Monday, May 27, 2024

వడ్డీ వ్యాపారుల కబంధహస్తాల నుండి ఆదివాసీలకు విముక్తి, పట్టా చేతికి వచ్చిన గంటకే ప్రాణం పోయింది!

ఫొటోో రైటప్: కొత్తకోట పోలీస్ స్టేషన్ లో ఉదయం 8 గంటలకు యువ న్యాయవాది – ఆదివాసీ చక్ర వడ్డీల బాధితులు (కాషాయం షేర్ట్ వేసుకున్న ఆసామి పక్కన నిలబడిన ఆసామి – కరకయ్యే)

BBC డాక్యుమెంటరీలో కొండదొర ఆదివాసీ గంగమ్మ వారి పిల్లల ఆవేదన చూసిన నేను తీవ్రంగా కలత చెందాను. వారి భూమి వారికి ఇప్పించే వరకు, 99 సంవత్సరాల లీజు ఎగ్రిమెంట్ రద్దు అయ్యే వరకూ, వారి పట్టాదార్ పాస్ పుస్తకాలు వారి చేతికి వచ్చేంతవరకూ అవిశ్రాంతిగా పని చేయాలని అదే రోజు నిర్ణయించుకున్నాను.
ఈ రోజు (మే 14, ఆదివారం) ఆ లక్ష్యం నెరవేరిందనే సంతోషం నాకు ఎక్కువ సేపు నిలవలేదు.
కొత్తకోట పోలీస్ స్టేషన్లో తమ చేతికి అందిన పత్రాలు పట్టుకుని తిరుగు ప్రయాణం చేస్తున్నా గంగమ్మ ఆమె భర్త ప్రమాదానికి గురయ్యారు. ఈరోజు మధ్యాహ్నం గంగమ్మ భర్త కరకయ్య తుది శ్వాస విడిచాడు.
వారి భూమిని వారికి సాధించి పెట్టి ఇచ్చామనే సంతోషం మాకు ఎక్కువ సేపు నిలవలేదు.
అత్యంత విచారకరమైన రోజు ఆదివారం ముగిసింది.
గత కొద్ది రోజులుగా మన సంఘ సభ్యులైన రావికమతం రోలుగుంట మండలాల కార్యకర్తల శ్రమ, నా శ్రమ ఈ విధంగా కావడం నాకు మిక్కిలి బాధాకరం.
గంగమ్మ కుటుంబ సభ్యులు ఈ విషాదంలోంచి త్వరగా బయటపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాంప్రదాయంగా జరిపే కర్మ రోజు ముందుగా తెలిస్తే నాతోపాటు మన సంఘంలోని కీలక నేతలు అందరూ తప్పక రరోచ్చకొనుకు చేరుకోగలము. ఇది నా జీవితంలో నేను చూసిన విషాదకరమైన జీవన పోరాటం. గత వారం రోజులుగా మండే ఎండలలో నేను నా సహచర కామ్రేడ్స్ పడిన శ్రమ ఇలా ముగుస్తుందనుకోలేదు.
ఫోటోలు :

కన్నీళ్లు తుడిచాం… రుణ విముక్తులను చేశాం… భూమి పట్టాలను భూమిని వెనక్కి ఇప్పించాం…

99 సంవత్సరాలు అంటే 100కు ఒక సంవత్సరం తక్కువ. పొట్టుకూరు గంగమ్మ ఆమె భర్త తమ కండరాల శక్తిని ధారపోసి ఏపుగా పెంచిన జీడి మామిడి తోటను నర్సీపట్నం కు చెందిన షావుకారి గంగమ్మకు రెండు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చి దానిపై వడ్డీలకు వడ్డీలు పెంచి భూమిని స్వాధీనం చేసుకున్నాడు. తనకున్న ఇద్దరు పిల్లలకు పక్కా ఇంటిని నిర్మించాలని గంగమ్మ తాపత్రయం. ఆ రెండు లక్షలకు తన తోటలో పoడే పంటను హామీగా చూపించి షావుకారు దగ్గర అప్పు తీసుకుంది గంగమ్మ. కానీ ఆ అప్పు  సాలిగూడనీ, ఇక అందులోనుండి తాను బయటపడలేననీ ఆ క్షణంలో గంగమ్మకు తెలియదు.

పంటంతా ఇచ్చినా అప్పూ, వడ్డీ పెరుగుతూనే ఉన్నాయి

సంవత్సరాలు గడుస్తున్నాయి పండిన పంటoతా అప్పు ఇచ్చిన షావుకారికే ఒప్పగిస్తున్నది కానీ ఎప్పటికప్పుడు వడ్డీ గానీ అసలు గానీ తీరకుండా  పెరిగిపోతూనే ఉంది. ఇక నీవు అప్పు తీర్చలేవు గనుక నీ దగ్గర ఉన్న భూమిని 99 సంవత్సరాల పాటు లీజుకు రాసి తీరాలని నర్సీపట్నం షావుకారు ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. గ్రామంలో కొందరు ‘పెద్దలు’ అని చెప్పుకునే వారు అతనికి వంత పాడటం మొదలుపెట్టారు. చివరికి 15 రూపాయల స్టాంప్ పేపర్ పై ఇంటిళ్లిపాది వేలిముద్రలు నొక్కవలసి వచ్చింది. ఇక అక్కడి నుండి రెండు ఎకరాలకు పైగా ఉన్న జీడి మామిడి తోట షావుకారు సొంతం  అయ్యిoది. 99 సంవత్సరాలు అంటే అది పూర్తి అయ్యేసరికి గంగమ్మ కాదు వారి పిల్లలు వారి పిల్లలు నేలపై జీవించి ఉంటారనడానికి ఎలాంటి హామీ లేదు. ఇదంతా జరుగుతుంది ఔరంగజేబు పరిపాలించిన మధ్యయుగాలలో కాదు సుమా! 21వ శతాబ్దంలో అందునా లిఖిత రాజ్యాంగము, చట్టబద్ధ పాలన అమలు అవుతుందని, భారత దేశంలో ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజాస్వామ్యానికే తల్లి అని ఈ దేశ ప్రధానమంత్రి విదేశాలలో డoకా భజాయిస్తున్నప్పుడు జరుగుతున్నది.

Also read: భూమి ప్రశ్న – భు పరిపాలనలో వస్తున్న మార్పులు

పేరుకి ఇది రొచ్చిపోనుకు గ్రామం, గంగమ్మ కథ అయినా రావికమతం మండలం, కళ్యాణపులోవ ప్రాంతంలోని ఆదివాసి జీడి మామిడి తోట రైతుల కథ.

99 సంవత్సరాల దొంగ లీజు డాక్యుమెంట్స్ , ఒరిజినల్ పాస్ పుస్తకాలను CI ఇలియాస్ అహ్మద్ సమక్షంలో అందుకుంటున్న పోతుకూరు గంగగమ్మ.

రొచ్చుపనుకు గ్రామంలో 35 ఆదివాసీ కుటుంబాలు

35 ఆదివాసి కుటుంబాలు ఉన్న రొచ్చుపనుకు గ్రామంలో విచారిస్తే అప్పులకు షావుకారులు వేసిన చక్ర వడ్డీలు లెక్క కడితే రెండు కోట్ల వరకూ వచ్చింది. ఈ అప్పులు వడ్డీలు అలాగే కొనసాగితే 99 కాదు 1000 సంవత్సరాలైనా ఈ ఆదివాసీలు పేదరికంలో నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. అంతేకాదు 10 నుండి 20 వేల రూపాయల వరకు నగదు అప్పుగా ఇచ్చి 20 నుండీ 30 సంవత్సరాలు పాటు ఆదివాసి జీడిమామిడి తోటలను లీజు పేరుతో రాయించుకుంటున్న విషయం వెలుగు చూస్తున్నది.

నిజానికి ఆదివాసీలతో వడ్డీ వ్యాపారం చేస్తున్న వారెవరూ ప్రభుత్వం వద్ద ఎలాంటి లైసెన్సు తీసుకోలేదు.

Also read: “9 నెలలుగా ఈ సమస్య అపరిష్కృతంగా వుంది”..

వీరు 99 సంవత్సరాల పాటు లీజులు రాయించుకుంటున్న భూములు ప్రభుత్వం ఇచ్చిన డి-పట్టా భూములు. వీటిని వంశపారంపర్యంగా అనుభవించాలే గాని అన్యాక్రాంతం చేయడానికి వీలు లేదు. ఒకవేళ పరుల పాలు అయితే అందుకు అట్టి భూములు కొన్నవారికి, లీజుకు తీసుకున్న వారికి, తనఖా పెట్టిన వారికి 2000 రూపాయల జరిమానా నుండి ఆరు నెలల జైలు శిక్ష మంది.

అంతేకాదు, షెడ్యూల్డ్ తెగలైన ఆదివాసీలను భూముల నుండి చట్ట విరుద్ధంగా తొలగించడం కోసం రూపొందించిన చట్ట విరుద్ధమైన పత్రాలు కూడా 2015 లో సవరించబడిన షెడ్యూల్డ్ కులాల , షెడ్యూల్డ్ తెగల అత్యాచారాల నిరోధక చట్టం కింద నేరం.

చట్టాలు ఇంత స్పష్టంగా చెబుతున్నా చాప కింద నీరులా జరిగకూడనివి జరిగిపోతూనే ఉన్నాయి.

బీబీసీ వీడియో కథనాలు

రోచ్చుపనుకు గ్రామస్తుల అభ్యర్థనపై నేను,  మోసూరు రాజు పర్యటించి వివరాలు సేకరించాం. వాటి ఆధారంగా రాసిన నివేదిక, సుప్రసిద్ధ పాత్రికేయులు రామచంద్ర మూర్తి గారి వెబ్ పోర్టల్ “సకలం” లో ప్రచురితమయ్యింది.

Also read: అప్పుల ఉచ్చులో  ‘రొచ్చుపనుకు’ ఆదివాసీ రైతులు

ఆ నివేదిక BBC వారిని ఆకర్షించి, వారి బృందం ఆ గ్రామాన్ని సందర్శించి ఆదివాసీల నుండి వివరాలు సేకరించింది. వాటిని రెండు విడివిడి వీడియో స్టోరీలుగా విడుదల చేసింది.

BBC తెలుగు విభాగం వారు విడుదల చేసిన ఈ రెండు వీడియో స్టోరీలు క్రమంగా మీడియా దృష్టిని, ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాయి.

ఆ కారణంగా మే 13వ తేదీ శనివారం నాడు రెవిన్యూ,  పోలీస్ విభాగాల అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.

లీజు పత్రాలు వాపసు

ఆదివారం మే 14  ఉదయం బాధిత ఆదివాసీలను, 99 సంవత్సరాలు లీజు రాయించుకున్న వారిని కొత్తకోట పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ఆదివాసీల తరఫున నేను, యువ న్యాయవాది అనన్య హాజరయ్యాము.

పొట్టుకూరి గంగమ్మ, తుర్రే ఎర్రయ్య, ఉల్లి సోమయ్య లకు సంబంధించిన ఆరు ఎకరాల భూమికి గాను లీజు పత్రాలు, ప్రో నోట్లు, ఆదివాసీల ఒరిజినల్ పట్టాదార్ పాస్ పుస్తకాలు పోలీసుల సమక్షంలో ఆదివాసీలకు అందజేయబడ్డాయి.

నర్సిపట్టణం ఏరియా ఆసుపత్రిలో కరకయ్య

సంతోషంలో విషాదం:

అంతా బాగానే జరిగిందనుకొని నేను ఇంటికి చేరుకొని నడుము వాల్చేసరికి విచారకరమైన వార్త నాకు చేరింది. తిరుగు ప్రయాణమైన ఆదివాసీల ఆటో ప్రమాదానికి గురికావడం అందులో ఉన్న 13 మందిలో ఐదుగురుకు గాయాలు అవ్వడం జరిగింది. గాయపడిన ఐదుగురిలో గంగమ్మ భర్త కూడా ఉన్నారు. కటిక పేదరికంలోనూ, కష్టార్జితమైన భూమి పోయిందనే విషాదంలో మునిగిపోయిన ఆ కుటుంబం ఈరోజే సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ ఉండగా అది ఎక్కువ సేపు నిలబడలేదు. 108 లో గాయపడిన వారిని నర్సీపట్నం ఏరియా ఆఫీసుకు తరలించారు. అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం కార్యకర్తలను అలర్ట్ చేయడం జరిగింది. మహాసభ నిర్వహణ కోసం సేకరించిన నిధుల నుండి తక్షణ అవసరంగా 15 వేల రూపాయలను నేను బాధిత ఆదివాసీల వద్ద ఉన్న కార్యకర్తలకు పంపించడం జరిగింది.

ఆటో ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆదివాసీ

వారందరూ గాయాలు నుండి కోల్కుంటారని 25వ తారీఖు నాడు అనకాపల్లిలో జరుగు మహాసభలో పాల్గొంటారని ఆశిస్తున్నాను.

విజయం చిన్నదే అయినా ఈ రోజు  పోలీస్ స్టేషన్  వద్ద వివిధ ఆదివాసి గ్రామాల వారు 60 మంది వరకు చేరుకున్నారు. వారందరిలో ఒక మనోధైర్యం వచ్చింది. సంఘం కట్టుకుంటే కలిసికట్టుగా పోరాడగలమని, విజయం సాధించగలమని వారు గ్రహించారు.

Also read: ‘MLA’ వంతంగి పేరయ్య భూమి కధ

అజయ్ కుమార్ పీ ఎస్
అజయ్ కుమార్ పీ ఎస్
పీఎస్ అజయ్ కుమార్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో సోషల్ వర్కులో మాస్టర్స్ డిగ్రి (MSW) చేశారు. గత 30 ఏళ్లుగా ఆదివాసీల భూమి సమస్య, నిర్వాసిత, గ్రామీణ కార్మికుల హక్కుల కోసం పని చేస్తున్నారు. ‘ప్రభుత్వ భూమి పేదలదే’, ‘భూమి సమస్య – వ్యాసాలు 1, 2’, ‘కళ్యాణలోవ కధలు’ ప్రచురితమైన పుస్తకాలు. భూమి సమస్య వ్యాసాలు – 1కి, DNF Rural Journalist award foundation –Hyderabad వారి Rural journalist award for year 2008 లభించింది. ప్రస్తుతం అఖల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్నారు.

Related Articles

1 COMMENT

  1. ఈరోజు మధ్యాహ్నం తర్వాత గంగమ్మ భర్త నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మృతి చెందాడని తెలియజేయడానికి విచారిస్తున్నాను. పోయిన భూమి తిరిగి వచ్చిందని తమ పట్టాదారు పాస్ పుస్తకాలు తమ చేతికి అందయని ఒక్కరోజు కూడా ఆ ఆనందాన్ని అనుభవించకుండా ఆయన విగత జీవుడు కావడం అత్యంత విషాదకరమైన విషయం.
    గంగమ్మ కుటుంబానికి అటువంటి బాధ్యత కుటుంబాలకు అండగా ఉంటాం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles