Friday, December 9, 2022

గాంధీ సినిమా అజ్ఞాత తపస్వి మోతీలాల్ కొఠారీ

గాంధీ చిత్ర దర్శకుడు రిచర్డ్ అటెన్ బరో

గాంధీయే మార్గం-23

గాంధీ  సినిమా ద్వారా గౌరవం, గుర్తింపు విశేషంగా పొందిన రిచర్డ్‌ అటెన్‌బరో 2014 ఆగస్టు 24న మరణించారు. ఈ సినిమా కారణంగా భారత ప్రభుత్వం 1983లో పద్మభూషణ్‌ గౌరవాన్ని అందజేసింది. బ్రిటీష్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ గాంధీ చిత్రాన్ని 20వ శతాబ్దపు 34వ గొప్ప చిత్రంగా కీర్తించింది. 22 మిలియన్ల డాలర్లతో నిర్మించిన ఈ సినిమా 127.8 మిలియన్‌ డాలర్లు గడించింది. 1982 నవంబరు 30న మన దేశంలో, అదే సంవత్సరం డిసెంబరు 3న బ్రిటన్‌లో, ఐదురోజుల తర్వాత డిసెంబరు 8న అమెరికాలో విడుదలైన గాంధీ  సినిమా ఒక వైపు ప్రజల మన్నన, మరోవైపు గొప్ప విమర్శకుల, పెద్ద పత్రికల ప్రశంసలు పొందింది. ఈ సినిమాను రిచర్డ్‌ అటెన్‌బరో ముగ్గురికి అంకితమిచ్చారు – కొథారి, మౌంట్‌బాటన్‌, నెహ్రూ. ఈ ముగ్గురూ సినిమా రూపుదిద్దుకుంటుండగానే కనుమూశారు.

Also read: మానవ లోకానికే ధ్రువతార

 1952లో జార్జిబెర్నార్డ్‌ షా నాటకాలను సినిమాలుగా గొప్పగా నిర్మించిన గాబ్రియల్‌ ప్రయత్నించి అప్పటి ప్రధాని నెహ్రూను సంప్రదించి ఒప్పందం చేసుకున్నారు. అయితే పాస్కల్‌ 1954లో కనుమూయడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది.  తర్వాతి ప్రయత్నం 1961లో మొదలై చివరికి 1982లో పూర్తి అయ్యింది. ఇంతకీ కొథారి  ఎవరు ?

కొథారీని వెలుగులోకి తెచ్చిన రామచంద్రగుహ

రిచార్డ్‌ అటెన్‌బరో కనుమూసినపుడు ప్రతి ఒక్కరూ ‘గాంధీ’ సినిమా ప్రస్తావిస్తూ వారిని శ్లాఘించారు. ఆ సమయంలో ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ హిందూస్తాన్‌ టైమ్స్‌  పత్రికలో ‘ది ఆమ్‌ ఆద్మీ బిహైండ్‌ అటెన్‌ బరోస్‌ గాంధీ ‘ అనే వ్యాసాన్ని 2014 సెప్టెంబరు 14న రాశారు. కేవలం ఒక్క వ్యాసకర్తే గాంధీ సినిమా వెనుక ఉన్న త్యాగమూర్తి మోతీలాల్‌ కొఠారీని ప్రస్తావిస్తూ కొన్ని కొత్త విషయాలు వెల్లడించారు. 

గుజరాతు ప్రాంతం నుండి ఇంగ్లండు వెళ్ళి స్థిరపడిన కుటుంబానికి చెందిన మోతీలాల్‌ కొఠారీ అక్కడ భారతీయ రాయబారి కార్యాలయంలో పనిచేసేవారు. 1950వ దశకం ఆఖరులో మోతీలాల్‌ కొఠారీకి హృదయసంబంధమైన సమస్య ఉందని తేలింది. తన జీవితంలో విలువయిన పని ఏదైనా చేయాలని భావించారు. హింస, ప్రతి హింసతో సతమతమయ్యే ప్రపంచానికి అవసరమైన గాంధీజీ శాంతి సందేశాన్ని శక్తివంతమైన సినిమా ద్వారా ఎందుకివ్వగూడదని కొఠారి ఆలోచించారు. 

Also read: అసలైన విప్లవవాది.. సిసలైన సిద్ధాంతకర్త!

లూయీస్ ఫిషర్ రచనే మూలం

గాంధీజీ మరణం కూడా చారిత్రాత్మకం. యాభై సంవత్సరాలకు పైగా సాగిన  పోరాటం గాంధీ నేతృత్వంలో స్వాతంత్య్రం గడిరచింది. అయితే స్వాతంత్య్రం వచ్చిన ఆరు నెలలలోపే ఒక భారతీయుడు గాంధీజీని కాల్చి చంపారు. దాంతో గాంధీజీ పట్ల ప్రపంచానికి మరింత ఆసక్తి మొదలైంది. ఎన్నో జీవిత చరిత్రలు వచ్చాయి. వాటిల్లో 1951లో వెలువడిన లూయీస్‌ ఫిషర్‌ రాసిన గాంధీ జీవితకథ చాలా పేరుపొందింది. మోతీలాల్‌ కొథారి లూయీస్‌ ఫిషర్‌ కలిశారు. ఫిషర్‌ తను రచించిన జీవిత చరిత్రను బహూకరించారు. సినిమాకు ఈ రచనే మూలం. 

1962 జూలైలో కొథారి మహాశయుడు బ్రిటీష్‌ నటుడు – దర్శకుడు రిచర్డ్‌ అటెన్‌బరోను సంప్రదించారు గాంధీ సినిమాకు దర్శకత్వం వహించమని. ఫిషర్‌ రాసిన పుస్తకాన్ని అటెన్‌బరోకు కొథారి ఇచ్చారు. ఆ పుస్తకం అధ్యయనం చేసిన తర్వాత 1963 ఫిబ్రవరిలో అటెన్‌బరో తన ఆమోదాన్ని తెలియజేశారు. లార్డ్‌ మౌంట్‌బాటన్‌ ద్వారా జవహర్‌లాల్‌ నెహ్రూను సంప్రదించమని – లోతయిన ప్రణాళికగల కొథారి సలహా ఇచ్చారు అటెన్‌బరోకు. గాంధీ సినిమా గౌరవప్రదంగా ఉన్నంతవరకూ అభ్యంతరం లేదని నెహ్రూ ఆమోదించారు. 

Also read: సంభాషించడం… సంబాళించడం!

మోతీలాల్‌ కొథారి, రిచర్డ్‌ అటెన్‌బరో ద్వయం గెరాల్డ్‌ హన్లేతో స్క్రిప్ట్‌ సిద్ధం చేయించారు. 1963 నవంబరులో వీరిద్దరూ నెహ్రూను కలసి స్క్రిప్ట్‌ చూపించారు. మరికొంత మందిని సంప్రదించి కథను సమగ్రంగా మలచాలని నిర్ణయించారు. అదే సమయంలో కొఠారీ – అటెన్‌బరో కలసి ఇండో బ్రిటిష్‌ ఫిల్మ్స్‌ లిమిటెడ్‌ అనే కంపెనీని ఈ సినిమా నిర్మాణం కోసం రూపొందించారు. 

హొరాస్ అలెగ్జాండర్ పాత్ర

ఈ విషయాలను మోతీలాల్‌ కొథారి రాసుకున్న నోట్స్ లో ఉన్నాయి. ఇది ప్రచురింపబడలేదు, కానీ గాంధీకి సన్నిహితుడైన హొరాస్‌ అలెగ్జాండర్‌ దగ్గర ఈ కాగితాలను రామచంద్ర గుహ చూశారు. అలెగ్జాండర్‌ మహాశయుడే కొఠారీ- అటెన్‌బరోలను గాంధీజీ దత్తపుత్రిక మీరాబెన్‌ (మాడలిన్‌ స్లేడ్‌) వద్దకు తీసుకు వెళ్ళారు మరిన్ని వివరాల కోసం. 

జవహర్‌లాల్‌ నెహ్రూ 1964 మే 27న కనుమూశారు. గాంధీ సినిమా ప్రాజెక్టు ఆగినట్టు సమాచారం లేదు. ఎందుకంటే 1964 డిసెంబరు 19న లండన్‌లోని శావోయ్‌ హోటల్‌లో కొఠారీ – అటెన్‌బరో ద్వయం ప్రెస్‌ మీట్‌ పెట్టి తమ సినిమా గురించి వివరించారు. ఈ ప్రెస్‌ మీట్‌లోనే రిచర్డ్‌ అటెన్‌బరో చిత్ర దర్శకుడని కొఠారీ ప్రకటిస్తూ – గాంధీజీ ప్రపంచంలోనే గొప్పవాడనీ, శతాబ్దంలో అటువంటి వ్యక్తి లేరనీ, తాను పాటించిన పిదపే ప్రవచించిన మనిషి గాంధీజీ అనీ, అటువంటి వ్యక్తి జీవన విధానం ప్రపంచపు జటిల సమస్యలకు తరుణోపాయమని కూడా వివరించారు.

Also read: గాంధీని మించిన పోరాటశీలి – కస్తూరిబా!

ఎందుకంత జాప్యం జరిగింది? 

మరి సినిమా రావడానికి 1982 ఎందుకయ్యింది? ఆర్థిక సమస్య కూడా ఒకటి. సరైన రచయిత దొరకక పోవడం ఇంకో సమస్య. తొలుత మెట్రో గోల్డ్‌విన్‌ మేయర్‌ నిర్మించడానికి అంగీకరించి, పిమ్మట వైదొలగారు. థామస్‌ మోర్‌ గురించి మంచి నాటకం రాసిన రాబర్ట్‌ బోల్ట్‌ను సంప్రదించారు. అయితే బోల్ట్‌ మొదట ప్రయత్నించి, తర్వాత తప్పుకున్నారు. 

తర్వాత కొథారి – అటెన్‌బరో మధ్య కొంత దూరం పెరిగిందనే అభిప్రాయం ఒకటి ఉంది. కారణాలు తెలియరాలేదు కానీ డేవిడ్‌ లీన్‌ను కొఠారీ సంప్రదించి సినిమాకు దర్శకత్వం వహించమని కోరారు. 1965లో లాల్‌ బహదూర్‌ శాస్త్రిని, 1968లో ఇందిరా గాంధీని డేవిడ్‌ లీన్‌ కలిశారు కూడా.  గాంధీ శతజయంతి సంవత్సరం 1969లో సినిమా వస్తుందని మోతీలాల్‌ కొథారి ఆశించారు. అది జరుగలేదు. అంతకుమించి 1970 జనవరిలో మోతీలాల్‌ కొఠారీ గుండెపోటుతో మరణించడం పెద్ద విషాదం. 

డేవిడ్‌ లీన్‌ ఆసక్తి కోల్పోవడం, కొఠారీ మరణంతో గాంధీ సినిమా ఆగిపోయింది. 1976లో అటెన్‌ బరో మళ్ళీ వార్నర్‌ బ్రదర్స్‌ ద్వారా రూపొందించాలని ప్రయత్నించారు.  అయితే అప్పట్లో భారతదేశంలో అత్యయిక పరిస్థితి విధించడంతో మళ్ళీ ఆగిపోయింది. తర్వాత ఇందిరాగాంధీని కో ప్రోడ్యూసర్‌ రాణి డూబె సంప్రదించారు. ఫలితంగా నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌ మెంట్‌ కార్పోరేషన్‌ అధ్యక్షులు డి.వి.ఎస్‌. రాజు 10 మిలియన్‌ డాలర్లతో భారతదేశపు భాగస్వామ్యానికి అంగీకరించారు. చివరకు గోల్డ్‌ క్రెస్ట్‌ ప్రొడక్షన్‌తో కలసి సినిమా పూర్తి చేశారు. 1980 నవంబరు 26న మొదలైన షూటింగు 1981 మే 10న ముగిసింది. బీహారులోని కోయిల్వార్‌ బ్రిడ్జిదగ్గర కూడా కొన్ని దృశ్యాలు తీశారు. అంత్యక్రియల దృశ్యాలలో మూడు లక్షల మంది ఎక్స్‌ట్రా నటీనటులు పాల్గోవడం ప్రపంచ రికార్డు. ఇటువంటి విషయాలు బోలెడు నెట్‌లో మనం చూడవచ్చు. 

Also read: కరోనా వేళ గాంధీజీ ఉండి ఉంటే…

మూడు ముఖ్యమైన సూచనలు

అయితే, గాంధీ చిత్రనిర్మాణం వెనుక మోతీలాల్‌ కొథారి తపన, పరిశ్రమ, పరిశోధన గొప్పవి. రచయితకు కొథారి మూడు సూచనలు చేశారు. బీదలతో మమేకమై సాగడం, అన్యాయానికి ఎదురొడ్డి పోరాడటం, ఇతరులకు చెప్పే ముందు తనే పాటంచడం – అనే గాంధీజీ తీరును సినిమా ప్రతిఫలించాలని కోరారు ! కొథారి ప్రకారం పేదరికం, వర్గపోరుగా మారిన కుల (లేదా జాతి) వైషమ్యాలు, మతపరమైన అసహనం మొదలైనవి కీలక సమస్యలనీ పేర్కొన్నారు. ఇంకా దేశాల మధ్య, వాదాల మధ్య అంతరాలు యుద్ధాలకూ, హింసకు దారి తీస్తున్నాయని మోతీలాల్‌ కొఠారీ విశ్లేషించారు. 

2014లో రామచంద్ర గుహ వివరించే దాకా ఎంతోమందికి మోతీలాల్‌ కొథారి గురించి తెలియదు. కొథారి ఆలోచనలు చాలా విలువైనవీ, వారి ప్రయత్నాలు శ్లాఘనీయాలు. 1961 నుంచి 1970 దాకా ఆయన గాంధీ సినిమా కోసం పడిన తపన, శ్రమ, శోధనా విలక్షణమైనవీ, విశేషమైనవీ! అందుకే మోతీలాల్‌ కొఠారీని అద్భుత తపస్విగా, అచంచల యోధుడిగా మనం గౌరవించాలి.

Also read: భారతీయ తొలి ఎకో-ఫెమినిస్ట్- మీరాబెన్

Dr. Nagasuri Venugopal
A broadcaster by profession, media researcher by training, a staunch Gandhian in thought, and a science writer by passion, Dr. Nagasuri Venugopal writes prolifically on contemporary issues. He penned over 60 books and two thousand newspaper articles so far. He is a PhD in journalism.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles