Sunday, January 29, 2023

బుల్డోజర్ పాలన కోర్టు ధిక్కారం

ఉత్తర ప్రదేశ్ లో శాంతిభద్రతల పరిరక్షణకు బుల్డోజరే ఆయుధమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. ప్రయాగరాజ్ (అలహాబాద్)లో ఒక ముస్లిం రాజకీయ నాయకుడు మహమ్మద్ జావెద్ ‘అక్రమ’ కట్టడమని చెబుతున్న నివాసాన్ని బుల్డోజర్ ధ్వంసం చేసింది. ఆ ఇల్లు అతని భార్య పేరు మీద ఉన్నట్టూ, ఆమె క్రమం తప్పకుండా ఇంటిపన్నూ, నీటి పన్నూచెల్లిస్తున్నట్టూ పత్రికలు స్పష్టం చేస్తున్నాయి. జావెద్  బీజేపీ ప్రవక్త నూపుర్ శర్మ ఒక టీవీ చానల్ లో మహమ్మద్ ప్రవక్త పై చేసిన వ్యాఖ్యాలకు నిరసనగా అలహాబాద్ లో ఈ నెల 10వ తేదీన జరిగిన అల్లర్ల వెనుక ఉన్నాడని నిర్ధారించి అందుకు జరిమానాగా అతడి ఇంటిని ధ్వంసం చేయించారు. ఇదేదో ఘనకార్యంగా యోగీ ఆదిత్యనాథ్ చెప్పుకుంటున్నారు. సంఘవిద్రోహుల పట్ల తన ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నారనడానికి  ఇది నిదర్శనమని చెప్పుకుంటున్నారు. సంఘ విద్రోహి అని ఆరోపణ చేసి, దాన్ని నిర్ణయించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటే, సంఘవిద్రోహి అని నిర్ణయించి అతని నివాసాన్ని నేలమట్టం చేయాలని కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తే ఇంక న్యాయవ్యవస్థ ఎందుకు? ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాధికారులు రొమ్ములు విరుచుకుంటూ ప్రతి శుక్రవాం తర్వాత శనివారం వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. ధర్మంగా, న్యాయంగా వ్యవహరించవలసిన ప్రభుత్వాలూ, ప్రభుత్వాలను నడిపించే రాజకీయ నాయకులూ, నిర్వహించే అధికారులూ ఈ విధంగా ఒక మతానికి వ్యతిరేకంగా బుద్ధిపూర్వకంగా వ్యవహరిస్తుంటే ఈ దేశం ఎటుపోతోందో ఎవరికి వారే ఆలోచించుకోవాలి. సహ్రాన్ పూర్ లో మరి ఇద్దరు నిందితుల ఇళ్ళు కూడా ఇదే రకమైన ఆరోపణలపైన కూలగొట్టారు. జూన్ 3న జరిగిన హింసాకాండలో ప్రమేయం ఉన్నదనే ఆరోపణపైన కాన్పూర్ లో నిందితుడి సమీప బంధువు ఇంటిని కూల్చివేయించారు.

ఇదంతా ఒక క్రమం ప్రకారం జరుగుతున్న అక్రమం. కొంతమందిని ఎంపిక చేసుకొని వారిని అణచివేయడానికీ, వారి నోళ్ళు మూయించడానికీ వారి నివాసాలను కూల్చేవేయడం అనే ప్రక్రియలో బుల్డోజర్లను సాధనాలుగా వినియోగించుకుంటున్నది ప్రభుత్వం. బుల్డోజర్ పంపడానికి ముందుగా నోటీసు ఇవ్వడం కానీ, ఆ నోటీసుకు ప్రత్యుత్తరం వచ్చే వరకూ వేచి ఉండటం కానీ లేదు. నోటీసులకు పాత డేటు వేసి, ఇంటి గుమ్మం ముందు అతికించిన కొన్నిగంటలకు బుల్డోజర్లు వచ్చేస్తున్నాయి. ఇది అక్రమమనీ, రాజ్యాంగ విరుద్ధమనీ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోవింద్ మాథుర్ ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. పోయిన ఎన్నికలలో బీజేపీ రెండో సారి గెలిచి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. నాటి ఎన్నికల ప్రచారంలోనే యోగిని బుల్డోజర్ బాబా అని పిలిచారు. 2019 ఎన్నికలలో బీజేపీ జాతీయ స్థాయిలో రెండో విడత గెలిచినప్పటి నుంచి విధానాలలో, వైఖరిలో మార్పు వచ్చింది.   బుల్డోజర్ వినియోగంలో దేశంలోని ముఖ్యమంత్రులకూ, హోమ్ మంత్రులకూ యోగి ఆదిత్యనాథ్ ఆదర్శంగా నిలిచారు. దిల్లీలోని జహంగీర్ పురిలోనూ, మధ్యప్రదేశ్ లోనూ బుల్డోజర్ విద్వంసాలు జరిగాయి. దీనిపైన ప్రజలు కోర్టులలో పిటిషన్లు దాఖలు చేశాయి. కోర్టులకు వేసవి సెలవలుంటాయి. పిటిషన్ల కు వెంటనే స్పందించాల్సిన అవసరం కోర్టులకు లేదు. స్పందించకపోతే ప్రశ్నించేవారు లేరు. గంటలలో బుల్డోజర్లు వచ్చి నివాసంలో ఉన్నవారినీ, వారి సమాన్లనూ రోడ్డు మీద పడవేస్తున్నాయి. కోర్టులు పిటిషన్లకు వారాలైనా, మాసాలైనా స్పందించవు. ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ కానీ, బీఎస్ పీ కానీ, కాంగ్రెస్ కానీ తగినంత వేగంగా రంగంలోకి దిగవు. యూపీలో రెండో సారి బీజేపీని గెలిపించినందుకు ప్రజలు బుల్డోజర్ సంస్కృతికి అలవాటు పడవలసి వస్తున్నది.  ఈ సంస్కృతికి బాధితులు బీజేపీ అభిమానులు కాకపోవచ్చు కానీ వారు కూడా ఈ దేశం ప్రజలే అని గుర్తుపెట్టుకోవాలి. వారికి రాజ్యంగం రక్షణ కల్పించాలి. ఇందుకు కోర్టులు చురుకుంగా, నిర్ద్వంద్వంగా పని చేయాలి. ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ బుల్డోజర్ల వినియోగంపైన ఆంక్షలు విధించాలి. పోలీసులు కేసు పెడితే న్యాయస్థానాలు ఏళ్ళూపూళ్ళూ అయినా తేల్చవు కనుక వారు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. పోలీసులకు ప్రభుత్వాల మద్దతు ఉంటున్నది. రాజ్యాంగంలో, న్యాయస్థానాలలో, చట్టపాలనలో విశ్వాసం ఉన్నవారు బుల్డోజర్ సంస్కృతిని వ్యతిరేకించాలి. బుల్డోజర్  పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే. బుల్డోజర్ రాజ్యాంగబద్ధం కాదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles