Saturday, April 27, 2024

గాంధీజీ సిద్ధాంతాలు నాటి కంటే నేడు ఎక్కువ అవసరం

కొత్తపల్లి సీతారాము

మహాత్మాగాంధీజీ గురించి వ్రాయడమంటే నాలాంటి గాంధీజీ అభిమానికి గొప్ప ఉత్సాహం కలుగుతుంది. గాంధీజీ సిద్ధాంతాలు నాటికన్నా నేటి సమాజానికే చాలా అవసరం ఉన్నది. స్వాతంత్ర్యానికి పూర్వం ప్రపంచ సామాజిక, రాజకీయ, సాంకేతిక, ఆర్ధిక పరిస్థితులు ఒక విధంగా ఉండేవి. నేటి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. నాడు డెబ్భైశాతం ప్రజల జీవితం ఆహారాన్వేషణలోనే గడిచేది. సగం మందికి కడుపునిండా తినటానికి తిండి, వంటినిండా కట్టుకోడానికి బట్టలు ఉండేవికావు. అక్షరాస్యత అంతంత మాత్రమే ఉన్నా, ప్రజల్లో నైతికవిలువలు నిండుగా ఉండేవి. వ్యక్తులు ఇప్పటిలా ఒంటరిగా కాకుండా, గుంపులుగా కష్టసుఖాలు పంచుకొని జీవించేవారు. కష్టపడటం మిగిలిన సమయమంతా విశ్రాంతంగా గడపడం తప్ప మరో ఆలోచనలు ఉండేవికావు. గుంపులోకానీ, తెగలోకానీ పెద్దలుండేవారు. వారు చెప్పినట్టు నడుచుకోనేవారు. రాజకీయాలు చాలాకొద్దిమంది మాత్రమే పట్టించుకొనేవారు. ప్రభుత్వమేమిటి? రాజెవరు? దేశమేమిటి? చట్టాలేమిటి? సాధారణ ప్రజలకి అనవసర విషయాలు. ప్రజలు పెద్దలు ఏమి చెబితే అదే పాటించేవారు. నాడొక నగరం నుంచి మరోనగరం పోవాలంటే ఎంతో కష్టంగా ఉండేది. నేడొక దేశంనుండి మరోదేశం పోవడం చాలా సుళువైపోయింది. పొరుగూరిలో ఏమి జరిగిందో నాడు ప్రక్క గ్రామానికే తెలిసేదికాదు. నేడు ప్రపంచంలో ఏమి జరిగిందో జరుగుతున్నదో నిమిషాలమీద అందరికీ తెలుస్తున్నది. నాడు కత్తులు, ఈటెలు, విల్లంబులు లాంటి ఆయుధాలు మాత్రమే లభించేవి. తుపాకులు, బాంబులు ప్రభుత్వాలదగ్గర మాత్రమే ఉండేవి. నేడు రిమోట్ మారణాయుధాలతోసహా ప్రజలకు లభిస్తున్నాయి. నాడూ అతివాదులు, తీవ్రవాదులు ఉండేవారు. కానీ నేటిలా విధ్వంసకర తీవ్రవాదులు ఉండేవారుకాదు. నాడు అవసరార్ధం చాలాతక్కువగా డబ్బులు వినియోగించే వారు. ఇప్పటంత విరివిగా డబ్బుల వినియోగం ఉండేదికాదు. ఒకరినుండి ఒకరికి డబ్బుచేరాలంటే ఎంతో ప్రయాస పడాల్సివచ్చేది. కొందరిదగ్గర అసలు డబ్బులుండేవేకాదు. మొత్తంమీద నాటి సమాజానికి, నేటి సమాజానికి ఏమాత్రం పోలికలేదు.

అప్పటి సమాజానికి ఇప్పటి సమాజానికి ఇంత వ్యత్యాసం ఉన్నది కదా? అలాంటప్పుడు నాటి గాంధీ మహాత్ముని సిద్ధాంతాలు ఇప్పుడు పనికొస్తాయా? అప్పటికన్నా ఇప్పటి సమాజానికే గాంధీ మహాత్ముని సిద్ధాంతాల అవసరం ఎక్కువవున్నది. హింసలో నేటి ప్రపంచం మునిగిపోయింది. ప్రజలు ప్రతీ చిన్న విషయానికీ హింసావాదాన్నే ఆశ్రయిస్తున్నారు. అన్ని మతాలవారూ హింసావాదానికే ప్రోత్సహిస్తున్నారు. కంప్యూటర్తో ఆధునిక విజ్ఞానం అవధులు దాటినా, ప్రజల్లో మూఢనమ్మకాలు మరింతగా పెరిగిపోయినవి. ప్రాంతీయ దురభిమానాలు పెట్రేగిపోతున్నవి. ఇలా ప్రజలు అనేకవిధాలుగా అశాంతితో జీవిస్తున్నారు. ఈ సమస్యలన్నింటికీ ప్రత్యామ్నాయం గాంధీమార్గమే. గాంధీజీ చూపిన సత్య, అహింసా మార్గాలను ఆశ్రయించడంతప్ప నేటి సమాజానికి మరోమార్గం లేదు.

నాకు తెలియకుండానే నా  హృదయంలో గాంధీ

నా బాల్యం అనేక ఇక్కట్లతో గడిచింది. మా పెద్దనాన్నగారు గాంధీజీ అభిమానులు. గాంధీజీని మహాత్ముడు అనే సంబోధించేవారు. ఖద్దరు బట్టలు ధరించేవారు. ఇతని ద్వారా మహాత్ముని గురించి నాకేమీ తెలియకున్నా గాంధీమహాత్ముడు అనేపేరు నాలో నాటుకున్నది. మా ఊరికి ఆరు కిలోమీటర్ల దూరాన పలాస బస్తీ ఉన్నది. మాకు పొలం గట్లంట, రాళ్లబాటలో, అడవిమృగాల బారిన పడకుండా పలాసా వెల్లిరావడం పెద్ద సాహసంగా ఉండేది. ఆ రోజుల్లో సినిమా చూడటం అన్నది ఒక కళారాధనగా భావించేవారు. నాతోటివారంతా కుర్చీ తరగతికి వెళ్లేవారు. నేను దిగువ తరగతికి వెళ్లేవాడను. ఒకడు నన్ను ఎగతాళిచేసేవాడు. మరొకడు నన్ను వెనకేసుకొస్తూ “వీడు గాంధీ తరగతికి వెల్లాడురా” అన్నాడు. అప్పుడు నాకు తెలిసింది గాంధీయిజం అంటే సింపుల్సిటీ అని. ఈవిధంగా గాంధీజీ నాలో ప్రవేశించాడు. అప్పటినుండి నా ఆర్ధిక లేమితనం గాంధీయిజంతో పెనవేసుకుపోయింది. నాకు తెలియకుండానే ప్రతీసమస్యకు గాంధీతత్వం జతకలిసేది. మా ప్రాంతంలో నేనొక చిన్నపాటి సెలబ్రిటీ అయినాను. చిన్నచిన్న మీటింగులకు నేను ఆహ్వానించబడేవాడిని. ప్రతీ మీటింగులో ఏదో ఒకరకంగా మహాత్ముని గురించి ఎంతోకొంత ఉపన్యసించేవాడిని. మొత్తంమీద నాబ్రతుకంతా గాంధీజీ ప్రేరణతో సాగిపోయింది. దొరికినంతవరకు గాంధీజీకి సంబంధించిన పుస్తకాలు పత్రికా వ్యాసాలు విడవకుండా చదివేవాడిని. కాశీబుగ్గ గ్రామ పంచాయితీ ఆఫీసు వరండాలో నిలువెత్తు గాంధీజీ విగ్రహం ఉండేది. ఆటువైపు ఎప్పుడు వెళ్లినా ఆ విగ్రహాన్ని కొన్ని నిమిషాలు తదేకంగా చూసేవాడిని. రచయితగా, కళాకారునిగా, ఇన్వెంటర్ గా మారిన తరువాత హైదరాబాద్ రావలసివచ్చింది. ఇక్కడకూడా అనేక ఇక్కట్లకు గురియైనాను. ఎన్ని ఇక్కట్లు వచ్చినా గాంధీజీ సిద్ధాంతాలైన నిజాయితీ, నిర్భయం, నిరాడంబరాలను విడచిపెట్టలేదు “సామాజిక ప్రయోజనంలేని పరిశోధనలు నిరర్ధకం” అన్న గాంధీజీ సూక్తిని అనుసరించే నా ప్రయోగాలు సాగించాను. నేను రూపొందించిన చాలా షార్ట్ ఫిలింస్ లో మహాత్మా గాంధీజీ గురించి కొంతవరకు చొప్పించాను. వరల్డ్ ఫష్ట్ ప్రోసడీ పొయిటిక్ ఎనిమేషన్ కార్యక్రమం విశ్వదాభిరామ వినురవేమ బుక్ లో ఒక పూర్తిపేజీలో గాంధీజీ పోటో క్రిందను “మాతృభాషా తిరస్కారం మాతృదేవీ తృణీకారం – మహాత్మాగాంధీ” అని ప్రింట్ చేశాను. పుణ్యపురుషుడు అనగా గాంధీజీయే అని, ఉత్తమ పురుషుడు అన్నా గాంధీజీయే అని యానిమేషన్లో దృశ్యకల్పన చేశాను. ఇప్పటివరకు ఎనిమిది లక్షలకు పైగా బాలలీ ప్రాజక్ట్ను చూశారు. ‘సత్యమేవజయతే’ అంటూ ఆవు-పులి’ కథను 3-డి యానిమేషన్లో క్రియేట్ చేశాను. చివరకు పులి ధర్మదేవతగా, ఆవు మహాత్మాగాంధీజీగా మారినట్లు చూపిస్తూ గాంధీజీ పాటను పెట్టాను. ఈ చిత్రం అంతర్జాతీయ చిల్డ్రెన్స్ ఫిలిం ఫెషివల్ లో ప్రదర్శితమైనది. “భారతీయ సంస్కృతికి స్వర్ణాభిషేకం చేసిన సీతారాము” అని ఫెస్టివల్ నిర్వాహకులచే ప్రశంసలందుకున్నది. ‘అయ్యా పులి’ కథను షార్ట్ ఫిలింగా క్రియేట్ చేశాను. అసత్యం చెప్పడం వలన కలుగు అనర్థాన్ని గాంధీజీ చిత్రం చూపెడుతూ గాంధీజీ మాటలుగా చూపించాను. ఈ ఫిలిం చాలా ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శితమైంది. ఎందుకోసమో ఏమో నాకు తెలియదు నా జీవనయానమంతా గాంధీజీ సిద్ధాంతాలతో కలసిపోయింది. ఒకానొక సమయంలో ప్రముఖ సినీ రచయిత వేటూరి సందరరామ్మూర్తి గారితో సంభాషిస్తుండగా గాంధీజీ ప్రస్తావన వచ్చింది. అతనూ గాంధీజీ అభిమానినని గాంధీజీ ‘సత్యశోధన’ బుక్ కొని చదవమని చెప్పగా వెంటనే పుస్తకంకొని పూర్తిగా చదివాక గాంధీజీ నన్నావహించినట్లైంది. అనేక నెలలపాటు గాంధీజీ సత్యశోధనే నా హృదయమంతా తిరుగాడింది. అంతవరకు గాంధీజీ అంటే నిరాడంబరమే అనుకున్నా, కాదు పోరాటమని తెలుసుకున్నాను. దాని ఫలితంగా గాంధీజీ గురించి ప్రజలకు తెలియని అద్భుతమైన విషయమొకటి నాలో ఉత్పన్నమైనది. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ సత్యశోధన బుక్లో దొరికాయి. దీనికి “ద ఇన్స్ప్రెషన్ ఆఫ్ మహాత్మా గాంధీ” అనే పేరుపెట్టాను. ఈ విషయాన్ని ఆధునిక దృశ్యమాధ్యమంలో ప్రపంచ భాషలన్నింటి లో నిర్మించి ప్రపంచ ప్రలందరికీ చూపించాలన్నది నా జీవితాశయం.

అహింస విషయంలో గాంధీ మాటమీద గౌరవం

ప్రపంచంలో అంతకుముందు అహింస, సత్యాగ్రహాలతో విప్లవాలెక్కడా జరగలేదు. మహాత్మాగాందీజీ బాల్యంనుండీ మహాపిరికివాడు, కఠిన శాకాహార నిష్టగల కుటుంబంలో పుట్టిపెరిగినవాడు. శారీరక బలం కావాలని ఒక మితృని సహకారంతో చాటుగా మాంసాన్ని తింటాడు. బారిష్టర్ అయ్యాక జడ్జిముందు నిలబడి మాట్లాడలేక సొమ్మసిల్లి పడిపోతాడు. ఇంతటి భయస్థుడైన మహాత్మాగాంధీజీకి తరువాత తుపాకులు, బాంబులు గలిగియున్న అతి క్రూరులైన బ్రిటిష్ పోలీసులకు ఉత్తిచేతులతో ఎదించగల ధైర్యం ఎలా వచ్చింది? ఆనాడు ఇప్పటిలా పత్రికలు, టీ.వీ.లు, సెల్ఫోన్లు ఇంటర్నెట్లు మొదలగు వార్తాసాధనాల్లేవు. రోడ్లు, ప్రయాణ సాధనాలు లేవు. అయినా మహాత్ముడు వస్తున్నాడంటే ప్రజలు తండోపతండాలుగా చేరుకొనేవారు. అప్పటికి ఇప్పటికి విప్లవమంటే రెండువర్గాలవారు ఒకర్నొకరు హింసించుకోవడమే. బ్రిటిష్ పోలీస్ మిమ్మల్ని హింసించినా మీరు ప్రతిహింస చేయకూడదన్న మహాత్ముని మాటకు కట్టుబడి భారతస్వాతంత్య్ర పోరాట యోధులు పోలీసులతో దెబ్బలుతిన్నారు, కొందరు కాళ్లు, చేతులు కోల్పోయారు, అవిటివారైనారు, కొందరు చనిపోయారు అయినా మహాత్ముని మాటకు కట్టుబడి ప్రతిహింస చేయలేదు. ఇంతటి సమ్మోహనాశక్తి గాంధీజీకి ఎలా వచ్చింది? ఇందుకొరకు గాంధీజీ చేసిన ప్రయోగాలేమిటి? అన్నది సాక్ష్యాధారాలతో నిరూపిస్తుందీ కాన్సెప్ట్.

ఇప్పుడు పుస్తకాలు చదివేవారు, చదివి అర్ధం చేసుకునేవారు చాలావరకు తగ్గిపోయారు. పుస్తకాలు చదివి ప్రజలకు వివరించి చెప్పే పద్ధతి అంతరించింది. పైగా పుస్తకాలు ప్రింటుచేయడం తేలికైనపనే కానీ సర్యులేషన్ చేయడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. లక్షమందికి సర్క్యులేట్ చేయుటకు రెండుకోట్లు వ్యయమౌతుంది అదికూడా సంవత్సరాల సమయం తీసుకుంటుంది. అదీ గాంధీజీ అభిమానులే చదువుతారు, సాధారణ ప్రజలకుచేరే అవకాశాలు చాలాచాలా తక్కువ. నేడు ఆధునిక సాంకేతిక సౌలభ్యత ఎంతో అభివృద్ధి చెందింది. ఈ అద్భుత విషయాన్ని పుస్తకంగా వ్రాయుటకన్నా దృశ్యంగా రూపొందించుటద్వారా మంచిఫలితం వస్తుందని ఊహించాను. నేడు దృశ్యమాధ్యమం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించబడినది. పండితులకు, పామరులకు, బాలలకు, వృద్ధులకు చేరుతూ అర్దమౌటమేకాకుండా ప్రేరణకూడా కలిగిస్తుంది.

గాంధీజీని బదనాం చేస్తున్న అతివాదులు

నాడు మహాత్ముడు అంటే దైవానికి ప్రతిరూపం. నాడు దేశప్రజలెల్లరూ నా భారతీయులే అంటూ ఐకమత్యంతో జీవించేవారు, నేడు ప్రాంతీయ, భాషా, కుల, మత ద్వేషాలతో సమాజం విచ్ఛిన్నమైయున్నది. స్వాతంత్ర్యానికి పూర్వం గాంధీజీకి వ్యతిరేకంగా అతివాదంతో పోరాటంనడిపిన ఒకవర్గం స్వాతంత్య్రానంతరం మరింత దూకుడుగా వ్యవహరిస్తూ అనేక అసత్య కట్టుకథలల్లుతూ దేశప్రజల్లో గాంధీజీపై విషప్రచారాలు గావిస్తున్నది. నేడిది ఎంతవరకు వచ్చిందంటే మహాత్మాగాంధీజీ అంటే హిందూ వ్యతిరేకియని, దేశవిచ్ఛిన్నానికి కారకుడనే అపవాదుతో యువత హృదయాలలో నాటుకొనేటట్లు ప్రచారాలు గావించి కృతకృత్యమైంది. సాధారణ ప్రజలనుండి అత్యున్నత విద్యావంతులు సైతం ఈ కుహానా హిందూ భావజాలానికి గురియైనారు. దేశంలో గాంధీజీ వ్యతిరేకులు ధన మాన ప్రాణాలను అర్పిస్తూ అదే జీవితంగా ప్రచారాలు చేస్తుంటే గాంధీజీ ఫాలోవర్స్, గాంధీజీ సంస్థలు కనీసం పట్టించుకున్న పాపానపోలేదు, కనీసం ఖండించనూలేదు. గాంధీజీ పేరుతో అధికారం చలాయించిన కాంగ్రేస్ పార్టీయైనా కనీసం స్పందించడంలేదు. ఇక గాంధీజీపై జరుగుతున్న దుష్ప్రచారానికి అడ్డూ అదుపు లేకుండా ఉన్నది. ప్రపంచంలో ఏ దేశపిత (ఫాదరాఫ్ నేషన్) కు ఇలా ఆ దేశ ప్రజలు, పండితులు నెగిటివ్ ప్రచారాలు, కల్పిత అసత్య ప్రచారాలు చేయలేదు. ఈ దేశంలో మాత్రమే జరుగుతున్నది. ఇదే మరో దేశంలో అయుంటే తప్పనిసరిగా శిక్షలు వేసేవారు. శిక్షలు మాటకేమి గాంధీజీని అసత్యాలతో ప్రచారాలు చేసినవారికి పదవులతో, ఆవార్డులతో సత్కరిస్తున్నారు. జాతిపితను అవమానించడం అంటే జాతిని అవమానిండం కాదా? దేశాన్ని అవమానించడం కాదా? దీనికి శిక్షలు అవసరంలేదా?

సాంకేతిక విస్తృతమైంది. నక్సలైట్లకు రిమోట్ మందుపాతరలు దొరికినట్లు గాంధీజీ వ్యతిరేకులకు వాట్సాప్ అనే సాధనం దొరికింది. దొరికిందే తడవు కరోనా వైరస్ కన్నా వేగంగా ఈభాష ఆభాష అనేభేదం లేకుండా గాంధీజీ ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ దుష్ప్రచారాలు చేస్తూనేవున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోలేదు. ఎదుటివారి వ్యతిరేకత ఏమాత్రంలేదు, ఇకవీరి ఆగడాలకు హద్దేముంటుంది? చాలామంది గాంధేయవాదులను అడిగాను. ‘మేము గాంధేయవాదులం, అహింసావాదులం మేమేమిచేయగలం? దేవుడే అన్నీ చూసుకుంటాడు’ అనే సమాధానం చెప్పారుతప్ప ఒక్కరు కూడా ప్రతిఘటించే మాటనలేదు. గాంధీయిజం అంటే కేవలం సత్యము, అహింసలే కాదు, పోరాటం. గాంధీయిజమంటే ముందు పోరాటం. తరువాతే సత్య అహింసలు. గాంధీజీ సత్య అహింసలకోసం పోరాటం చేయలేదు, పోరాటం కోసం సత్య అహింసలను ఆశ్రయించాడు. గాంధీజీకి సౌతాఫ్రికాలో ప్రాణాంతక సమస్యలు చుట్టుముట్టినప్పుడు కూడా తనపోరాటం మానుకోలేదు. ఈ విషయమై గాందేయవాదులమంటూ నిమ్మకు నీరెత్తినట్లు పిరికితనంతో ప్రవర్తించడం గాంధీయిజం కాదు. ఒక రకంగా గాంధీయిజానికి తూట్లుపొడవటమే అనుటలో తప్పులేదనుకుంటా. గాంధీయిజమంటే కురుక్షేత్రంలో శ్రీకృష్ణపరమాత్మ అర్జునునితో ‘యుద్ధం చేటమే నీధర్మం, పోరాడు’ అన్నదే కానీ వేరే కాదు.

దేశ విభజనకు ప్రధాన కారకుడని నింద

మహాత్ముడు హిందూ వ్యతిరేకి, ముస్లిం అనుచరుడని, దేశవిభజనకు ప్రధాన కారకుడని ఈ కుహనా హిందువులు ప్రజలకు నూరిపోస్తారు. ఒకసారి ఊహించండి- పాకిస్తాన్ కలసి వుండియుంటే ఈసరికే మన దేశం ముస్లిందేశంగా మారిపోయి ఉండేది. పదిశాతం ఓట్లుతోటే వారు మొత్తం ప్రభుత్వాలనే శాసిస్తున్నారు. ఇరవై శాతం ఓట్లుంటే? దేశం ఏమైఉండును? ఒకసారి ఆలోచించండి. ఈ కుహనా హిందువులకు స్వాతంత్ర్య సమర సమయంలో, స్వాతంత్ర్యానంతరం హిందువులకు, ముస్లింలకు మధ్య గొడవలు సృష్టించడమే పని. ఆ గొడవల్లో హిందువులే దెబ్బతినేవారు. గొడవలు జరిగేటప్పుడు ఈ కుహనా హిందువులెవరూ కాపాడటానికి వచ్చేవారుకాదు. ‘మా హిందువులకు రక్షణలేదు’ అని తరువాత దేశమంతా గోలచేసేవారు. అప్పుడు దేశంలో ఒకమాట ప్రచారంలో ఉండేది. ఒక్క ముస్లిం పదిమంది హిందువులతో సమానమని. అమ్మవారిగుడి దగ్గరకువెళ్లి కోడిని కోయటానికే ఎంతో భయపడే హిందువు పెద్దపెద్ద ఆవు దున్న లాంటి జంతువులను నిర్ధాక్షిణ్యంగా వధించగల ముసల్మానులను ఎలా ఎదురించగలడు? కుహనా హిందువులు వచ్చి గొడవలు సృష్టించడం – సాధారణ హిందువులు హింసకు గురికావడం. (అప్పటినుండి ఇప్పటివరకు దేశంలో జరిగిన ప్రతీ మత ఘర్షణలో హిందువులే హింసించబడ్డారు) ఘర్షణను ఆపకుండా కొనసాగిస్తే అక్కడ బలి అయ్యేది అమాయక హిందువులే. మహాభారతంలో బకాసురవధ కథలా ముస్లింలకు తాయిలాలిచ్చి సాధారణ హిందువులకు రక్షించడమే గాంధీజీ ఉద్దేశం. బ్రిటిష్ వారి టైంలో అధికారం మనచేతుల్లో లేదు. స్వాతంత్య్ర దేశంలో రాజ్యాంగము, చట్టాలు, ఓటు బ్యాంకులు అడ్డుపడుతున్నాయి. గాంధీజీ ముస్లింలతో సంధి చేసుకోకుండా గొడవలనే ప్రోత్సహిస్తే అక్కడ హింసకు గురయ్యేదెవరు? అమాయక హిందువులు కాదా?

ప్రయాగలో జరిగే కుంభమేళాల్లో మూడుసార్లు పాల్గొన్నారు, కుంభమేళాలోనే స్వామి శ్రద్ధానంద గారు గాంధీజీకి ‘మహాత్మా’ అన్న బిరుదిచ్చారు. కాశీలో విశ్వనాధుని దర్శించుకొని దక్షిణకోసం పురోహితునితో వాగ్వాదం జరిపిన గొప్ప భక్తుడు. స్వాతంత్ర్యం రావడానికి ముందునుండే ‘మనదేశానికి స్వాతంత్ర్యం కన్నా గోవధనిషేధమే’ ముఖ్యమైనదని ప్రవచించిన అసలు సిసలైన హిందువు మహాత్మాగాంధీజీ. నేను స్వాతంత్ర్యం తెస్తాను, మీకు ఉచితపథకాలు ఇస్తానని మాటలతో మభ్యపెట్టి ప్రజలను వంచించలేదు. తను మాటలే కాదు తనభావాలను ఆర్టికల్స్ రూపంలో తొంభై ఐదు వాల్యూమ్స్ ఏభైవేల పేజీలకు మించి రచన చేసిన ప్రపంచంలో అతి ఎక్కువ పేజీలు వ్రాసిన సామాజిక రచయిత గాంధీజీ. అంత్యజులు అంటే ఇప్పుడందరూ అంటున్న దళితులకు తన ఇంట్లోనే ఆశ్రయంకల్పించాడు, అంత్యజులను భగవంతుని బిడ్డలుగా ‘హరిజనులు’ అని పేరు పెట్టాడు. ‘హరిజన్’ అనే పేరుతో పత్రిక నడిపాడు. హరిజనుల పాయికానాలు స్వయంగా అతనే కొన్నిసార్లు శుభ్రం చేశాడు. హిందుత్వానికి అస్పృశ్యతే ప్రధాన శత్రువని పేర్కొని అస్పృశ్యత నివారణకోసం అవిరళకృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్ముడు. ఆనాడు దేశప్రజల్లో తొంబైతొమ్మిది శాతం ప్రజలకు చెప్పులుండేవికావు. కలరా, ప్లేగు, మలేరియా మొదలగు అంటువ్యాధులతో ప్రజలు చాలా కష్టాలు పడేవారు. వీటినుండి రక్షణ కోసం పరిసరాల పరిశుభ్రత పాటించుటకు తనే స్వయంగా చీపురుపట్టుకొని పరిసరాలను పరిశుభ్రపరచే వారు (ఈ కాన్సెప్ట్ ను ప్రేరణగా తీసుకొనే మోడీజీ ప్రభుత్వం గాంధీజీ ఐకాన్లతో ‘స్వచ్ఛభారత్’ పథకాన్ని ప్రవేశపెట్టింది)

తన కుటుంబాన్నేకాదు తమ కులాన్నంతటినీ వెనకేసుకొచ్చే నేటి ప్రజానాయకులను గమనించండి. మహాత్ముని కన్నబిడ్డలు వారేమి చేస్తున్నారో, ఎక్కడవుంటున్నారో ఆతనికి తెలియదు. వారి మంచి చెడ్డలు పట్టించుకొనే ఆలోచననైనాలేని నిష్కళంక ప్రపంచ ప్రజానాయకుడు మన మహాత్ముడు. తనుచేసిన నేరానికో, తన ఆస్తులు రక్షించుకోటానికో కాదు, దేశ స్వాతంత్య్ర పోరాటం కొరకు పదమూడు సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన నిష్కామయోగి మనగాంధీజీ. ప్రపంచంలో నిత్యం భగవద్గీత చేతపట్టుకొని      తిరిగిన ఒకే ఒక నాయకుడు, ‘నాకుకష్టాలు ఎదురైనప్పుడు నేను భగవద్గీతనే ఆశ్రయిస్తాను. నాకు గీతే మార్గం చూపెడుతుంద’ని బహిరంగంగా చెప్పుకున్న ఒకే ఒక మాహా పురుషుడు మహాత్మాగాంధీజీ. సర్వకాల సర్వావస్థలయందు రామనామస్మరణ చేస్తూ నిత్యం ‘రఘుపతి రాఘవ రాజారాం, పతితపావన సీతారామ్’ అని భజనచేసే వ్యక్తి, తానుమరణిస్తూ కూడా రామ నామాన్నే స్మరించుకున్న పరిపూర్ణ హిందువు మహాత్మాగాంధీజీ.

గాంధేయవాదుల మౌనం బాధాకరం

ప్రపంచంలో ఎందరో మహానీయులు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా, అంగసాన్ సూకీ, బరాక్ ఒబామా మొదలగు వారికి ప్రేరణ మహాత్మాగాంధీజీ. విరోధులతో సైతం గౌరవాలందు కున్న మహానీయుడు మన గాంధీజీ. అతనికి ప్రధాన శత్రువులు బ్రిటిష్ వారు. వారి పార్లమెంట్ ముందు అతని విగ్రహం పెట్టుకొని సభ్యులకు స్పూర్తి కలిగించుకుంటున్నారు. అన్ని విషయాలలో గాంధీజీకి పూర్తిగా వ్యతిరేకులైన చైనావారు తమదేశ పాఠశాలల్లో గాంధీజీ జీవితాన్ని పాఠ్యాంశంగా పెట్టుకున్నారు. ఆధునిక దేశమైన అమెరికాలో అనేక గాంధీ మెమోరియల్ చిహ్నాలు నిర్మించుకున్నారు. యునైటెడ్ నేషన్స్ గాంధీజీ జయంతిని ఇంటర్నేషనల్ అహింసా దినంగా పాటిస్తున్నది. అనేక దేశాలవారు వారి దేశాలలో గాంధీజీ విగ్రహాలు స్థాపించి గౌరవించుకుంటున్నారు. ప్రపంచ మహామేధావి ఐన్ స్టీన్ “గాంధీజీ అనే వ్యక్తి రక్తమాంసాలతో ఈ భూమిమీద నడయాడాడు అంటే భవిష్యతరాలు నమ్మరు” అని పేర్కొన్నాడు. ఇంతటి మహానీయునికి స్వదేశీయులే అనేక నీచమైన కట్టుకథలల్లి ధుష్ప్రచారాలు చేస్తున్నారంటే చేసినవారినేమనాలి? వీరా సనాతనధర్మ సంరక్షకులు? దేశంలో గాంధేయ వాదులమనే పదాన్ని తగిలించుకున్న వారనేకమంది ఉన్నారు. హింసావాదులతో పోరాటం చేయలేకున్నా గాంధీజీ గొప్పతనాలు, అతను చేసిన త్యాగాలనైనా ప్రజల్లో ప్రచారాలు చేయక పోవడం అత్యంత దురదృష్టకరం. సత్యము వేయి సూర్యులకన్నా ప్రకాశవంతమైనదైనా మబ్బులు కమ్మినప్పుడు అంధకారం ఆవరిస్తుందికదా! ఒక అసత్యాన్ని సత్యమని పదేపదే ప్రచారం చేస్తూపోతుంటే కొన్నాళ్లకు అదే నిజమైపోవుటన్నది చరిత్ర చెప్పిన సత్యం. మనం శక్తిమేర గాంధీజీ సత్యచరిత్రలు, సత్యశోధనలను ప్రపంచ ప్రజావాహిని ముందుకు తీసుకువెల్లాలి. ఇదే మహాత్మునికి మనమిచ్చే ఘననివాలి. సత్యనేవ జయతే.

కొత్తపల్లి సీతారాము

అనేక సందేశాత్మక లఘుచిత్రాలు రూపొందించి ఆవార్డు లందుకున్న నిర్మాత, దర్శకుడు, ఎనిమేటర్.

ప్రపంచ ప్రప్రధమ సాహితీ ఎనిమేషన్ ఆవిష్కర్త.

హైదరాబాద్ 98499 32519

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles