Tuesday, November 29, 2022

జాతి భక్షకులు నరభక్షకులకన్నా ప్రమాదం!

మన భారతదేశంలోనే కాదు, అనేక ఇతర దేశాలలో కూడా హింసాత్మక మూఢవిశ్వాసాలు, పనికిరాని సంప్రదాయాలు, ఆచారాలు వాడుకలో ఉన్నాయి. వాటి వల్ల ఎవరి ఆరోగ్యమూ బాగుపడదు. ఏ సమాజమూ ముందుకు నడవదు. ఉదాహరణకు ఆఫ్రికా ఖండంలోని ‘బిరాబిన్’ సంస్కృతి ప్రకారం యుక్తవయ్సులోని  పిల్లలు వారి ముఖాల మీద కత్తిరించుకుంటారు. తలలు గుండు చేయించుకుంటారు. ముఖంమీది ఆ మచ్చలు జీవితాంతం అలాగే ఉంటాయి. వాటిని ‘గార’ అంటారు. ముఖాన్ని కత్తిరించుకుని భరించడం ఎంత బాధాకరమైన విషయం? పాపువా న్యూ గునియా తెగలకు చెందిన అబ్బాయిలు యుక్తవయసుకు వచ్చినపుడు మరొక రకమైన హింసాత్మక సంప్రదాయాన్ని అనుసరించాల్సి ఉంటుంది. చేతికి, కాళ్ళకు ఉన్న గోళ్ళకు పైభాగాన ఉన్న చర్మం కత్తితో చెక్కడం, లేదా డిజైన్లుగా కత్తిరించడం లేదా కాల్చడం చేస్తారు. అంతే కాదు, ఒళ్ళంతా కత్తితో రెండు సెం.మీ. నిడివిలో గాట్లు పెడతారు. చర్మం మళ్ళీ అతుక్కుపోకుండా బంక మట్టి లేదా చెట్ల నూనె, ఆ గాట్లకు వ్యతిరేక దిశలో  పూసి వదిలేస్తారు. అలా చేయడం వల్ల చర్మం అంటుకోకుండా మొనలు మొనలుగా పైకి లేస్తుంది. చివరికి అది మొసలి చర్మంలాగా తయారవుతుంది. సంస్కృతి, సంప్రదాయం పేర కౌమార దశలోని బాలురు ఆ హింసాత్మక చర్యల్ని ఎదుర్కొని నిలబడాల్సిందే. నిలబడలేనివారు ప్రాణాలు వదులుకోవాల్సిందే. శరీరాన్ని హింసించుకోవడం తప్ప, ఈ ఆచరాంలో ఏముంది? ప్రయోజనమేముంది?

Also read: ‘హకూన మటాటా’: బాధలూ, ఒత్తిళ్లూ లేకుండా ఉండండి!

ఇక ఈ తెగలలోని అమ్మాయిలు గనుక పెద్దమనుషులైతే వారిని చావబాదుతారు. అలాంటి ఆచారం ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? అని ఇప్పుడు పరిశోధనలు చేయడం శుద్ధ దండుగ. అవగాహన లేని రోజుల్లో నాటి విశ్వాసాల ప్రకారం ఎలాగోలా వచ్చి ఉంటాయి. ఇక ఇప్పుడు ఆధునిక జీవితానికి సరిపడనివి, హింసాత్మకమైనవి, అహేతుకమైనవి నిర్దాక్షిణ్యంగా వదిలేయడం మేలు. నాగరిక సమాజానికి దూరంగా ఉన్న కొన్ని ఆటవిక జాతుల్లో ఇలాంటివి ఇంకా కొనసాగుతున్నాయంటే- నిజమే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ, అత్యాధునిక యుగంలో బతుకుతూ, అత్యాధునిక శాస్త్రపరిజ్ఞానమంతా ఉపయోగించుకుంటూ, ఇంకా మూఢత్వంలో బతుకుదామని పిలుపునిచ్చే మూర్ఖ రాజకీయ నాయకుల్ని, పండితుల్ని, బాబాల్ని, యోగుల్ని, స్వాముల్ని, అమ్మల్ని, ప్రవచనకారుల్ని, దొంగభగవానుల్ని ఏమందాం? చట్టపరంగా వీరంతా శిక్షార్హులు కాదా? ఉన్నత స్థితిలో ఉండి, ఉన్నత పదవులు అనుభవిస్తూ దేశాన్ని, సమాజాన్ని వెయ్యేళ్ళు వెనక్కి నడపాలనుకుంటున్న వారిని ప్రజలు ఎందుకు క్షమించాలి? అధికారంలో ఉన్నవాడి శక్తి కంటే, ప్రజాశక్తికి ఉన్న అధికారం ఎప్పుడూ గొప్పదే! రుతుస్రావాన్ని ముఖానికి, ఒంటికి పూసుకునే సంప్రదాయం కొన్ని తెగలలో ఇప్పటికీ ఉంది. మా సంస్కృతి మాకు గొప్ప, దాన్ని మేం నిలుపుకుంటూనే ఉంటాం – అని ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఆధునిక సమాజం ఊరికే తమాషా చూస్తూ ఉండాలా? ఊరి వాళ్ళందరు ఒక చోట  గుమిగూడి రాళ్ళతో కొట్టుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. కర్రలతో తలలు పగలగొట్టుకునే సంప్రదాయం ఉంది. మరి ఇవన్నీ సమర్థనీయమైనవా? గొర్రెను పళ్ళతో కొరికి, రక్తం వంటి నిండా పూసుకొని చేసే వీరంగం ఇంకా ఈ కాలానికి అవసరమా? ఇవన్నీ ఆదిమజాతుల యుద్ధాల్ని, ప్రవర్తనని, ఆహారపు అలవాట్లని ప్రతిబింబించేవి. వీటి వల్ల మూఢత్వాన్ని నిలుపుకుంటూ రావడమే తప్ప మరో ప్రయోజనం లేదు. ఇలాంటి పనులు చేసేవారికన్నా, వెనక ఉండి చేయిస్తున్న పెత్తందార్ల మెదళ్ళలో ఎంత మురికి నిండి ఉందో జనం అంచనా వేసుకోవాలి! ఆ ఆలోచనని, ఆ వివేకాన్ని మేధావులు జనానికి కల్పిస్తూ ఉండాలి.

cannibalism and human flesh market

Also read: ట్రావెన్ కోర్ లో రొమ్ము పన్ను

పాపువా న్యూ గునియా ప్రసక్తి వచ్చింది గనక, అక్కడి ఘోరాలు మరికొన్ని చూద్దాం. ఇక్కడ కెనబాలిజం (CANNIBALISM) అంటే నరమాంసభక్షణ ఎక్కువ . మనుషుల్ని పూర్తిగా కానీ, శరీరంలోని కొన్ని భాగాల్ని కానీ తినడం శతాబ్దాలుగా ఇక్కడి వారికి అలవాటు. పూర్వం యుద్ధాలు జరిగినప్పుడు శత్రువుల్ని నరికి తినడం ఇక్కడి సంప్రదాయం. అలా చేయడం వల్ల శత్రువు శక్తియుక్తులు, సామర్థ్యాలు అన్నీ తమకు వస్తాయనేది ఒక నమ్మకం. ఇది 20వ శతాబ్ది వరకూ బాగా వ్యాప్తిలో ఉంది. పాపువా న్యూ గునియా లోను దాని పక్కనే ఉన్న సోలోమన్ ద్వీపాలలోను నరమాంస అంగళ్ళు కూడా నడిచేవి. ఒకప్పుడు ఫిజీ, మెలనీసియా, ద్వీపాల్ని ‘కేనిబల్ ఐసెల్స్’ అని వ్యవహరించేవారు. మనిషి పరిణామదశల్లో ఒక దశ అయిన నియాండర్ తల్ మ్యాన్ గా ఉన్నప్పుడు వారికి నరమాంసభక్షణ అలవాటుగా ఉండేది. కాలక్రమంలో హోమోసేపియనుల జనాభా పెరిగి, నియాండర్ తల్ సంతతి తగ్గిపోయిన సందర్భంలో  తొలి హోమోసేపియనులు నియాండర్ తల్ మానవుల్ని తినేవారు. అదే వారికి ఒక అలవాటు, ఒక సంస్కృతి అయ్యింది. చాలా కాలం గడిచింది. ఇప్పుడు అన్నీ స్వతంత్ర దేశాలయిపోయినా కూడా కొన్ని కొన్ని సందర్భాలలో నరమాంసభక్షణ ఒక ఆచారంగా మిగిలిపోయింది. పాపువా న్యూ గునియావాసుల్లో ఆ అలవాటు ఇప్పుడు లేదు గానీ, కుగ్రామాల్లో, అడవి ప్రాంతాల్లో ఉన్న ఆదిమ జాతుల్లో ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. తమ జాతివారిని తినడాన్ని ‘ఎండోకెనబాలిజమ్’ అని, ఇతర జాతులవారిని తినడం ‘ఎగ్జోకెనబాలిజం’ అని అంటారు. అలాగే బతికకి ఉన్నవారిని చంపితింటే అది ‘హోమిసిడల్ కెనబాలిజం’ అని, చనిపోయిన తర్వాత తింటే దాన్ని ‘నెక్రోకెనబాలిజం’ అనీ అంటారు. అందుకే దట్టమైన అరణ్యాల్లోకి, ఆదిమ తెగలు ఉండే చోటికి ఆధునికులు వెళ్ళాలంటే భయపడేవారు.

Also read: అస్తమించిన భారతీయ వెండితెర వెలుగు దిలీప్ కుమార్

పాపువా న్యూ గునియా ఫసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియా ఖండానికి ఉత్తరాన ఉంది. 42-45 ఏళ్ళ క్రితం ఆఫ్రికా నుండి వలసవచ్చిన మానవ జాతులు ఇక్కడ స్థిరపడ్డాయి. ఏడు వేల బీసీఎలో వ్యవసాయం ప్రారంభమైంది. 18వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు తియ్యకందను ఈ ప్రాంతానికి పరిచయం చేశారు. ఈ దేశం ఇండోనేషియన్ ప్రాలినెన్స్ కు పక్కన ఉంటుంది. పటంలో చూస్తే ఏదో పక్షి తోకలాగా కనిపిస్తుంది. సుమారు 851 భాషలున్న ఈ దేశంలో 11 భాషలు అంతరించిపోయాయి. ప్రస్తుతం అక్కడ వారి ప్రాంతీయ భాషలు మూడింటితోపాటు, ఇంగ్లీషు కూడా ఒక అధికార భాష.

The flyboy and the book

Also read: హృదయంలో మేధస్సు

కేవలం ఇక్కడే కాదు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ అలవాటు కొనసాగింది. 1201లో ఘోరమైన కరువు సంభవించినపుడు ఈజిప్టులో – రోమన్ ఈజిప్ట్ లో నరమాంసభక్షణ జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో 1941-42లలో 872 రోజుల్లో-సైనికులు దొరికిన పక్షులు, ఎలకలు, పెంపుడు జంతువులన్నీ తినేశారు. నాజీల దిగ్బంధంలో సుమారు కొన్ని మిలియన్ల సోవియెట్ లు చనిపోయారన్నది ఒక అంచనా. అలాంటి సమయంలో కొందరు సైనికులు నరమాంసభక్షణకు పూనుకున్నారు. చివరికి సోవియెట్ విజయం సాధించిన తర్వాత, జర్మన్లు ఒక ఊళ్ళో చిక్కుకుపోయారు. వారికి ఆహారం సరఫరా నిలిపేవేయబడింది. అప్పుడువారు నరమాంసభక్షణకు పూనుకున్నారు. అలాంటి యుద్ధ సమయంలోనే ఒకసారి తినడానికి ఏమీ దొరకకపోతే  సైనికులు తమ లెదర్ షూస్ ముక్కలు కోసి ఉడకబెట్టుకుని తిన్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆకలి ఎంత భయంకరమైందో అర్థం చేసుకోవాలంటే 1972లో ఉరుగుయెన్  ఎయిర్ ఫోర్స్ విమానం ప్రమాదానికి గురై జాడతెలిని చోట కూలిపోయింది. చాలామంది చనిపోయారు. బతికినవారి సమాచారం బయటి ప్రపంచానికి అందలేదు. రోజులు గడిచిపోయినా తినడానికి ఏమీ దొరకలేదు. బతికిన ప్రయాణికులు చనిపోయినవారిని తినడం ప్రారంభించారు.

Also read: శాస్త్రజ్ఞులూ, నాస్తికులూ మానవతావాదులే!

బ్రిటిష్ ఇండియా సైన్యంలో పని చేసిన లాన్స్ నాయక్ హతం అలీ స్వయంగా చూసి చెప్పిన సంఘటన ఇలా ఉంది – బందీలయినవారి నుండి జపాన్ సైనికులు రోజూ ఒకరిని ఎన్నుకొని తీసుకుపోవడం, అతను బతికి ఉండగానే అతని మాంసం కోసుకోవడం విగతా బాగాన్ని పక్కన ఓ గోతిలో పడేయడం జరిగేది. అలా వందరోజులు వందమంది బందీలు జపాన్ సైనికులకు ఆహారమైపోవడం నేను ప్రత్యక్షంగా చూశాను – అని ఆయన చెప్పారు. 1945లో చిచిజమాలో జపాన్ సైనికులు ఐదుగురు అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగుల్ని స్వాహా చేశారు.ఈ కేసులో 30 మంది జపాన్ సైనికులు న్యాయవిచారణ ఎదుర్కున్నారు. వారుదోషులని తేలడంతో వారు ఉరిశిక్షననుభవించారు. ఇలాంటి సంఘటనల్ని జేమ్స్ బ్రాడ్లీ అనే రచయిత ‘ప్లైబోయ్స్ – ఎ ట్రూ స్టోరీ ఆఫ్ కరేజ్’ – అనే గ్రంథంలో నమోదు చేశాడు. భారతీయ బందీలకోసం ఏర్పాటు చేసిన వివక్ కేంప్ లో ప్రతిరోజూ ఒక జపాన్ డాక్టర్ వచ్చేవాడు. బలిష్టంగా ఉన్న ఒక భారతీయుణ్ణి కేంప్ బయటికి పంపించేవాడు. అతను బయటికి వెళ్ళడమే ఆలస్యం జపాన్ సైనికులు అతణ్ణి చుట్టుముట్టి చంపేసేవారు. మాంసం బాగా ఉండే  భాగాలు భుజాలు, తొడలు, పిక్కలు, పిరుదులు కోసం వండుకొని తినేవారు. అలా 19 మంది మాయమైపోయారని ‘ద కొరియర్ మెయిల్’ 25 ఆగస్టు 1945న ప్రకటించింది. నరహంతకుడైన ఉగాండా అధ్యక్షుడు  (1971-79) ఒక నరభక్షకుడని, అతని ఫ్రిజ్ లో స్త్రీల అవయవాలు కనిపించాయని రూఢిగానే తెలిసింది. అయితే ప్రపంచంలో ఎవరూ ఎక్కడా ఇది తమ హక్కని చెప్పుకోలేదు. మానవీయ విలువలు ఏ  మాత్రమూ లేని ఈ దుర్మార్గాన్ని ఎవరు మాత్రం బహిరంగంగా సమర్థించుకుంటారు? జంతువుల్లో అయినా సరే, ఏ జంతువూ తన జాతి జంతువుల్ని తనదు. అలా శారీరకంగానే కాదు, మానసికంగా మనుషుల్ని తినే అలవాటు కేవలం మానవ జాతికే ప్రత్యేకం!  ప్రపంచం ఆధునికతలోకి మారుతున్నకొద్దీ – ఏదో న్యూనతా భావంతో – దొంగచాటుగానే ఇది కొనసాగింది.

Also read: యోగాను సైన్సు ఎందుకు అంగీకరించదు?

గ్రీకు పురాణాల్లోనూ, జానపద గీతాల్లోనూ నరమాంస భక్షణ మీద కథలు, పాటలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవడం ఎందుకంటే మానవజాతి ఎన్నిదశలు దాటి, ఎన్ని దిశలు మారి ఈ అత్యాధునిక నవ సమాజంలోకి వచ్చిందో అర్థం చేసుకోవడానికి! మనిషికి ఇప్పుడు తెలివి పెరిగింది. కాని మునుషుల్ని ‘తినే’ స్వభావం మాత్రం పోలేదు. మరీ ముఖ్యంగా మన భారత దేశంలో గతంలోని నరమాంసభక్షకులలాగా మీద పడి మాంసం పీక్కుతినడం లేకపోవచ్చు. కానీ, ఇతరత్రా ప్రాణాలు తోడేసి ఆనందించడం మాత్రం అగలేదు. జాతి భక్షకులు నరభక్షకుల కన్నా ప్రమాదం!!  అహింసా సిద్ధాంతాలు వల్లిస్తూ హింసకు దిగేవారున్నారు. దేశంలోని వైవిధ్యాన్ని శ్లాఘిస్తూనే తమకు కావల్సిన ఏకత్వం కోసం ఆయాసపడుతున్నారు. ప్రజాస్వామ్యం పేరుతో ఫాసిజాన్ని స్థాపిస్తున్నారు. అందరి వికాసం గూర్చి మాట్లాడుతూ కొందరికే మేలు చేస్తున్నారు. నిజాల పేరుతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. పేద విద్యార్థులకు ఫీజులు పెంచి, తాము మాత్రం ఉచితంగా ప్రపంచ పర్యటనలు చేస్తుంటారు. వేలకోట్లు ఖర్చు పెట్టి తమ ముర్ఖత్వాన్ని విగ్రహంగా నిలబెట్టుకుంటారు. ఆరోగ్యవంతుడికి అనవసరంగా ఆపరేషన్ చేసినట్టు – ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పౌరసత్వానికి సంబంధించిన చట్టాలు తెచ్చింది. అందుకు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా నిరసన తెలియజేస్తున్న అన్ని విశ్వవిద్యాలయ విద్యార్థుల మీద ప్రభుత్వం పాశవికంగా తన ప్రతాపం చూపుతోంది. రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ దేశంలోని రైతులు ఒక సంవత్సర కాలంగా ఉద్యమాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్దలకు చీమ కూడా కుట్టడం లేదు. తాజాగా పెగాసస్ స్పైవేర్ తో ప్రభుత్వం సామాన్యుల వ్యక్తిగత జీవితంలోకి అక్రమంగా జొరబడుతోంది. అందుకే జాతి హింస- నరమాంసభక్షణ కన్నా తక్కువదేమమీ కాదని అనుకోవాల్సి వస్తోంది.

Also read: కవి, వెండితెర కవిగా మారితే – బుద్ధదేవ్ దాస్ గుప్తా

Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles