Saturday, July 13, 2024

నిజం బతికే రోజు రావాలి!

అబద్ధం – దర్జాగా బతికి ఏదో ఒక రోజు ఛస్తుంది. నిజం – రోజూ ఛస్తూ, ఏదో ఒక రోజు బతికి భవిష్యత్తులో చరిత్రగా మారుతుంది. అటు తర్వాత అది అనునిత్యం బతుకుతుంది. శాస్త్రీయ దృక్కోణం లేని సాహితీవేత్తలు, కళాకారుల వల్ల సమాజానికి జరిగే మేలు కన్నా కీడే ఎక్కువ! ఒకప్పటి పురాణ రచయితల వల్ల ఆధునిక సమాజం కూడా ఎలా అతలాకుతలం అవుతుందో గమనించండి.  8,800 శ్లోకాలతో వ్యాసుడు రాసిన ‘జయం’ అనే ఒక కట్టు కథను, వైశంపాయనుడు 24 వేల శ్లోకాలకు పెంచాడు. దానికి ‘భారతం’ అని పేరు పెట్టాడు. కొంతకాలానికి దానికే మరో 76 వేల శ్లోకాలు జోడించి,  ఆ గ్రంథాన్ని లక్ష శ్లోకాలకు విస్తరించాడు. అప్పుడు దాన్ని ‘మహాభారతం’ అన్నాడు. ఆ తర్వాత ఆ కథలో అనేక ప్రక్షిప్తాలు చేరిపోయాయి. అందుకే మనం అర్థం చేసుకోవాల్సిందేమంటే ‘మహాభారతం’ చారిత్రక గ్రంథం కాదు – కాలేదు. పైగా పురాణాల ద్వారా హిందూ ధర్మం మనకిచ్చిన వరాలు కొన్ని ఉన్నాయి. అవి, బాల్య వివాహాలు, సతీ సహగమనం, వైధవ్యం, జోగినీ వ్యవస్థ, వరకట్నం వగైరా. ఇవి స్త్రీలను అణిచిపెట్టడానికి ఎంతగా ఉపకరించాయో అందరికీ తెలుసు. ఇక కులవ్యవస్థ, అంటరానితనం, బలులు, కన్యాశుల్కం, ఇతర మూఢనమ్మకాలు ఎన్నో, ఎన్నెన్నో. ఇవన్నీ గొప్పతనాలా? సంస్కృతీ సంప్రదాయాల పేరిట కొనసాగించిన ముఢనమ్మకాలా? ఇవి వరాలా? లేక శాపాలా? ఇంగిత జ్ఞానంతో ఎవరికి వారే ఆలోచించుకోవాలి! మారుతున్న కాలాన్ని, జరుగుతున్న వైజ్ఞానిక ప్రగతిని గమనించకుండా పురాణాలకు అనుగుణంగా ఆధునిక వ్యవస్థ ఉండాలనుకోవడం బుద్ధితక్కువ. ఆధునికంగా జీవిస్తూ, వేల ఏళ్ళ నాటి విలువల్ని ప్రతిష్టించుకోవాల్సిన అవసరాన్ని కొందరు ‘చదువుకున్న నిరక్షరాస్యులు’ నొక్కి చెబుతుంటారు. ప్రజలు అలాంటి వారి నోళ్ళు మూయించాలి!

Also read: నిజాం దుష్టపాలన అంతమైన రోజు

చదువుకున్న అవివేకులు

‘చదువుకున్న అవివేకులు’ తమ ఇళ్ళలో పెళ్ళిళ్ళు జరిగితే , సీతారాముల పెళ్ళిలోని తలంబ్రాల ఘట్టం పెళ్ళి పత్రికల్లో ముద్రించుకుంటున్నారు. కొత్త జంటను సీతారాముల్లా వర్థిల్లమని దీవిస్తున్నారు. భజంత్రీలను సీతారాముల కళ్యాణం పాటలు వాయించమంటారు. ప్రేమకు, అన్యోన్యతకు ప్రతినిధులై సీతారాముల జంట ఉన్నట్టు – రామాయణంలోనే లేదు. ‘అమ్మో సీతకష్టాలు’ అనే పదం ఈ నాటికీ వాడుకలోఉంది. కొత్త జంటల్ని సీతారాముల్లా ఉండమనడం ఏమైనా తెలివిగల పనా? ఒక్కసారి ప్రజాకవి వేమన పద్యాలు తిరగేస్తే అసలు నిజాలు తెలుస్తాయి.

కనక మృగము భువిని కద్దు లేదనకుండ

తరుణి విడిచిపోయె దాశరథియు

తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా?

విశ్వదాభిరామ వినురవేమ.

వెర్రి కుక్కల వలె వేదములు చదివేరు

అన్వయంబునెరుగరయ్యవార్లు

వేదవిద్యలెల్ల వేశ్యలవంటివి 11విశ్వ11

తల్లితో రమించె తండ్రి యజ్ఞము చేసి

తనయుడట్లె రంభ తనరగూడె

తల్లిని రమింత్రు దబ్బుర విప్రులు 11విశ్వ11

వేదాలు, పురాణాలు ఎంత సంస్కార హీనంగా రాయబడ్డాయన్నది మేమనే కాదు, ఆయన తర్వాత హేతువాద రచయితలు ఎత్తి చూపుతూనే ఉన్నారు. దేవుడి పేరుతో, భక్తి పేరుతో గుడ్డిగా విశ్వసించేవారు – వారి విశ్వాసాల్లోవారు ఉండొచ్చు. కానీ, విశ్వాసాల్లో లేనివారిని, హేతుబద్ధంగా విశ్లేషించుకునేవారిని బూతులు తిట్టే అర్హత వారికి ఉండదు. వారి వాదనని వారు సంస్కారవంతంగా వనినిపించొచ్చు. బూతులు తిడితే తాము సంస్కారహీనులమని వారికి వారే ఢంకా బజాయించుకున్నట్టు-

‘దేవుడిదయ’ అనడం ఎందుకు?

మత బోధకులు ఏం చేశారు? సహాయపడినవారికి కృతజ్ఞతలు  చెప్పడం కూడా నేర్పించలేదు. పైగా మనుషుల్ని అవమానపరిచే పదం నేర్పారు. ‘‘దేవుడి దయవల్ల’’ అని అనమన్నారు. కృతజ్ఞతాభావం ఉంటే అది సహాయపడినవారికే నేరుగా వ్యక్తం చేయాలి కదా? ‘‘దేవుడిదయ’’ అనే పదం మనుషుల్ని అవమానపరిచేది.  మనువాదులు మతవాదులు అంతేకదా? వారు మనుషుల్ని మనుషులుగా ఎప్పుడు గుర్తించారు గనక? అయినా సహాయపడ్డవాడికీ, సహాయం తీసుకున్నవాడికీ మధ్య దేవుణ్ణి ఎందుకు జొప్పించారో – దాని వెనుక జరిగిన కుట్ర ఏమిటో అర్థం చేసుకుంటే మంచిది. అబద్ధాన్ని నిలబెట్టాలనుకునేవారికీ, నిజాల్ని ప్రకటించేవారికీ పొసగదు. తటస్థంగా ఉండేవారంతా ఆలోచించుకోవాలి. దేన్ని ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలి. అబద్ధం వైపు భ్రమల వైపు ఉన్నవారు కూడా ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది. ఆ అబద్ధపు పవిత్ర గ్రంథాల ప్రభావం సమకాలీన సమాజంపై ఎలా పడుతూ ఉందో రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం.

Also read: వైజ్ఞానిక స్పృహకోసం ఒక రోజు – 20 ఆగస్టు

హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓ తండ్రి ఘోరం – ఉన్నట్టుంటి ఇంటి నుండి చిన్న కూతురు మాయమైంది. పోలీసులకు రిపోర్టిచ్చారు. వారు ఆచూకీ తీసి, అమ్మాయిని వెతికి ఇంట్లో ఒప్పగించారు. అప్పుడు చిన్న కూతురు పారిపోవడానికి కారణం చెప్పింది. తన తండ్రి తనమీద అఘాయిత్యం చేస్తున్నాడని! అది విని ఇంట్లోంచి పెద్ద కూతురు కూడా ముందుకొచ్చి పోలీసుల ముందు అదే విషయం చెప్పింది. అంటే- ఆ తండ్రి తన ఇద్దరు కూతుళ్ళపై ఒకరికి తెలియకుండా మరొకరిపై అఘాయిత్యం చేస్తున్నాడని తేలింది. ఒకే ఇంట్లో అక్కాచెల్లెళ్ళిద్దరూ వారి తండ్రి వల్లే చితికిపోయారని పోలీసులు తేల్చారు. నిందితుణ్ణి అరెస్టు చేసి తీసుకెళ్ళారు. ఇది 21 జనవరి 2021నాటి ఘటన. మానవవాదులు ఎన్నడూ ఇలాంటి ఘటనల్ని సమర్థించరు. అక్రమ సంబంధాలతో రాయబడ్డ మతగ్రంథాల్ని అర్ధనిమీలిత నేత్రాలతో విని పరవశించిపోయేవారే ఆలోచించాలి. అర్ధరహితమైన వ్యాఖ్యలు చేయడంతో మతగురువులు ఎప్పుడూ ముందుంటారు. ‘‘బహిష్టు సమయంలో వంట చేసే మహిళ మరుజన్మలో వావి వరుసలు లేని వ్యభిచారిగా పుడుతుంది’’ అని అన్నాడు స్వామి కృష్ణాస్వరూప్ దాస్.  జీవశాస్త్రపరంగా బహిష్టు అంటే ఏమిటో అతనికి అవగాహన లేదు. మరుజన్మగురించి అవగాహన లేదు. వ్యభిచారాన్ని ఎవరు పెంచి పోషించారో అవగాహన లేదు. నోరుంది కదా వినే బకరాలున్నారు కదా అని ఏదో ఒకటి వాగడం ఎంతవరకు సబబూ?  ‘‘ఒరేయ్ నీ తల్లి బహిష్టు సమయంలో కూడా చిన్నప్పుడు నీకు పాలిచ్చిందిరా మనువాదీ!’’ అని  చెప్పాల్సినవాళ్ళు చెప్పాలి కదా? లేకపోతే అతని అజ్ఞానాన్ని గొప్ప జ్ఞానంగా భావిస్తూ ఉంటాడు.

Also read: నెహ్రూ ఆత్మకథ చదివి పొంగిపోయిన రవీంద్రుడు

హిందూమతంలో తప్పులే ఎన్నుతారా?

ఇలాంటి విషయం ఏదైనా చెప్పగానే ‘‘ఏం మీకు హిందూమతంలోని తప్పులే కనిపిస్తున్నాయా? ఇతర మతాల్ని, ఆ మత గ్రంథాల్ని, ఆ మత బోధకుల్ని విమర్శించరా?’’ అని తమ స్థాయిని తాము తగ్గించుకుని కొందరు మాట్లాడుతుంటారు. నిజానికి మానవవాదులు ఎవ్వరూ ఏ మతాన్నీ వెనకేసుకురారు. మతం అని అంటే, అది అన్ని మతాల గురించి చెప్పిన మాట!  మత విశ్వాసకులు అంటే అది అన్ని మత విశ్వాసకులు అని అర్థం. ప్రతిసారీ ఒక్కొక్క మతాన్ని ఉటంకిస్తూ చెప్పడం కుదరదు. అల్లాను ప్రసన్నం చేసుకోవడంకోసం, ఆయన ప్రేమకు పాత్రురాలు కావడం కోసం కేరళ పాలక్కడ్ జిల్లాలో గర్భవతి అయిన ముప్పయ్యేళ్ళ తల్లి, తన ఆరేళ్ళ కొడుకు గొంతుకోసం చంపేసింది. పాలకులే  కాదు. మత విశ్వాసాలున్న ప్రజలు కూడా ఈ దేశాన్ని త్వరితగతిన పాత రాతి యుగంలోకి తీసుకుపోవడానికి కృషి చేస్తున్నారు. మత విశ్వాసంతో పరిపాలన సాగిస్తున్న ప్రస్తత మత-కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ఎంత ఘోరంగా విఫలమౌతూ ఉందో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. కోవిడ్ ఉధృతిలో జనం శవాల గుట్టలుగా పేరుకుపోతుంటే దేశ నాయకుడు మాత్రం ఎలక్షన్ ర్యాలీలు నిర్వహిస్తూనే వచ్చారు. కుంభమేళాకు అనుమతి ఇచ్చి, 30 లక్షల మందిని పవిత్ర గంగా మురికి నీటిలో నగ్నంగా జలకాలాడించారు. రవీంద్రనాథ్ టాగూర్ వేషంతో బెంగాల్ వెళ్ళారు. బెంగాలీల మెప్పుకోసం బంగ్లా స్వాతంత్ర్య సమరంలో పాల్గొని జైలుకెళ్ళానని అబద్ధం చెప్పారు. కేరళ వెళ్ళి బైబిల్ సూక్తులు వల్లించారు. అన్ని చోట్లా, అన్ని వేళలా మూర్తీభవించిన మతవిశ్వాసంలా ఆయన రంగులు మార్చారు. ఇక సామాన్యుల్లో వైజ్ఞానిక స్పృహ పెంచడం ఎలాగని కొంతమంది రచయితలు, మేధావులు, సైన్సు సంస్థల కార్యకర్తలూ ‘తపన’ పడుతూనే ఉన్నారు. ‘‘కొందరికి దేవుడిపై నమ్మకం ఉంటే  ఉండొచ్చు. కానీ, దాని ఆధారంగా ఇతరులపై మతాన్ని రుద్దే హక్కు ఎవ్వరికీ ఉండదు’’అని అన్నారు ప్రపంచ ప్రసిద్ధురాలైన నర్స్ –ఫ్లోరెన్స్ నైటింగేల్!

Also read: ప్రభుత్వాన్ని ఎదిరించిన ఒంటరి వీరుడు సోల్జినిత్సిన్

భగవంతుడంటే తెలివితక్కువతనం

‘‘నా మానవత్వానికి మతం లేదు. నీ మతానికి మానవత్వం లేదు. అందుకే నీ మతం నాకు సమ్మతం కాదు’’- అని మావనవాదులు గట్టిగా చెబుతున్నారు. ఇందులో నిజానిజాలు అందరూ సీరియస్ గా ఆలోచించాలి. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో దమ్ తరి జిల్లాలో సంతానం లేని మహిళలు బోర్లాపడుకుంటే పూజారులూ, మంత్రగాళ్ళమని తిరిగే కొందరు పురుషులు వారి వీపుపై నుండి తొక్కుతూ వెళతారు. ‘టెక్నాలజీ’ పెరుగుతోంది కానీ జనంలో మూడనమ్మకాలు తగ్గడం లేదు. మనుధర్మ శాస్త్ర రీత్యా స్త్రీలు కూడా శూద్రులే – అయితే స్త్రీ గర్భం నుండి పుట్టిన అగ్రవర్ణంవారంతా శూద్రులు కాకుండా ఎలా ఉంటారూ? ఎవరూ సూటిగా సమాధానం చెప్పరు. నిచ్చెనమెట్ల సంస్కృతికి కాలం చెల్లింది. ‘‘తెలివితక్కువతనం ఈజ్ ఈక్వల్ టు – భగవంతుడు!’’-        అనే ఫార్ములా ఇచ్చాడు రాహుల్ సాంకృత్యాయన్! అదెలాగంటే…‘‘నీ తెలివితక్కువతనాన్ని ఒప్పుకోవడానికి సిగ్గుపడి ‘‘భగవంతుడు’’ అనే గౌరవనీయమైన పేరు పెట్టుకున్నావ్! అంటే. తెలివితక్కువతనం – భగవంతుడితో సమానం అయినట్టే కదా?’’ అన్నది రాహుల్ సాంకృత్యాయన్ ఆలోచన!

Also read: ‘హకూన మటాటా’: బాధలూ, ఒత్తిళ్లూ లేకుండా ఉండండి!

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles