Thursday, February 2, 2023

అసలైన విప్లవవాది.. సిసలైన సిద్ధాంతకర్త!

గాంధీయే మార్గం-21

ఒక చెంపమీద కొడితే మరో చెంప చూపించారు! బలహీనుడు కాక బలవంతుడా?

గోచిగుడ్డ, చేతికర్ర, కళ్ళజోడు, బోడిగుండు ఏముంది ఆకర్షణ?

రాట్నం వడకమంటాడు, ఖాదీ అంటారు, గ్రామాలు వెళ్ళమంటారు … ఎలా?

సైన్స్‌ ఆయనకు తెలీదు, ఆధునికుడు కాదు!

— ఇలాంటి మాటలు యాభై అరవై ఏళ్ళుగా వినబడ్డాయి, కనబడ్డాయి, చర్చించబడ్డాయి! 

నిజానికి గాంధీజీ ఇంతేనా?

మరేమీ కాదా?

 ‘‘రండి! మగటిమి చూపండి! ఈ పూజారులను తన్ని తరమండి. చచ్చినా మారలేరు కనుక. వీరు ప్రగతి విరోధులు! వీరికి హృదయ వికాసం లేదు. శతాబ్దాల తరబడి పేరుకుపోయిన గుడ్డి నమ్మకాల నుంచి వీరు పుట్టుకు వచ్చారు! ప్రజాహింస నుంచి వీరు పుట్టుకు వచ్చారు. ముందుగా కూకటి వేళ్ళతో పెరికి పారవేయవలసింది వీరి పూజారితనాన్నే. రండి, మగటిమి చూపండి! మీ కలుగులలో నుంచి వెలికి రండి! ఒకసారి నలుదిక్కులకు చూడండి! దేశదేశాలు ఏ విధంగా పురోగమిస్తున్నవో గమనించండి …’’

Also read: సంభాషించడం… సంబాళించడం!

ఈ మాటలు ఎవరివో ఒకసారి ఊహించగలమా? ప్రచండమైన ఉరుముల్లాంటి ఈ పలుకులను వివేకానంద అన్నారు. ఆశ్చర్యం కలుగదా? ఇందులో భావం ఎంత తీవ్రంగా ఉందో, భాష అంత పదునుగా ఉంది,  కనుకనే వళ్ళు జలదరిస్తుంది. అంతేకాదు ఈ తెలుగు సేత కూడా మనల్ని మురిపిస్తుంది. దానికి కారణం 1972లో సంపాదకీయం కోసం నార్ల వెంకటేశ్వరరావు చేసిన అనువాదం కావడం కూడా. 

Also read: గాంధీని మించిన పోరాటశీలి – కస్తూరిబా!

గాంధీజీ వాదాన్ని, వాదనా విధానాన్ని గమనిస్తే అంతటి ఆశ్చర్యం కలుగుతుంది. గాంధీజీలో, వివేకానందలో నడుస్తున్న సమాజగతిపై తీవ్రమైన వ్యతిరేకత ఒకే రకంగా కనబడుతుంది. అయితే, వివేకానందలో బెత్తంతో బోధించే ఉపాధ్యాయుడు ఉండగా;  గాంధీజీలో లాలింపుల అమ్మ ఉంటుంది. ఈ మహానుభావులలో సమాజం సర్వతోముఖాభివృద్ధి కావాలనే తహతహ విపరీతంగా ఉంది. వీరు చూపే తరుణోపాయాలు కూడా పూర్తిగా మనకు తెలిసిన వనరుల నుంచే ఆధారపడి ఉంటాయి. 

Also read: కరోనా వేళ గాంధీజీ ఉండి ఉంటే…

గాంధీజీని పోల్చగలిగితే మనకు బుద్ధుడు, ఏసు, వివేకానందులు కనబడతారు. వారు బోధించిన వాటిలో సారూప్యత ఉంది. మరోరకంగా చెప్పాలంటే గాంధీజీ వీరందరికన్నా సార్వత్రికంగా, సహజంగా, సర్వతోముఖంగా కనబడుతారు. అందుకే  ఐదువేల సంవత్సరాల ( లేదా అది ఎంతయినా కావచ్చు) మానవ చరిత్రలో గాంధీజీ వంటి అపురూపమైన వ్యక్తి మరొకరు లేరు అని పేర్కొనడం!  

అయితే, గుడ్డి అభిమానం అవసరం లేదు!  లోతుగా, తుల్యతతో చూద్దాం. హేతుబద్ధంగానే విశ్లేషిద్దాం!!  అన్ని కొలబద్దలు వాడుదాం!!!

Also read: భారతీయ తొలి ఎకో-ఫెమినిస్ట్- మీరాబెన్

బలం, బలహీనత: 

గాంధీజీ మానసికంగానే కాదు, శారీరకంగా కూడా బలవంతుడు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పా చివరిదాకా ఆయన జనంలో ఉన్నారు. దేశమంతా స్వాతంత్య్ర సంబరాలలో మునిగి ఉంటే ఆయన నౌఖాలిలో గాయపడిన హృదయాలను సముదాయించారు. ఆయన  రోజూ బాగా నడిచేవాడు. బోయర్‌ యుద్ధ సమయంలో క్షతగాత్రులను మోసుకుంటూ  కిలోమీటర్లు నడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలాసార్లు భౌతికంగా దాడికి గురైన సంఘటనలున్నాయి. చివరి దశలో కూడా రోజుకు 18 గంటలు పనిచేసి ఆశ్చర్యపరిచారు.

Also read: త్యాగానికీ, పట్టుదలకూ ప్రతిరూపం – మీరాబెన్  

వైద్యం – వైద్యదృష్టి: 

ఆశ్రమంలోని ఆసుపత్రికి  తెప్పించిన అస్థిపంజరాన్ని బీరువా తీసి చూశాడు గాంధీజీ. పరిశీలనగా చూస్తుండగా దేహనిర్మాణం మీకు తెలుసునా – అని అనుచరులు ఆయనను అడిగినపుడు దేహనిర్మాణం, ఏ అవయవంలో ఎన్ని ఎముకలుంటాయో అని ఏడెనిమిది నిమిషాలు వివరించారు. చివరలో అస్థిపంజరం గడ్డం పట్టుకుని, దాన్ని బుజ్జగిస్తూ ‘‘నాయనా! నేను కూడా ఏదో ఒకనాడు నీలాగే ఔతానులే’’ అన్నారు.  (ప్రభాకర్‌ జీ డైరీ ఆధారాలతో ఊట్ల కొండయ్య రచన ‘గాంధీపథం’ 1982వ సంవత్సరం ప్రచురణ నుంచి).  1888 లోనే కాదు, 1908లో సైతం మెడికల్‌ డిగ్రీ సంపాదించి పూర్తిస్థాయి వైద్యుడుగా స్థిరపడాలని గాంధీజీ ప్రయత్నించారు. మొదటిసారి ఆయనను కుటుంబం అడ్డుకోగా,  రెండవసారి ఆయన స్థాయి (అప్పటికి గాంధీజీ సత్యాగ్రహాన్ని ఆయుధాన్ని మలచి, దక్షిణాఫ్రికాలో ప్రజానాయకుడుగా సాగుతున్నారు) ఆటంకం అయ్యింది. ఆయన ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, హోమియోపతిని ఆదరించారని భావిస్తాం. అయితే, ఆధునిక వైద్యరంగంలో పరిశోధకుల వినయాన్ని, పాటవాన్ని చిత్తశుద్ధిని విశేషంగా శ్లాఘించి మన ఆయుర్వేద వైద్యులు మెరుగుపడాలని కోరారు. 1925 ప్రాంతంలో ఆయుర్వేదంతో లైంగిక సామర్థ్యం పెంచుకోవచ్చనే ప్రకటనలను గట్టిగా, వైద్యుల మధ్యనే ఖండించారు. తన ఆశ్రమాలు వైద్య సేవలనే కాదు, అందులో పరిశోధనలు కూడా చేయగలవిగా ఆయన మలిచారు! 

Also read: అంతరంగం నుంచి అంతర్జాతీయం దాకా!

అప్‌డేట్‌ అవడం:

‘‘అనేక అంశాలపై గాంధీజీ శ్రద్ధ చూపిన విధం ఎంతో ఆసక్తిగొలిపే విషయం. ఆయనది పైపైన ఆసక్తి కాదు. ఆయన ఒకసారి ఒక అంశంపై ఆసక్తి చూపడం ఆరంభిస్తే, ఆ అంశాన్ని ఎంతో లోతుగా అధ్యయనం చేసేవారు. జీవితంలో చిన్న చిన్న అంశాలు అని మనం భావించే వాటిపై ఆయన చూపిన అపరిమితమైన శ్రద్ధే ఆయన మానవతావాదంలో విశిష్టత కావచ్చు. అది ఆయన వ్యక్తిత్వానికి మూలం’’ – ‘బహురూపి’  పుస్తకానికి 1964లో ముందుమాట రాస్తూ జవహర్‌లాల్‌ అలా అన్నారు. అలాగే ఏదైనా ఒక విషయం గురించి రెండు లేదా ఎక్కువ అభిప్రాయాలుంటే – తాజా అభిప్రాయాన్నే గాంధీజీ తన అభిప్రాయంగా, సవరించిన అభిప్రాయంగా పరిగణించమంటారు. ఈ తీరును గమనిస్తే ఇది పూర్తి శాస్త్రాభినివేశం గల దృక్పథంగా బోధపడుతుంది, పరిశోధనాదృష్టిని స్ఫురింపచేస్తుంది. 

Also read: గాంధీజీ ప్రత్యేకత ఏమిటి ?

నగరాల నిరంతర అహంకారం :  

ఇవి ఆయన మాటలే. ఇందులో అహంకారం అనేది ఎంత తీవ్రంగా ఉందో, నిరంతరం అనేది అంత లోతుగా ఉంది. ఏడు దశాబ్దాల క్రితం గతించిన మనిషి ఇంత ఈసడింపుగా అంటారా అనిపిస్తోంది. ఇందులో వనరుల దోపిడి, కాలుష్య కారణవ్యవస్థలు, వినియోగలాలసత, పటాటోపం, కల్లాకపటం – ఇలా చాలా వర్తమాన కాలపు దుర్గుణాలు మనకు ద్యోతకమవుతాయి. ఈ విధానాలను ఇంత తీవ్రంగా వ్యతిరేకించిన గాంధీజీ మరెంతటి విప్లవవాది?

Also read: మహాత్ముడు ఎందుకుకొల్లాయి గట్టారు?

స్త్రీ హృదయం – మాతృభావన:

అహింస అనేది మన జీవన సూత్రమైతే భవిష్యత్తంతా మహిళలదే (If non-violence is the law of our being, the future is with women) అన్నది గాంధీజీ అని చాలామంది నమ్మకపోవచ్చు! మహిళ వంటింటిలో కూరుకు పోకుండా సరళమైన, సహజమైన ఆహారపదార్థాలు తినడం అలవాటు చేసుకోవాలని ప్రతిపాదించారు గాంధీజీ. 1969లో శతజయంతి ప్రచురణగా వెలువడిన ‘ఫేసెట్స్‌ ఆఫ్‌ గాంధీ’ పుస్తకంలో బి.కే.అహ్లూవాలియా ఇలా అంటారు– ‘‘వాస్తవంగా గడచిన నూరేళ్ళలో భారతదేశంలో ఏ సంఘ సంస్కర్తా భారత స్త్రీల విముక్తికి గాంధీ చేసినంత సఫల కృషి చేయలేదు…’’

“..నైతిక బలంలో పురుషుల కంటే స్త్రీలు మెరుగనీ, అహింసా సమరంలో అవసరమైనది పాశవికబలం కాదు. నైతిక బలమే ముఖ్యం. కనుక ఆ క్షేత్రంలో స్త్రీలే నిశ్చయంగా నాయకత్వానికి అర్హులు’’ అని గాంధీజీ అభిప్రాయం. అహింసను మనం జీవనధర్మంగా అంగీకరిస్తే మన భవిష్యత్తు స్త్రీల మీదనే ఆధారపడుతుంది. ఇదీ గాంధీజీ కున్న మహిళలపరంగా దార్శినికమైన దృష్టి! దేవదాస్‌ గాంధీ 1900లో జన్మించినపుడు మిగతా పిల్లలను చూసుకుంటూ, కస్తూర్బా సుఖప్రసవానికి తనే అన్ని ఏర్పాట్లు చేశారు. వైద్య పుస్తకాలు చదివి, మంత్రసానిగా మారిన స్త్రీ హృదయం ఆయనది. 

Also read: వందశాతం రైతు పక్షపాతి

మాతృభాషలకు ఊతం: 

ఇంగ్లండులో చదివి, దక్షిణాఫ్రికాలో ప్రజానాయకులై కూడా తన తొలి పుస్తకం హింద్‌ స్వరాజ్‌ ను 1909లోనూ, తర్వాత  ఆత్మకథను 1925లోనూ గుజరాతీ భాషలో రాశారు. ఇంగ్లీషు చదువుతోనే మనకు బానిస ధోరణి అలవడిందని ఆయన అంటారు. నౌఖాలి ఉత్పాత సమయంలో పాత్రికేయులు అడిగిన దానికి ఆయన చెప్పిన సమాధానం – నా జీవితమే నా సందేశం (మై లైఫ్‌ ఈజ్‌ మై మెసేజ్‌). అది చెప్పబడిన భాష బెంగాలీ! ఆయన ఆ సమయంలో కలకత్తాలో ఉన్నారు. సైన్స్‌ బోధన మాతృభాషలలో జరగాలని అంటారు. అవసరమైతే ఇంగ్లీషు పదాలను తీసుకుని, స్థానిక భాషలలో వివరణ ఇద్దామని చెబుతాడు గాంధీజీ. దీనికి జపాన్‌లో జరిగేది గమనించమంటారు. 

Also read: తొలి భారతీయ పర్యావరణవేత్త జె.సి.కుమారప్ప

యంత్రాలను నిరాకరించలేదు: 

గాంధీజీ యంత్రాలను వ్యతిరేకించారనే ప్రచారం ఉంది. అయితే ఆయన మాటలే చూడండి – సర్వేపల్లి రాధాకృష్ణ 1969లో రాసిన ‘మహాత్మాగాంధీ’ అనే వ్యాసం నుంచి: ‘నా శరీరమే అతి సూక్ష్మాంశాలతో కూడిన అతి సంకీర్ణమైన యంత్రమని నాకు తెలిసినపుడు నేను యంత్రాల వ్యతిరేకిని ఎలా అవుతాను? చరఖా అనేది యంత్రం. పళ్ళు కుట్టుకునే పుల్ల యంత్రం. యంత్రాలను గురించిన వ్యామోహానికి మాత్రం నేను వ్యతిరేకినే. కేవలం యంత్రాలకు కాదు శరీర పరిశ్రమను తగ్గించే యంత్రాలనబడే వాటి గురించి వ్యామోహం…’’ 

ఇది గాంధీజీ దార్శనికత. యంత్రాలే కాదు, యంత్రాల తర్వాతి దశనూ, అది కల్గించే అవరోధాలను గురించి దశనూ ఎరిగినవాడు ఆయన. అది ఆయన సమస్య  కాదు, మన దృష్టి సమస్య.

Also read: సిసలైన గాంధేయవాది పొట్టి శ్రీరాములు

కేంద్రీకరణ, వికేంద్రీకరణ: 

లక్ష్యం ఏకరీతిగా వుండాలి. కేంద్రీకృతం కావాలి. కానీ అమలు వికేంద్రీకరించబడాలి. ఇది వ్యవస్థల  గురించి, దేశం గురించి చెప్పాడు. గ్రామ స్వరాజ్యభావన అందులోంచే వచ్చింది. 

సహృదయత, సమన్వయం:

ప్రాంతాల మధ్య, నాయకుల మధ్య, భావజాలాల మధ్య సమన్వయం కోసం గాంధీజీ ప్రయత్నించారు. 1941 జనవరి 26 ‘హరిజన్‌’ పత్రికలో ఇలా రాశారు – ‘‘కమ్యూనిస్టులందరూ చెడ్డవారు కాదు. కాంగ్రెస్‌ వారందరూ దేవతలూ కాదు. కాబట్టి కమ్యూనిస్టు అంటే నాకు దురభిప్రాయం లేదు. కానీ వారి సిద్ధాంతాలను మాత్రం ఆమోదించలేను’’ (గాంధీ దర్శనం, ఆదర్శ గ్రంథమండలి ప్రచురణ, 1959, అనువాదం ఉప్పులూరి వెంకటసుబ్బారావు). రామమనోహర్‌ లోహియా గాంధీకి ఎంత సన్నిహితులో,  నెహ్రూకు అంతదూరం. మానవ వనరుల సమన్వయానికి గాంధీజీ వ్యక్తిగత సంభాషణ, సభాప్రసంగం, పత్రికా వ్యాసం, పుస్తక రచన, ఇలా చాలా ఉపయోగించారు. అభిప్రాయాలలో రాజీ లేదు. భాష, వ్యక్తీకరణ కడు సాత్వికం.

హిమాలయాలంత పురాతనం: 

తన సత్యాగ్రహ సిద్ధాంతానికి మూలమైన సత్యం, అహింస భావనలకు ఆధారాలైన మతధర్మ శాస్త్రాలనూ, ప్రవక్తలనూ, రచయితలనూ, పుస్తకాలను ఆయన పేర్కొన్నారు. ఉన్నవాటి నుంచే విలక్షణత సాధించారు. 

నిజాయితీగా తన ఆలోచనకు మూలమైన వనరులు పేర్కొని, వినయంగా నిలబడతాడు. ఆయన నిస్సందేహంగా సిసలైన సిద్ధాంతకర్త, అసలైన విప్లవవాది! 

– ఇలా గాంధీజీ గురించి మన ఆధునిక అవసరాల రీత్యా, మన పడికట్టు చట్రాల ఆధారంగా కూడా విశ్లేషించవచ్చు. గాంధీజీ నిస్సందేహంగా అత్యంత ఆధునికుడు!

Also read: ఏడున్నర దశాబ్దాలలో గాంధీజీ విధానాలు ఏమయ్యాయి ?

-డాక్టర్ నాగసూరి వేణుగోపాల్

మొబైల్: 9440732392

Dr. Nagasuri Venugopal
A broadcaster by profession, media researcher by training, a staunch Gandhian in thought, and a science writer by passion, Dr. Nagasuri Venugopal writes prolifically on contemporary issues. He penned over 60 books and two thousand newspaper articles so far. He is a PhD in journalism.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles