Thursday, February 2, 2023

పౌరసమాజమే శత్రువు అంటారా దోవల్?

  • పౌరసమాజంపైన తుపాకి ఎక్కుపెట్టే హక్కు దోవల్ కి ఎవరిచ్చారు?
  • దోవల్, రావత్ ల వ్యాఖ్యాలు అడ్డగోలుగా ఉంటున్నాయి
  • మన ప్రజలనే మన శత్రువులుగా పరిగణించే సిద్ధాంతం ప్రమాదభూయిష్టం
అరుణారాయ్

‘సివిల్ సొసైటీ ఈజ్ నాట్ ద ఎనిమీ’ అనే శీర్షికతో ఇండియన్ ఎక్సెప్రెస్ బాంబే ఎడిషన్ 18 నవంబర్ 2021 సంచికలో మాజీ ఐఏఎస్ అధికారి, హక్కుల కార్యకర్త అరుణారాయ్ (సమాచార హక్కు చట్టం వంటి ఉదారవాద చట్టాల రూపశిల్పి) రచించిన ఒక వ్యాసం ప్రచురించింది. జాతీయ భద్రతావ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ ఇటీవల హైదరాబాద్ లో కొత్త పోలీసు అధికారులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రస్తావించిన విషయాలను అరుణారాయ్ ఖండించారు. అజిత్ దోవల్ అభివర్ణించిన నాలుగో తరం యుద్ధతంత్రం (ఫోర్తె జనరేషన్ వార్ పేర్) సూత్రం రాజ్యాంగ విరుద్ధమనీ, జాతీయ భద్రతకు గొప్ప హానికలిగిస్తుందనీ ఆమె స్పష్టం చేశారు.

సివిల్ సర్వెంట్లు శిక్షణకాలంలోనే రాజ్యాంగంపైన ప్రమాణం చేయాలి

‘‘అజిత్ దోవల్ 1968లో భారత పోలీసు సర్వీసులో చేరారు. అదే సంవత్సరం నేను ఐఏఎస్ లో చేరాను. శిక్షణ ప్రధానం. ప్రతి ఒక్కరూ లాలో బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో శిక్షణ పొందినవారే. కొన్ని తేడాలు ఉండవచ్చును కానీ సివిల్ సర్వీస్ లో శిక్షణ పొందినవారంతా రాజ్యాంగానికి విధేయంగా ఉంటానంటూ ప్రమాణం చేయవలసి ఉంటుంది…నాకు శిక్షణ పద్ధతి గురించి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. కానీ ఏడు సంవత్సరాలు ఐఏఎస్ అధికారిగా పని చేసి విరమించి చాలా ఏళ్ళు గడిచిపోయినప్పటికీ కొన్ని అంశాలు నా హృదయానికి దగ్గరగా మెసలుతున్నాయి.ఇప్పటికీ వాటిని గుర్తు పెట్టుకుంటాను. రాజ్యాంగ విలువలను పరిరక్షించడం సివిల్ సర్వెంట్ల ప్రాథమిక కర్తవ్యం అనే నియమం అందులో ప్రధానమైనది. ఆదేశిక సూత్రాలు జాగ్రత్తగా కాపాడుకోవలసినవి. రాజ్యాంగ పరిధిలో ఆలోచిస్తేనే నిజాయితీ, నిస్పక్షపాత వైఖరి వంటి నియమాల విలువ అర్థం అవుతుంది. ఎన్నికైన నాయకులు ఎవ్వరూ ఈ వ్యవహారంలో పరిధి దాటడానికి వీలు లేదు. వీటిని ఉల్లంఘించకుండా చూడటం సివిల్ సర్వెంట్ల బాధ్యత,’’ అని ఆమె రాశారు.

‘‘అయితే, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు దోవల్ హైదరాబాద్ లోని పోలీసు అకాడెమీకి తిరిగి 11 నవంబర్ 2021న వెళ్ళినప్పుడు ‘పాసింగ్ అవుట్ పరేడ్’ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన యుద్ధతంత్రం, జాతీయ భద్రత గురించి కొత్త రాజకీయ సిద్ధాంతం ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం అత్యంత ప్రమాదకరమైనది. చాలా విపరీత పరిణామాలకు దారితీసేటటువంటిది. కొత్త పోలీసు అధికారులతో దోవల్, ‘‘యుద్దతంత్రంలో- మీరు పిలిచే నాలుగో తరం యుద్ధతంత్రం- కొత్త సరిహద్దు సివిల్ సొపైటీ (పౌరసమాజం). సరిహద్దు యుద్ధాలు తమ రాజకీయ, సైనిక లక్ష్యాలను ఛేదించలేకపోతున్నాయి. అవి చాలా ఖర్చుతో కూడినవి. భరించలేనటువంటివి. అదే సమయంలో యుద్ధంలో గెలుస్తామో, ఓడిపోతామోనన్న తెలియదు. అందుకే, పౌరసమాజాన్ని చీల్చడానికీ, చిచ్చుపెట్టడానికీ, తప్పాదోవపట్టించడానికీ, దానిపైన దుష్ప్రభావం వేయడానికీ, జాతీయ ప్రయోజనాలను దెబ్బతీయడానికీ శత్రువులు ప్రయత్నిస్తారు. పౌరులకు పూర్తి రక్షణ ఇవ్వడానికే మీరు ఉన్నారు అని దోవల్ ఉద్భోదించారు.

ఏ పౌరులతో పోలీసులు యుద్ధం చేయాలి?

‘‘ఏ పౌర సమాజంతో తన అధికారులు యుద్ధం చేయాలని దోవల్ కోరుకుంటున్నారో ఆయన వివరించలేదు. మన ప్రజలపైనే నాలుగోతరం యుద్దాన్ని ప్రకటించడానికి ఆయనకు ఎవరు అధికారం ఇచ్చారో కూడా తెలియదు. ఈ సిద్ధాంతం ఎన్నికైన ప్రభుత్వ నిర్వాహకులకూ, ప్రైవేటు పారిశ్రామికవేత్తలకూ, వణిక్ ప్రముఖులకూ ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతిపక్షాలకూ,పౌరసంస్థలకూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారికీ వ్యతిరేకంగా ఉంటుంది. అధికారంలో ఉన్న రాజకీయ నాయకులనూ, వారికి అనుకూలమైన పారిశ్రామికవేత్తలనూ, వణిక్ ప్రముఖులనూ దేశ నిర్మాణంలో భాగస్వాములు గానూ, ప్రతిపక్షాలనూ, పౌరసంస్థలనూ,ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారినీ దేశద్రోహులుగానూ, అభివృద్ధి నిరోధకులుగానూ అభివర్ణిస్తుంది. రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్య, సామాజిక, ప్రగతిపరమైన హామీలనూ, హక్కులనూ ఆయన ఖాతరు చేయరు.

‘‘నేను 1975లో ఐఏఎస్ సర్వీసు వదిలిన తర్వాత సామాజిక కార్యకర్తగా పని చేశాను. భారతీయ సామాజిక, రాజకీయ జీవితంలో ప్రజాస్వామ్య విలువలు ఎట్లా వర్తిస్తాయో తెలుసుకున్నాను. లాభాపేక్ష లేకుండా స్వతంత్ర దేశానికి పునాది వేయడంలో నా సహచరులు కృషి ఉంది. మేం నిర్మించిన ఉద్యమాలు అందుకు దోహదం చేశాయి. స్వాతంత్ర్య ఉద్యమానికి కొనసాగింపుగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆత్మగౌరవం అనే రాజ్యాంగం ప్రసాదించిన సూత్రాలను పరిరక్షించేందుకూ కాపలాదారులుగా పౌరసంఘాల నాయకులూ, కార్యకర్తలూ పనిచేశారు. బహుశా ఈ ప్రభుత్వానికి అదే సమస్య కాబోలు.

మనం దేశానికి ప్రమాదకరమైన శక్తులమా?

‘‘మనల్ని భారత దేశానికి ప్రమాదకరమైన శక్తులుగా అభివర్ణించడం ద్వారా పౌరసమాజాన్ని శత్రుసమూహంగా పరిగణించాలని కొత్త పోలీసు అధికారులకు దోవల్ ఉద్బోధించారని అనుకోవాలి. ఆ సమాజంతో నాలుగో తరం యుద్ధం చేయాలి. మా బ్యాచ్ లో ఈ రోజు దోవల్ ఒక్కరే ప్రభుత్వ పదవిలో కేబినెట్ మంత్రి హోదాలో జాతీయ భద్రతా సలహాదారుగా పని చేస్తున్నారు. నాలుగోతరం యుద్ధతంత్రంపైనా, పౌరసమాజం నుంచి పొంచి ఉన్న ప్రమాదంపైనా ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు ఏమైనప్పటికీ, మనకంటే ఎక్కువగా ఆయన ప్రభుత్వ సేవకుడిగా రాజ్యాంగానికి బద్ధుడై ఉండాలి. పౌరసమాజంపైన తుపాకీ ఎక్కుపెట్టమని చెప్పే ఒక్క అక్షరం కూడా నాకు రాజ్యాంగంలో కనిపించలేదు. భారత దేశం అనే రాజ్యాంగ ఉనికికి వ్యతిరేకంగా పని చేస్తున్న వారిని నిరోధించడానికి బదులు పౌరసమాజంపైన తుపాకీ ఎక్కుపెట్టడం ద్వారా అంతర్గత యుద్ధానికి దారి తీస్తున్నారు సీనియర్ సలహాదారు దోవల్.  

‘‘దోవల్ ఒక రాజకీయ నియుక్తుడు. రాజకీయ ప్రభుత్వ వ్యవస్థను విమర్శించేవారంతా దేశానికి ప్రమాదకారులేనని దోవల్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తున్నది. అంటే, ఎన్నికలలో గెలిచి ప్రభుత్వంఏర్పాటు చేసిన అధికార పార్టీకీ, ఆ ప్రభుత్వం చేసే శాసనాలకు మాత్రమే రాజ్యాంగపరమైన హక్కులు ఉంటాయని వాదించినట్టు ఉంటుంది. ‘బ్యాలట్ పెట్టలలో ప్రజాస్వామ్య సారం ఉండదు. బ్యాలట్ పెట్టెల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులు చేసే శాసనాలలో ప్రజాస్వామ్య అభివ్యక్తి ఉంటుంది’- అంటూ ఆయన హైదరాబాద్ ప్రసంగంలోనే సెలవిచ్చారు. దేశం, జాతీయత లాగానే అదికారపార్టీ చెప్పిందే  చట్టబద్దమైన పాలనకు నిర్వచనం అవుతుంది.

ఉగ్రవాదులుగా అనుమానించినవారిని చావగొట్టొచ్చు

‘‘ఇది ఒక వలయం. త్రివిధ సాయుధ దళాల అధిపతిగా నియుక్తుడైన జనరల్ బిపిన్ రావత్ కూడా ఇదే ధోరణిలో మాట్లాడుతున్నారు. జమ్మూ-కశ్మీర్ ప్రజలు ఉగ్రవాదులను పట్టుకొని చంపివేస్తామని ప్రకటించడం ముదాహవమంటూ ఆయన ‘టైమ్స్ నౌ’ టీవీకి ప్రశంసాత్మకంగా చెప్పారు. మీ ప్రాంతంలో ఉగ్రవాది తన కార్యకలాపాలు సాగిస్తున్నట్టు మీకు తెలిస్తే అతడిని ఎందుకు లాగి కొట్టి చంపివేయకూడదు? అంటూ రావత్ ప్రశ్నించారు. అంటే తాము అనుమానించిన వ్యక్తులను గుంజి చితక్కొట్టి చంపే మందను జనరల్ రావత్ ప్రోత్సహిస్తున్నారని అనుకోవాలి.  తాము ఉగ్రవాదులు అని అనుమానించినవారికి ఎటువంటి శిక్ష విధించాలో నిర్ణయించే అధికారం కూడా ఆ మందకు ఉంటుందని ఆయన అభిప్రాయం. రాజకీయ నియుక్తుడైన వ్యక్తి ఆథ్వర్యంలో నడిచే జాతీయ మానవహక్కుల సంస్థ (నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ -ఎన్ హెచ్ ఆర్ సీ) ఈ మధ్య ఒక చర్చను పోలీసు అధికారులతో కలిపి నిర్వహించింది. ఉగ్రవాదం, నక్సలిజం వంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మీకు మానవహక్కులు అడ్డంకిగా పరిణమిస్తున్నాయా? అంటూ ఆ సంస్థ ప్రతినిధి పోలీసు అధికారులను ప్రశ్నించారు. మానవహక్కులను రాజ్యాంగం ప్రసాదించింది. వాటిని కాపాడేందుకు కమిషన్ ఏర్పాటు చేశారు. అటువంటి కమిషనే మానవహక్కులు అడ్డంకిగా ఉన్నాయా అనే ప్రశ్నఅడుగుతోందంటే ఏమనుకోవాలి?

‘‘ఈ వ్యవహారం అంత మన ప్రజలపైన ప్రమాదభూయిష్టమైన దాడి అనడంలో సందేహం లేదు. మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యన్ని, పౌరసత్వాన్నీ పూర్తిగా అణచివేసే రోజు ఎంతో దూరం లేదు. భారత దేశం అనే ఒక మహోన్నతమైన ఆలోచనావిధానాన్ని భగ్నం చేసే ప్రయత్నమిది. ప్రజాస్వామ్య బాద్యతలు ఈ ప్రభుత్వానికీ, మరే ఇతర ఎన్నికైన ప్రభుత్వానికైపా ఉన్నాయి. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి. రాజ్యాంగాన్ని పక్కన పెట్టి యధేచ్ఛగా వ్యవహరించడానికి వీలు లేదు,’’ అని అరుణారాయ్ తన వ్యాసంలో ఉద్ఘాటించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles