Sunday, April 28, 2024

నాగసూరి కలంకత్తికి నలువైపులా పదును!

 (సాహిత్యం, సైన్స్, మీడియా రచనల గురించి ఆకాశవాణి పూర్వ సంచాలకులు, ప్రముఖ రచయిత, డా. నాగసూరి వేణుగోపాల్ తో ఇంటర్వూ)

ఇంటర్వ్యూ: సుప్రసిద్ధ కవయిత్రి మందరపు హైమావతి

ప్రశ్న 1.  ఇప్పుడు అందరూ బుల్లితెరకు బానిసలే. కానీ ఇరవై ఏళ్ళ కిందటి వరకూ ప్రతి ఇల్లూ ఆకాశవాణితోనే మేల్కొనేది. పొద్దున్న సూక్తి ముక్తావళి దగ్గర నుంచి రాత్రి ఆంగ్లంలో వార్తల వరకూ రేడియో మోగుతూనే వుండేది. అలాటి ఆకాశవాణిలో మూడు దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో పనిచేసి మీదైన ముద్రను ప్రతిష్ఠించుకొన్నారు. మీ జన్మస్థలం, బాల్యం గురించి చెప్తారా?

Announcing a new programme on sciencwe

నాగసూరి జవాబు:

ఇప్పుడు బుల్లితెరకు దాదాపు కాలం చెల్లిపోయిందేమో! అంతా మొబైల్ లోనే నడుస్తోంది.  టెలిఫోన్, సమాచారం, వార్తలు,  రేడియో, టెలివిజన్ కార్యక్రమాలు, సినిమాపాటల తుంపులు, వీడియోలు, సినిమాలు ఇలా అన్నిటికీ అరచేతిలోని మొబైలే ఏకైక సాధనమయింది.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నాలుగైదు దశాబ్దాలు ఆకాశవాణి ఏకైక సమాచార, వినోద, సామూహిక విద్య మార్గంగా పనిచేస్తూ ఇంట్లోని కుటుంబ సభ్యుల్ని ఒకేచోట కలిపి ఉంచకపోయినా సవ్యమైన సంస్కారయుతమైన భాషను అలవాటు చేస్తూ ఎన్నో ఆరోగ్యకరమైన భావాలను పరివ్యాప్తి చేసింది. అదంతా గతవైభవం!

నేను 1988 ఏప్రిల్ నుంచి 2021 జనవరి దాకా పనజి (గోవా), అనంతపురం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కడప, మద్రాసు, తిరుపతి కేంద్రాలలో పనిచేశాను. కొన్ని నెలలపాటు ఢిల్లీలోని ఆకాశవాణి మహానిర్దేశాలయం (Director General office) లో కూడా దేశ వ్యాప్తంగా రెండువందల పైచిలుకు ఆకాశవాణి కేంద్రాలలో ప్రసారం కోసం ‘రేడియోస్కోప్’ అనే ఆంగ్ల సైన్సు సంచికా కార్యక్రమాన్ని కూడా  కొన్ని నెలలు రూపొందించాను. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలో నెగ్గి ట్రాన్స్ మిషన్ ఎక్జిక్యూటివ్ గా మూడేళ్ళు గోవాలో పని చేసిన తర్వాత యు.పి.ఎస్.సి. పరీక్ష ద్వారా ఆకాశవాణి/దూరదర్శన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ తెలుగు (Spoken words and features) గా ఎంపికై పలు రాష్ట్రాలలో, పలు భాషల ఆకాశవాణి కేంద్రాలలో పనిచేసిన అదృష్టం నాది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గోవా రాష్ట్రాలకి సంబంధించి ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాలలో పనిచేసిన ప్రోగ్రామ్/ అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందికి ఉద్యోగనైపుణ్యం మెరుగు పరిచే రీజినల్ అకాడమీ ఆఫ్ బ్రాడ్ కాస్ట్ అండ్ మల్టీ మీడియా (RABM, Hyderabad) శిక్షణా సంస్థలో సంచాలక బాధ్యతలు కూడా నిర్వహించాను. అంటే అనంతపురం వంటి అతి చిన్న ఆకాశవాణి కేంద్రం నుంచి ఢిల్లీలోని ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ ఆఫీస్ దాకా;  అలాగే తెలుగులో ప్రఖ్యాత ఆకాశవాణి కేంద్రాలతో సహా పనిచేసే అవకాశం కలిగింది. ఇన్ని సాధ్యమవుతాయని నేను ఎంతమాత్రమూ ఊహించలేదు.

ఇదివరకటి అనంతపురం జిల్లా, ఇప్పటి సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలపు కుగ్రామం  కొనతట్టుపల్లి మావూరు.  అపూర్వ శిల్పకళా క్షేత్రం లేపాక్షికి పాతిక కిలోమీటర్లు, పెనుగొండ దుర్గానికి 30 మైళ్ళు, సత్యసాయి పుట్టపర్తికి 40 కిలోమీటర్లు, కదిరి నరసింహస్వామి ఆలయానికి 65 కిలోమీటర్లు, ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన తిమ్మమ్మ మర్రిమాను ఇంకా వేమన్న సమాధికి 75 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది మా వూరు!  ఎన్ని గొప్ప ప్రదేశాలు దగ్గరలోనే ఉన్నా ఇప్పటికీ సరైన తారురోడ్డు కానీ,  బస్సు సదుపాయం కానీ మా ఊరికి లేదు. పోస్టు డబ్బా కూడా లేకపోయినా పంచాయితీ ఎలిమెంటరీ స్కూలు మాత్రం మంచి భవనం, చుట్టూ సుంకేసరి చెట్లతో అలరారుతూ వుండేది. ఎటువంటి హిందూమత సంబంధమైన దేవాలయం కూడా లేని మా వూరులో అందరూ శ్రామిక జీవితం గడిపే కుటుంబాలు 50, 60కి మించి వుండేవి కావు. నీళ్ళ సదుపాయం పెద్దగా లేని ఈ కరువు ప్రాంతంలో పంటలు, జీవితమూ అన్నీ వర్షాధారమే. అలాంటి కొండకింద ఉండే కొనతట్టు పల్లి ఎలిమెంటరీ పాఠశాలలో 5వ తరగతి దాకా చదివాను. 6వ తరగతి ఆరు కిలోమీటర్ల దూరంలో వుండే మండల కేంద్రం పాలసముద్రంలోని హైస్కూలులో చదివి, తరువాతి నాలుగు తరగతులు హిందూపురంలో చదివాను. ఇంటర్మీడియెట్ హిందూపురంలోనే కాగా బి.ఎస్సీ డిగ్రీ పుట్టపర్తి సత్యసాయి కాలేజీలోనూ ఫిజిక్స్ ఎమ్మెస్సీ, ఎమ్.ఫిల్ కోర్సులు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలోనూ సాగాయి.

పదిమంది పిల్లలున్న మధ్యతరగతికి దిగువన వుండే సామాన్య, అగ్రవర్ణంలో ఎనిమిదో బిడ్డగా నేపథ్యం నాది. చిన్న చిన్న  ఇంటిపనులు, పొలం పనులు, పశువులకు సంబంధించిన పనులు మొదలైనవి చేస్తూ సాగిన బాల్యం కూడా నాది. చదువు విలువ తెలిసిన తల్లిదండ్రులు నాకు గొప్ప వరం!

2. ప్ర. స్కూల్లో చదువుకొనేటపుడు టీచర్లు పిల్లల్ని ‘‘పెద్దయినాక నువ్వు ఏమవుతావు?’’ అని అడిగేవారు కదా చిన్నపుడు!  ఆకాశవాణిలో ఉద్యోగం చెయ్యాలని అనుకొన్నారా?

జ. అలాంటి ప్రశ్న నన్నెవరూ అడినట్టు గానీ, సమాధానం చెప్పినట్టు గానీ గుర్తులేదు. బి.ఇడి. చదివితే టీచరు ఉద్యోగం త్వరగా వస్తుందని మా రెండో అన్న చెప్పడం గుర్తుంది. అయితే నాకు మాత్రం యూనివర్సిటీలో పోస్టు గ్రాడ్యుయేషన్ చెయ్యాలనే కోరిక హైస్కూలులో చదువుతున్నప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాను. దానికి ఒక సినిమా వారపత్రిక చదువుతున్నప్పుడు కలిగిన అభిప్రాయం అని చెబితే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. కానీ అది నిజం!  అలాగే ఫలానా ఉద్యోగం చెయ్యాలని అనిపించక పోయినా దీనికి సంబంధించి రెండు సందర్భాలను చెప్పచ్చు. తెలుగు వారపత్రికలను తరచు చూస్తున్నప్పుడు పత్రికలలో కాలమ్ రాయాలని,  ఆ కాలమ్ తో పాటు రచయిత అయిన నా ఫొటో వుండాలని కోరిక బహుశ 9వ తరగతి చదువుతున్నప్పుడు కలిగిందనుకుంటా!  నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు ఎమర్జన్సీని రద్దు చేసి ఎన్నికలు జరగడం,  ఆ జనరల్ ఎలక్షన్లలో కొత్తగా ఏర్పడిన జనతాపార్టీ అధికారం పొందడం అధికారం పొందడంతోపాటు; లోక్ నాయక్ జయప్రకాష్, ఆచార్య జె.బి.కృపలానీ వంటి వారి త్యాగమయ గాథలు తెలుసుకోవడం సంభవించింది.  ఆ రోజుల్లో మా మూడో అన్న మిత్రుడు డా. ఎస్. శంకర్రావు అని బొంబాయి యూనివర్సిటీలో ఎకనమిక్స్ స్కాలర్ గా వుండేవారు. ఆయన తెచ్చిన కొన్ని పుస్తకాలలో ఒకటి రెండింటిని మా అన్న తీసుకురావడం,  కొన్ని రోజులు మా ఇంట్లో వుంచటం జరిగింది. అలా కులదీప్ నయ్యర్ ‘ది జడ్జిమెంట్’,  జనార్థన్ ఠాకూర్ ‘ఆల్ ది ప్రైమినిస్టర్ మెన్’ అనే పుస్తకాలను చూశాను. వీటి గురించి డా. శంకర్రావును ఓ ప్రశ్న అడిగాను. ఇలాంటి పుస్తకాలు ప్రచురణ యోగ్యమని చివరిస్థాయిలో ఎవరు నిర్ణయిస్తారని!  ఆయన ఇలా చెప్పారు,  పబ్లిషింగ్ హౌస్ కు ఎడిటర్ వుంటారు, ఆయన డిసైడ్ చేస్తారని! అంటే చదవడమే పని కదా, అలాంటి ఉద్యోగం చెయ్యాలని మనసులో అనుకున్నా లేదా మోజుపడ్డా!  అంతే గానీ అలాంటి పని చెయ్యాలని నేను గట్టిగా ప్రయత్నించింది లేదు!

నాగసూరి వేణుగోపాల్

ఆకాశవాణి ఉద్యోగం చెయ్యాలని నేను కలలు కనకపోయినా చిన్నప్పుడు మనసులో ముద్ర వేసిన ఆశలు పలుమార్లు పలురకాలుగా తీరాయి, అదింకా కొనసాగుతోంది. అట్లనే లభించిన ఆకాశవాణి ఉద్యోగాన్ని మనస్ఫూర్తిగా గౌరవించాను, గొప్పగా ఇష్టపడ్డాను, ఆనందంగా నిర్వర్తించాను, తెలుగు ఆకాశవాణి  చరిత్రలో నాగసూరివంటూ కొన్ని పుటలు నిస్సందేహంగా నిలుస్తాయని నేను హేతుబద్ధంగానే భావిస్తున్నాను. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా సాధ్యమయినంత ఎక్కువమందికి దోహదపడే, సాధ్యమయినంత ఎక్కువ ప్రయోజనం గల విషయాలకు సంబంధించి, సాధ్యమయినంత ఎక్కువమంది వాటిలో పాల్గొనేలా చేస్తూ ఆకాశవాణికి గౌరవాన్ని, ప్రతిష్ఠను, అపుడపు ఆదాయాన్ని కూడా తెచ్చిపెట్టే రీతిలో కృషిచేశాను. పదవీవిరమణ పొందిన రెండున్నర సంవత్సరాల తర్వాత కూడా ఈ విషయాన్ని తృప్తిగానే చెబుతున్నాను. సాధ్యమైనంత తక్కువ వనరులతో, ఎక్కువమందికి దోహదపడే రీతిలో చేసిన విభిన్న సృజనాత్మక ప్రయోగాలను నా అనుభవాలుగా ‘సహరి’ ఇ-వీక్లీలో సంవత్సరం క్రితం ఓ పన్నెండు నెలలపాటు రాశాను. ఇలా రాసిన 50 పై చిలుకు వ్యాసాలు  200 పై చిలుకు పుటల పుస్తకంగా రాబోతున్నాయి. అలాగే ఆకాశవాణి చరిత్ర మైలురాళ్ళు, విభిన్న ప్రక్రియలు, విలక్షణ ప్రయోగాలు, సృజనాత్మక సేవలందించిన రేడియో మహనీయుల గురించి మరో పుస్తకం కూడా అతి త్వరలో వెలువడుతోంది.  ఈ రెండు పుస్తకాలు తెలుగు  ఆకాశవాణి కార్యక్రమాల గురించి భవిష్యత్తరాలకు దివిటీలు పడతాయి.

3. ప్ర. మీ కలానికి రెండువైపులా పదునుంది. ఒక వైపు సైన్సు, మరోవైపు సాహిత్యం. ఈ రెండిటికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు రాశారు. మీకు సైన్సు అంటే ఇష్టమా?  సాహిత్యం అంటే ఇష్టమా?  ఏది ఎక్కువ ఇష్టం??

జ. మీకు ధన్యవాదాలండీ. నిజానికి నాగసూరి కలం కత్తికి రెండువైపులే కాదు, మూడు, నాలుగు వైపులా పదునుంది అని అంటే మీరేం అనుకోవద్దు. సైన్సు, సాహిత్యం, జర్నలిజం, సామాజికం, చరిత్ర ఈ నాలుగైదు విభాగాల్లో నా మూడు పాతికల రచనల్లో కనబడతాయి. నిజానికి ఒక విభాగమని వింగడించడం కూడా ఒక్కోసారి సాధ్యపడదేమో అని కూడా అనిపిస్తూ వుంటుంది. తొలుత ప్రచురించబడిన వ్యాసాలు మూడున్నర దశాబ్దం క్రితం మూడు విభాగాలకు చెందినవి. ‘వేమనవాదంలో కవిత’ అని ‘ఆంధ్రప్రభ ఆదివారం’ సంచిక ప్రచురిస్తే; తెలుగు దినపత్రికల సంపాదకీయాల గురించి ‘ఆంధ్రపత్రిక’ డైలీ సోలార్ వాటర్ హీటర్ గురించి ; ‘ఆంధ్రజ్యోతి’ తన ఎడిట్ పేజీలలో అలంకరించాయి. ఇవన్నీ కూడా ఒక సంవత్సరం లోపు నేను యూనివర్సిటీ చదువుతున్న కాలంలో సంభవించాయి. అన్ని పెద్ద పత్రికలే! మరో రకంగా చెప్పాలంటే సమాజానికి పనికొచ్చే వస్తువును అందంగా అందిస్తూ హేతుబద్ధతను రంగరించడమే నాగసూరి వ్యాసం అని అనవచ్చునేమో! పదవ తరగతి చదువుతున్నప్పుడు ‘ఆంధ్రపత్రిక’ ఓ కవితను ప్రచురించినా, డిగ్రీ చదువుతున్నప్పుడు తొలి కథ ‘అన్వయం’ రాసిన యూనివర్సిటీ మెట్లేక్కసరికి “ఫిక్షన్ వద్దు, వచనం చాలు” అనే నిర్ణయమయిపోయింది నాలో! ఇదే మాట శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కేవలం రెండు మాటల్లో, ” వచనమంటే విజ్ఞానం” అని ‘ప్రబుద్ధాంధ్ర’ పత్రిక లో రాశారని పుష్కరం క్రితం తెలుసు కున్నాను.

ఇది కేవలం నేను రాయడం వరకే! చదవడంలో ఈ పట్టింపులు లేవు. కవిత్వం, కథలు, జీవిత చరిత్రలు వ్యాసావళులు సైన్సు, కల్చర్, చరిత్ర వంటివి చదవడానికి ఇష్టపడతాను. తెలుగు, ఇంగ్లీష్ కూడా చదవక తప్పదు నా అవసరం రీత్యా.

సైన్సు సమాజానికి చాలా అవసరం గనుకా, సైన్సును ఆసక్తికరంగా రాయగలిగాను గనుకా, పాపులర్ సైన్స్ రాసేవాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్నారు కనుకా, నాకు సైన్స్ రచయితగా గుర్తింపు, ప్రాచుర్యం, కాలమ్స్ రావడంతో పాటు పుస్తకాలు కూడా సులువుగానే వెలుగు చూశాయి. అయితే అసలు ఇష్టమైన పత్రికారంగం,  టెలివిజన్ గురించి రాయడానికి; ఆ రచనలు విరివిగా ప్రచురించడానికి నేను కొంత సాధనా ప్రణాళికాబద్ధమైన కృషీ చేయాల్సి వచ్చింది. కనుకనే  టెలివిజన్, పత్రికలు, సోషల్ మీడియా, రేడియో, సినిమా, సైన్స్ మొదలైనవాటి గురించి ఆంధ్రభూమి, వార్త, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, సూర్య దినపత్రికలు; ఈవారం, సహరి వంటి వారపత్రికలలో; ఆంధ్ర ప్రదేశ్ యోజన, నడుస్తున్న చరిత్ర, ఉపాధ్యాయ, మల్లెతీగ, మిసిమి, విజ్ఞానవని మాసపత్రికలలో ధారాపాతంగా కొన్ని సంవత్సరాల చొప్పున వర్తమాన మీడియా పోకడలను డాక్యుమెంట్ చెయ్యగలిగాను, వాటిని పుస్తకాలు గా వెలువరించగలిగాను. భారతదేశంలో మీడియా గురించి ఇంత వైవిధ్యభరితమైన కృషిని వేరొక భాషలో మరొకరు ఎవరూ చేయలేదని డా. ఎన్. భాస్కరరావు వంటి మీడియా పండితులు అభిప్రాయపడుతున్నారు. తెలుగులో మరొకరు ఇంత కృషి చేయలేదని చెబుతూనే ఈ నా  మీడియా సంబంధించిన కృషిని తెలుగు ప్రముఖులెవరూ సరిగా పట్టించుకోలేదని కూడా నేను అభిప్రాయపడుతున్నాను.  ఈ విషయంలో కొంత అసంతృప్తి వున్నా… తెలుగు మీడియాకు సంబంధించి కొన్ని దశాబ్దాల పాటు వ్యాఖ్యాన కర్తగా సేవలందించిన ఏకైక వ్యక్తిగా అనందపడుతున్నాను.

మూడు పాతికలకు మించిన నా పుస్తకాల్లో సైన్సు, సాహిత్యం, జర్నలిజం ప్రతిదీ సుమారు మూడోవంతు ఆక్రమిస్తుందని నేను భావిస్తున్నాను. అంటే నాకు సాహిత్యం, సైన్సు, సామాజికం, చరిత్ర అన్నీ ఇష్టమే!   ఈ క్లారిటీ నేను పదోతరగతి చదివేటప్పటికే నాకుంది. సైన్సును విడిగా, స్వంతంగా చదవలేమని తెలుసుకుని ఇంటర్మీడియేట్ లో సైన్సు విభాగం ఎంచుకున్నాను. అందులో ఎంతో ఇష్టమైన, ఈ భౌతిక ప్రపంచాన్ని వివరించే ఫిజిక్స్ లో నా ఉన్నత చదువు కొనసాగించాను. ఆకాశవాణి ఉద్యోగంతో ఫిజిక్స్ పిహెచ్ డి మధ్యలో ఆగిపోయిన కారణంగా సర్వీసులో చేరిన పదిహేనేళ్ళకు జర్నలిజంలో ఎమ్.ఏ. చేసి పిమ్మట ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు టెలివిజన్ న్యూస్ ఛానెళ్ళ తీరు తెన్నుల మీద పి హెచ్ డి పొందాను.

4. ప్ర. సుమారు 20 ఏళ్ళ కిందట ‘వార్త’లో మీ ‘ప్రకృతి-వికృతి’ కాలం చదివి సైన్సు విషయాలను కూడా ఇంత చక్కగా రాశారనిపించింది. మొదలు పెడితే ఆగకుండా చివరి దాకా చదివించే జలపాత శైలి,  సరళ సుందరమైన భాష … ఎవరీ రచయిత ? … అనుకొన్నాను. తరవాత తెలసింది, విజయవాడ ఆకాశవాణిలో పనిచేయడానికి కొత్తగా వచ్చారని!  అక్కడ పని చేస్తున్నప్పుడు ‘శతవసంత సాహితీ మంజీరాలు’ ధారావాహిక కార్యక్రమం ప్రసారం చేశారు కదా. ఆ కార్యక్రమం గురించి వివరిస్తారా?

జ. అవును,  సుమారు పాతికేళ్ళ క్రితం శతాబ్దపు మలుపులో విజయవాడ ఆకాశవాణిలో పనిచేసే కాలంలో సాధించిన రెండు మైలురాళ్ళు ఇవి!

పర్యావరణం గురించి అవగాహన కల్పిస్తూ కాలుష్యపు చెంపపెట్టును సైన్స్ ద్వారా చవిచూపిస్తూ సామాజిక బాధ్యతను ఫిలాసఫీతో రంగరించి సాహిత్య రూపంగా సాగింది ‘ప్రకృతి-వికృతి’ శీర్షిక. ఇందులో వంద వ్యాసాలు ‘వార్త’ దినపత్రిక ఆదివారం సంచికలో 1999 జనవరి నుంచి 2000 డిశంబరు దాకా వచ్చాయి. నాకు ఎక్కువ పేరూ గౌరవం సాధించిన రచన కూడా ఇది. అంతేకాకుండా తెలుగులో తొలి పర్యావరణ శీర్షిక కూడా ‘ప్రకృతి వికృతి’ అనవచ్చు.

తెలుగు ఆకాశవాణి కార్యక్రమాలకు మదరాసు ఒకప్పుడు మక్కా నగరం కాగా తరువాతి కాలంలో విజయవాడ ఆ స్థానాన్ని పొందింది. అలాగే హైదరాబాదు కూడా!  నా అదృష్టం , ప్రతిభ కారణంగా విజయవాడ, హైదరాబాదు, మదరాసులో పనిచెయ్యడమే కాకుండా వాటి 50, 60, డెబ్బయి అయిదేళ్ళ సంరంభాలలో ఆయా కేంద్రాల ఉద్యోగిగా సేవలు అందించే అవకాశం కూడా కలిగింది. ఉద్యోగం చెయ్యడం వరకే మన ప్రయత్నం. సహోద్యోగులను,  సందర్భాలను మనం నిర్ణయించుకోలేం కదా! కానీ చేతికొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, చేసుకోకపోవడం అనేది ఆయా ఉద్యోగుల చేతుల్లో వుంటుంది.

1996 జులైలో విజయవాడ ఆకాశవాణిలో చేరిన నాకు ప్రైమ్ టైమ్; అంటే తెలుగు న్యూస్ చానల్స్ రాని కాలంలో ఉదయం 7.15 నుంచి 7.45 గంటల దాకా ప్రసారమయ్యే ‘ఉదయరేఖలు’ పర్యవేక్షణ బాధ్యతను తొలి రోజునుంచే అప్పజెప్పారు.  ఒకరకంగా నా ప్రతిభా సామర్థ్యాలకు, విస్తృతమైన పఠనాభిలాషకు సరైన రంగస్థలంగా ఉదయరేఖలు అవకాశం కల్పించింది. బహుశ ఆకాశవాణి విజయవాడ కేంద్ర చరిత్రలో ఉదయరేఖలకు సంబంధించి పది పన్నెండేళ్ళ ఘనమైన చరిత్రలో నా ఐదారేళ్ళ పర్యవేక్షణా కాలం సువర్ణాధ్యాయమని ఘంటాపథంగా చెప్పగలను. నండూరి రామ్మోహనరావు, మహీధర రామ్మోహనరావు, సి.వి.ఎన్. ధన్, దరూరి వీరయ్య, మిరియాల రామకృష్ణ,తెన్నేటి హేమలత, కొమ్మూరి వేణుగోపాలరావు, వేగుంట మోహన్ ప్రసాద్, పరకాల పట్టాభిరామారావు, సి. రాఘవాచారి వంటి సెలబ్రిటీ శ్రోతల నుంచి విలువైన ఫీడ్ బ్యాక్ రెగ్యులర్ గా అందుకున్న సౌభాగ్యం కూడా నాది!

ఇలా ఉజ్జ్వలంగా సాగుతున్న దశలో అంటే 1999 జూలై మాసంలో మంజులూరి కృష్ణకుమారి గారికి పదోన్నతి రాగా, విజయవాడ ఆకాశవాణి సాహిత్య విభాగాన్ని కూడా నాకు అప్పజెప్పారు. ఈ బాధ్యతలు చూసిన రెండవ రాయలసీమ వ్యక్తిని! అంతకు ముందు 1960 దశకంలో అనంతపురం జిల్లా వాసి గుంటూరు రఘురాం  విజయవాడ ఆకాశవాణి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. 1999 జులై నాటికి వైటుకే సంచలనం గానీ, 2000 సంవత్సరపు పూనకం గానీ అప్పటికి మొదలు కాలేదు. వీటన్నికంటే ముందుగా 20వ శతాబ్దంలో వెలువడిన గొప్ప తెలుగు పుస్తకాలను పరిచయం చెయ్యాలనే తలంపు ఆకాశవాణి లో నాకు కలిగింది. 1999 జూలై 1వ తేదీ గురువారం ఏడుంబావుకు మొదలైన ‘శతవసంత సాహితీ మంజీరాలు’ మూడేళ్ళ పాటు సాగింది. ఇది వంద గొప్ప తెలుగు పుస్తకాల గురించి సుమారు 95 మంది పాల్గొన్న ధారావాహిక. ఇందులో కవిత్వం, కథలు, నవలలు, నాటకాలు, విమర్శ, స్వీయచరిత్రలు ఇంకా కొన్ని  వర్గీకరణకు లొంగని రచనలు పరిచయం చేశాం. నిజానికి వస్తువు,  దాన్ని సమర్పించిన శిల్పం, ఆ గ్రంధం కలిగించిన ప్రభావమూ, లేదా రేపిన దుమారం వగైరాలను వివరించడమే కాక, కాలపరీక్షకు నిలిచిన తరువాత ఆ పుస్తకం మిగుల్చుకున్నదేమిటి అనే పూర్ణమైన ప్రణాళికతో నడిచింది ఆ శీర్షిక.

చెన్నైలో రచయితలతో నాగసూరి వేణుగోపాల్

‘శతవసంత సాహితీ మంజీరాలు’ అనే అందమైన పేరును నండూరి రామ్మోహనరావు చాలా ఇష్టపడేవారు. ఈ పేరును సూచించినది అప్పటి విజయవాడ కేంద్రం డైరెక్టర్ ప్రయాగ వేదవతి గారు. నేను ఆ విభాగం చూస్తున్న కాలమంతా ఆమే నా సూపర్ వైజింగ్ ఆఫీసర్. నా పట్ల ఎంతో గౌరవం కలిగి వుండి, ఎన్నో ప్రయోగాలకు అవకాశమిచ్చిన  ఉదార దృక్పథం కూడా ఆమెది. ఆమె మంచి మంచి శీర్షికలు పెట్టేవారు. హెచ్.ఐ.వి. ఎయిడ్స్ కు సంబంధించిన ధారావాహికకు జీవితమూ, దాని ప్రతిబింబం కలిపి ‘జీవనబింబం’ అనే హుందా అయిన  శీర్షికను సూచించడం ఆమెకే చెల్లు. ‘శతవసంత సాహితీ మంజీరాలు’ 199 జూలైలో మొదలై 2002 మధ్య దాకా కొనసాగింది. ఈ ప్రసంగవ్యాసాలన్నీ ప్రతి ఆరునెలలకు ఒకేసారి ఒక ప్రత్యేక సంచికగా ‘గ్రంథాలయ సర్వస్వం’ పత్రిక ప్రచురించేది. ఈ సమయంలో కొండేపూడి వాణిశ్రీ అనే అమ్మాయి నా విభాగంలో అందించిన దోహదం కూడా కొనియాడదగ్గది. తరువాత 2002 డిసెంబరులో వంద వ్యాసాలను 700 పైచిలుకు పుటల పుస్తకంగా శ్రీమతి రావి శారద ‘ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం’ తరఫున ప్రచురించారు. ఇంకా ప్రసంగాలు సాగుతున్నాయి కాలం ఎన్నో సూచనలు చేసిన ప్రముఖులు ఈ రెండు రాష్ట్రాలలో ఉన్నారు. అలాగే పుస్తకం వెలువడే సమయానికి నేను అనంతపురం  ఆకాశవాణి కేంద్రానికి బదిలీ మీద వెళ్ళినా మిత్రులు నవోదయ రామ్మోహనరావు, వి. చంద్రశేఖరరావు, బి. తిరుపతి రావు అందించిన ప్రోత్సాహం ఘనమైనది.

ఈ ధారావాహిక ప్రసారం అవుతున్న సమయంలో నాగభైరవ కోటేశ్వరరావు గొప్ప అభినందన చేశారు. నాగసూరి ” ఇకముందు నీవేం చెయ్యకపోయినా తెలుగు సాహిత్యం నిన్ను గుర్తుపెట్టుకుంటుంది.  ఈ కృషి కారణంగా”  అని. బజార్లో ఒకే వ్యక్తి లేదా ముగ్గురు నలుగురు వ్యక్తులు కొన్ని పుస్తకాల గురించి రాసిన వ్యాస సంకలనాలు అందుబాటులో వుండవచ్చు. కానీ సి.ధర్మారావు అన్నట్టు వంద పుస్తకాల గురించి రెండువందల గొంతుకల్లో జరిగిన ప్రయోగమిది. కనుకనే నేటికీ యు.పి.ఎస్.సి., ఎ.పి.పిఎస్సీ, టి.ఎస్.పి.ఎస్సీ పరీక్షలకు ఏకైక రిఫరెన్స్ గ్రంథంగా మిగిలింది. కనుకనే ‘ఆంధ్రభూమి’ దినపత్రిక నాలుగేళ్ళ క్రితం అన్ని వ్యాసాలను ధారావాహికంగా పునఃప్రచురించింది. ఈ ధారావాహిక గురించీ, ఈ ప్రయోగం గురించీ నేను గర్వపడుతున్నాను. 20 ఏళ్ళ క్రితం వెలువడిన ఈ పుస్తకం తరువాత నాకు సంబంధించి ఇటీవల వెలువడిన ‘అఖిలకళా వైభవశ్రీ అడివి బాపిరాజు ‘ ఈ స్థాయి కృషి అని అనిపిస్తోంది. అలాంటి అవకాశం కలిగించింది ఆకాశవాణి! దానిని సద్వినియోగం చేసుకోమన్నది నా యెరుక!!

(ఇంకా ఉంది)

Hymavathi Mandarapu
Hymavathi Mandarapu
మందరపు హైమవతి ప్రఖ్యాత కవయిత్రి. ఆమె కవితా ముద్ర స్త్రీవాద కవిత్వంలో చెరిగిపోనిది. ఆమె కవిత ‘సర్పపరిష్వంగం’ తనను చాలాకాలం వెంటాడిందని చేరాతలలో చేకూరి రామారావు రాసుకున్నారు. అంతకు మించిన యోగ్యతాపత్రం అక్కరలేదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles