Thursday, April 25, 2024

వైకాపా కార్యకర్తల నిరాశ నిజమేనా?

గత వారం రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన నిరసన ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి. ధరలు తగ్గాలంటే జగన్ పోవాలని ప్రజలకు వివరిస్తూ ఊరూరా తీసిన ర్యాలీలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఇది తెలుగుదేశం పార్టీలో కొత్త జోష్ నింపడానికి ఎంతగానో సహకరిస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు వీధుల్లోకి వచ్చినా, ప్రజలు పెద్దగా పట్టించుకుంటారన్న నమ్మకం ఆ పార్టీలో పెద్ద తలకాయలకే లేదన్న సంగతి ఇటీవల సోషల్‌ మీడియా హల్ చల్ చేసిన వీడియో మనకు చెప్పకనే చెప్పింది. గడచిన రెండేళ్లుగా ఆ పార్టీ చీఫ్ తన సకుటుంబ సపరివార సమేతంగా పొరుగు రాష్ట్రంలో నివసిస్తోండడం ఆ పార్టీ కార్యకర్తలకు సైతం మింగుడుపడని విషయం . మింగలేక కక్కలేక బిక్క చచ్చిపోయిన పార్టీ కేడర్లో సరికొత్త జోష్ నింపడానికి చేపట్టిన ఈ ధరల పెరుగుదల నిరసన ప్రదర్శనలకు సైతం ఎలాంటి స్పందన లభించనుందో పార్టీలో పెద్దలకే కాదు, ప్రజలందరికీ తెలిసిందే. అందుకే చాలా లెక్కలు వేసుకుని జిల్లాలో కేవలం రెండు మూడు చోట్ల మాత్రమే జిల్లా నాయకత్వం ఈ బల ప్రదర్శన’ చేపట్టింది. శ్రీకాకుళం జిల్లాలో గొప్ప ఎత్తుగడతో టెక్కలి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. కీలక సమయాలలో సైతం తన ప్రజలకు అందుబాటులో లేని టెక్కలి శాసనసభ సభ్యులు ఈ సారి కోటబొమ్మాళిలో వందలాది జనాలను మోహరించి ప్రభుత్వానికి స్పష్టమైన సందేశాన్ని పంపారు. అచ్చెన్నను నిలువరించడానికి అధినాయకుడు పావుగా పెట్టిన దువ్వాడ సరికొత్త పాఠాలు నేర్వాల్సింది ఇప్పుడే.

Also read:దక్షిణాదిలో బహుజన రాజకీయాలు బలపడనున్నాయా?

కార్యకర్తలకు తెలియాల్సిన విషయాలు

దీనిని భూతద్దంలో చూపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులు జగన్ పని అయిపోయినట్లేనని ప్రచారం మొదలుపెట్టారు. రెండున్నరేళ్ల తర్వాత రానున్న ఎన్నికలలో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేస్తున్నట్టే పగటి కలల్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుత ప్రభుత్వం నడుస్తున్న తీరులో ఆ పార్టీ కార్యకర్తలకు తీవ్ర నష్టం వాటిల్లిపోతున్నట్లు గుండెలు బాదుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో జగన్ పార్టీ కార్యకర్తలలో ఏ కొందరైనా అదేవిధంగా భావిస్తున్నట్లయితే ఆ తప్పు వారిది కాదు. ఆ పార్టీ నేతలదే. ఈసారి జగన్ నేతృత్వంలో అధికారం చేపట్టిన ప్రభుత్వపు తీరుతెన్నులను తమ పార్టీ కార్యకర్తలకు స్పష్టంగా వివరించడం లేదన్న మాటే. ఈ ప్రభుత్వ పనితీరును, తమ ప్రాథమ్యాలను వారికి స్పష్టంగా వివరించడం లేదన్న మాటే. ప్రస్తుత ప్రభుత్వం మూడు మార్గాలలో పాలన చేస్తోందన్న సంగతి తన పార్టీ కార్యకర్తలకు సైతం తెలియజేయడం లేదన్న మాటే. ప్రపంచానికి జాడ్యంలా పట్టిన కరోనా మన జీవితాలను అల్లకల్లోలం చేసింది. కొన్ని మాసాల పాటు లాక్ డౌన్ వల్ల కొన్ని కోట్లమంది తాము చేస్తోన్న పనులకు దూరమై తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి మనకు తెలిసిందే. అలాంటి సమాజంలో కేవలం పొట్టకూటి కోసం నేరాలు జరగకుండా ఉండడానికి వివిధ రూపాలలో ప్రజలందరికీ డబ్బు చేరాలి. దీని గురించే మన పారుగు రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్ మనీ ల్యాండింగ్ చేయాలని కేంద్రాన్ని కోరారు. అనేక పథకాల రూపంలో జగన్ చేస్తోంది అదే. దీనినే మన మేధావులు డబ్బుల పందేరంగా అభివర్ణిస్తున్నారు. రానున్న రోజుల్లో నిబంధనలు విధించి ఈ లక్షలాది లబ్ధిదారులలో ఒక వందమందిని తగ్గించినా తిరిగి గగ్గోలు పెట్టేది కూడా వీరే. జగన్ ఏది చేసినా వ్యతిరేకించడమే వారి పని.

Also read: పార్లమెంటులో ప్రతిసారీ అదే తంతు


వేళ్ళూనుకున్న అవినీతి

అన్ని కాలాల్లోను, అన్ని దేశాల్లోను మనిషి తన జీవితం సాఫీగా సాగిపోవడానికి ఏ అడ్డదారి తొక్కడానికైనా తెగించడానినే మనం అవినీతి అంటున్నాం. ఇచ్చేవారు, పుచ్చుకునేవారు ఇద్దరూ పరస్పరం సహకరించుకుని అవినీతికి పాల్పడుతారు. ఈ అవినీతిని రూపుమాపడం మనిషికి సాధ్యపడని విషయం. ప్రభుత్వం తలచుకుని అత్యంత కఠినంగా వ్యవహరించినప్పటికీ సమాజంలో వటవృక్షంలా వేళ్లూనుకున్న అవినీతిని కూకటివేళ్లతో పెకిలించడానికి కొన్ని దశాబ్దాలు పడుతుందనడంలో ఆశ్చర్యం లేదు. కొంచెం అతిశయోక్తిగా అనిపించినప్పటికీ మన రాష్ట్రంలో ఆ ప్రయత్నానికి బీజాలు పడ్డాయి. అందుకే చిన్నచిన్న అడ్డదారులు తొక్కడానికి సోపానాలుగా ఇన్నాళ్లు ఉపయోగపడిన రాజకీయ అందలాలు ఇప్పుడు ఎవరికీ అందడం లేదు. బదిలీలు, డెప్యుటేషన్లు, పదోన్నతులు, పైరవీలు పార్టీ కార్యకర్తలకే కాదు శాసనసభ సభ్యులకు కూడా అందని మావిపళ్లుగా మారిన సంగతి ఇప్పుడిప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈ విషయంలో ఆమాత్యుల, ఉపముఖ్యమంత్రుల మాటకు సైతం విలువ లేని సచివాలయంలో పార్టీ కార్యకర్తల సంగతి చెప్పనవసరం లేదు. ఈ విషయం అర్థం కానంతవరకు తెల్లచొక్కాల ఈగోలు హర్టవుతూనే ఉంటాయి. ఇలా గుండెలు బద్దలయిన ఎందరో సీనియర్ శాసనసభ్యులు సైతం శ్రీకాకుళం మొదలుకుని రాష్ట్రవ్యాప్తంగా మౌనాన్ని ఆశ్రయించారు.

Also read: వారు బయటకొస్తారా?

ప్రభుత్వ ప్రాథమ్యాలు

ఇక ముఖ్యమైన మూడవ అంశం ప్రభుత్వ ప్రాధాన్యతలు. విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాలకు అవసరమైన దానికంటే ఎక్కువ నిధులను మంజారు చేయడమే కాకుండా, వాటి అమలును పర్యవేక్షించడం, సమీక్షలు నిర్వహించడం, అడుగడుగునా దిగువనున్న లబ్దిదారుల అంతిమ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకోవడం వంటి కీలకమైన అంశాలు ప్రభుత్వ ప్రాధాన్యతలను విస్పష్టంగా చెప్తున్నాయి. నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను పోల్చుకోలేనంతగా మార్చడం దగ్గరనుంచి, పిల్లలు తినే తిండి నుంచి వేసుకునే దుస్తులు, వాడే బూట్ల వరకు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అత్యంత శ్రద్ధతో రూపొందించడం పాలకుడికి విద్యపట్ల ఉన్న నిబద్ధతను తెలియజెప్తాయి. రైతు భరోసా కేంద్రాలు అందిస్తున్న సేవలలో దొర్లిన లోపాలను భూతద్దంలో చూడడం కాదు, ఇవి రైతులకు సహాయపడగల కేంద్రాలుగా మలచడంలో ప్రభుత్వం తీసుకుంటున్న క్రమానుగత పరిణామాలను పరిశీలించాలి. ఆరోగ్యరంగంలో మునుపెన్నడూ చూడని విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ప్రభుత్వ ఆసుపత్రులను, వైద్య కళాశాలలను మెరుగుపరుచుకుంటూ రావడం ఈ ప్రభుత్వ విధానంలో ఒక భాగమని మనం గుర్తించాలి. ఇదే అసలు సిసలు అభివృద్ధి అని కార్యకర్తలు గమనించాలి.

Also read: జల జగడం

ప్రతిసారీ పోల్చి చూడాలి

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో జరిగిన దానికన్నా జరుగుతుందనే మత్తులోనే ప్రజలను ఉంచారు. దానికి ఆయన సొంత మీడియా వంతపాడింది. చేసినదాని కంటే చేస్తారని చెప్పిందే ఎక్కువైంది. ఆంధ్రరాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించలేని సంగతి ఆయన చేసిన దుబారా. రాజధాని ఆలోచనల కోసం ఆయన చేసిన విదేశీ పర్యటనలు, ఆయన మంత్రులు చేసిన ఖర్చువెచ్చాలు, ఆయన అధికారులు చేసిన డాబుదర్సాలు, అందుకోసం ప్రభుత్వ ఖజానాను గుల్ల చేయడం ఎవ్వరూ పూడ్చలేనిది. పోలవరం చూడడానికి వందల బస్సుల్లో ప్రజలను తీసుకెళ్లడానికి చేసిన ఖర్చులు గుండెల్లో గాబరా తెప్పిస్తాయి. పదేపదే గ్రాఫిక్స్ చూపించి కాలం గడపడాన్ని అసహ్యించుకున్న ప్రజలు 151 స్థానాల్లో జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుత ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో తన సామాజిక వర్గానికి, తన పార్టీ కార్యకర్తలకు, తన కొమ్ముకాసిన పత్రికలకు జరిగినట్టు జరగడం లేదని వైకాపా కార్యకర్తలు భావిస్తున్నట్టయితే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. అలా తన పాలన సాగినందుకే 21తో ప్రజలు సరిపెట్టారు. ఈ కొత్త రాజకీయ సరళిని వైకాపా కార్యకర్తలు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే రాష్ట్ర ప్రగతి అంత త్వరగా సాగుతుంది.

Also read: సిక్కోలు రైతుకు బాసట

(రచయిత మొబైల్: 9989265444)

రవికుమార్ దుప్పల
రవికుమార్ దుప్పల
దుప్పల రవికుమార్ సిక్కోలు బుక్ ట్రస్ట్ ప్రధాన సంపాదకులు. ఆంగ్ల అధ్యాపకులు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మొబైల్ : 99892 65444

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles