Tuesday, November 29, 2022

హార్దిక్ పటేల్ గుజరాత్ లో బీజేపీని గట్టెక్కిస్తారా?

Gujarat Leader Hardik Patel Joins BJP Days After Quitting Congress
గుజరాత్ నాయకుడు హార్దిక్ పటేల్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నప్పటి చిత్రం

ఇరవై ఎనిమిది ఏళ్లుగా గుజరాత్ లో తిరుగులేని విధంగా ప్రతి ఎన్నికలలో బీజేపీ  విజయం సాధిస్తూ అక్కడ కాంగ్రెస్ పార్టీనికోలుకోకుండా చేస్తూ వస్తున్నది. అయితే మొదటి సారిగా, ఐదేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో, బీజీపీని దాదాపు పరాజయం అంచువరకు పటిదార్ ఉద్యమ నేతగా హార్దిక్ పటేల్ తీసుకు వెళ్లగలిగారు. అయినా, కాంగ్రెస్ అంతర్గత బలహీనతల కారణంగా బీజేపీ ఏదో విధంగా గట్టెక్కగలిగింది. అయితే ఆ పార్టీ బలం శాసనసభలో 100 మార్క్ కు చేరుకోలేకపోయింది.

సారథులు ఆ ఇద్దరే కేంద్రంలో ప్రభుత్వాన్ని, బీజేపీని కూడా  ఆ ఇద్దరే నడిపిస్తున్నారని అందరికి తెలుసు. వారిద్దరూ ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా. పుష్కరకాలం పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఢిల్లీలో ఒకేసారి ప్రధాని పదవికి మోదీ చేరుకోగలిగారు. అటువంటి గుజరాత్ లో ఓటమి చెందితే జాతీయ స్థాయిలో వారిద్దరి నాయకత్వ సామర్ధ్యం ప్రశ్నార్ధకరంగా మారే అవకాశం ఉంది.

అందుకనే, ఏదో విధంగా వచ్చే డిసెంబర్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో అక్కడ బీజేపీ గెలుపొందడం రాజకీయంగా వారిద్దరికీ జీవన్మరణ సమస్య. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు బిజెపికి కాంగ్రెస్ కన్నా పెద్ద సవాల్ గా పరిణమించిన హార్దిక్ పటేల్ ఇప్పుడు ఆ పార్టీలో చేరడం కీలకంగా మారింది. కేవలం ఈ యువ నాయకుడు మద్దతుతో ఆ రాష్ట్రంలో గట్టెక్కగలరా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

జూన్ 2న బీజేపీలో చేరే ముందు తన జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలు కాబోతుందని ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో చిన్న సైనికుడిగా పని చేయబోతున్నట్లు హర్దిక్‌ తెలిపారు.  ప్రధాని మోదీ మొత్తం  ప్రపంచానికే  ఆదర్శంగా  నిలుస్తున్నారని హార్దిక్ ఈ సందర్భంగా కొనియాడారు. కాంగ్రెస్ పాలనలో సంతోషంగా లేని ప్రజల కోసం బీజేపీలో చేరుతున్నట్లు హార్దిక్ తెలిపారు. 

ట్వీట్లు తొలగింపు, కేసులు మాఫ్

ఈ ట్వీట్ ఇవ్వడానికి ముందు ప్రధాని మోదీని, అమిత్ షాను తీవ్రంగా విమర్శిస్తూ తనకు గతంలో ఇచ్చిన వెయ్యికి పైగా ట్వీట్ లను ట్విట్టర్ నుండి తొలగించడం గమనార్హం. అదే సమయంలో గత ఐదారేళ్లుగా అతనిపై బీజేపీ ప్రభుత్వం రెండు రాజద్రోహం కేసులతో పాటు 30 వరకు క్రిమినల్ కేసులను నమోదు చేసింది. వాటిలో దొమ్మీ వంటి కేసులు కూడా ఉన్నాయి. ఆయా కేసులను క్రమంగా మూసివేయడంతో, వాటి ప్రభావ తీవ్రతను తగ్గిస్తూ రావడమో బిజెపి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ వచ్చింది. 

Anandiben Patel Age, Husband, Children, Family, Biography & More »  StarsUnfolded
ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీ పటేల్

కాబట్టి, ఇది `అవసరం కోసం’ జరిగిన వివాహంగా స్పష్టం అవుతుంది. గుజరాత్ లో కాంగ్రెస్ ఇంకా ఎన్నికలకు సిద్ధంగా లేదు. అంతర్గతంగా ఎన్నో సమస్యలతో తలమునకలై ఉంది. అయినా ఆ పార్టీ గురించి బిజెపి భయపడుతోంది. అందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ బలంకన్నా, తమ పార్టీ లొసుగులే కావడం గమనార్హం. 

యూపీ ఎన్నికల తర్వాత 17 సార్లు మోదీ గుజరాత్ పర్యటన

 బీజేపీ అయితే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుండే గుజరాత్ వైపు దృష్టి సారించింది. అప్పటి నుండి ప్రధాని ఇప్పటి వరకు 17 సార్లు గుజరాత్ లో పర్యటించారు. బహుశా ఆయన ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఇంత తరచుగా పర్యటించలేదని చెప్పవచ్చు.

ఇప్పటి వరకు బీజేపీకి బలమైన మద్దతుదారులుగా ఉంటున్న పట్టణ ప్రాంత ఓటర్లలో అధిక ధరలు, నిరుద్యోగం వంటి కారణాలతో వ్యతిరేకత పెరుగుతూ వస్తున్నది. అందుకనే గ్రామీణ ప్రాంతాలలో, గిరిజనులలో తమ ఓట్లను పెంచుకోవడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఆ క్రమంలోనే హార్దిక్ పటేల్ ను చేర్చుకొంది. 

అయితే, ఇప్పుడు బిజెపి ఎదుర్కొంటున్న ప్రధాన సవాల్ సొంత పార్టీ మద్దతుదారుల నుండే ఓ విధమైన `తిరుగుబాటు.’ ఆ పార్టీ నాయకులు తీవ్రమైన `అవినీతి’కి పాల్పడుతూ తమను పట్టించుకోవడం లేదని అసంతృప్తి వారిలో వ్యక్తం అవుతున్నది. మరో వంక, ప్రధాని మోదీకి నమ్మకస్థురాలిగా  పేరొందిన పరిపాలన సామర్ధ్యం గల ఆనందీబెన్ పటేల్ ను అమిత్ షా పట్టుబట్టి గద్దె దింపారు. ఆ తర్వాత వచ్చిన సీఎంలు ఇద్దరిలో పార్టీపై, ప్రభుత్వంపై చెప్పుకోదగిన పట్టు ఉన్నట్లు కనిపించడం లేదు. 

ఎన్నికలలో పోటీ చేయడమే హార్దిక్ లక్ష్యం 

హార్దిక్ పటేల్ బీజేపీలో చేరడంలో ప్రధాన ఉద్దేశ్యం డిసెంబర్ లో జరిగే ఎన్నికలలో పోటీ చేయడమే. 2017లో కనీస వయస్సు లేక పోటీ చేయలేక పోయారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో జామ్‌నగర్ నుండి పోటీ చేయాలని కాంగ్రెస్‌లో చేరితే క్రిమినల్ కేసుల కారణంగా సాధ్యం కాలేదు. కాంగ్రెస్ లో ఉంటె ఇప్పుడు కూడా పోటీ చేసే అవకాశం కనిపించక, బీజేపీలో చేరినట్లు స్పష్టం అవుతుంది. 

 రిజర్వేషన్ కోసం పాటిదార్ల ఆందోళన కారణంగా 2016లో పాటిదార్ మహిళా ముఖ్యమంత్రి (ఆనందీబెన్ పటేల్) ను బీజేపీ బలవంతంగా గద్దె దించవలసి వచ్చింది. ఆ కోపంతో  2015లో రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన విస్‌నగర్‌  అల్లర్లు, దహనం కేసులో హార్దిక్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించారు.  ప్రస్తుతం  ఆ తీర్పుపై స్టే కోసం హైకోర్టు తీర్పును ఆశ్రయించారు. 

ఇంతలో, 2019 లోక్‌సభ ఎన్నికలలో నామినేషన్ల దాఖలుకు కొన్ని రోజుల ముందు అతని అప్పీల్ హైకోర్టు లో  తిరస్కరణకు గురైంది, సుప్రీం కోర్ట్ జోక్యంపై సమయం లేకపోవడంతో నామినేషన్ వేయడం సాధ్యం కాలేదు. ఈ కేసు సందర్భంగా, గుజరాత్ ప్రభుత్వం హార్దిక్‌పై నమోదైన రెండు దేశద్రోహం కేసులతో సహా 17 ఎఫ్‌ఐఆర్‌లతో పాటు అతనిపై నేర చరిత్ర ఉందని పేర్కొంటూ స్టేకు వ్యతిరేకంగా బలమైన కేసును రూపొందించింది.

కేసుల కారణంగా నామినేషన్ వేయలేకపోయిన వైనం

 హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ వాదనను సమర్థించడంతో పోటీ చేయలేకపోయాడు. అక్కడితో అతని రాజకీయ యాత్ర ఆగిపోయింది.  తిరస్కరణకు గురైంది, సుప్రీం కోర్ట్ జోక్యంపై సమయం లేకపోవడంతో నామినేషన్ వేయడం సాధ్యం కాలేదు. 2015 నుండి 2018 మధ్య కాలంలో అతనిపై నమోదైన దేశద్రోహంతో సహా కనీసం 30 ఎఫ్‌ఐఆర్‌లలో అతను నిందితుడు. 

హైకోర్టులో వలే ఇప్పుడు సుప్రీం కోర్టులో గుజరాత్ ప్రభుత్వం అతని నేర చరిత్రపై గట్టిగా వాదనలు వినిపించక పోవడంతో ఏప్రిల్ 12న అతనికి కింది కోర్ట్ విధించిన శిక్షపై స్టే ఇచ్చి, అతని అప్పీల్ పై నిర్ణయం పెండింగ్ లో ఉంచింది. దానితో ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేయడానికి మార్గం ఏర్పడింది. 

ఆ తర్వాత, ఏప్రిల్ 25న, రాష్ట్ర ప్రభుత్వం అతనిపై, ఇతరులపై అల్లర్లకు సంబంధించిన మరొక కేసును ఉపసంహరించుకోవాలని ప్రయత్నించింది.  అయితే అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించారు. మే 10న ఉపసంహరణకు అనుమతినిస్తూ ప్రభుత్వం సెషన్స్ కోర్టు తలుపులు తట్టింది. అప్పటి నుండి కాంగ్రెస్ ను విడిచి, బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యాడు. 

బీజేపీలో ఇమడగలడా!

కాంగ్రెస్ లో స్వయంగా రాహుల్ గాంధీ అతనిని ప్రోత్సహించినా రాష్ట్రంలోని నాయకులతో కలసి పని చేయలేక పోయాడు. ఇప్పుడు బీజేపీలో సహితం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉంటాయని భావించలేము. బీజేపీలో చేరే విషయంలో రాష్ట్రాల్లోని నాయకులతో సంబంధం లేకుండా నేరుగా ప్రధాని కార్యాలయం వారితోనే నిత్యం సంప్రదింపులతో ఉన్నట్లు తెలుస్తోంది. 

కాంగ్రెస్ లో హార్దిక్ పటేల్ ను వెంటాడుతున్న మరో భయం ఉంది. పాటీదార్లలో మంచి ఇమేజ్ గల ఖోడల్‌ధామ్ ట్రస్ట్ ఛైర్మన్ నరేష్ పటేల్ కాంగ్రెస్‌లో చేరవచ్చని మీడియాలో కథనాలు రావడంతో ఆందోళన చెందడం ప్రారంభించారు. 

ఆనందీబెన్ పటేల్ అనుచరులతో బెడద

పాటిదార్ల ఉద్యమం కారణంగా ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన ఆనందీబెన్ పటేల్‌కు ఇప్పటికి ఆ పార్టీలో గణనీయమైన అనుచరులు ఉన్నారు. వారు అతనిని అంత తేలికగా వదిలివేసే అవకాశం లేదు. 

ఇలా ఉండగా, కాంగ్రెస్ కు రాజీనామా చేయడానికి హార్దిక్ చెప్పిన కారణాలు హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి.  తన సొంత కులానికి రేజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ప్రముఖునిగా వెలుగొందుతున్న హార్దిక్ పటేల్ `కులతత్వ’ పార్టీ అని ఆరోపిస్తూ కాంగ్రెస్ నుండి బైటకు రావడం చూస్తే తన రాజకీయ భవిష్యత్ పట్ల ఎంత  ఆత్రుతతో ఉన్నారో వెల్లడవుతుంది.

పొంతనలేని విమర్శలు 

పైగా. గత మూడేళ్లుగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నా.. తనకు పని లేదని, కాంగ్రెస్‌ గుజరాతీ వ్యతిరేకి అని, కాశ్మీర్‌ విలీనానికి కాంగ్రెస్‌ అడ్డుపడుతోందని, గుజరాతీలిద్దరినీ (అంబానీ, అదానీ) కాంగ్రెస్‌ ఎప్పుడూ విమర్శిస్తున్నదని అంటూ పొంతనలేని విమర్శలు గుప్పించారు.  అతని విమర్శలు రాజకీయ వర్గాలలో వినోదం కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ లో తనకు పనిలేదని గ్రహించడానికి మూడేళ్లు పట్టిందా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. 

చలసాని నరేంద్ర 

Narendra Chalasani
రచయిత సీనియర్ జర్నలిస్టు, మానవ హక్కుల కార్యక్రమాలలో క్రియాశీలక భాగస్వామి. ప్రజాస్వామ్య, ఉదారవాద విలువల పట్ల ప్రగాఢమైన విశ్వాసం కలవారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles