Tuesday, April 23, 2024

బీజేపీ ఒక “హిందూ వ్యతిరేక పార్టీ”

  1. ఇది ఎన్నికల సమయం. బీజేపీ కేంద్రంలో వరుసగా మూడవసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. స్వతంత్ర భారతదేశంలో మునుపెన్నడూ చూడని విధంగా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అక్రమ మార్గాలలో సహాయం చేసింది, దేశంలో సంపద మరియు ఆదాయ అసమానతలను పెంచింది. సామాన్య ప్రజల జీవనోపాధిని నాశనం చేసింది. ముస్లింల భయం, రామరాజ్యంపై ఆశలు, నకిలీ విశ్వగురుపై గుడ్డి విశ్వాసం కలిగించటం వంటి చౌకబారు వ్యూహాల ద్వారా ఉత్తర భారతీయ హిందువుల మనస్సులను బీజేపీ మరింతగా స్వాధీనం చేసుకుంది; వారి ఓట్లను రాబట్టేందుకు మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టి 2024 ఎన్నికలలో గెలవాలని ప్రయత్నిస్తోంది. 

2.             కాబట్టి, ఈ మతతత్వ ఫాసిస్ట్ బీజేపీని తిరిగి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోకుండా ఆపి మన దేశాన్ని, ప్రజలను రక్షించుకునే సమయం ఆసన్నమైనది. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఎన్నికల ప్రచారంలో హిందుత్వ, రామ మందిరం, మత ధ్రువీకరణ, ఫాసిజం గురించి మాట్లాడితే ఇంకా ఎక్కువ మంది హిందువులు బీజేపీ గుప్పిట్లోకి చేరవచ్చు, తద్వారా బీజేపీ తిరిగి అధికారంలోకి రావచ్చు. అందువలన, హిందుత్వ, రాముడి గురించి మాట్లాడే బదులు, బీజేపీ తాము హిందువులపార్టీ అని పైకి చెప్పుకుంటున్నప్పటికీ, బీజేపీ ఒక “హిందూ వ్యతిరేక” పార్టీ అనే నిజమైన దృక్పథాన్ని ప్రజలకు అందించాలి. అందువల్ల, 100 సంవత్సరాలుగా సంఘ్ పరివార్ చర్చిస్తున్న మతానికి సంబంధించిన విషయాల నుండి, జాతీయ చర్చను, బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా భారతీయులందరిపై, ముఖ్యంగా 110 కోట్ల పై సంఖ్యలో ఉన్న అమాయక హిందువులపై, చేసిన ఆర్థిక విధ్వంసం వైపు మళ్లించాలి.  

3.             భారతదేశంలో ఆర్థిక అసమానతలపై ఆక్స్ఫామ్ – 2022నివేదికలో చెప్పినప్రకారం, దేశంలోనిమొదటి 1% మంది సంపన్నులు జాతీయ సంపదలో 42.5%, 10% మంది సంపన్నులు 77% కలిగున్నారు; అయితే, దిగువ 50% ప్రజలు కేవలం 2.8%సంపద మాత్రమే కలిగున్నారు. ఇంకా, 2021 లో, ఉన్నత స్థానంలో ఉన్న మొదటి 1% మంది ధనికుల సంపద 46% పెరగ్గా, దిగువ 50 శాతం ప్రజల సంపద 3% మాత్రమే పెరిగింది. ఇటువంటి దయనీయ పరిస్థితిలోనూ, 90% భారతీయులను ఆర్థికంగా ఇబ్బంది పెట్టి అత్యంత సంపన్నులైన మొదటి 10% మందిని మరింత సంపన్నం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం 2014 నుండి కృషి చేస్తోంది. ఈ దుర్మార్గమైన ఆర్థిక విధానాల ద్వారా కూడగట్టుకున్న అపఖ్యాతిని కప్పిపుచ్చడానికి, బీజేపీ 80:20, అంటే దేశ జనాభాలో80% హిందువులు మరియు 20% మైనారిటీలు, అనేదుర్బుద్ధితో కూడిన ఒక విభజన ఆలోచనను ముందుకు తెచ్చింది. అంతేకాకుండా, ద్వేషం, హింస, చట్టాల ద్వారా దేశాన్ని మతపరంగా ధృవీకరించి, అధిక సంఖ్యలో ఉన్న హిందువుల ఓట్లను తమకు అనుకూలంగారాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ యొక్కమతతత్వం, ఫాసిజం, చట్టాలు, విధానాలు మరియు నిర్ణయాలు మైనారిటీలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా నాశనం చేయడమే కాకుండా, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద, నిరుపేద హిందువుల ఆర్థిక స్థితిని, జీవనోపాధిని కూడా నాశనం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎస్సీల, ఎస్టీల, ఓబీసీల, రైతుల, కార్మికుల, యువత, మహిళల, వయోవృద్ధుల జీవితాలను బీజేపీ తుంగలో తొక్కింది. గత దశాబ్దంలో హిందువుల (అగ్ర 10% మినహా) జీవితాలను మెరుగు పరిచేందుకు బీజేపీ కృషి చేస్తున్నట్లుగా చేసే వాదనలు కేవలం అపోహలు మాత్రమే. నిజానికి, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వాల కంటే ఎక్కువ మంది హిందువులను పేదరికంలోకి నెట్టింది ఈ బీజేపీ ప్రభుత్వమే. బీజేపీ ప్రభుత్వం హిందువుల కోసం పని చేస్తుందని చేసే ప్రచారం ఒక బూటకపు కథనం. వాస్తవంగా బీజేపీ ఒక “హిందూ వ్యతిరేక” పార్టీ. బీజేపీ నకిలీ కథనాన్ని తిప్పి కొట్టడానికి అవసరమైన వాస్తవాలతో కూడిన కథనం క్రింద వివరించబడింది:

 4.             జాతీయ ఆస్తులన్నీ వివిధ సమూహాలకు వారి జనాభా శాతం ప్రకారం చెందినవని భావిస్తే, బీజేపీ ప్రభుత్వం గత దశాబ్దంలో పెట్టుబడిదారులకు అప్పగించిన పన్నుచెల్లింపుదారుల ప్రతి 100రూపాయలలో, జాతీయ ఖనిజాలలో, అటవీ వనరులలో, ప్రజామౌలికసదుపాయాల ఆస్తులలో, 80 రూపాయలకంటే లేదా 80% ఆస్తులకంటే ఎక్కువ హిందువులకు చెందినవని, 20 రూపాయలుకంటే లేదా 20% ఆస్తుల కంటే తక్కువ మైనారిటీలకు చెందినవని అర్థమవుతుంది. భారతదేశంలో మైనారిటీలు వారి జనాభా శాతంతో పోలిస్తే అసమానంగా తక్కువ ఆర్థికస్థితిని, ఆస్తులను కలిగి ఉన్నారు. దీంతో బీజేపీ ప్రభుత్వ చర్యలు హిందువులకు ఎక్కువ ఆర్థిక నష్టాన్ని కలిగించినట్లు నిరూపించబడుతోంది.

5.             ప్రభుత్వరంగ సంస్థలను, మౌలిక సదుపాయాలను, అన్యాయంగా, తక్కువ ధరలకు ప్రైవేటీకరించడం, లీజుకు ఇవ్వడంవల్ల, ఈ సామాజిక ఆస్తుల్లో 80 శాతం వాటా కలిగియున్నహిందువులకు ఎక్కువ నష్టం జరుగుతుంది. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, ప్రధానంగా, ఎస్సీ, ఎస్టీ, ఒబిసిల  EWSల ఉపాధిని దెబ్బతీస్తుంది; ఎందుకంటే, కొనుగోలు చేసే ప్రైవేట్ సంస్థలకు ఉద్యోగాలలో రాజ్యాంగ బద్ధంగా నిర్దేశించిన రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత ఉండకపోవచ్చు. తద్వారా బీజేపీ హిందువుల జీవనోపాధికి తీవ్రమైనహాని చేస్తుంది.  

6.             ప్రభుత్వరంగ బ్యాంకులనుంచి పెట్టుబడిదారులు తీసుకున్న రూ.15.4లక్షలకోట్ల రుణాలను బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసింది. ఈ మొత్తాలు దిగువ, మధ్యతరగతి, వేతనజీవుల కష్టార్జితం. అంతేకాకుండా, నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులకు పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో మూలధనాన్ని సమకూర్చింది. ఈ రెండు చర్యలవలన నష్టపోయినవారిలో 80% ప్రజలు హిందువులే. 

7.             “నోట్ల రద్దు” సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలరంగాన్ని, చిన్న వ్యాపారాలను నాశనం చేసింది; లక్షలాది దిగువ, మధ్యతరగతి,  పేద ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు; అప్పులపాలయ్యి ఆత్మహత్యలు చేసుకున్నారు; వారిలో 80% మంది హిందువులు. అయితే, ఈ ప్రక్రియ వలన “నల్ల ధనం” వెలికి తీయబడలేదని రద్దు చేసిన నోట్లన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తిరిగి రావడంవలన నిరూపించబడింది. 

8.             దేశంలోని ఎక్కువ సాగు భూమి హిందూ రైతుల యాజమాన్యంలో ఉంది. లక్షలాది హిందూ కౌలు రైతులచే సాగు చేయబడుతోంది. బీజేపీ ప్రభుత్వ “నల్ల వ్యవసాయ చట్టాలు” హిందూ రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి కార్పొరేట్‌లకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ఉన్నాయి. పెరిగిన ముడి సరుకుల ఖర్చులు, సరిపోని రుణ సదుపాయాలు, ప్రకృతి వైపరీత్యాలు, సహాయపడని భీమా పథకం, ధరల అస్థిరత హిందూ రైతుల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి.  

9.             ప్రభుత్వం కార్పొరేట్ పన్నులను 30% నుండి 22%కి తగ్గించటం వలన పెట్టుబడిదారులకు లాభం, ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరిగింది. అయితే, అదనపు పెట్టుబడులుగాని, కొత్త ఉద్యోగాల కల్పనగాని జరగలేదు; తద్వారా, యువత అనేక విధాలుగా నష్టపోయింది. బీజేపీ ప్రభుత్వం GST పరిధిని, రేట్లను పెంచి దోపిడీ పన్ను విధానం అవలంబిస్తోంది; ఆరోగ్యం, విద్యా రంగాలను విస్మరించింది; పేదల ఉపాధి పథకాలకు నిధులను తగ్గించింది; కొత్త లేబర్ కోడ్‌లతో పారిశ్రామికవేత్తలకు సహాయం చేసి, కార్మికులకు హాని కలిగించింది; నిత్యావసర వస్తువులైన కిరాణా, ఇంధనం, గ్యాస్, వివిధ సేవలయిన రవాణా, విద్యుత్ ల ధరలను పెంచి మధ్య, దిగువ, పేద వర్గాలను దెబ్బతీసింది. మైనారిటీలు, దళిత మహిళలపై నేరాలు పెరిగాయి;  పైన వివరించిన ప్రభుత్వ చర్యల బాధితుల్లో 80% హిందువులే.  

10.           పైన వివరించిన బీజేపీ ప్రభుత్వ చర్యలు, సంపన్నులను మినహాయించి, మైనారిటీలకు అన్ని రకాలుగా, దేశ జనాభాలో 80% ఉన్న హిందువులలోని ప్రతి వర్గానికి ఆర్ధికంగా, తీవ్రమైనహాని కలిగించింది. అయితే, బీజేపీ యావత్ప్రపంచానికి తమ పార్టీ “హిందూ అనుకూల పార్టీ” అని చెప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో, హిందువులు మాత్రమే అధికారంలో ఉన్న బీజేపీ (బీజేపీలో ముస్లింలు అధికార స్థానాల్లోలేరు) హిందువులకే అపారమైన హానిని కలిగిస్తున్న విషయం దిగ్భ్రాంతికరం; తద్వారా, బీజేపీ ఒక “హిందూ వ్యతిరేక” పార్టీ అని నిస్సందేహంగా నిర్ధారించబడింది. కాబట్టి, బీజేపీ ప్రభుత్వ ఫాసిజానికి, మతతత్వానికి, “హిందూ వ్యతిరేక తత్వానికీ” వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన, సత్యమైన కథనం ద్వారా మనం కలిసి పోరాడుదాం, మన దేశాన్ని, మన ప్రజలను, కుల మత వివక్ష లేకుండా కాపాడుకుందాం. విద్యావంతులు, మేధావులు, దేశభక్తులు, పౌర సమాజ సమూహాలు, ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రయత్నంలో ఒక ముఖ్య భూమిక పోషించవలసిన అవసరముంది. 1984లో జార్జ్ ఆర్వెల్ చిత్రీకరించిన డిస్టోపియన్ సమాజంగా మన ప్రియమైన భారతదేశం మారకుండా చూసుకుందాం.  

-బండ్ల శ్రీనివాస్, నెల్లూరు నరసింహారావు, నలమాటి లక్ష్మణరావు

Bandla Srinivas
Bandla Srinivas
బండ్ల శ్రీనివాస్ ఐ ఎ యస్ (రిటైర్డ్)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles