశాఖలో సహాయమంత్రి. మహీంద బావగారు నిశాంత్ విక్రమసింఘే శ్రీలంక ఎయిర్ లైన్స్ సంస్థకి అధిపతి. మహింద మరో పుత్రుడు యోషిదా ప్రధాని కార్యాలయంలో సిబ్బందికి ప్రధానాధికారి. ఈ విధంగా రాజపక్సే కుటుంబం పదవులు పంచుకొని రాజ్యం చేస్తోంది. అధికార మదంతో విర్రవీగుతోంది.  

రాజపక్సే సోదరుల నాయకత్వంలోని లంక ప్రభుత్వం చైనాకు చేరువైంది. భారీ ఆర్థిక సహాయం అందుకున్నది. అన్నీ రుణాల రూపంలోనే. ప్రాథమిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన భారీ ప్రాజెక్టులకోసమే. మహీంద నియోజకవర్గంలో కొన్ని లక్షల డాలర్లు వినియోగించి నిర్మిస్తున్న హంబన్ టోటా రేవు ఒక తెల్ల ఏనుగు వంటిది. రుణాలు తీర్చలేమని గొటబాయ ప్రకటించారు. తేలిక వాయిదాలలో రుణాలను చెల్లించే ఏర్పాటు చేద్దామని చైనా నమ్మబలికింది. అంతిమంగా శ్రీలంకను ఒక సైనిక స్థావరంగా చేసుకొని ఇండియా గుండెల్లో నిద్రపోవాలని చైనా సంకల్పం. లంక సంక్షోభం క్రమంగా క్షీణించి నిరసన జ్వాలకు దారి తీసింది.

Sri Lanka: Gotabaya Rajapaksa resigns after fleeing Sri Lanka - BBC News
సంతోషంతో చిందులేస్తున్న కొలంబో ప్రజలు

దెబ్బతిన్న పర్యాటకం, చితికిపోయిన ఆర్థికం

అసలే కోవిద్ కారణంగా పర్యాటకం దెబ్బతిన్నది. పర్యాటక రంగం నుంచి వచ్చే రాబడి శ్రీలంకకు ప్రధాన ఆదాయవనరు. అది కాస్తా ఆగిపోవడంతో పరిస్థితి తలకిందులయింది. ఒకప్పుడు ఆసియా దేశాలలో, ముఖ్యంగా దక్షిణాసియాలో శ్రీలంక చాలా అభివృద్ధి చెందిన దేశంగా ఉండేది. తలసరి ఆదాయం ఎక్కువ. ఆరోగ్యం, విద్య వంటి రంగాలలోని సూచీలు బాగుండేవి. కళకళలాడుతున్న శ్రీలంక తమిళుల తిరుగుబాటుతో దెబ్బతిన్నది. తమిళ సంహారం కోసం కోట్లాది డాలర్ల ఖర్చు చేయడం, కోవిద్ మహమ్మారి సోకడంతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ తలకిందులయింది. రాజపక్సే సోదరుల తలపొగరు విధానాల వల్ల ఆర్థిక స్థితి కుదేలయింది. పన్నులు తగ్గించడంలో అసలే ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక వ్యవస్థ దారుణంగా డీలాపడిపోయింది. ఖజానాకు రాబడి పూర్తిగా తగ్గింది. వ్యవసాయరంగాన్ని దెబ్బతీసేఅతితెలివి చర్యలకు రాజపక్సే సోదరులు బరితెగించారు. ఎరువులూ, చీడపీడ నివారణ మందులూ వాడకుండా ఆర్గానిక్ సేద్యం చేయాలంటూ హుకుం జారీ చేశారు. ఎరువుల, రసాయనిక మందుల దిగుమతులను నిలిపివేశారు. దాంతో వ్యవసాయ దిగుబడి దారుణంగా దెబ్బతిన్నది. లంకేయుల ఆహారంలో ప్రధానమైన బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నిత్యావసర వస్తువులు  ఆకాశమార్గం పట్టాయి. శ్రీలంక ప్రజలు నిత్యావసర వస్తువులు లేక, పెట్రోల్ లేక, పాలు లేక, ఆహారపదార్థాలు లేక నెలల తరబడి అలమటిస్తున్నారు. నేనూ, మరికొందరు మిత్రులం ఏప్రిల్ మొదటివారంలో శ్రీలంకలో నాలుగు రోజులు పర్యటించాం. అప్పుడు పరిస్థితి బాగా లేదని గ్రహించాం.  నిరసన ఇంత పెద్ద ఎత్తున ఎగిసిపడుతుదని కానీ, మంత్రులను వెంటబడి తరుముతారనీ కానీ, గొటబాయి దేశాన్ని వదిలి పారిపోతాడని కానీ ఊహించలేకపోయాం. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నశ్రీలంకలో ఈ రోజు సెంట్రల్ బ్యాంకులో 25 మిలియన్ల విదేశీమారక ద్రవ్యం మాత్రమే ఉన్నది. శ్రీలంకలో నెల గడవాలంటే బిలియన్ డాలర్లు అవసరం. 51 బిలియన్ డాలర్లు అప్పులున్నాయి. చైనా మిత్రుల ఆదుకుంటారని రాజపక్సే సోదరులు ఆశించారు. ఇండియా మూడున్నర బిలియన్ డాలర్లు సహాయం చేసింది. ఇది సముద్రంలో నీటిబొట్టు వంటిది. ఈ రకంగా రాజపక్సే శకం ముగిసింది. రణిల్ విక్రమసింఘే కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వైదొలుగుతానని స్పష్టం చేశారు. పరిస్థితి పూర్తిగా చేజారుతుందేమోనని ప్రతిపక్ష నాయకులు కూడా భయపడుతున్నారు. నిరసనకారులలో తీవ్రవాదులూ, ఫాసిస్టుశక్తులూ ఉన్నారనీ, వారు అధికారంకోసం అంగలార్చుతున్నారనీ, వారి ఆటకట్టించాల్సిన అవసరం ఉన్నదనీ రణిల్ విక్రమసింఘే, ప్రతిపక్ష నాయకులు కూడా భావిస్తున్నారు. వారం రోజుల్లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని శ్రీలంక పార్లమెంటు స్పీకర్ మహింద యాప అజేయవర్దనే అన్నారు.

ఐఎంఎఫ్ రుణం

ఐఎంఎఫ్ రుణం కోసం గొటబాయ మొదట్లో ప్రయత్నించలేదు. అప్పు అడుగుతే ఆర్థికవిధానాలలో అవకతవకల గురించి ప్రశ్నిస్తారని గొటబాయ జంకాడు. ఇప్పుడు అప్పు కోసం దరఖాస్తు ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్  (ఐఎంఎఫ్) పరిశీలనలో ఉంది. ఆ అప్పు రావడానికి చాలా మాసాలు పడుతుంది. వారు దరఖాస్తును పరిశీలించాలి, సందేహాలు తీర్చుకోవాలి, ఆ తర్వాతనే అప్పు మంజూరు చేయాలి. ఈ లోగా పాలు, తిండిపదార్థాలు, పెట్రోలు, మందులు దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వానికి విదేశీమారక ద్రవ్యం అవసరం. చైనా ఇస్తుందా? అమెరికా ఇస్తుందా? యూరప్ దేశాలు ఇస్తాయా? ఇండియా ఇవ్వగలదా? ఇవన్నీ ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్నలు. వారంరోజుల్లో ప్రతిపక్షాలు, అధికార పక్షం కలిసి ఎన్నుకునే ప్రభుత్వం నిర్వర్తించవలసిన తక్షణ కర్తవ్యాలు ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం, నిరసనకారులను శాంతపరిచి ఇళ్ళకు పంపించడం, శాంతి, భద్రతల పరిస్థితిని దారిలో పెట్టడం, టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవడం.

The chief. The terminator. The bodyguard: Meet Sri Lanka's powerful  Rajapaksa family - Times of India
శక్తిమంతమైన కుటుంబం: మహింద, గొటబాయ రాజపక్సే

ఒకే ఒక కుటుంబం కారణంగా సంక్షోభం

ఒక కుటుంబం అహంకారం వల్లా, మైనారిటీల పట్ల వివక్ష కారణంగా, అర్థంపర్థం లేని ఆర్థిక విధానాలు అమలు చేయడం వల్లా, వ్యవసాయరంగాన్ని స్వయంగా నీరుగార్చడం వల్లా కొన్నేళ్ళ కిందటి వరకూ అన్ని విధాలు బాగున్న దేశం చిరిగిన విస్తరిలా తయారయింది. మళ్ళీ కుదుట పడాలంటే రాజకీయ పక్షాలు నడుం బిగించాలి, కొత్త వ్యవస్థలను నిర్మించుకోవాలి, సరికొత్త విధానాలు అనుసరించాలి. ప్రజల ఆకాంక్షలు ఏమిటో తెలుసుకొని వాటికి అనుగుణ్యమైన విధానాలు రూపొందించుకోవాలి. అవినీతిపరులనూ, అహంకారులనూ, స్వార్థపరులనూ దరిచేరనివ్వకుండా రాజకీయాలను ప్రక్షాళన చేయాలి. రాజపక్సే రహిత సమాజాన్ని రూపొందించాలి.  అప్పుడే శ్రీలంకలో శాంతి పరిఢవిల్లుతుంది. పర్యాటకం మళ్ళీ రెక్కలు తొడుగుకుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  

చైనాతో జాగ్రత్త!

చైనాపైన అధికంగా ఆధారపడకుండా స్వశక్తిపైనే వ్యవహారం చేయాలి. శక్తికి మించిన అప్పులు చేసి అవసరం లేని భారీ ప్రాజెక్టుల నిర్మాణం తలపెట్టకూడదు. భారత దేశానికి చెందిన పెట్టుబడిదారీ సంస్థలు కూడా శ్రీలంకవైపు చూడకుండా నిగ్రహించుకోవాలి. ఏ రంగంలోనైనా భారీ ప్రాజెక్టులను తలకెత్తుకోవాలన్న ఆలోచనకు స్వస్తి చెప్పాలి. రాజపక్సే కుటుంబ సభ్యుల పరారీకి భారత్ సాయం చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదానీ కారణంగా భారత్ పట్ల శ్రీలంక వాసులలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ అనుమానాలను తొలగించి శ్రీలంకతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచుకునేందుకు భారత్ నిజాయితీగా ప్రయత్నించాలి. ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలకు అగ్రతర ప్రాధాన్యం ఇవ్వాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles