Friday, April 26, 2024

నాలుగు క్వార్టర్స్ బ్రాంది  బాటిల్స్ – (మైనస్)  ‘అత్యాచారం’ కేసులు = ??!!

దళితులు, ఆదివాసీలపై  అత్యాచారాలను నిరోధించడానికి ఒక చట్టం వుంది. దానికి 2015లో సవరణ వచ్చింది. అదనంగా కొన్ని సెక్షన్ లు వచ్చి చేరాయి. అవి ‘అత్యాచారం’ అనే నిర్వచనాన్ని విస్తృత పరిచాయి. ఉదాహరణకు ఒక దళితుడు/ ఆదివాసీల సాగు అనుభవoలో వున్న భూమి నుండి చట్ట విరుద్దమైన పద్దతిలో , ఆయన / ఆమె అభిష్టానికి వ్యతిరేకంగా తొలగించ కూడదు. “అభీష్టం” అంటే ఏమిటో కూడా అది వివరించింది.  భుమి ఖాళీ చేయమని  ‘ఒత్తిడి’తో  ఆ అభీష్టాన్ని రాబట్టకూడాదు. అట్టి భూమికి సంబదించిన రికార్డులను తారుమారు చేయకూడదు. బాధితులు ఇచ్చే ఫిర్యాదును ఒక పబ్లిక్ ఆఫీసర్ తిరస్కరించ కూడదు. ‘అత్యాచారం’ నిర్వచనానికి కొత్తగా వచ్చిన చేర్పులు.

ఈ చట్టం కింది ఎన్ని కేసులు నమోదవుతున్నాయి? ఎన్ని కేసులలో అసలు శిక్షలు పడుతున్నాయి? ఈ గణాంకాలతో సంబధం లేకుండా, ఈ చట్టం దుర్వినియోగం అవుతుందని ప్రచారం మాత్రం స్థిరపడిపోయింది. ఈ చట్టం కింది FIR నమోదు అయితే DSP స్తాయి అధికారి విచారణ జరిపి నిర్దారణ చేయవలసి వుంటుంది. అది మొదటి వడపోత. దానికి ముందు,  పోలీస్ స్టేషన్ లో బాధితుల నుండి ఫిర్యాదు స్వీకరణ జరగాలి. అక్కడే  చాల ఫిర్యాదులు  కేసుగా నమోదు గాకుండా  ఆగిపోతాయి. ఈ సంగతులు చాల మందికి తెలియదు.

Also read: ఆదిమ తెగల ఆదివాసీల జీడి తోటలను నరికివేసే ప్రయత్నం:అడ్డుకున్న గిరిజన మహిళలు

నేను మూడు  కేసులు వివరిస్తాను. అయితే అవి ఇప్పుడు తాజాగా వున్నవి. ‘లీగల్’ పరిభాషలో అవి ఇంకా ఒక ‘లాజికల్ ఎండ్’కు రావలసి వుంది, తీసుకు వచ్చే పనిలో వున్నాను. కనుక సాంకేతిక సమాచారం మినహాయిస్తున్నాను.

పండగ జేసుకుంటున్నది ఎవరు?

ఈ మధ్య ఒక జిల్లాలోని కొండదొర ఆవాస గ్రామం ఆదివాసీలపై పొరుగున వున్న గిరిజనేతరులు దాడి చేశారు. తిట్టారు, కొట్టారు. అది కూడా స్థానిక  రెవిన్యూ అధికారుల సమక్షoలో జరిగింది.

కొండదొరలు తరతరాలుగా సాగు చేస్తున్న భూమికి గాను గిరిజనేతరులకు పట్టాలు ఇచ్చారు. అవి సీలింగ్ మిగులు భూములు. అంటే ప్రభుత్వ భూమి అని అర్ధం. తమ సాగు అనుభవాన్ని గుర్తించమని, గిరిజనేతరులకు ఇచ్చిన D- పట్టాలు (ప్రభుత్వ భూమికి ఇచ్చే పట్టాలు) రద్దు చేసి తమకే పట్టాలు ఇవ్వాలని కోరుతూ  ఆదివాసీలు చాలకాలంగా వినతి పత్రాలు ఇస్తున్నారు. ఏనాడూ వాటిపై సదరు మండల రెవిన్యూ కార్యాలయం అధికారులు చిత్తశుద్ధితో విచారణ చేయలేదు. గిరిజనేతరుల పట్టాలు రద్దు కాలేదు. ఆదివాసీల సాగు అనుభవాన్ని రికార్డు చేయటం లేదు. కావాలనే చేయటం లేదు.

ఆ గిరిజనేతరుల కులానికి చెందిన వ్యక్తీ నేడు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక  భారీ పదవి పొందాడు. ఇక “ఇప్పుడు గాకపోతే ఎప్పుడు” అని ప్రశ్న వేసుకొని, తమకు పట్టాలు వున్నాయి గనుక తమదే ఆ భూమి అని ఆదివాసీల మీదకు రావడం, దాడులు చేయడం  మొదలు పెట్టారు. అంతేగాదు, నిస్సిగ్గుగా తామే సాగు చేస్తున్నామని కూడా దబాయిoచడం మొదలు పెట్టారు. ఈ దబాయింపునకు  రెవిన్యూ అధికారులు వంతపాడటం మొదలు పెట్టారు. దీని వెనుక ఆ ‘పెద్దాయన’ తెర వెనుక పాత్ర వున్నది.

ఈ నేపధ్యంలో గత మే నెల 23న స్థానిక రెవెన్యు అధికారి వుండగానే, మధ్యాన్నం  1.20 నిముషాల సమయంలో ఆదివాసీలపై గిరిజనేతరుల దాడి జరిగింది. దాడి స్థలం నుండి  ఆదివాసీలు ఒక ఫిర్యాదు రాసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు. అప్పటికి 5.20 అయ్యింది.

చట్టం ఏo చెపుతుంది? ఫిర్యాదు స్వీకరించి  రసీదు ఇవ్వాలని, FIR నమోదు చేసి విచారణ జరపాలని చెపుతుంది. ఆపని జరగలేదు. అంటే ఫిర్యాదు తీసుకున్నారు గాని దానిని నమోదు చేయలేదని అర్ధం. ఆదివాసీలకు రసీదు తీసుకోవాలని గాని, క్రిమినల్ నేర విచారణలో FIR నమోదు సమయానికిగల  ప్రాముఖ్యత ఏమిటనిగాని తెలీదు.

నేను ఇచ్చిన సలహాపై ఆదివాసీ బాధితులు మే 25న ఉదయం 11 గంటలకు  ఫిర్యాదును రిజిస్టర్ పోస్టులో పంపారు. మే 28 రాత్రి 9.40కి ఆదివాసీ ఫిర్యాదుదారులలో ఒకరికి మెజెస్ వచ్చింది, కేసు నమోదు అయ్యిoదని. ఇప్పుడు మీరు ఉహించoడి ఏం జరిగిందో!  రిజిస్టర్ పోస్టులో వచ్చింది గనుక GD (జనరల్ డైరి)లో నమోదు చేయకతప్పలేదు. అలా జరిగింది గనుక FIR రిజిస్టర్ చేయవలసి వచ్చింది. లేదంటే లేదు.

ఈ మొదటి అంకంలో,  23,24,25,26,27,28 తేదీలలో బాధితులు మలమల మాడ్చేసే వేసవి ఎండలలో, ప్రయాణ ఖర్చులకు డబ్బులు సర్దుకుంటూ, టీలు తాగుతూ అదే భోజనంగా భావిస్తూ  తమ రక్షణకోసం ఈ దేశ పార్లమెంట్ చేసిన చట్టాన్ని అమలు చేయమని కోరుతూ, ప్రాధేయపడుతూ బాధితులు  తిరుగుతున్నారు. మరి, వారిపై దాడి చేసినవారు ఎవరు?

Also read: ఇచ్చిన మాటకు కట్టుబడండి, బాధితుల డిమాండ్

రెండో అంకం మొదలు

కేసు నమోదు తరువాత రెండవ అంకం మొదలయ్యింది. నమోదైన కేసులో ‘అత్యాచారాల నిరోధిక చట్టం’ ప్రోవిజన్స్ వున్నాయి గనుక DSP దొరవారు విచారణ చేయాలి. ఆదివారం నాడు అయ్యగారు మిట్టమధ్యాన్నం ఒంటిగంటకు వచ్చారు. కొంత సేపు హడావిడి. “స్టేషన్ కు రండి! అంటూ” దొరవారు నిష్క్రమించారు. బాధిత  ఆదివాసీలు తమ గ్రామo నుండి  స్టేషన్ కు వేళ్ళాలి. వెంటనే వెళ్ళాలి. నిలబడినపలంగ అక్కడ వుండాలి. ఎలా? ఆటోలు లేవు. చేతిలో డబ్బులు లేవు. అప్పటికి వారింకా ఇంత అన్నం ముద్ద తినలేదు. అయినా పరిగెత్తారు. మండల కేంద్రంలో పోలీస్ స్టేషాన్ కు వెళ్ళే సరికి  అక్కడి దొరగారు లేరు. అర్జెంట్ గా జిల్లా కేంద్రలోని తన కార్యాలయాని రమ్మని కబురు అక్కడ వుంచి  దొరగారు వెళ్లిపోయారు.

ఆదివాసులు ‘రాముడా – దేముడా’ అనుకుంటూ,  జిల్లా కేంద్రలోని  దొరవారి ఆఫీసు వెతికి పట్టుకొని వెళ్ళేసరికి అయ్యగారు ‘పెద్దయ్య’ గారు చెప్పిన పెద్దపని మీద బయటకు వెల్లిపోయారు. ‘ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చారు?’ అంటూ దొరగారి సిబ్బంది వారిపై చిరాకు పడ్డారు. వచ్చింది 9 మంది ఆదివాసీలు. అందులో ఇద్దరు మహిళాలు. అయ్యగారికి అర్జెంట్ పనులు వలన వారు కార్యాలయానికి రాలేదు. ఇదిగో దొరవారు … అదిగో దొరవారు వస్తున్నరంటూ .. అంటూ..  వారిని చీకటిపడే వరకు కూర్చో బెట్టి, సింపుల్ గా “రేపు రండని” పంపెసారు. మధ్యానం కాల్చేసే ఎండవేడి, కడుపులో ఆకలి, చీకటి కాగానే దోమలు, ఆ ఇద్దరు ఆదివాసీ మహిళల సహజ అవసారాలని పట్టించుకున్నవాడు లేడు. నకనకలాడే కాలే కడుపులతో వారు తమ ఇళ్ళకు చేరేసరికి రాత్రి 11. కాని వారికీ నిద్రపట్టదు. ఎందుకంటే, రేపు ఉదయం 9 కల్లా దొరవారి ముందు వుండాలన్నది ఆదేశం.

వారు ఎంత ప్రయత్నం చేసినా 11 గంటలకుగాని జిల్లా కేంద్రానికి  చేరుకోలేకపోయారు. వారు చేరుకునే సరికి దొరవారు వచ్చి వెళ్ళిపోయారు. ఈసారి వచ్చింది ఆరుగురు. అందులో ఒక కొండదొర రైతు వయస్సు 73. తన కాళ్ళు వంకరపోయి వుంటాయి. ఎక్కవ సేపు కూర్చోలేదు. మరొకరు 60 ఏళ్ళుదాటిన మహిళ. నేను వారిని రాత్రి 7 గంటల సయంలో కలిసాను. అందరూ డస్సిపోయి వున్నారు. వెంటనే చేసిన పని,  ఆ ఆదివాసీ మహిళను బాత్రూంకు పంపే ఏర్పాటు. ఆమె  అక్కడ ఉదయం 11 నుండి వుంది. నేను వెళ్లిoది రాత్రి 7కి. అప్పుడు తన సహజ అవసరాలు తీరాయి. మీకు ఏమైనా అర్ధం అవుతోందా? నేను ఏమి చెపుతున్నానో తెలుస్తోందా? ఇది మన దేశంలో  అమలయ్యే రాజ్యంగ బద్ధపాలన. విచారణ పూర్తి చేసుకొని వారు ఇళ్ళకు చేరుకునే సరికి రాత్రి 11.40.

ఉప్పులో కాలేసినట్టే లెక్క

ఇదంతా విన్నవారు, సరే! వారు కష్టపడితే పడ్డారు. ఇప్పుడు కేసు నమోదయ్యింది గనుక ఇక వారిపై దాడి చేసిన వారు ‘నానాయాతన పడతారు’ అనుకోవచ్చు. అలా మీరు అనుకుంటే పప్పులో కాదు ఉప్పులో కాలు వేసారు.

సారా, మద్యం చట్టంకు ప్రస్తుత ప్రభుత్వం సవరణ తెచ్చింది. సార దొరికితే, అది ఎంతమొత్తం అన్నదానితో సంబధం లేకుండా అందుకు 7 ఏళ్ళు జైలు. ఇక మూడు కంటే ఎక్కవ లైసెన్స్ లేని బ్రాంది బాటిల్స్ (ఒక్కక్కోటి ఒక క్వార్టరైనా) దానికి కూడా అంతే శిక్ష. అంటే ముద్దాయిలకు కోర్టు వారు  బెయిల్ ఇచ్చే వరకూ రిమాండ్ లో ఉంచుతారు.

క్రిమినల్ ప్రోజీసర్ కోడ్ (CRPC) సేక్షన్ 41కి చేసిన సవరణ వలన 7 సంవత్సరాలకంటే తక్కువ శిక్షపడే నేరాలలో పోలీస్ స్టేషన్ లో బెయిల్ ఇచ్చేయవచ్చు.

 FIR లో వున్న  సెక్షన్ లు 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడేవిగా వుండి అత్యాచారాల నిరోధక చట్టాన్ని అన్యయించినా ‘ముద్దాయిలకు’ స్టేషన్ బెయిల్ వచ్చేస్తుంది. అంటే కేసు విచారణ జరిగి నేరారోపణ రుజువు అయిన తరువాత మాత్రేమే వారు జైలుకు వెళ్తారు. ఒక వేల శిక్షపడినా దానికి అప్పీల్ అవకాశం వుండనే వుంది.

Also read: వడ్డీ వ్యాపారుల కబంధహస్తాల నుండి ఆదివాసీలకు విముక్తి, పట్టా చేతికి వచ్చిన గంటకే ప్రాణం పోయింది!

అయితే, ప్రస్తుతo నేను చెపుతున్న  కేసులో శిక్షపడే అవకాశం కూడా లేదు. ఎందుకంటారా, నేరం జరిగింది మే 23, మధ్యాన్నం 1.20కి. కేసు రిజిస్టర్ అయినది మే 28, రాత్రి 9.40కి. ఎలా ఎందుకు జరిగిందో ముందే చెప్పాను. బాధిత ఆదివాసీలు ఫిర్యాదు ఇచ్చినప్పుడు వెంటనే దానిని నమోదు చేయలేదు. కాని రేపు ముద్దాయిల తరుపు న్యాయవాది ఈ వివరాలు చూసి లొట్టలు వేసుకుంటాడు. బాధితులను, ప్రోసిక్యూషన్ వారిని ఒక లెక్కలో ఆడుకుంటాడు. దాడి 23న జరిగితే కేసు 28న ఎందుకు రిజిస్టర్ అయ్యిందని నిలదీస్తాడు.

ఇంతటితో కధ అయిపోలేదు. కొస మేరుపులు కొన్ని వున్నాయి.

SC, ST అత్యాచారాల నిరోధక చట్టం కేసు నమోదు పుర్తికావాలంటే బాధితులు ఆ సామాజిక వర్గానికి చెందిన వారేనని నిర్దాణకావాలి. అందుకు బాధితులే ‘తగిన’ ఏర్పాట్లు చేసుకోవాలి.

ఈ వివాదo సాగు భుమీతో ముడిపడి వుంది. సాగులో ఆదివాసీలు వున్నారు. కాని ఆ విషయాన్ని చెప్పే రికార్డు ఏమి వారివద్ద లేదు. రెవిన్యూ అధికారులు ఈ వాస్తవాన్ని ఎన్నడు నమోదు చేయలేదు (గిరిజనేతర D- పట్టాదారుల ప్రయోజనాలకు వారు కొమ్ముకాస్తూ వచ్చారు). ఇప్పుడు ఇది క్రిమినల్ వివాదం అయ్యింది. సాగులో వున్న ఆదివాసీలపై గిరిజనేతరులు దాడి చేశారు.

కీలకాంశాలు

వివాదంలో వున్న భూమికి సంబదించి నివేదిక ఇవ్వమని DSP దొరవారు, తాశీల్దార్ దొరవారిని కోరుతారు. అప్పుడు ఈ చిన్న దొరవారు పెద్ద దొరవారికి ఏమని నివేదిక ఇవ్వబోతారన్నది  కేసుకు చాలా కీలకం. వారు ఇలా నివేదించే అవకాశం వుంది

1.       మా రికార్డు దాఖలా X, Y, Z అనే గిరిజనేతరులే భూమికి హక్కుదారులు (అలా రాసి, సాగులో మాత్రం ఆదివాసీలు వున్నారనే విషయాన్ని తొక్కిపెట్టవచ్చు)

లేదా

2.       మా రికార్డు దాఖలా X, Y, Z అను గిరిజనేతరులే భూమికి హక్కుదారులు. ప్రస్తుతం భూమి కోర్ను( ఖాళీగా) వుంది. (ఇది మే నెల గనుక పంటలు వుండవు కదా ! కనుక దానిని అవకాశంగా తీసుకొని ఆదివాసీలే సాగులో వున్నారనే వాస్తవాన్ని తొక్కి పెట్టవచ్చు)

ఈ రెండింటిలో ఎదో ఒక పద్దతిలో రాయడానికే ఎక్కువ అవకాశం వుంది. అప్పుడు కేసు మరింత బలహీనపడుతుంది. డిఫెన్స్ లాయరు వారు విచారణ సమయంలో మరింత రెచ్చిపోతారు.

పుట్టుకే ఎరుగని రెండు కేసులు

ఆదివాసీలు, దళిత బాధితుల నుండి ఫిర్యాదు అందుకొని దానిని జనరల్ డైరిలో నమోదు చేసుకొని FIR రాస్తేనే పైన నేను చెప్పిన విచారణ తతంగం. అసలు FIR నమోదే చేయకపోతే ఆ ఫిర్యాదు పుట్టుకలోనే మరణించనట్లు లెక్క.

ఆదివాసీలలో కొన్ని తెగలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “ఆదిమ తెగల ఆదివాసీలుగా” (PVTG)గా గుర్తించింది. అలాంటి ఆదివాసీలు జీవిస్తున్న రెండు గ్రామలలో, వారి  ప్రయోజనాలు దెబ్బ తీయడానికి, గిరిజనేతర భూ మాఫియాకి సహకరించాడానికి వీలుగా  ఆ మండలాల తాశీల్దార్లు తప్పుడు నివేదికలు తయారు చేశారు. ఒక తాశీల్దార్ రికార్డులో నమొదైన ఆదివాసీల పేర్లను ఏకపక్షంగా తీసేశాడు. ఇదంతా గిరిజనేతర లేండ్ మాఫియా కోసం చేసిన పని.

సమాచార హక్కు చట్టం ద్వారా నేను వారు ఎలా మోసం చేసింది బయటకులాగాను. 2015, SC, ST అత్యాచారాల నిరోధక సవరణ చట్టం అనుసరించి ఇది నేరం.

ముగ్గురు  గదబ (PVTG) ఆదివాసీ మహిళల రైతులు  ఫిర్యాదు పట్టుకొని మధ్యాన్నం 2 గంటలకు రక్షక భట నిలయంకి వెళ్ళారు. వారికి రాత్రి 8 గంటలుకు ఫిర్యాదు ముట్టినట్లు రసీదు ఇచ్చారు. పెద్దగ చదువుకోని ఆ ఆదివాసి మహిళలలో ఇంటికి చేరుకొనే సరికి రాత్రి 10 దాటింది. ఆ రసీదులో ఫిర్యాదు చేసిన మహిళల పేరుల్లకు బదులు వారి భర్తల పేర్లు రాసారు. అది సివిల్ వివాదమని కనుక RDO వద్దకు పొండని రసీదులో  రాశారు. ఫిర్యాదు అందిన సమయాన్ని తప్పుగా వేశారు.

అంటే ఏమి జరిగివుంటుంది? సదరు రక్షక భట నిలయం అధికారి,DSP దొరవారు, CI దొరవారు, తశీల్దార్ దొరవారు, RDO దొరవారిల మధ్య టెలిఫోన్ సంభాషణ జరిగివుంటుంది. దాని ‘ఆవుట్ కం’ సదరు రశీదు.

Also read: భూమి ప్రశ్న – భు పరిపాలనలో వస్తున్న మార్పులు

ఫిర్యాదు తీసుకోం, రసీదు ఇవ్వం

ఇక రెండవ కేసులో మేము మీ ఫిర్యాదు  తీసుకోo, రసీదు ఇవ్వం. అని ఖరాఖండిగా చెప్పేశారు.

చట్టం ఎం చెపుతోంది? ఒక ఆదివాసీని అతని స్వాధీనంలో వున్న భూమి నుండి చట్ట విరుద్ధంగా తొలగించడానికి చేసే ప్రయత్నం “అత్యాచారం” కిందకు వస్తుంది. అందులో fabricating records of such land (అట్టి భూమికి సంబంధించిన రికార్డులను తారుమారు చేయడం కూడా) నేరం.

పై పైన మాత్రమే చూసినప్పుడు  దళితులు, ఆదివాసీలు వంటి సాంఘిక వర్గాలకు ఎంతో రక్షణ వున్నట్లు కనిపిస్తుంది. కాని చట్టం అమలు గాకుండా, దాని ప్రయోజనం  వారికీ దక్కకుండా, దాని అమలు ప్రక్రియలో ఎన్నో అడ్డంకులు పెడుతూవుంటారు. ఇది నెమ్మదిగా కంటికి కనిపించకుండా జరుగుతూ వుంటాయి. ప్రదాన  స్రవంతి సమాజానికి ఇవేవి తెలియవు లేదా వారికి పట్టదు.

ఇప్పుడు మొదటి కధని మల్లి ప్రస్తావించి ముగిస్తాను. పైన చెప్పిన  కేసులో నిజానికి బాధలు పడింది, నలిగిపోయింది ఎవరు?

గిరిజనేతరుల నుండి దెబ్బలు తిని, అవమానాలు పడిన వారు రెండు రోజుల పాటు, నిద్ర సుఖం లేకుండా, తిండి తిప్పలు లేకుండా, మలమల  మాడ్చే ఎండలో కాలిపోతూ, (జస్ట్) కేసు నమోదుకు 23 నుండి 28 తేదీల  మధ్య  తమ గ్రామం, మండల కేంద్రంలో రక్షక భట నిలయం, జిల్లా కేంద్రంలోని DSP దొరవారి కార్యాలయంకు తిరిగారు.  అన్నం తిన్నారా, ప్రయాణానికి డబ్బులు వున్నాయా అని అడిగిన వారు ఎవరు?

దాడి చేసినవారి ఖుషామత్

అదే సమయంలో వారిని కొట్టిన వారు తమ పనులు చేసుకుంటూ, రాత్రి పూట మందు పార్టీలు చేసుకుంటూ ఎకసెక్కాలు ఆడుకుంటువున్నారు.

కేసు రిజిస్టర్ అయితే ఏమి అవుతుంది? ఒక్క రోజుకూడా జైలు చిప్ప కూడు తినవలసిన అవసరం వారికి  లేదు. ఒక ముంతడు నాటు సారా, మూడుకంటే ఎక్కువ క్వార్టర్ లైసెన్స్ లేని బ్రాంది బాటిల్స్  (అనగా నాలుగు) దొరికినా అది బెయిల్ రాని నేరం. కాని SC, ST అత్యాచారాల నిరోధక సవరణ చట్టం కేసు నమోదు అయితే అది పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వదగు నేరం.

ఇప్పుడు  ఏo జరుగుతుంది? గౌరవ SI దొరవారు ముద్దాయిలకు ఫోన్ చేసి ఎండ చల్లబడ్డాక తమ ఆధార్ కార్డులతో వచ్చి సంతకాలు పెట్టి వెల్లoడని పెళ్ళికి పిలిచి నట్లు పిలుస్తాడు. వారు బెయిల్ మీద వచ్చి బాధితులను చూసి నవ్వుకుంటూ వుంటారు.

 దళితులు, ఆదివాసీలు జీవితాలు నాలుగు బ్రాంది బాటిల్స్ లేదా ముంతడు సారా పాటి చెయ్యవని మీకు అర్ధం అవుతుందా??

Also read: “9 నెలలుగా ఈ సమస్య అపరిష్కృతంగా వుంది”..

P.S. అజయ్ కుమార్

అజయ్ కుమార్ పీ ఎస్
అజయ్ కుమార్ పీ ఎస్
పీఎస్ అజయ్ కుమార్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో సోషల్ వర్కులో మాస్టర్స్ డిగ్రి (MSW) చేశారు. గత 30 ఏళ్లుగా ఆదివాసీల భూమి సమస్య, నిర్వాసిత, గ్రామీణ కార్మికుల హక్కుల కోసం పని చేస్తున్నారు. ‘ప్రభుత్వ భూమి పేదలదే’, ‘భూమి సమస్య – వ్యాసాలు 1, 2’, ‘కళ్యాణలోవ కధలు’ ప్రచురితమైన పుస్తకాలు. భూమి సమస్య వ్యాసాలు – 1కి, DNF Rural Journalist award foundation –Hyderabad వారి Rural journalist award for year 2008 లభించింది. ప్రస్తుతం అఖల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles