Monday, November 11, 2024

వైఎస్ మిత్రులూ, అభిమానులూ ఏమంటారు?

  • ఆత్మీయులకు విజయమ్మ ఆహ్వానం
  • జ్ఞాపకాలు కలబోసుకోవడానికేననీ, రాజకీయాలకు అతీతమనీ స్పష్టీకరణ
  • మీడియా కారణంగా ప్రజలలో పెరిగిన ఆసక్తి
  • గురువారం హైటెక్స్ నోవాటెల్ లో సమావేశం

వైఎస్ సతీమణి విజయలక్ష్మి వైఎస్ మిత్రులకూ, అభిమానులకూ ఒక పరీక్ష పెట్టారు. అందరినీ వైఎస్ 12వ వర్థంతి సందర్భంగా నవాటెల్ హోటల్ కి గురువారం సాయంత్రం రావాలని ఆహ్వానించారు. వైఎస్ జ్ఞాపకాలు కలబోసుకోవడమే  ఉద్దేశమనీ, రాజకీయాలకు అతీతంగా సమావేశం జరుగుతుందనీ చెబుతూ ఆమె స్వయంగా వైఎస్ మిత్రులకు ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు. ఇది వైఎస్ 12వ వర్థంతి. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళి పుష్కరం. నది వంటి వైఎస్ జీవితం ప్రవహించే స్వభావం కలది. నదులకు పుష్కరాలు జరుపుకున్నట్టే వైఎస్ వెళ్ళిపోయిన తర్వాత పుష్కరకాలమైన సందర్భంగా మిత్రులనూ, అభిమానులనూ కలుసుకోవాలని విజయమ్మ ఆకాంక్ష. అది ఒక సమావేశంగా రూపుదాల్చింది.

భార్య విజయలక్ష్మితో వైఎస్ఆర్

మిత్రుల సంశయం

వెళ్లుటయా, వెళ్ళకుండుటయా అనే సంశయంలో కొట్టుమిట్టాడుతూ ఒకరికి ఒకరు ఫోన్ చేసుకొని చర్చించుకుంటున్నారు. వైఎస్ తనయ షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పేరుతో ఒక రాజకీయ పార్టీని వైఎస్ జయంతి జులై 8న స్థాపించారు. ఇప్పుడు వర్థంతి సందర్భంగా సభ అంటున్నారు. ఈ రెండింటికీ సంబంధం లేదని విజయమ్మ చెబుతున్నప్పటికీ సంబంధం లేకుండా ఎట్లా ఉంటుంది? ఈ సమావేశానికి షర్మిల హాజరవుతుందని అంటున్నారు మరి జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరవుతారా?  అసలు ఆయనను విజయమ్మ ఆహ్వానించారా? తండ్రి జయంతి, వర్థంతి సందర్భంగా అన్నా చెల్లెలు కలసి కాకుండా విడివిడిగా శ్రద్ధాంజలులు ఘటిస్తున్నారు. ఇది పైకి కావాలని చేస్తున్న తమాషానా లేక నిజంగానే సోదరుడికీ, సోదరికి మధ్య విభేదాలు ఉన్నాయా?

చరిత్రాత్మకమైన పాదయాత్ర

జగన్ మోహన్ రెడ్డి జైలులో ఉన్నప్పుడు రాష్ట్రం ఈ మూల నుంచి ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించిన సాహసవంతురాలు షర్మిల. భారత రాజకీయ చరిత్రలో అన్ని మైళ్ళు పాదయాత్ర చేసిన మహిళ ఎవ్వరూ లేరు.  ఆమెకు కనీసం రాజ్యసభ సీటు కూడా ఇవ్వకుండా ఇంటికే పరిమితం చేయడం జగన్ మోహన్ రెడ్డి పొరపాటు అని కొందరు అంటున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మంత్రిపదవి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ పదవికి పరిమితం చేసి చంద్రబాబునాయుడు తప్పిదం చేసినట్టే, రాష్ట్ర విభజనకు కారణమైనట్టే,  షర్మిలకు పదవి ఇవ్వకుండా జగన్ మోహన్ రెడ్డి కూడా తప్పు చేశారని వాదించేవారు ఉన్నారు. ఈ కారణంగా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తలనొప్పికి కారణమైనారని అంటున్నారు. షర్మిలపై దాడి చేయడం ఇష్టం లేకా దాడి చేయకుండా ఉండలేకా ఆయన ఇబ్బంది పడుతున్న విషయం తెలుస్తూనే ఉంది.  షర్మిల మాత్రం కేసీఆర్ పైనే దాడి చేస్తున్నారు.

వైఎస్ ఆర్ కి శ్రధ్ధాంజలి ఘటిస్తున్న నాటి ప్రధాని డాక్డర్ మన్మోహన్ సింగ్

నిజంగా షర్మిలకు అన్నపైన అలక ఉంటే, అన్నకు గుణపాఠం చెప్పాలనీ, అన్న సంగతి చూడాలనీ  పట్టదల ఉంటే ఆంధ్రప్రదేశ్ లోనే పార్టీ పెట్టవచ్చు కదా తెలంగాణలో ఎందుకు అని ప్రశ్నించుకుంటున్నారు. ఆంధ్రలోనే పార్టీ పెట్టి  నిరుడు హత్యకు గురైన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీతను వెంటబెట్టుకొని పాదయాత్ర చేసి ఉంటే జగన్ మోహన్ రెడ్డికి కష్టాలు మొదలయ్యేవి కదా?  ఆ పని చేయకుండా తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టడం? దీనివల్ల లాభం ఏమున్నది? తెలంగాణ రాజకీయవాదులలో వైఎస్ అభిమానులు ఉన్నమాట వాస్తవమే. కానీ వారు వివిధ పార్టీలలో చేరిపోయి ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఇప్పుడు షర్మిలమ్మ పెట్టిన పార్టీలో చేరడానికి సీనియర్ నాయకులు ఎవ్వరూ సిద్ధంగా లేరు. పార్టీలో చేరడానికి కాదు టీపార్టీకి హాజరు కావడానికి కూడా సంకోచిస్తున్న పరిస్థితి.

తండ్రి వైెఎస్ ఆర్ నేపత్యంలో కుమారుడు జగన్ మోహన్ రెడ్డి

వైఎస్ తెలంగాణ రాష్ట్ర వాదానికి వ్యతిరేకమా, కాదా?

వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేమనీ, సమైక్య ఆంధ్రావాది అనీ టీఆర్ఎస్ నాయకులూ, కాంగ్రెస్ నాయకులూ విమర్శిస్తున్నారు. వైఎస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకం కాదని షర్మిల వాదించినా ఎవ్వరూ నమ్మరు. ఆ వాదాన్ని తెలంగాణ ప్రజలు నమ్మితే షర్మిలకు లాభం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మితే జగన్ కు నష్టం. తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకమే కానీ తెలంగాణ ప్రాంతానికీ,  తెలంగాణ ప్రజలకూ వ్యతిరేకం కాదని ఆమె వాదించవచ్చు. తెలంగాణ ప్రజలని ఆంధ్రప్రదేశ్ ప్రజలతో సమానంగా ప్రేమించారని చెప్పవచ్చు. తెలంగాణలో ఆయన చేపట్టిన జలయజ్ఞం తాలూకు ప్రాజెక్టులనూ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలనూ వల్లె వేయవచ్చు. హైదరాబాద్ లో ఐఐటీనీ, పివి నరసింహారావు ఎక్స్ ప్రెస్ హైవేనీ, శంషాబాద్ లో రాజీవ్ గాంధీ విమానాశ్రయాన్నీ, రింగ్ రోడ్డునీ, మరెన్నో ఘనకార్యాలను వైఎస్ చేసిన మేళ్ళుగా ఉటంకించవచ్చు. వాటిని ఎవ్వరూ కాదనే అవకాశం లేదు. కానీ తెలంగాణవాదం నరనరానా జీర్ణించుకున్న తెలంగాణ ప్రజలు తెలంగాణ  రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకించిన వైఎస్ కుమార్తె పెట్టిన పార్టీకి ఓట్లు వేస్తారా అన్నది వైఎస్ అభిమానులు అడుగుతున్న ప్రశ్న.

తెలంగాణ నాయకులకే ప్రాధాన్యం

గురువారం సాయంత్రం సమావేశానికి తెలంగాణ ప్రాంతం నుంచే ఎక్కువ మందిని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ పాలకపక్షం నుంచీ, ప్రభుత్వం నుంచీ ఎక్కువ మందిని పిలవలేదు. కెవిపి రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్,  బొత్ససత్యనారాయణ, భూమా కరుణాకరరెడ్డి, రఘువీరారెడ్డి, వరదరాజులురెడ్డి వంటి మిత్రులను మాత్రమే పిలిచారు. మైసూరారెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి వంటి స్నేహితులను సైతం ఆహ్వానించారు. తెలంగాణ నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు డిఎస్ శ్రీనివాస్, ప్రస్తుత విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ స్పీకర్, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, సునీతా లక్ష్మారెడ్డి,  సురేష్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, గీతారెడ్డి, శ్రీధర్ బాబు, బీజేపీ నాయకురాలు డికె అరుణ వంటి నేతలను విందుకు ఆహ్వానించారు. జర్నలిస్టు ప్రముఖులలో ఏబికే ప్రసాద్ నూ, ప్రొఫెసర్ నాగేశ్వర్ నూ, ఇతరులనూ ఆహ్వానించారు. మొత్తం మీద తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులూ, మేదావులకే ఎక్కువగా ఆహ్వానం వెళ్ళింది.

తండ్రి వైఎస్ఆర్ నేపథ్యంలో షర్మిల పోస్టర్

సభకు హాజరైనవారిని వైఎస్ జ్ఞాపకాలను ఇతరులతో పంచుకోవలసిందిగా కోరే అవకాశం ఉంది. ఎవరు ఏమని మాట్లాడతారు? ఎంత సేపు మాట్లాడతారు? మనసు విప్పి మాట్లాడతారా, పైపైన నాలుగు మాటలు చెప్పి విరమిస్తారా? అన్నది వైఎస్ అభిమానులూ, షర్మిల అభిమానులూ, వ్యతిరేకులూ, తటస్థులూ సమాధానం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న  ప్రశ్నలు.

పాదయాత్ర ప్రాముఖ్యం

ఈ సమావేశం వల్ల షర్మిలకు రాజకీయంగా ప్రయోజనం ఉంటుందా, ఉండదా అనేది చెప్పడం కష్టం. ప్రస్తుతానికి షర్మిల పార్టీ పట్ల ప్రజలలో గొప్ప అభిప్రాయం కానీ అభిమానం కానీ లేవు. ఒక తటస్థ వైఖరి కనిపిస్తోంది. కానీ అక్టోబరులో పాదయాత్ర ప్రారంభించిన తర్వాత పరిస్థితిలో మార్పు వస్తుందని షర్మిల ప్రగాఢ విశ్వాసం. మామూలు పాదయాత్రలాగా సాగితే షర్మిల కష్టం ఫలించకపోవచ్చు. పాదయాత్ర సాందర్భంగా మహిళలతో కనెక్ట్ అవుతే, వారితో బలమైన అనుబంధం ఏర్పడితే ఆమె జైత్రయాత్రను ఎవ్వరూ ఆపలేరు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles