Monday, February 26, 2024

సంభాషించడం… సంబాళించడం!

గాంధీయే మార్గం-20

అది 1947 సంవత్సరం నవంబరు 12 ! ఆరోజు దీపావళి. దేశ విభజన జరిగింది. మతకల్లోలాల గాయాలు, కాందిశీకుల యాతనలు ఇంకా తగ్గలేదు. పాకిస్తాన్ నుంచి తరలి వచ్చిన కాందిశీకుల నుద్దేశించి గాంధీజీ కురుక్షేత్రం వెళ్ళి ప్రసంగించాలి. అయితే ఆయన అక్కడికి వెళ్ళలేకపోయారు. సరిగ్గా,  ఈ సమయంలో రేడియోను వినియోగించుకోమని సూచనతోపాటు, ఒత్తిడి కూడా పెరిగింది! 

Also read: గాంధీని మించిన పోరాటశీలి – కస్తూరిబా!

ఏ రకమైన ఒత్తిడి అది?

ఇక్కడ ఒత్తిడి అనేమాట ఎందుకంటే అంతకుముందు కొన్ని సంవత్సరాలుగా గాంధీజీ రేడియోలో ప్రసంగించాలని ప్రజలు కోరడం; ప్రపంచ యుద్ధం అనో, మరోటి అనో బ్రిటీషు ప్రభుత్వం వాయిదా వేస్తూ రావడం మామూలైంది. స్వాతంత్ర్యం సిద్ధించింది. కానీ గాంధీజీ ఇంకా రేడియోలో ప్రసంగించలేదు,  కనుక ఎంతోమంది గాంధీజీని రేడియోలో వినాలని కోరుతూ వచ్చారు. గాంధీజీకి రేడియో అంటే కాస్త బిడియం ఉండేది. చాలామంది అభ్యర్థించడంతో ఆయన అంగీకరించారు. ఢిల్లీ-కురుక్షేత్ర దూరాన్ని జయించాలంటే గాంధీజీకి రేడియోనే మార్గంగా కనబడింది. 

Also read: కరోనా వేళ గాంధీజీ ఉండి ఉంటే…

అత్యంత అప్రమత్తంగా, ప్రతిభావంతంగా, దాదాపు సంపూర్ణంగా వనరులు వినియోగించుకోవడం గాంధీజీ విధానం! ఎంత పరిమితమైన వనరులున్నా,  విజయవంతంగా సాగిపోవడం ఆయన నైజం!! రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని లండన్ నుంచి 28 డిసెంబరు 1931 న గాంధీజీ బొంబాయి చేరారు. ఆతురతతో ఎదురు చూస్తున్న ప్రజలకూ, ఎందరో నాయకులకూ లండన్ లో జరిగిన చర్చలు వ్యర్థం అన్నట్టుగా తన రిక్తహస్తాలు చూపించారు. ఆ క్షణానికి ఉన్న వనరులతో సాధ్యమైన ప్రభావవంతమైన కమ్యూనికేషన్ అది! 

Also read: భారతీయ తొలి ఎకో-ఫెమినిస్ట్- మీరాబెన్

గాంధీజీ 19 సంవత్సరాల వయసులో ఇంగ్లాండు వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారి వార్తాపత్రికలను చూశారు. గమనించిందే తడవుగా, వార్తా పత్రికకు ఉన్న సౌలభ్యాలనూ, ప్రయోజనాలనూ గుర్తించారు. అంతే రెండేళ్ళలో అక్కడ ‘వెజిటేరియన్’ పత్రికకు ఆహారం, పండుగలు, సంప్రదాయాలు, అలవాట్లు గురించి రాయడం మొదలుపెట్టారు. వెజిటేరియన్ ఉద్యమంలో చేరారు. అప్పటినుంచి  రాత, రాతతో ప్రారంభించిన పని ఉద్యమంలా సాగడం మొదలైంది. ఈ ప్రక్రియ ఆయన కనుమూసినపుడే ఆగిపోయింది.

Also read: త్యాగానికీ, పట్టుదలకూ ప్రతిరూపం – మీరాబెన్

ఇండియన్ ఒపీనియన్ 

దక్షిణాఫ్రికాలో దిగిన మూడో రోజున న్యాయస్థానంలో అవమానం జరిగింది. వ్యాకులపడిన గాంధీజీ ఆ సంఘటన క్రమాన్ని స్థానిక వార్తాపత్రికకు రాశారు. ఒక్కరోజులో పెద్ద ప్రచారం లభించింది. 35 సంవత్సరాల వయసులో దక్షిణాఫ్రికాలో ‘ఇండియన్ ఒపీనియన్’ పత్రికకు బాధ్యతలు స్వీకరించారు. సంపాదకుడున్నా అన్ని బాధ్యతలు గాంధీజీ స్వీకరించి మమేకమయ్యారు. ప్రతివారం తప్పక రెండు వ్యాసాలు రాసేవారు. ‘ఇండియన్ ఒపీనియన్’ పత్రికకు ఎక్స్ ఛేంజ్ కాపీలుగా 200 పత్రికలు లభించేవి. ఆ పత్రికలు చదివి, ఉపయోగపడతాయనే అంశాలను తన పత్రికలో తిరిగి ప్రచురించేవారు. సరళమైన భాషలో, విశేషణాలు, అలంకారాలు లేకుండా, ప్రకటనలు లేకుండా తన పత్రిక సాగేది. అనువాదంలో, పదాల ఎంపికలో జాగ్రత్త పడేవారు. పేరులేని లేఖలంటే గౌరవముండేది కాదు, తీవ్రమైన విమర్శలున్నదాఖలాలను కూడా ప్రచురించేవారు కాదు. పదేళ్ళపాటు ఈ పత్రిక కోసం పాటుపడ్డారు. తొలుత నష్టాలలో నడిచే పత్రికకు ప్రతినెలా 1200 రూపాయలు తను ఖర్చుపెట్టారు. ఇలా 26,000 రూపాయలు నష్టపోయారు.

Also read: అంతరంగం నుంచి అంతర్జాతీయం దాకా! 

అది దక్షిణాఫ్రికా విషయం కాగా, భారతదేశంలో ముప్ఫయి సంవత్సరాలపాటు పత్రికలు నడిపారు. ‘ఇండియన్ ఒపీనియన్’ కు గుజరాతీ సంచిక ఉండగా,  మన దేశంలో  ‘నవజీవన్’ ప్రారంభించి,  తర్వాత దాన్ని ఇంగ్లీషులో ‘యంగ్ ఇండియా’ అన్నారు. ‘హరిజన్’ పత్రికను జైలులో ఉన్నపుడు ప్రారంభించారు. దీన్ని ఇంగ్లీషులో ప్రచురించాలని ఒక మిత్రుడు ప్రతిపాదిస్తే అంగీకరించారు. మొదట పదివేల కాపీలతో ప్రారంభించి, మూడు నెలల్లో స్వయం పోషకత్వం సాధించాలని నిర్ణయించారు. అయితే, రెండు నెలల్లోనే స్వయం పోషకత్వం సాధించారు. తర్వాతి కాలంలో ఈ వారపత్రిక మొత్తం పది భాషలలో వెలువడేది. ఆంగ్లం, హింది, ఉర్దూ, తమిళం, తెలుగు, ఒరియా, మరాఠి, గుజరాతి, కన్నడ, బెంగాలి భాషలలో ప్రచురితమైంది. గాంధీజీ భారతదేశంలో ఏ పత్రికనూ నష్టాలతో నడపలేదు. ఆయన ప్రకటనలు ప్రచురించలేదు. 

Also read: గాంధీజీ ప్రత్యేకత ఏమిటి ?

అంతేకాదు, ఈ మూడు విషయాలను మనం గమనించాలి:

ఒకసారి గాంధీజీని,  ఆయన వ్యాసాలనూ తీసుకువెళుతున్న రైలు ఆలస్యంగా నడుస్తోంది. వ్యాసాలను పోస్టు చేయడానికి అవకాశం కూడా దొరకలేదు. ఒక మనిషి ద్వారా వ్యాసాలను బొంబాయి పంపించి, పత్రిక స్వంత ప్రచురణాలయంలో కాకుండా,  బొంబాయిలో ప్రచురించి పత్రికను సకాలంలో విడుదల చేశారు. ‘యంగ్ ఇండియా’లో ప్రచురింపబడిన విమర్శల కారణంగానే భారతదేశంలో తొలుత గాంధీ అరెస్టు అయ్యారు. 70 సంవత్సరాల వయసులో కూడా ‘హరిజన్’ పత్రిక పని పూర్తి చేయడానికి అర్థరాత్రి ఒంటి గంటదాకా మేల్కొని పూర్తి చేసేవారు. నడుస్తున్న రైలులో చాలాసార్లు రాశారు. కొన్ని ప్రసిద్ధ సంపాదక వ్యాసాల క్రింద ‘రైల్లోంచి’ అని ఉంటుంది. అలాగే కుడిచేయి నొప్పిపుడితే ఎడమ చేతితో రాసేవారు. జబ్బు చేసినపుడు కూడా వారానికి నాలుగు వ్యాసాలు రాశారు.

Also read: మహాత్ముడు ఎందుకుకొల్లాయి గట్టారు?

ప్రొఫెషనల్ జర్నలిస్ట్ 

 గాంధీజీ ఎంత ప్రొఫెషనల్ జర్నలిస్టో తెలుసుకోవడానికి ఈ విషయాలు దోహదపడతాయి. 1910లో దక్షిణాఫ్రికాలో అక్కడి బ్రిటీషు ప్రభుత్వం అచ్చు యంత్రాలు మొదలుపెట్టాలంటే భారీ మొత్తంలో డిపాజిట్టు అవసరమనే నియమం పెట్టింది. ఇది పత్రికల ప్రచురణను ఆపడానికి ఉద్దేశించిందే! దీనిని బాగా వ్యతిరేకించడమే కాదు, శిక్ష కూడా పొందారు. బ్రిటీషు ప్రభుత్వం మీద 1930 సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ (సహాయ నిరాకరణ ఉద్యమం) మొదలుపెట్టినపుడు అమెరికాలో ఉన్నవారికి గాంధీజీ ఇలా టెలిగ్రాం పంపారు:  “ఐ వాంట్ వరల్డ్ సింపథి ఇన్ దిస్ బ్యాటిల్ ఆఫ్ రైట్ ఎగెనెస్ట్ మైట్ ” కేవలం పదకొండు పదాలే, అయినా గొప్ప అర్థాన్ని ఇవ్వడమే కాదు ఎంతో ప్రేరేపిస్తాయి కూడా!

Also read: వందశాతం రైతు పక్షపాతి

 12 నవంబరు 1947 మధ్యాహ్నం 3 గంటలకు గాంధీజీ మహాత్ముడు రాజకుమారి అమృతకౌర్ తో కలసి దిల్లీలోని బ్రాడ్ కాస్టింగ్ హౌస్ కు వచ్చారు. అప్పటికి రికార్డు చేసి వినిపించే అవకాశం లేదు. ప్రార్థనకు గాంధీజీ వాడే చెక్క వేదిక వంటిది ఏర్పాటు చేశారు. స్టూడియోలోకి వెళ్ళగానే గాంధీజీ చాలా సహజంగా మారిపోయారు. బిడియం మాయమైంది. రేడియో పరికరాన్ని సొంత పరికరంగా భావించారు. ప్రసంగం హాయిగా 20 నిమిషాలు సాగింది. 13నవంబరు 1947న ‘హిందూస్తాన్ టైమ్స్’ పత్రిక సవివరమైన కథనాన్ని ప్రచురించింది. అప్పటికి అదే గాంధీజీ  చివరి ఆకాశవాణి ప్రసంగం అవుతుందని ఎవరికీ తెలియదు. తర్వాత మూడు నెలలలోపే హత్య చేయబడ్డారు. ఈ అపురూపమైన గాంధీజీ ఆకాశవాణి ప్రసంగాన్ని గుర్తు చేసుకుంటూ 2001 నుంచి ‘ప్రజోపయోగ ప్రసార దినోత్సవం’ (పబ్లిక్ సర్వీస్ బ్రాడ్ కాస్టింగ్ డే) జరుపుకుంటున్నాం. ఇక్కడ ప్రసారమంటే భావ ప్రసారం లేదా సమాచార ప్రసారంగా పరిగణించాలి. 

Also read: తొలి భారతీయ పర్యావరణవేత్త జె.సి.కుమారప్ప

గాంధీజీ దీనిని ఎలా పరిగణించారు? వేటిని తన భావప్రసారానికి వినియోగించుకున్నారు? వంటి ప్రశ్నలను పరిశీలించాలంటే ఆయన మొత్తం జీవితాన్ని తరచి చూడాలి. 1946 లో కలకత్తాలో మతకలహాలు చెలరేగాయి. ఆ సమయంలో శాంతి స్థాపన కోసం గాంధీజీ పాదయాత్ర చేస్తున్నారు. బెంగాలీ పాత్రికేయులు ప్రజలకు సందేశమివ్వండి అని అడిగారు. ఆరోజు గాంధీజీ మౌనవ్రతం పాటిస్తారు. కనుక పలక మీద బెంగాలీ లిపిలో ‘అమార్ జీబనీ  అమార్ బానీ’ అని రాశారు. ‘నా జీవితమే నా సందేశం’ అని ఆ మాటలకు అర్థం.          మరి గాంధీజీ ఏమిటో,  ఎలా తెలుసుకోవాలి? ఆయన ఏమి చెప్పారో, ఎలా చెప్పారో అనే  వాటికన్నా ఏమి చేశారో, ఎలా చేశారో  గమనించాలి.  అలాగే ఆయన వస్తువులు, దుస్తులను కూడా జాగ్రత్తగా గమనించాలి.

Also read: సిసలైన గాంధేయవాది పొట్టి శ్రీరాములు

మౌనమే సందేశం

మాటా-మౌనం – తన కమ్యూనికేషన్ కు మాటను, మౌనాన్నీ వినియోగించారు. సంభాషణ, ప్రసంగం, పాత్రికేయం ఆయన సాధనాలు. సుమారు నలభై సంవత్సరాలు ఆయన చాలా క్రియాశీలంగా పత్రికలు నడపడం గమనార్హం. ప్రపంచాన్ని చేరాలంటే ఇంగ్లీషు వాడినా మాతృభాషను, భారతీయభాషలను ఆయన నిరాదరించలేదు.  ఆయన తొలి పుస్తకంతో పాటు ఆత్మకథను కూడా తన మాతృభాష గుజరాతీలో రాశారు. పత్రికలే కాదు కరపత్రాలు ప్రచురించారు. పుస్తకాలు కూడా వెలువరించారు. మాట పనిచేయని చోటా, వేళా… మౌనవ్రతం కూడా పాటించారు. అలా తన అభిప్రాయాలను వెల్లడించారు. 

Also read: ఏడున్నర దశాబ్దాలలో గాంధీజీ విధానాలు ఏమయ్యాయి ?

ఆకారం – బక్కచిక్కిన మనిషి! కళ్ళజోడు, చిరునవ్వు, ప్రశాంతమైన కళ్ళు ఇవి మనకు గుర్తొచ్చే అంశాలు. తుండుగుడ్డ, అంగవస్త్రం, చేతికర్ర అదనం. ఇంకా మొల గడియారం, మూడుకోతులు. ఇవన్నీ కూడా మనకు సందేశాన్ని పంచే విషయాలే! ఆయన సహజత్వాన్ని, సరళ జీవితాన్ని చాటి చెప్పడమే కాదు మన దేశ పరిస్థితులకూ, శీతోష్ణస్థితికి, ఆర్థిక పరిస్థితికి తగిన విషయాలని కూడా తెలుసుకుంటే బోధపడుతుంది.

Also read: గాంధీజీ ఆలోచనలకు విలక్షణ వ్యాఖ్యాత డా.రామమనోహర్ లోహియా

ప్రవర్తన – మాటమాత్రమే మృదువు కాదు, ప్రవర్తన కూడా లలితం. మహా ఓపిక. తన శత్రువుకు కూడా హాని చేయని ఆలోచనారీతి. నచ్చజెప్పి, అందరం మెరుగు కావాలనే ధోరణి. దానికోసమే సత్యాగ్రహభావనను ప్రపంచానికి అందించిన ప్రతిభావంతుడు. మన దేశంలోని మతాలన్నింటిలో ఉండే మంచిని స్వీకరించిన ఉదారుడు. ఆయన స్పృశించని ఆలోచన లేదు. తలపెట్టని సత్కార్యం లేదు. 

ఆయన దీనికి వాడిన విధానం సంభాషణం! 

Also read: సామాన్యంగా అనిపించే అసామాన్య పోరాటం దండి సత్యాగ్రహం

(12 నవంబర్ జాతీయ ప్రసార దినోత్సవం – నేషనల్ పబ్లిక్ సర్వీస్  బ్రాడ్ కాస్టింగ్ డే సందర్భంగా)

డా. నాగసూరి వేణుగోపాల్

మొబైల్: 9440732392

Dr. Nagasuri Venugopal
Dr. Nagasuri Venugopal
A broadcaster by profession, media researcher by training, a staunch Gandhian in thought, and a science writer by passion, Dr. Nagasuri Venugopal writes prolifically on contemporary issues. He penned over 60 books and two thousand newspaper articles so far. He is a PhD in journalism.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles