Monday, October 7, 2024

భూమి ప్రశ్న – భు పరిపాలనలో వస్తున్న మార్పులు

(IRAP వారి వెబ్నార్ లో (ఆన్ లైన్ క్లాస్) ఇచ్చిన ప్రసంగానికి అక్షర రూపం)

PS అజయ్ కుమార్ MSW (LLB)

రెండు పదాలు మూడు అంశాలు

“భుమి ప్రశ్న” అనే మాటలో రెండు పదాలు వున్నాయి. “భుమి ప్రశ్న” అనే మాట ఆర్దిక, రాజకీయాలు, చరిత్ర, సాంఘిక సంబంధలతో దట్టించబడిన రెండు పదాల కలయిక. మొత్తంగా కమ్యూనిస్టు ఉద్యమానికి, ప్రత్యేకంగా వ్యవసాయ ప్రధాన ఆర్దిక వ్యవస్థల దేశాలకు, జాతులకు చాల  కీలకమైన అంశo ఇది. Land question అనే మకుటంతో ప్రొపెసర్ జయతి ఘోష్ ఒక పుస్తకం ప్రచురించారు. అందులో భూమి ప్రశ్నకు సంబందించి మారిస్క్టు మహోపాద్యాయులు ఏమి చెప్పింది ఒక చోటకు తెచ్చే ప్రయత్నం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే “భూమి ప్రశ్న”, భూమి సంబంధాల అమరిక   ( Tenure) పద్దతిని (Systems)   సూటిగా ప్రస్తావిస్తుంది. వ్యవసాయక విప్లవానికి “భూమి ప్రశ్న” చాల కీలకమైనది గనుక కమ్యూనిస్టులకు అతి ముఖ్యమైనది.

Also read: “9 నెలలుగా ఈ సమస్య అపరిష్కృతంగా వుంది”..

నేను  “భూమి ప్రశ్న”ను ఒక సైధాంతిక అంశంగా చర్చించడానికి కావలసిన విషయపరిజ్జనంగాని ఆ రకమైన అధ్యయనం గాని లేనందున నిత్య జీవిత, రోజువారి  అనుభవం నుండి అప్పుడప్పుడు చేస్తున్న అధ్యయనం, సమాలోచనల నుండి చెప్పే ప్రయత్నం చేస్తాను.“భూమి ప్రశ్న”లో మూడు  అంశాలు వాటిలో ఉప అంశాలు  నిబిడికృతంగా వున్నాయి. అవి ఏమిటో చూద్దాo.

భూమి సంబధాలు : మొదటి కేటగిరిలో  ఉప అంశాలు

A.      భూమి సంబంధాల స్వభావం

B.      చారిత్రిక క్రమంలో ఏ దశలో వున్నాయి?

C.       వాటి మార్పుకు “కోర్స్ ఆఫ్ ఏక్షన్” ఎమిటి?

భూమి సమస్యలు :  రెండవ కేటగిరి ఉప అంశాలు

A.      భూమి సమస్యలో తక్షణ సమస్యలు – “కరెంట్ ఎపైర్స్”

B.      సాగుదార్లు, కౌలుదార్లు, చిన్న, సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు 

C.       భూమిలేని వ్యవసాయ కార్మికులకు భూమి

భూ పరిపాలన : మూడవ  కేటగిరి ఉప అంశాలు

A.      భూమి పరిపాలన (Land administration / Land Governances)

B.      రాజ్యం (State) ఏర్పాటు చేసిన వ్యవస్థలు – రెవిన్యు కార్యాలయాలు, సబ్ – రిజిస్టర్ ఆఫీసులు, సర్వే & లేండ్ రికార్డ్సు కార్యలయాలు, సివిల్ కోర్టులు, భూ సేకరణ కార్యలయాలు వగైరా 

C.       1. భూమిపరిపాలన సాధనాలు (ఇనుస్ట్రుమెంట్స్) కేంద్ర , రాష్ట్ర భు చట్టాలు, కార్యనిర్వాహక ఆదేశాలు, కోర్టు తీర్పులు, పాలన పద్దతులు, సంప్రదాయాలు.

2. ఈ భూమి పరిపాలన సాధనాల (ఇనుస్ట్రుమెంట్స్)లోనే మరో భాగం  “భూమి రికార్డులు” . 

భూమి రికార్డులు

A.      హక్కుల నమోదు

B.      మార్పులు – చేర్పులు (మ్యుటేషన్స్)

C.       హక్కుల పరిధి

D.      భూమి గుర్తింపు (ఫిజికల్ ఐడెoటిఫికేషన్) – భూమి సర్వే (సర్వే రికార్డులు – పద్ధతులు)

పైన ప్రస్తావించిన అంశాలలో వ్యక్తిగతంగా నా కార్యక్షేత్రం ముందు ప్రస్తావించిన రెండవ, మూడవ కేటగిరిలలోకి వస్తాయి. అంటే రోజువారి సమస్యలు, వాటి పరిరక్షణకు  మన ముందున్న సాధనాలు. అందుచేత ఆ రెండు అంశాల మీద ముందుగా చర్చించుకుందాం. ఆఖరిలో మొదటి అంశాన్ని ప్రస్తావించుకొని ముగిద్దాం.

Also read : అప్పుల ఉచ్చులో  ‘రొచ్చుపనుకు’ ఆదివాసీ రైతులు

భూమి సమస్యలు పలు రకాలుగా వుంటాయి. సునీల్ గారు సమస్యలను లెక్కగట్టి వాటిని 70 రకాలుగా గుర్తించారు. ఆస్తిగా భూమి పంపకాలలో కుటుంబ సభ్యుల మధ్య వచ్చే తగాయిదాలను ఒక ప్రక్కన పెడితే, గ్రామాలలో పేద వర్గాలకు – రాజ్యానికి మధ్య, పేద వర్గాలు – ఆధిపత్య / బలాఢ్య వర్గాలకు మధ్య వచ్చే సమస్యలు మా ప్రధాన కార్యక్షేత్రం.

భూ పరిపాలనలో మనం చెప్పుకున్న ఉప అంశాలు  ఒక సాలెగూడులా (స్పయిడర్ వెబ్) ఉంటాయి. ఇందులోని వ్యవస్థలు   కొన్ని పాత, దీర్ఘ మొండి వ్యాధులతో కొట్టుకుంటూ వుంటాయి. వీటికి అదనoగా , 2015 నుండి కొత్త జబ్బులు  వచ్చి చేరాయి. చివరికి పాత, కొత్త జబ్బులన్ని  కలసి వ్యవస్థలను అంపశయ్య మీదకు చేర్చాయి.

మన చర్చను తేలిక పరిచేందుకు రెండు కేసులు చెపుతాను. ఒకటి సినిమాలోది, రెండవది నిజ జీవితంలోది.

కోటయ్య కథ – రోజులు మారాయిలో…

కోటయ్య కధ – రోజులు మారాయి !?

ఒక్క సెంటు భూమి లేని కోటయ్యకు వ్యవసాయం ఎలా చేయాలో తెలుసు. వ్యవసాయం చేయని గ్రామ భూ యజమాని సాంబయ్య  వద్ద ఆయన కౌలు రైతు. ఆ కౌలు వ్యవసాయం మానేసి గ్రామంలో వున్న 4 ఎకరాల ప్రభుత్వ భూమిలో సాగులోకి దిగుతాడు కోటయ్య. అంతకు ముందు ఆ బంజరులో నల్ల తుమ్మ చెట్లు ఉండేవి. అందుకని దానికి “తుమ్మల బంజరని” పేరు. వరి పంట నూర్చే సమయానికి అక్కడకి గ్రామ  కరణం, పోలయ్య వస్తారు. పోలయ్య అనే వాడు సాoబయ్య చేలా / రౌడి.   రికార్డు దాఖల సాగుదారు పోలయ్య గనుక ఆ పంట పోలయ్యేదేనని వారి వాదన . తగవు పెద్దగా రంగంలోకి దిగిన సాంబయ్య, వాస్తవ సాగుదారైన కోటయ్య నుండి రికార్డు దాఖల సాగుదారైన పోలయ్యకు ఎకరాకి 3 బస్తాల చొప్పున 12 బస్తాలు ధాన్యం  ఇప్పిస్తారు.

Also read: ప్రత్యామ్నాయ భూములు కోరుతూ అనకాపల్లిలో దీక్షాశిబిరం

ప్రశ్న ఏమిటంటే, వాస్తవ సాగుదారు రికార్డు సాగుదారుగా ఎందుకు కాలేదు. ముందు మనం ప్రస్తావించుకున్న మూడవ అంశం అందులోని ఉప అంశాలు  ఏo చెపుతున్నాయి ?.  రెండవ కధ కూడా వినేసి అప్పుడు ఈ ప్రశ్నల వద్దకు వద్దాం.

రోజులు మారాయిలో అక్కినేని నాగేశ్వరరావు రైతు పాత్రలో…

అడివమ్మ కధ – కాగితం ఏది ?!

విశాఖ జిల్లా , రోలుగుంట మండలం, కొంతలం గ్రామానికి చెందిన అడివమ్మ ఒక వంటరి మహిళా రైతు. కొండ కమ్మర తెగకు చెందిన ఆదివాసీ మహిళ.  తాను గత 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిలో తమకు చెందిన రెండు (2) ఎకరాలు భూమి వుందని కనుక దానిని వదిలేయాలన్నది గ్రామ మోతుబరుల వాదన. ఆ భూమిలోకి SI వచ్చాడు. అడివమ్మ తన సాగును, గట్లు మీద వేసిన తాడి (తాటి) చెట్లను చూపింది. అంతా తిరిగి చుసిన SI, “ నీవు ఈ భూమిని సాగు చేస్తున్నట్లు కాగితం ఏది ?” అని అడిగాడు అడివమ్మని. ఆ భూమిలో తన జీవితం అంతా ధారాపోసిన అడివమ్మ దగ్గిర తానే  సాగు చేస్తున్నట్లు  “కాగితం” లేదు. SI సాగునైతే చూశాడు కాని ఆయనకీ కాగితం కావాలి. అది అడివమ్మ దగ్గిర వుండదని కూడా అతగాడికి తెలుసు.

ముందు మీరు విన్న కధ 1955లో  వచ్చిన “రోజులు మారాయి” సినిమాలోది. రెండవది 2021 నాటిది. మొదటి కధ వద్దకు  వెళ్దాం. ఎవరైనా ముందస్తు అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే దానికి సoబందించి ఏమి చేయాలో “భూ ఆక్రమణ చట్టం 1905” (ఇప్పటికి ఆ చట్టమే అమలులో వున్నది) దాని నియమాలు చెపుతున్నాయి. అంతేకాదు,  మూడవ  కేటగిరి ఉప అంశాలలోని  భూ పరిపాలనలో C.2లో ప్రస్తావించిన భూమి రికార్డులు వాటి నిర్వహణ, నమోదును గూర్చిన “స్టెoడింగ్ ఆర్డర్స్” అనే కార్యనిర్వాహక ఆదేశాలు ప్రతి ఏడాది (ఒక ఫసలి – అనగా ఒక వ్యవసాయక సంవత్సరం) ఏ భూమిని ఎవరు సాగు  చేసారో నమోదు చేయాలని చెపుతున్నాయి.

Also read: ‘MLA’ వంతంగి పేరయ్య భూమి కధ

“భూ ఆక్రమణ చట్టం 1905’ ప్రకారం అభ్యంతరకరం కాని ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే వారి నుండి జరిమానా వసూలు చేయాలి. ప్రతి ఏడాది ప్రభుత్వ భూముల ఆక్రమణ వివరాలను పహణి/ అడంగల్ నెంబరు 3లోనూ, 4C అనే ఎకౌంట్ లో నమోదు చేయాలి. మన కధలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగులోకి తెచ్చింది కోటయ్య. అంటే ప్రభుత్వానికి ఆయనే జరిమానా కట్టాలి. ఆ గ్రామ పహణి/ అడంగల్ నెంబరు 3లోనూ, 4C అనే ఎకౌంట్ లో ఆక్రమణదారుగా కోటయ్య పేరే నమోదుకావాలి. కాని కరణం ప్రకారం “రికార్డుదాఖల సాగుదారు పోలయ్య” అంటే ఎమయ్యివుంటుందో ఊహించoడి ?!.  గ్రామ పహణి/ అడంగల్ నెంబరు 3లోనూ, 4C అనే ఎకౌంట్ లో ఆక్రమణదారుగా ‘కోటయ్య’ పేరుకు బదులుగా ‘పోలయ్య’ పేరు నమోదు చేసివుండాలి.

అడివమ్మ కధలో , ఆమె సాగులో వున్న రెండు ఎకరాలు ఆమె పేరుమీద సాగు నమోదు కావటం లేదు. కోటయ్య , అడివమ్మ వంటి వారికి పైన మనం ప్రస్తావించుకున్న భు పాలన సంగతులు తెలీదు. అయితే అసలు ప్రశ్న అదికాదు, ఈ సంగతులు తెలిసిన వారు ఎవరు ? కోటయ్య, అడివమ్మలకు  తెలియజెప్పే వారెవవరు ?

దీనినే నేను “లేండ్ నాలెడ్జ్” అంటాను. ఇక్కడ నాలెడ్జి అంటే “విషయ పరిజ్ఞానం” అని మాత్రమె అనుకోవటం లేదు. విషయ పరిజ్ఞానంతో బాటు దానిని ఉపయోగించడానికి కావలసిన నైపుణ్యాలు కుడా అందులో భాగమని  అంటాను. అయితే 1. విషయ పరిజ్ఞానం 2. నైపుణ్యాలతో బాటు సాంఘిక న్యాయం కోసం వాటిని ఉపయోగించడానికి కావలసిన “విలువల” ను కూడా నేను “లేండ్ నాలెడ్జ్” అనే మాటలో కలిపి చూస్తున్నాను.

కొటయ్యకు, అడివమ్మకు సహయంగా రాగలిగే, “లేండ్ నాలెడ్జ్” కలిగిన ఏజెన్సిలు (వ్యవస్థలు) ఏవీ? మనకు ఇద్దరే రంగం మీద కనిపిస్తారు. ఒకరు న్యాయవాదులు, రెండు మధ్య దళారీలు. మొదటి వారి “లేండ్ నాలెడ్జ్”కి పరిమితులు వున్నాయి. వారెప్పుడు సమస్య పరిష్కారాన్ని “కోర్టులు – కోర్టు కేసులు” అనే కోణంలో మాత్రమే చూస్తారు లేదా చూడగలుగుతారు. ఇక రెండవ గ్రూప్ కు “లేండ్ నాలెడ్జ్” వుందని మనం అనుకున్నా,  “విలువలు” వుండవు.  వారు కోటయ్య, అడివమ్మలను ముంచేస్తారు. “లేండ్ నాలెడ్జ్” ఇచ్చే వ్యవస్థలు లేవు. అసలు అలాంటి అవసరం ఒకటి వుందనే తలంపే లేదు.

భూమి సమస్యలు వున్నాయి, వాటి పరిష్కారానికి భూ పరిపాలనలో (పరిమితులతో) ఏర్పాట్లు కూడా వున్నాయి.  కాని “లేండ్ నాలెడ్జ్” లేదు. అలాంటి వ్యవస్థలు / ఏజెన్సిలు లేవు. ఇది ఒక ముఖ్యమైన సమస్య.

వాకపల్లి ఆదివాసీ గ్రామం సాగు రైతులు, అనకాపల్లి జిల్లా, చీడికాడ మండలం. తరతరాలుగా వారి సాగులో వున్న భూమికి సాగు రికార్డు లేదు. రైతులతో మాట్లాడుతున్న వ్యాస రచయిత.

ఇక భూమి ప్రశ్నలోని మొదటి అంశo గూర్చి చర్చించుకొని ముగిద్దాం. చరిత్రను ప్రస్తావించకుండా మనం భూ సంబంధాలు సంగతి మొదలు పెట్టలేము. అలాగని చరిత్రను తవ్వుకుంటూపోతూ వుంటే వర్తమానం మీద మన దృష్టి తగ్గిపోతుంది. అందుచేత కీలకమైన మలుపులను ప్రస్తావించుకొని వర్తమానం దగ్గిరకు వద్దాం.

మద్రాస్ ప్రెసిడెన్సీ వరకు పరమితం అయితే, రెండు రకాల శాశ్వత శిస్తు పద్ధతులను ప్రవేశ పెట్టడంద్వారా భూమి సంబధాలను బ్రిటీష్ వారు బలంగా ప్రభావితం చేశారు. జమిందారీ భూమి చట్టం ( ఎస్టేట్ లేండ్ ఏక్ట్ ) 1802 ద్వారా జమిందారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. 1792-1799లో బారమహల్ ప్రాంతం సివిల్ పాలకునిగా తాను చేసిన విజయవంతమైన శిస్తు ప్రయోగాల కారణంగా థామస్ మన్రో కొన్ని ప్రాంతాలలో రైత్వారీ విధానానికి ఈస్టు ఇండియా కంపెనీని ఒప్పించగలిగాడు. జమిందారి, రైత్వారీ పద్దతులు భూ సంబంధాలను బలంగా ప్రభావితం చేసిన రెండు పాలన చర్యలు. జమీందారి విధానంలో భూమి శిస్తును రైతుల నుండి తాను వసూలు చేసుకొని ప్రభుత్వానికి జమిందారు కడతాడు. రైత్వారి విధానంలో రైతు నేరుగా ప్రభుత్వానికి శిస్తు చెల్లిస్తాడు.

జమిందారీ భూమి చట్టం 1802 ద్వారా జమిందారీ వ్యవస్థ   అమలులోకి వచ్చింది. 1802 నుండి 1871 మధ్యలో చట్టానికి పలు సవరణలు తెచ్చింది వలస ప్రభుత్వం. దాని ఆఖరి రూపం 1908 ఎస్టేట్ అండ్ లేండ్ ఏక్ట్. ఈ సవరణలు ఎందుకు తెచ్చారు, వాటి కారణాలు ఏమిటన్నది తెలుసు కోవలసిన ఒక ఆసక్తికరమైన అంశం.

Also read: పేదలకు ఇళ్ళ కోసం .. పేదల భూములు ..

జమిందారీ ప్రాంతాలను రైత్వారీ విధానoలోకి మార్చాలన్నది జమిందారీ ప్రాంతాల రైతుల డిమాండ్. 1923 లో ఆంధ్ర రాష్ట్రీయ జమిందారి రైతు సంఘం వారు వేసిన చిన్న పుస్తకంలో ఈ రెండు ప్రాంతాల మధ్య తేడాను ఇలా చెప్పారు:

జమిందారీ ప్రాంతాలలో సాలుకు (ఏడాదికి) ఒక రైతు 11 రూపాయలు శిస్తు కడుతూ వుంటే, అదే రైత్వారీ ప్రాంతాలలో 5 రూపాయలు కడుతున్నాడు.  జమిందారీ ప్రాంతాల రైతు ఉద్యమంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ సోషలిస్టులు కీలకపాత్ర పోషించారు.

భూ సంబదాల మార్పుకు మొదటి ప్రయత్నం

స్వాతంత్రం వచ్చాక చేసిన  ప్రయత్నం, రైత్వారీ విధానంకు బయట వున్న అన్ని శిస్తు పద్దతులను రద్దు చేసి, మొత్తం గ్రామీణ భూ సంబధాలను రైత్వారిలోకి తీసుకురావడం. 1948 జమిందారీ రద్దు చట్టం, 1956 ఇనాంల రద్దు చట్టం, 1969, 1970 ఆదివాసీ ప్రాంతాలలో ముఠాదారి రద్దు చట్టం, భూముల సర్వే, రికార్డుల తయారి వంటి వన్నీ  ఆ ప్రయత్నంలో సాధనాలుగా పని చేశాయి. ఈ మార్పుల  సారాoశం ఏమిటి ?

A. అమ్ముకునే హక్కు (టైటిల్ రైట్) లేకుండా కేవలo సాగుదార్లుగా వున్న రైతులు పట్టాదార్లుగా (యజమానులుగా) మారారు.

B. రాజ్యానికి – రైతుకు మధ్య అప్పటి వరకు వున్న మధ్యమ వ్యవస్థలు ( జమిందార్లు, ఇనాందార్లు, ముఠాదార్లు) పోయారు

C. భూమి రికార్డుల నిర్వహణ ప్రభుత్వం చేతికి వచ్చింది.

అయితే…

A. పట్టా భూమి (భూ కమతాలకు పరిమితి) ఎంత ఉండాలనే  పరమితి పెట్టలేదు ( ఒక్క జమ్మూ – కాశ్మీర్ మినహాయించి)

B. జమిందార్లు, ఇనాందార్లు, ముఠాదార్లు వద్ద సాగుదార్లుగా వున్నవారు పట్టాదార్లు అయినారు కాని భూమి లేని వ్యవసాయ కార్మికులకు భూమి రాలేదు. 

C. పేరుకు కౌలుదార్ల రక్షణ చట్టాలు చేసారు గాని అవి అమలుకాలేదు.

 రెండవ ప్రయత్నం :

మొదటి దశలో  వదిలేసిన భూ కమతాల పరిమితిని తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. అవి సీలింగ్ చట్టాలు. మొదటి, రెండవ భు సంస్కరణ చట్టాలు. వాటి వలన భూమిలేని వ్యవసాయ కార్మికులకు పెద్దగా భూమి వచ్చింది లేదు.

కొత్త మార్పులు :

భూమి సంబధాలలో 1984 నుండి కొత్తరకం మార్పులు రూపుతీసుకోవడం గమనిoచవచ్చు. ఎన్ టీ రామారావు గ్రామ రెవిన్యు పాలనలో కీలకపాత్ర వహిస్తున్న  సాంప్రదాయ వ్యవస్థను (కరణం-మునసబు) రద్దు చేశాడు. మెట్టు భూమికి శిస్తు రద్దు చేసాడు.

రైత్వారీ విధానంలో పట్టదారుకు తన పట్టా భూమిని అమ్ముకునే హక్కుతో అన్ని హక్కులు వున్నాయి. అయితే, ప్రభుత్వానికి క్రమం తప్పకుండా భూమి శిస్తు చెల్లించాలానే షరతుకు లోబడి మాత్రేమే ఈ పట్టా హక్కు వుందని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి, ఆ ప్రభుత్వమే తనక రైతు నుండి శిస్తు వద్దు అంటే అర్ధం ఏమిటి ? ఇది ఏ మార్పులకు సూచన?

మొత్తం మన భూ పాలన వ్యవస్థ రైతు నుండి రాజ్యానికి రావలసిన వాటా (శిస్తు) వసూలు చేయడం మీద నిర్మితమైనప్పుడు, రాజ్యం ఆదాయంలో భూమి శిస్తు కనుమరుగైనప్పుడు  అది భూ పాలన మీద, భూ సంబధాల మీద చూపే ప్రభావాలు ఏమిటి?

ప్రభుత్వానికి భూమి శిస్తు వసూలుపైన ఆసక్తిపోవడంతో అది  రెవెన్యూ పాలన వ్యవస్థ నిర్వహణపై ప్రభావం చూపడం మొదలు పెట్టింది. 1984 నుండి 2007 మధ్య 23 ఏళ్లలో గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను 5 సార్లు మార్చారు. ఈ మార్పులను కింది విధంగా చెప్పుకోవచ్చును.

A.      భూ పరిపాలన మీద ఫోకస్ పోయింది.

B.      భూ పరిపాలనలో కీలకమైన రికార్డుల నిర్వహణపై పట్టు పోయింది.

C.       గ్రామ భూ పరిపాలన వ్యవస్థ దెబ్బతిన్నది.

D.      భూ పరిపాలనలో కీలకమైన వివధ వ్యవస్థల మధ్య సమన్వయం దెబ్బతిని పరిస్థితి మరింత దిగజారింది.

E.       హక్కుల నిర్దారణలో ముఖ్యపాత్ర వహించే భూమి రికార్డులు పోవడం, ఉపయోగానికి పనికి రాకపోవడం, చట్ట విరుద్ధమైన “టేంపరింగ్”కు గురికావడం జరిగింది.

F.       భూమి మీద వున్న వాస్తవాన్ని రికార్డులు చూపడం మానేశాయి.

G.      రికార్డుల పవిత్రత, సాధికారిత పోయింది.

H.      రికార్డుల “ఆడిట్” (జమాబంది) నిల్చిపోయింది.

భూమి శిస్తు నుండి భూముల రిజిస్ట్రేషన్ నగదుకు : ప్రస్తుత దశ 2015

భూమిని సాగు చేసే రైతు నుండి శిస్తు వదిలేసిన  ప్రభుత్వం భూములు  అమ్మకం – కొనుగోలు సమయంలో  వచ్చే రిజిస్ట్రేషన్  నగదును ఒక ఆదాయ వనరుగా గుర్తించింది. భూ పరిపాలనలో ముందు చెప్పుకున్న పాత సమస్యలు అలా వుంటుoడగానే, వాటిని పరిష్కరించే ఆలోచన కూడా చేయకుండా కొన్ని కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో ముఖ్యమైనది భూమి రికార్డుల “కంప్యుటరైజేషన్”.

తప్పుల తడకగా వున్న రికార్డుల సమాచారాన్ని కంప్యుటర్లకు ఎక్కించారు. అలా ఎక్కించడంలో మళ్ళీ తప్పులు.

అలా కంప్యుటర్లకు ఎక్కించిన సమాచారానికి చట్టబద్ధత, సాధికారికత కల్పించారు. అంతేగాక, వివిధ ఏజెన్సీలకు వాటిని అనుసంధానం చేసారు.

భూమిని అమ్మడం – కొనడంకు అడ్డంకి లేకుండా వుండే విధంగా రికార్డుల నిర్వహణలో మార్పులు రావడం మొదలైంది. ఉదాహరణకు పట్టాదారు – సాగుదారు వేరైనా, పట్టాదారునే సాగుదారుగా చూపే విధంగా కంప్యుటర్ లో మార్పులు చేసారు. భూమి మీదకు వెళ్లి సర్వే చేయకుండానే కార్యాలయంలో కూర్చొని కంప్యుటర్ సిస్టంలో మార్పులు చేసే పద్దతి పెట్టారు. ఇక భూమి చుట్టూ వుండే హక్కులకు రాజ్యం బాధ్యత వహించే పద్ధతిలో కూడా మార్పులు రావడం మొదలైంది.

Also read: ఉపాధి హామీ పధకoలో కేంద్ర తీసుకువస్తున్న కార్మిక వ్యతిరేక మార్పులను రద్దు  చేయాలి!

రాజ్యం భూమి హక్కులు

సాగు భూమి శిస్తు నుండి భూమి అమ్మకం రిజిస్ట్రేషన్ నగదు వసూలుకు మారినప్పుడు ఒక్క టైటిల్ రైట్ (యజమాని హక్కు) కు మాత్రామే ప్రాధాన్యత వుంటుంది. కొనుగోలు మీద పెట్టుబడి పెట్టాలంటే ఆ పెట్టుబడికి రక్షణ వుండాలి. ఎక్కువ రేటుకు అమ్ముకొనే వెసులుబాటు వుండాలి.

ఒకసారి మీరు వెనక్కి వెళ్లి చూడండి, వ్యవసాయక భూమి నుండి భూమి శిస్తు వసూలు చేసే సమయంలో పట్టాదారు ఎవరు? ఎవరు ఎవరికి అమ్ముతున్నారు? వంటి అంశాలలో రాజ్యానికి ఆసక్తి లేదు. ఎందుకంటే ఎవరు కొనుగులు చేసినా  ఆ వ్యక్తి ప్రభుత్వానికి శిస్తు చెల్లించాలి. అందుకే ప్రభుత్వం పట్టా హక్కులకు ఎలాంటి భాద్యత తీసుకోలేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం వస్తే వారు తమహక్కుల వివాదాన్ని సివిల్ కోర్టులో తేల్చుకోవాలి.

భూమి అమ్మే – కొనే సరుకుగా మారాలి. ఎన్ని అమ్మకాలు జరిగి చేతులు మారితే అంతగా రిజిస్ట్రేషన్ రుసుము లభిస్తుంది. కంప్యుటరైజేషన్, ఆన్ లైన్ అనుసంధానం అంటే మార్కెట్ శక్తులకు “సమాచారo” అందుబాటులో వుంచడo. అమ్మిన  వారి నుండి కొన్న వారికి రికార్డు మార్పులు కూడా నిముషాలలో జరిగిపోవాలి.

ఇంతచేసినా  ఒక అడ్డంకి మిగిలిపోయింది. అదే “టైటిల్’కు రక్షణ. ఒక “టైటిల్” ను ఎవరైనా ప్రశ్నిస్తే ఆ వివాదం కోర్టులో తేలాలి. అది తేలేంత వరకూ  హక్కు ఎవరిదన్న ప్రశ్న అలానే  వుండిపోతుంది. అది భూమి అమ్మకాల మార్కెట్ ను నిరుత్సాహపరుస్తుంది. పెట్టుబడి ప్రవహించాలంటే ఆ టైటిల్ కు ప్రభుత్వం పూచీ పడాలి, గ్యారంటీ ఇవ్వాలి. అందుకే ప్రభుత్వం “టైటిల్ గ్యారంటీ యాక్టు’ (AP Title Guarantee Act) తీసుకువస్తున్నది. ఒక సారి ఈ భూమి మీది అని చెప్పిన తరువాత ఆ హక్కును ఎవరైనా ప్రశ్నిస్తే అందుకు ప్రభుత్వమే బాద్యత వహించి యజమాని  తరుపున కేసు వాదిస్తుంది.

అందుకే, ముందు చెప్పినట్లుగా అమ్మకానికి వెసులుబాటు కల్పించే పట్టా హక్కులు తప్ప మరే విధమైన హక్కులు ప్రభుత్వం గుర్తించదు. ఉదాహరణకు సాగు హక్కు. కౌలుదార్లకు రక్షణ కల్పించే రక్షిత కౌలుదారీ చట్టం 1956ను ప్రభుత్వం రద్దు చేసింది. అందుచేత కౌలుదారు ఇక ఎన్నటికి రైతు అయ్యే ప్రసక్తే లేదు.

వ్యవసాయం చేయని వారు వ్యవసాయ భూమిని కొనుగోలు చేయకుండా నిరోధించే ఎలాంటి వ్యవస్థ లేదు. ఇప్పుడు భూమిని కొoటున్నది వ్యసాయం చేయడానికి కాదు. దానిని మరింత ఎక్కువ రేటుకు అమ్ముకోవడానికి. కేవలం అమ్మడం కోసమే వ్యవసాయు భూమిని కొనడానికి మన రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది, ఆక్షేపణ లేదు. కనుక ఈ “భూమి మార్కట్ “ ( లేండ్ మార్కట్)కు అనుకూలంగా  వ్యవస్థలు మారుతున్నాయి, మారుస్తున్నారు.

వ్యవసాయం వ్యవసాయ భూమి గ్రామీణ కార్మికులు

‘వ్యవసాయం’ ఒక జీవనోపాధిగా తన పాత్రను కోల్పోతున్నప్పుడు భూమి లేని గ్రామీణ కార్మికులు భూమి కావాలని కోరుకోవడం తగ్గిపోతుంది. ఒక ఎకరా భూమిలో వ్యసాయం చేస్తే వచ్చే ఆదాయానికి ఆ భూమి మార్కట్ రేటుకు వుండవలసిన ‘లింక్’ పోయినప్పుడు, వుంటే గింటే అమ్ముకోవాడానికి (బంగారంలా) ఒక సాధనoగా తప్ప జీవనోపాధి వనరుగా ఇక భూమి పాత్ర వుండదు కదా! అందుచేత వ్యవసాయం మీద ఆధారపడిన భూమి లేని గ్రామీణ కార్మిక వర్గం నుండి భూమి కావాలనే భూదాహo  తగ్గిపోయింది. వ్యవసాయం, అందునా చిన్న కమతాల వ్యవసాయం తిరిగి గిట్టుబాటు అయితే తప్ప భూమి కావాలనే డిమాండ్ పెరగదనిపిస్తుంది.

అయితే, భూమి సమస్య లేదా అంటే వుంది. ఇప్పటికే ఏంతో కొంత భూమిని కలిగి వున్న కౌలు రైతులు, చిన్న రైతులు మారుతున్న భూపాలన పద్దతులలో కొత్త సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీరు సోమవారం నాడు వచ్చే ఫిర్యాదులు చూస్తే అందులో 70 శాతం ఆన్ లైన్ లేండ్ రికార్డులపై ఫిర్యాదులే వుంటాయి. ఇటువంటి భూ బాధితులకు ఎం జరిగిందో చెప్పే వారే లేరు. మొత్తం చర్చను ఈ కింది హైలైట్స్ తో ముగిస్తాను.

•        భుమి, వ్యవసాయం ఒక జీవోపాధిగా వున్నప్పుడు భూ యజమాని టైటిల్ కు ప్రభుత్వం పూచి పడలేదు. అది సివిల్ కోర్టులకు వదిలేసింది.

•        అప్పుడు భూమి రికార్డులలోని సమాచారాన్ని కూడా వారికి దూరంగా ఉంచింది.

•        వ్యవసాయ భూమిని అమ్మకం సరుకుగా చూస్తున్నప్పుడు టైటిల్ గ్యారంటికి ప్రభుత్వం బాద్యత తీసుకుంటున్నది (AP Title Guarantee Act).

•        భూముల సమాచారాన్ని ఓపెన్ మార్కట్ కు అందుబాటులో వుoచింది. త్వరిత మార్పులకు వీలు కలిపిచింది. అదే కంప్యుటరైజేషన్.

•        ప్రభుత్వం తన ఆదాయాన్ని భూమి శిస్తు నుండి రిజిస్ట్రేషన్ నగదుకు మార్చుకుంది. ఇప్పుడు భూమి అంటే వ్యవసాయం కాదు ‘రియల్ ఎస్టేట్’ వ్యాపారం. దానికి అనుగుణoగా భూ పరిపాలనను తీర్చిదిద్దుతుంది

•        వ్యవసాయం చేయని వారు వ్యవసాయ భూమిని కొనుగోలు చేయకుండా నిరోధించడానికి అప్పడూ, ఇప్పుడూ ఎలాంటి ఏర్పాట్లూ లేవు

•        వ్యవసాయo చేయని వారు, వ్యవసాయం జీవనోపాధి కాని వారి చేతిలో వున్న భూమిని వ్యసాయం చేసేవారికి ఇచ్చేందుకు ఇప్పుడు ఎలాంటి అవకాశాలు లేవు.

•        భూమిపై పట్టా హక్కు తప్ప మరే విధమైన హక్కు రికార్డు గాకుండా వ్యవస్థలో ఏర్పాట్లు జరిగిపోయాయి

•        భూముల సమాచారం, మార్పిడిని కంప్యుటరైజేషన్ ద్వారా చేయడం పేద భూ యజమానులకు ప్రమాదకరంగా మారింది. ఎలాంటి రక్షణ లేకుండా పోయింది

•        “లేండ్ నాలెడ్జ్” ఇచ్చే వ్యవస్థలు లేవు. పేద రైతులకు సహాయపడే వ్యవస్థలు లేవు.

•        సన్న, చిన్న కారు రైతులు, కౌలుదార్ల మూడో తరం (జనరేషన్) పిల్లలు వ్యవసాయంపై ఆసక్తిని కోల్పోతున్నారు.

Also read: దండోరా రిపోర్టు చెప్పిన భూసంస్కరణల కథాకమామీషూ

PS అజయ్ కుమార్

అజయ్ కుమార్ పీ ఎస్
అజయ్ కుమార్ పీ ఎస్
పీఎస్ అజయ్ కుమార్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో సోషల్ వర్కులో మాస్టర్స్ డిగ్రి (MSW) చేశారు. గత 30 ఏళ్లుగా ఆదివాసీల భూమి సమస్య, నిర్వాసిత, గ్రామీణ కార్మికుల హక్కుల కోసం పని చేస్తున్నారు. ‘ప్రభుత్వ భూమి పేదలదే’, ‘భూమి సమస్య – వ్యాసాలు 1, 2’, ‘కళ్యాణలోవ కధలు’ ప్రచురితమైన పుస్తకాలు. భూమి సమస్య వ్యాసాలు – 1కి, DNF Rural Journalist award foundation –Hyderabad వారి Rural journalist award for year 2008 లభించింది. ప్రస్తుతం అఖల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles