Sunday, October 13, 2024

హింస… అహింస

గాంధీయే మార్గం-24 

అది 1917. అహ్మదాబాదులో ప్లేగ్‌ వ్యాపించింది. బట్టల మిల్లుల యజమానులు పనివాళ్ళ భత్యం పెంచి వారు వెళ్ళిపోకుండా జాగ్రత్తపడ్డారు. కొంతకాలం గడిచింది. ప్లేగు తగ్గుతోంది. మిల్లుల యజమానులు భత్యం ఇవ్వడం మానివేశారు. అదే సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణంతో పెరిగిన ధరలు. ఇలాంటి సమయంలో భత్యం ఆపి, జీతం పెంచక పోవడం కార్మికులకు సమస్య అయ్యింది. మిల్లు యజమానులు వినడం లేదు. 

గాంధీ తొలి నిరాహారదీక్ష, మిల్లు కార్మికుల విజయం

కార్మికులు గాంధీజీ దగ్గరకు వచ్చారు. అప్పటికి ఆయన చంపారణ్యం నీలిమందు రైతుల సమస్యలను సత్యాగ్రహంతో దారికి తెచ్చారు. గాంధీజీ ప్రవేశించిన తర్వాత కూడా మిల్లుల యాజమాన్యం 20 శాతం  బోనస్‌ దగ్గర ఆగింది. గాంధీజీ 35 శాతం పెంపు ప్రతిపాదించారు. మిల్లు యాజమాన్యం అంగీకరించలేదు. దాంతో గాంధీజీ సమ్మె చేయాలని కార్మికులకు సూచించారు. అయితే,  సమ్మె కార్మికులు విధిగా కొన్ని నిబంధనలు పాటించాలి – అవి ఏమిటంటే… అహింస, యాజమాన్యానికి విధేయులైన కార్మికులకు హాని చేయకపోవడం, మిల్లు ఆస్తి నష్టం చేయకుండటం, దృఢదీక్షతో సాగడం. సమ్మె మొదలైంది. 

Also read: గాంధీ సినిమా అజ్ఞాత తపస్వి మోతీలాల్ కొఠారీ

ప్రతిరోజూ సబర్మతి ఒడ్డున గాంధీజీ ప్రసంగించేవారు. రోజూ ఒక న్యూస్‌ బులెటిన్‌ గాంధీజీ విడుదల చేసేవారు. కొన్ని రోజుల తర్వాత వచ్చే కార్మికులు తగ్గిపోయారు. కార్మికులను సంఘటితం చేయడానికి గాంధీజీ నిరాహారదీక్షకు దిగారు. దీంతో కార్మికులే కాదు, యాజమాన్యం కూడా కదిలి వచ్చి 35 శాతం పెంపుకు అంగీకరించింది. మొత్తం వివాదం ట్రిబ్యునల్‌కు అప్పగించాలని నిర్ణయించారు. 

అది ప్రజా ప్రయోజనం కోసం భారతదేశంలో జరిగిన గాంధీజీ మొదటి నిరాహారదీక్ష.  సత్యం అహింసల ఆధారంగా గాంధీజీ సత్యాగ్రహ భావనను రూపకల్పన చేశారు.

గాంధీ తొలి సత్యాగ్రహం 

11  సెప్టెంబరు 1906న దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బెర్గ్‌ పట్టణంలో ఎంపైర్‌ థియేటర్‌లో అక్కడి  ప్రభుత్వం ప్రతిపాదించిన ఆసియాటిక్‌ రిజిస్ట్రేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తూ గాంధీజీ సత్యాగ్రహ భావనను ప్రతిపాదించారు. అప్పటికి అది పూర్తిగా కొత్త ఆలోచన. సత్యంలో అహింస కూడా అంతర్భాగమంటారు గాంధీజీ. 

 అహింస గురించి గాంధీజీ ఆలోచనలు ఏమిటో చూద్దాం: 

 1920 ఆగస్టు 18 యంగ్‌ ఇండియా సంచికలో గాంధీజీ ఇలా రాశారు:

‘‘… ప్రతి  చెడు తలపు, తగని తొందరపాటు, అనృతం, విద్వేషం, ఇతరులెవరైనా చెడిపోవాలనే కోరికా – ఇవన్నీ అహింసా సూత్రానికి విరుద్ధాలు. ప్రపంచానికి కావలసింది ఒకరు తన వద్ద ఉంచుకుంటే హింసించిన వాడౌతాడు. సత్యం, అహింసలు ఒకదానితో మరొకటి పెనవేసుకుని ఉంటాయి. అహింస సాధనం,  సత్యం సిద్ధి…’’

గాంధీజీ దృష్టి విలక్షణమైంది. ‘దక్షిణాఫ్రికా లో సత్యాగ్రహం’ గ్రంథంలో గాంధీజీ ఇలా అంటారు – “వేలాది వేల సంవత్సరాల నుండి పశుబలమే ప్రపంచాన్ని పాలిస్తోంది. దీని దుష్ఫలితాన్ని అనుభవించి, అనుభవించి మానవకోటికి రోత పుట్టింది. హింస వలన  ప్రపంచానికి మేలు జరుగదు. చీకటి నుండి వెలుతురు రాగలదా?

Also read: మానవ లోకానికే ధ్రువతార

‘‘హింసించి’’ హక్కులను స్థిరపరచుకోవడం తేలిక మార్గంగా కనిపించవచ్చు. కానీ పోను పోనూ ఇది కంటకావృత మార్గమవుతుంది. ఈతగానికి నీటి గండం, సైనికునికి కత్తి గండం తప్పదు.”

 (యంగ్‌ ఇండియా 1928 ఆగస్టు 6).

ప్రతీకారశక్తి ఉన్నా నిగ్రహం పాటించాలి

1922 ఫిబ్రవరి 9 సంచిక  యంగ్‌ ఇండియా పత్రికలో గాంధీజీ ‘‘ప్రతీకార శక్తి కల్గియుండి కూడా నేను అనేకసార్లు నిగ్రహించుకుని ఉన్నాను. జోరాస్టర్‌, మహావీరుడు, డానియేలు, ఏసుక్రీస్తు, మహమ్మద్‌, నానక్‌ మొదలగు అనేకమంది ప్రపంచ మహా ప్రవక్తల ప్రబోధాలను పఠించి నా జీవితాన్ని అహింసా సిద్ధాంత ప్రచారానికి అంకితం చేశాను…’’  

అదే పత్రిక 1922 జనవరి 26 సంచికలో ‘‘భారతదేశానికి  అహింసా విధానం తూచినటుల సరిపోతుంది. సామాన్య ప్రజలు తరతరాల నుండి అహింసా పద్ధతులు అవలంబిస్తున్నారు…’’

ఇంకా  అంటారు : ‘‘కోపం అహింసకు శత్రువు. ఇక, గర్వం అహింస పాలిటి రాక్షసి. గర్వం అహింసను మింగి ఊరుకుంటుంది… అహింస క్షత్రియుల మతం. మహావీరుడు క్షత్రియుడు. బుద్ధుడు క్షత్రియుడు. రామకృష్ణులు క్షత్రియులు. వీరందరూ అహింసా ప్రచారం చేశారు. వీరి పేరిట మనం అహింసను ప్రచారం చేయాలి.’’

 చాలా జాగ్రత్తగా గమనించి, వాస్తవికంగా గాంధీజీ వ్యాఖ్యానిస్తారు. ఆయన  ఉన్నత స్థాయి సిద్ధాంత కర్తే కాదు, చాలా నింపాది అయిన పూర్తి స్థాయి అనువర్తకుడు కూడా!  అహింస గురించి తెలుసుకోవాలంటే హింస పరిమితిని గుర్తించాలి కూడా. సృష్టించడం చేతగానివాడు చంపడంలో భాగస్వామి కాకూడదు అని గాంధీజీ భావన. అలాగే అహింసకు ఆనవాలు శాంతి, సహనం, ప్రేమ. గాంధీజీ భావన చాలా సమగ్రంగా, ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటుంది. 

Also read: అసలైన విప్లవవాది.. సిసలైన సిద్ధాంతకర్త!

అహింసా విధానం వేయి రెట్లు మెరుగు

హింసకు పరాకాష్ఠ చంపడం. చావుకు వ్యతిరేకం పుట్టుక. పుట్టుకకు మూలం స్త్రీ పురుషుల కలయిక. కనుక స్త్రీ పురుషుల సంయోగం ఒక శాంతిదాయకమైన చర్య అని కూడా ఆయన భావిస్తారు. ఇది చదవండి – గాంధీజీ ఇలా అంటాడు ‘యంగ్‌ ఇండియా’ పత్రిక  1920 ఆగస్టు 11 సంచికలో – 

‘‘నేను 1908వ సంవత్సరంలో దారుణమైన దౌర్జన్యానికి గురి అయ్యాను. ఆ దౌర్జన్యానికి నేను మరణించి ఉండవలసిందే. ఈ దౌర్జన్యం గురించి నా పెద్ద కుమారుడు ఇలా ప్రశ్నించాడు – ఆ సమయంలో నేను అక్కడే ఉండటం తటస్థించిందనుకోండి. మిమ్ములను హత్య చేయడం చూస్తూ నిలబడాలా లేక నా శక్తి కొలది బలాన్ని ఉపయోగించి మిమ్ములను కాపాడాలా?’’

బలాన్ని ఉపయోగించి నన్ను రక్షించటమే ధర్మమని అతనికి చెప్పాను అంటారు గాంధీజీ. అందువల్లనే బోయర్‌ యుద్ధంలో గాంధీజీ పాల్గొన్నారు. 

Also read: సంభాషించడం… సంబాళించడం!

“భారతదేశ పరువు ప్రతిష్ఠలకు భంగం కలుగుచుండగా పిరికిపందలవలే నిలబడటం కంటే భారతీయులు బలాన్ని ప్రయోగించి, గౌరవాన్ని కాపాడటం మంచిదంటున్నారు. కానీ హింసా విధానం కంటే అహింసా విధానం వేయిరెట్లు మెరుగని నా దృఢవిశ్వాసం.’’

కనుక గాంధీజీని అర్థం చేసుకోవాలంటే చాలా సూక్ష్మమైన మేధ అవసరం. అలాగే గాంధీజీ అహింసా విధానం పాటించాలంటే క్షమ, ఓపిక, పట్టుదల, ధైర్యం ఇంకా ఎక్కువ అవసరం. 

Also read: గాంధీని మించిన పోరాటశీలి – కస్తూరిబా!

–డా. నాగసూరి వేణుగోపాల్,

  ఆకాశవాణి పూర్వ సంచాలకులు,

  మొబైల్: 9440732392

Dr. Nagasuri Venugopal
Dr. Nagasuri Venugopal
A broadcaster by profession, media researcher by training, a staunch Gandhian in thought, and a science writer by passion, Dr. Nagasuri Venugopal writes prolifically on contemporary issues. He penned over 60 books and two thousand newspaper articles so far. He is a PhD in journalism.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles