Sunday, September 15, 2024

అమిత్ షాతో చంద్రబాబునాయుడు భేటీ ఫలితం ఏమిటి?

  • తెలంగాణలో బీజేపీ, టీడీపీ పొత్తు ఉంటుందా?
  • మోదీ, అమిత్ షాలు గతాన్ని విస్మరిస్తారా?
  • ఎవరి ప్రయోజనాలు ఏమిటి? ఎవరి వ్యూహాలు ఏమిటి?

తెలుగుదేశం అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడితో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా శనివారంనాడు ఢిల్లీలో భేటీ అయ్యారు. వారిద్దరూ 45 నిమిషాలపాటు చర్చించుకున్నారు. ఏమి చర్చించుకున్నారో అటు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ చెప్పడం లేదు. ఎవరికి వారు ఊహించుకోవలసిందే.

అసలు బీజేపీ నాయకులు చంద్రబాబునాయుడితో భేటీకి అంగీకరించడమే విశేషం. దాదాపు అయిదేళ్ళ కిందట బీజేపీ నాయకత్వంలోని ఎన్ డీఏ కూటమి నుంచి బయటికి వచ్చి, కాంగ్రెస్ తో చేతులు కలిపిన చంద్రబాబునాయుడు ప్రధాని మోదీని నిశితంగా విమర్శించారు. అప్పటి ఆయన అంచనా 2019 ఎన్నికలలో బీజేపీ ఓడిపోతుందనీ, కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనీ. అంచనా ఘోరంగా తప్పింది. 2019 ఎన్నికలలో బీజేపీ అనూహ్యంగా 330 లోక్ సభ స్థానాలు గెలుచుకోవడమే కాకుండా చంద్రబాబునాయుడు నాయకత్వంలోని టీడీపీ 175 స్థానాలు గల ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 23 స్థానాలకే పరిమితమైంది. ఇది కూడా అనూహ్యమే. టీడీపీతో పాటు కాంగ్రెస్ కూడా ఘోరంగా దెబ్బతిన్నది. అప్పటి నుంచి మోదీతో, షాతో మాట్లాడే అవకాశం కోసం చంద్రబాబునాయుడు ఎదురు చూస్తున్నారు.

అంచనాలు తప్పితే అంతే సంగతులు

రాజకీయాలలో తొందరబాటు, సహనం, వ్యూహం, పోరాటస్ఫూర్తి అన్నీ ఉండాలి. చంద్రబాబునాయుడిలో ఈ లక్షణాలు అన్నీ పుష్కలంగా ఉన్నాయి. అంచనాలపైన ఆధారపడి అవకాశవాద రాజకీయాలు చేసినప్పుడు అవి విఫలమై బెడిసికొట్టే ప్రమాదం ఉన్నది. ఇది తెలిసే రాజకీయ నాయకులు రిస్కు తీసుకుంటారు. చంద్రబాబునాయుడికి రిస్కు తీసుకోవడం కొత్త కాదు. అదొక సరదా. లేకపోతే 2014లో గెలిచే అవకాశాలు బొత్తిగా లేని శాసనమండలి సభ్యుడికోసం ఒక టీఆర్ఎస్ ఎంఎల్ఏని కొనుగోలు చేసే ప్రయత్నం చేసి దొరికిపోతారా? 2004లో ఎన్నికలను ముందుకు జరిపించి ఆయన దెబ్బతినడమే కాకుండా వాజపేయి అధికార కాలాన్ని కూడా కత్తిరించారు. అందుకు కారణం ఏమంటే అలిపిరిలో నక్సలైట్లు జరిపిన దాడిలో తాను తృటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డందుకు ప్రజలు సానుభూతితో ఉన్నారనే అంచనా. ఇందుకు తెలుగుదేశం నాయకులు స్కూళ్ళ యాజమాన్యాలతో మాట్లాడి విద్యార్ధినీవిద్యార్థులకు పూలు ఇచ్చి చంద్రబాబునాయుడి దగ్గరికి పంపించడం కారణం. ఇది తన మనుషులు ఏర్పాటు చేసిన పరామర్శ అని గ్రహించకుండా నిజంగానే జనంతో తన పట్ల సానుభూతి అమితంగా ఉన్నదని చంద్రబాబునాయుడు భ్రమించారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగారు. కేంద్రంలో బీజేపీ ఓడిపోయింది. రాష్ట్రంలో టీడీపీ పరాజయం పొందింది.

1999లో బీజేపీతో చేతులు కలపడానికి ముందు చంద్రబాబునాయుడు అంచనా నిజమైంది. బీజేపీ గెలుస్తుందని అంచనా వేశారు. అప్పటి వరకూ ఉన్న యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ పదవినీ, వామపక్షాల స్నేహాన్నీ, జనతాదళ్ తో పొత్తునూ సకలం వదులుకొని బీజేపీతో పొత్తుకు సిద్ధమైనారు. 1996 లోక్ సభ ఎన్నికలలో వామపక్షాలతో పొత్తు పెట్టుకొని పోరాడిన టీడీపీ 1999 ఎన్నికలలో బీజేపీతో పొత్తుపెట్టుకొని శాసనసభ ఎన్నికలలోనూ, లోక్ సభ ఎన్నికలలోనూ పోటీ చేసింది. సత్ఫలితాలు పొందింది. అంతకు ముందు 1994లో చంద్రబాబునాయుడు అంచనా, ఆయన రాజకీయ గురువు రామోజీరావు (ఈనాడు అధిపతి) అంచనా తప్పాయి. ఎన్ టీ ఆర్, లక్ష్మీపార్వతి 1994 ఎన్నికలకు ముందు తన చికోటీ గార్డెన్ నివాసానికి వెళ్ళినప్పుడు వారితో ‘‘మీకు అత్తెసరు సీట్లు వస్తాయి. గెలిచినా కొద్ది తేడాతోనే. చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అంటూ రామోజీరావు చెప్పారు. కానీ ఆ ఎన్నికలలో ఎన్ టీఆర్ నాయకత్వంలోని టీడీపీకి ఎవ్వరూ ఊహించని విధంగా అపూర్వమైన మెజారిటీ సిద్ధించింది.  ఆ తర్వాత తొమ్మిది మాసాలకే ఎన్ టీఆర్ పదవీచ్యుతుడైనారు. అది వేరే ముచ్చట.

తన అంచనాలు 2004లో తప్పిన తర్వాత చంద్రబాబునాయుడు బీజేపీకో దండం పెట్టి వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు. 2009 ఎన్నికలలో టీఆర్ఎస్ తో కూడా సర్దుబాటు చేసుకున్నారు. ఓడిపోయారు. రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ కు శాసనసభలో అత్తెసరు (వైఎస్ మాటలలోనే) మార్కులు వచ్చినప్పటికీ లోక్ సభ స్థానాలలో 33 ను కాంగ్రెస్ గెలుచుకున్నది. 2009 సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ దుర్మరణం, అనంతరం జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు,  సోనియా పిలిచి ఓదార్పు యాత్రలు వద్దనడం, జగన్ కాంగ్రెస్ నుంచి నిష్క్రమించి సొంత కుంపటి పెట్టుకోవడం విదితమే. 2014లో రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత ఎన్నికలు జరిగాయి.

అప్పుడు మళ్ళీ వామపక్షాలకు జెల్లకొట్టి బీజేపీతో, జనసేనతో చేతులు కలిపిన చంద్రబాబునాయుడు ఎన్నికలలో గెలిచి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కేంద్రంలో అశోక్ గజపతిరాజు మంత్రిగా ఉన్నారు. చంద్రబాబునాయుడు పదేళ్ళ విరామం తర్వాత అయిదేళ్ళ పాటు మళ్ళీ చక్రం తిప్పారు. పోలవరం తానే నిర్మిస్తానన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ నయమని భావించారు. అంతా బాగానే ఉంది. కానీ ఎందుకో బీజేపీ 2019లో ఓడిపోతుందని చంద్రబాబునాయుడు అంచనాకు వచ్చారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. కాంగ్రెస్ తో చేతులు కలిపారు. ఎన్ టీ ఆర్ ఆత్మ క్షోభించి ఉంటుంది. అయినా పర్వాలేదు  కానీ అంచనా తప్పింది. దిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మెడలో శాలువా కప్పి వచ్చారు. లక్నో వెళ్ళి అఖిలేష్ యాదవ్ నూ, కొల్ కతా వెళ్లి మమతాబెనర్జీనీ, ముంబయ్ వెళ్ళి శరద్ పవార్ నీ కలిసి వచ్చారు.  నరేంద్రమోదీని అనరాని మాటలు అన్నారు. ఆయన ఉగ్రవాది అన్నారు. భార్యనే ఏలుకోలేని మనిషి దేశాన్ని ఏమి ఏలుతారంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల పోరాటంలో ఉన్న అస్త్రాలన్నీ ప్రయోగించారు. పోరాటంలో వెనుకంజవేసే ప్రసక్తి లేదు. మోదీ, అమిత్ షా అవాక్కయ్యారు. జీవితంలో మళ్లీ టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని అమిత్ షా ప్రతిజ్ఞ చేశారు. చంద్రబాబునాయుడికి ‘యూటర్న్ బాబు’ అని పేరు పెట్టారు.

నిజంగానే కాంగ్రెస్ తో కూడా పొత్తుపెట్టుకోవడంతో చంద్రబాబునాయుడు ఒకానొక రికార్డు స్థాపించారు. డీఎంకె, ఏఐఏడీఎంకె, సమాజ్ వాదీ పార్టీ, బహుజనసమాజ్ పార్టీ, టీఎంసీ లాగానే టీడీపీ కూడా బీజేపీతోనూ, కాంగ్రెస్ తోనూ పొత్తుపెట్టుకున్న పార్టీల జాబితాలో చేరిపోయింది. కాంగ్రెస్ కు పాతరవేయడానికే పార్టీ పెట్టిన ఎన్ టీఆర్ లేరు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడమే తన విధానం అని న్యాయస్థానంలో సైతం చెప్పిన రామోజీరావు ఉన్నారు. కానీ మిన్నకున్నారు. ఈ దేశంలో ఒక్క బీజేపీ, కాంగ్రెస్ మినహా తక్కిన అన్ని పార్టీలూ రెండు జాతీయ పార్టీలతో ఎప్పుడో ఒకప్పుడు పొత్తులు పెట్టుకున్నవే. మిత్రపక్షాలుగా కూటములలో చేరి అధికారం పంచుకున్నవే.

నాలుగేళ్ళుగా చంద్రబాబునాయుడు ఎదురు చూపులు

కడచిన నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబునాయుడు సహనంతో  ఎదురు చూస్తున్నారు. మోదీ, అమిత్  షా ల దగ్గరి నుంచి పిలుపు వస్తుందని ఆశిస్తున్నారు. ఇందుకోసం ఇద్దరు భృత్యుల్ని-రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరినీ, సీఎం రమేష్ నూ, బీజేపీలోకి పంపించారు. వీరితో పాటు మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీలోకి 20 జూన్ 2019 వెళ్ళారు. కాలయాపన లేదు. టకటకా నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడం. కాంగ్రెస్ పొత్తులో ఎన్నిన్నికలు ఓడిపోయిన కొద్ది రోజులకే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వలసవెళ్ళారు.  కేసుల గొడవ తప్పుతుందని కొంతా, తమ నాయకుడు చంద్రబాబునాయుడు ప్రయోజనాలకోసం కొంతా వారు బీజేపీలో ప్రవేశించి తమ ఆట తాము ఆడుతున్నారు. వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఎట్లాగైనా నరేంద్రమోదీతో చంద్రబాబునాయుడు సమావేశం ఏర్పాటు చేయడం వారి బాధ్యత. వారు ఎంత ప్రయత్నించినా నరేంద్రమోదీ మెత్తబడలేదు. కానీ సహనం ఫలితాలను ఇచ్చి తీరుతుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల రూపంలో అవకాశం వచ్చింది.

రాబోయే 2024 ఎన్నికలలో బీజేపీ దాదాపు ఒంటరి. అకాలీదళ్, జేడీ(యూ) నిష్క్రమించిన అనంతరం బీజేపీకి గట్టి మిత్రపక్షం అంటూ లేదు. చిన్నాచితకా పార్టీలు ఉన్నాయి కానీ ఒకటి, రెండు రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల పార్టీ లేదు. పైగా అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రాల చుట్టూ తిరిగి మద్దతు సమీకరిస్తున్నారు. రేపు రాజ్యసభలో దిల్లీ అధికారయంత్రాంగంపైన అదుపుకోసం కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్సు (సుగ్రీవాజ్ఞ)ను బిల్లురూపంలో సభలో ప్రవేశపెట్టి చట్టం చేయాలన్న బీజేపీ సంకల్పం నెరవేరకుండా చేసేందుకు కేజ్రీవాల్ అందరినీ కలుపుకొని పోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ఇతమిత్థంగా ఏమీ చెప్పలేదు కానీ కాంగ్రెస్ మిత్ర పక్షాలైన డీఎంకే, జేడీయూ, జేఆర్డీ, జేఎంఎం కేజ్రీవాల్ ను బలపరిచేందుకు ఒప్పుకున్నాయి. కాంగ్రెస్ కు చెందిన దిల్లీ, పంజాబ్ నాయకులు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ కి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించవలసి రావచ్చు. అటువంటి పరిస్థితులలో టీడీపీ దగ్గర మిగిలిన ఇద్దరు  రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీకి అవసరమే. 2019 జూన్ లో టీడీపీ దగ్గర ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఆ నెలలో నలుగురు సభ్యులు బీజేపీ లో  చేరిపోయారు. చంద్రబాబునాయుడు ప్రోత్సాహంతోనే వారు బీజేపీలో చేరినట్టు అభిజ్ఞవర్గాల భోగట్టా. ఆ ఇద్దరు సభ్యుల మద్దతు కోసం అమిత్ షా ఇన్ని మెట్లు దిగి వచ్చారని అనుకోవడం పొరబాటు అవుతుంది.

కర్ణాటకలో బీజేపీ బేజారు, తెలంగాణలో తగ్గిన జోరు

కర్ణాటకలో బీజేపీ బేజారైన తర్వాత తెలంగాణలో ఆ పార్టీ జోరు తగ్గింది. అంత వరకూ తెలంగాణలో మంచి ఊపు మీద ఉన్న బీజేపీ కాంగ్రెస్ కంటే ముందంజలో ఉన్నదనే అభిప్రాయం కలిగించింది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తెలంగాణలో కాంగ్రెస్ కు వరంలాగా కలిసి వచ్చింది. ఖమ్మంజిల్లా నాయకుడు, లోక్ సభ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబ్ నగర్ నాయకుడు జూపల్లి కృష్ణారావులు బీజేపీలో చేరుతామని సంకేతాల పంపిస్తూ ఊరించి చివరికి రామని చెప్పివేశారు. చేర్పుల కమిటీ అధినేత ఈటల రాజేంద్ర చేతులెత్తేశారు. అసలు ఈటల విషయమే ప్రశ్నార్థకంగా తయారయింది. బీజేపీలో చేరిన నాయకులు ఎవ్వరూ సంతోషంగా లేరు. ఈటల రాజేంద్రకూ, బీజేపీ తెలంగాణ శాఖాధ్యక్షుడు బండి సంజయ్ కూ  పడటం లేదని పుకార్లు వినిపిస్తున్నాయి. మొత్తంమీద బీజేపీలో చేరాలనే మోజు తగ్గింది. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరితేనే బాగనే ఆలోచన చేస్తున్నారు. బీజేపీకి టీఆర్ఎస్ కీ మధ్య అప్రకటిత మైత్రి ఉన్నదనే ఆరోపణ చెలామణిలో ఉంది. అందుకు కవితను అరెస్టు చేయకపోవడమే నిదర్శనమని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రత్యర్థులు వాదిస్తున్నారు. మొత్తం మీద ఇతర పార్టీల నుంచి వ్యక్తులకు తమ పార్టీలో చేర్చుకోవడం, వారికి తమ పార్టీలో మొదటి నుంచీ ఉన్నవాళ్ళకు పడకపోవడం, తలనొప్పులు రావడం కంటే ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని బీజేపీ కేంద్ర నాయకత్వం (అంటే మోదీ, షా) ఆలోచిస్తున్నట్టు వినికిడి. అయితే, ఎట్లాగైనా బీఆర్ఎస్ ను ఓడించి, కేసీఆర్ ను గద్దె దింపాలని పట్టుదలతో ఉన్న నాయకులు బీజేపీ కంటే కాంగ్రెస్ నయం అనే నిర్ణయానికి వచ్చారు. భారత్ జోడో పాదయాత్ర తర్వాత రాహుల్ గాంధీ రేటింగు పెరగడం, దేశవ్యాప్తంగా 2019లో కాంగ్రెస్ అనుకూల ఓటు 19.5 శాతం ఉండగా ఇప్పుడది 29 శాతానికి పెరగడం, రాహుల్ గాంధీని మోదీకి ప్రధాన ప్రత్యర్థిగా పరిగణించడంతో కాంగ్రెస్ ప్రతిష్ఠ పెరిగింది. దీనికి తోడు తెలంగాణలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా బహిరంగంగా వాదులాడుకోవడం, కీచులాడుకోవడం తగ్గించారు. రేవంత్ పాదయాత్ర, భట్టి విక్రమాదిత్య పాదయాత్ర సాగుతున్నాయి. విక్రమాదిత్య పాదయాత్ర బ్రేకులు లేకుండా ప్రజలతో మమేకమై సాగుతూ వస్తోంది. బహిరంగసభ జరిగిన సందర్భాలలో సీనియర్ నాయకులందరూ హాజరవుతున్నారు. మొత్తం మీద రెండో స్థానంలోకి కాంగ్రెస్ వచ్చింది. బీజేపీ లో నాయకుల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. ప్రజల దృష్టిలో బీజేపీ మూడో స్థానంలోకి వెళ్ళిపోయింది.

ఈ నేపథ్యంలో టీడీపీ అవసరం బీజేపీ నాయకత్వానికి కనిపించి ఉండవచ్చు. అది కూడా తెలంగాణలో బీజేపీకి టీడీపీ సహకారం ఉంటే హైదరాబాద్, రంగారెడ్డిలోనూ, నిజామాబాద్, ఖమ్మంలోనూ కలసి రావచ్చునన్న అంచనా కావచ్చు. హైదరాబాద్ లో నివసిస్తున్న సీమాంధ్రులను మళ్ళీ టీడీపీ ఆకర్షించగలదా? అన్నది ప్రశ్న. 2014లో రెండు కళ్ళ సిద్ధాంతంతో విభజనవాదాన్ని ఎదుర్కొన్న టీడీపీకి తెలంగాణలో 15 సీట్లు వచ్చాయి. కానీ 2018లో రెండే స్థానాలు దక్కాయి. టీఆర్ ఎస్ హైదరాబాద్ నగరంలో సీమాంధ్రుల ప్రాబల్యం కలిగిన 14 నియోజకవర్గాలలో జయకేతనం ఎగురవేసింది. వాళ్ళు కూడా టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు. 2018లో టీఆర్ఎస్ కు ఓటేసిన సీమాంధ్రులు మళ్ళీ టీడీపీవైపు మొగ్గుతారా అన్నది ప్రశ్న.

2018 ఎన్నికలలో చంద్రబాబునాయుడు సాహచర్యం వల్ల కాంగ్రెస్ నష్టపోయింది. ఖమ్మంజిల్లాలో చంద్రబాబునాయుడు కాలుమోపే వరకూ కాంగ్రెస్ కు కనీసం 30 స్థానాలు వస్తాయని అనుకున్నారు. అంతవరకూ కేసీఆర్ కు ప్రచారంలో గట్టి అంశం దొరక లేదు.  2014లో చెప్పిన ఉపన్యాసాలే చెబుతున్నారు. ఖమ్మంలో చంద్రబాబునాయుడు ప్రచారం ప్రారంభించగానే పరిపాలన హైదరాబాద్ నుంచి జరగాలో, రిమోట్ ద్వారా అమరావతి నుంచి జరగాలో ప్రజలే నిర్ణయించాలని కేసీఆర్ ప్రచారం జోరుగా చేశారు. ఫలితంగా కాంగ్రెస్ కు 18 స్థానాలు దక్కాయి. టీఆర్ఎస్ కు అదనంగా పాతిక సీట్లు దక్కాయి.

వ్రతం చెడ్డా ఫలం దక్కుతుందా?

కాంగ్రెస్ కు 2018లో ఎదురైన అనుభవమే 2023లో బీజేపీకి ఎదురు కావచ్చు. చంద్రబాబునాయుడిని కానీ, చంద్రబాబునాయుడితో పొత్తు పెట్టుకున్న పార్టీలను కానీ తెలంగాణ ప్రజలు ఉపేక్షించరు. తిరస్కరిస్తారు. ఈ విధంగా చూస్తే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలన్న బీజేపీ ఆలోచన ఆత్మహత్యసదృశంగా పరిణమించవచ్చు. టీడీపీకి కొన్నితెలంగాణ జిల్లాలలో ఇంకా కార్యకర్తలు ఉన్నారు. కానీ ఓట్లు లేవు. ఆ కార్యకర్తలు పని చేస్తే టీడీపీకి చేస్తారు లేకపోతే బీఆర్ఎస్ కు చేస్తారు కానీ బీజేపీకి కానీ కాంగ్రెస్ కు కానీ చేయరు. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్టు బీజేపీ విధానం మార్చుకొని, చంద్రబాబునాయుడితో రాజీపడి టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ప్రయోజనం ఉండదేమోనని పరిశీలకులు భావిస్తున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ వల్ల ప్రయోజనం ఉంటుందా, ఉండదా అనే మీమాంస టీడీపీ నేతల్లో ఉంది. రేపు ఎన్నికల్లో శాసనసభ స్థానాలలో బీజేపీకీ, పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనకు కలిపి 50 సీట్లు వదిలిపెట్టి 100సీట్లలో టీడీపీ పోటీ చేసినప్పటికీ టీడీపీకి మెజారిటీ దక్కకపోవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పరిశీలించినవారికి టీడీపీ ఆధిక్యం కనిపించవచ్చు. ఇందుకు మీడియా ప్రభావానికి తోడు చంద్రబాబునాయుడు చేసే హడావిడీ, లోకేష్ పాదయాత్ర ప్రభావం ఉండవచ్చు. కానీ వదిలిన 50 స్థానాలలో అత్యధికం వైఎస్ఆర్ సీపీకి దక్కుతాయని గమనించాలి. తెలుగుదేశం ఓట్ల జనసేనకూ, బీజేపీకీ బదిలీ కావడం అంత తేలిక కాదు. మిగిలిన వంద  స్థానాలలో సగం స్థానాలు వైసీపీ గెలుచుకున్నా దానికి అధికారం పదిలం. మూడు పార్టీలూ కలిసినా ఫలితం ఉండకపోవచ్చుననే అభిప్రాయం ఉంది. ఈ మూడు పార్టీలూ చేతులు కలిపితే మొదటి నుంచీ చంద్రబాబునాయుడిని సమర్థిస్తూ వస్తున్న సీపీఐ రామకృష్ణ ఏమి చేస్తారో చూడాలి. పైగా ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ గెలిచినా దిల్లీలో మద్దతు ఇచ్చేది బీజేపీకే. వైఎస్ఆర్ సీపీ, టీడీపీ, జనసేన – మూడుపార్టీలూ బీజేపీకి విధేయంగా ఉంటాయి. కనుక టీడీపీతో పొత్తుపెట్టుకొని రెండు సీట్లు గెలిచినంత మాత్రాన బీసేపీకి తేడా పడదు. తాము జరిపించుకునే సర్వేలలో 2024లో వైసీపీ ఓడిపోతుందనీ, టీడీపీ గెలిచితీరుతుందనీ అంచనాకు వస్తే అప్పుడు బీజేపీ 2014 నాటి పొత్తుకు అంగీకరించి పవన్ కల్యాణ్ కూ, చంద్రబాబునాయుడికీ సంతోషం కలిగించవచ్చు.

షా తో చంద్రబాబునాయుడు కలవడం ప్రాథమిక చర్య మాత్రమే. ఇంకా ప్రధాని నరేంద్రమోదీని కలుసుకోవాలి. ముందుగా తెలంగాణ ఎన్నికలలో చేతులు కలిపి దాని ఫలితం చూసి, ఆంధ్రప్రదేశ్ లో కార్యాచరణ గురించి నిర్ణయం తీసుకోవచ్చు. ఆరు నెలల వ్యవధి ఉంటుంది. ఆ వెసులుబాటు బీజేపీకి ఉన్నది. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి చూసినవారికి బీజేపీ, టీడీపీ చేతులు కలిపినా ప్రయోజనం ఉండదని అనిపిస్తోంది. పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉంటుందని అంచనా.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles