Friday, December 2, 2022

యోగాను సైన్సు ఎందుకు అంగీకరించదు?

కొన్నేళ్ళ క్రితం వరకూ శారీరక శ్రమకు చాలా విలువ ఉండేది. పొలాలకు వెళ్ళడం, మోట కొట్టడం, నాగలి దున్నడం, పశువులు మేపడం వంటి ఏ పని తీసుకున్నా అది శారీరక శ్రమతో కూడుకున్నదే!  గృహిణులు ఇంటి  పనులే కాకుండా వ్యవసాయపు పనులు కూడా చేసేవారు. వడ్లు దంచడం, పిండి విసరడం వంటివన్నీ శారీరక శ్రమలే! అవన్నీ జీవన శైలిలో అంతర్భాగంగా ఉండేవి. ప్రత్యేకంగా వ్యాయామం చేయడం ఉండేది కాదు. పరిశ్రమలు పెరిగి, యంత్రాలు వచ్చి శారీరక శ్రమం స్థానంలో బుద్ధిబలానికి విలువ పెరుగుతున్నకొద్దీ వ్యాయామం అవసరమైంది. ఆటలు అవసరమయ్యాయి. అందుకే అన్ని రకాల వ్యాయామాల్ని, జిమ్నాస్టిక్స్ ని, ఆటల్ని, క్రీడల్ని సైన్సు ఆమోదించింది. ముక్కు మూసుకుని చేసే ధ్యానాన్ని, యోగాను, సమాధిని సైన్సు అంగీకరించలేదు.

Also read: కవి, వెండితెర కవిగా మారితే – బుద్ధదేవ్ దాస్ గుప్తా

ఆటలతో, క్రీడలతో శారీరక శ్రమ లభిస్తుంది. శారీరక శ్రమతో జీవన క్రియలన్నీ ప్రారంభమవుతాయి. ప్రారంభమైనవి వేగాన్నందుకుంటాయి. దాంతో శరీర గ్రంథులూ, మొదడూ అవసరమైన రసాయనాల్ని విడుదల చేస్తాయి. ఫలితంగా  శరీరంలో కణస్థాయి నుంచి అన్ని వ్యవస్థలలో చురుకుదనం పెరిగి మనిషి ఆరోగ్యవంతుడవుతాడు. ఆనందాన్ని అనుభవిస్తాడు. వేగంగా నడవడాన్ని, ఈత కొట్టడాన్ని, సైకిల్ తొక్కడాన్ని, కర్రసాముని, జిమ్ లోని అనేక వ్యయామాల్ని జీవశాస్త్రం – వైద్య శాస్త్రం ఒప్పుకుంది. ప్రోత్సహించింది కూడా. మరీ చిన్నపిల్లలయితే ఆటపాటలతో పాటు అనందంగా విద్యనేర్చుకునే వసతి ఉండాలని విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ తన శాంతినికేతన్ లో ఆ ఏర్పాట్లు చేశారు. ఆటలకూ, క్రీడలకూ దేవుడితోనూ, మతాలతోనూ సంబంధం లేదు. కానీ, హిందూ మతానికి సంబంధించి కొందరు యోగాను, ధ్యానాన్ని, సమాధిని పరమాత్మలో లీనమయ్యేందుకు మార్గంగా ఎంచుకున్నారు. ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక చింతనకు లంకె పెట్టారు. అందువల్ల వీటిని సైన్సు  గుర్తించదు. మతధర్మాల్లాగా ఇవీ విశ్వాసాలుగా ఉండిపోతాయి. ముందుగా ఆ తేడాను గమనిస్తే వాటి వాటి స్థానాలేమిటో బోధపడుతుంది.

Also read: మానవ సంబంధాల్ని బలపరుస్తున్న టెక్నాలజీ

యోగాను ప్రతిపాదించిన పతంజలి ‘‘యోగః చిత్తవృత్తి నిరోధకః’’ అని అన్నాడు. అంటే యోగ ఆలోచనల్ని స్థంభింపజేస్తుందని అర్థం! అంతే కాదు. యోగ మోక్షానికి మార్గమనే చెప్పాడు పతంజలి – అంతేకాని, ఆరోగ్యసాథనకోసం ఇది పనికొస్తుందని చెప్పలేదు. ఇటీవలి కాలంలో ఆధునిక యోగా గురువులు వారి వారి ఆలోచనల్ని జోడించి, జనాన్ని మభ్యపెడుతూ వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ ఆధునిక వ్యాపార గురువులు యోగ కాన్సర్ నీ, ఎయిడ్స్ నీ కూడా తగ్గిస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. పతంజలి – యోగాను ప్రతిపాదించిన కాలానికి కాన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధులు గుర్తించబడలేదు. యోగ ఈ వ్యాధుల్ని తగ్గిస్తుందంటే మరి నిరూపణ ఏదీ? వారి దగ్గర నిరూపణ ఏదీ లేదని కూడా మనకు తెలుసు. అయినా కూడా వారు పెట్టే ‘చెవిలో పువ్వుని’ భక్తితో పెట్టించుకుని, వారి పిట్టకథలు వింటూ ఉండాలని వారి కోరిక! యోగాతో సర్వరోగాలూ మటుమాయం అయ్యే మాటైతే…నిత్యం యోగాను  పాటించిన రామకృష్ణ పరమహంస, రమణ మహర్షులను కాన్సర్ ఎందుకు కబళించిందీ? నేటి కాలంలో యోగా గురువుగా ప్రసిద్ధుడైన రాందేవ్ బాబా మోకాళ్ళ ఆపరేషన్ కోసం విదేశాలకు ఎందుకు వెళ్ళినట్టూ? మనకు మనం ఆలోచించుకోవలసిన విషయాలు.

Also read: ‘‘భరతమాత ముద్దుబిడ్డ నెహ్రూ:’’ అటల్ బిహారీ వాజపేయి

‘యోగ’ – అంటే వ్యాయామం అనే అర్థం కూడా ఉంది కదా? మరి దాన్ని తీసుకుంటే తప్పేమిటి? అనేవారు కొందరుంటారు. దేహదారుఢ్యానికి ఉపయోగపడే పరేడ్ సైనికులకు, ఎన్.సి.సి. కాడిట్ లకు ఉంటుంది. స్కూలు పిల్లలకు డ్రిల్ పీరియడ్ ఉంటుంది. యోగ ఇలాంటి శారీరక వ్యాయామాల కిందికి రాదు. వైద్య రంగంలో ‘ఫిజియోథిరపీ’ ట్రీట్ మెంట్ ఉంది. ఏ రోగికి ఎలాంటి వ్యాయామం అవసరమో, అది ఎంత కాలం చేయాల్సి ఉంటుందో వైద్య నిపుణులు నిర్ణయిస్తారు. జిమ్స్ లో కూడా ట్రైనర్లు ఉంటారు. మీ ధ్యేయమేమిటో తెలుసుకుని, మీకు ఎలాంటి వ్యాయామం అవసరమో వారు అలాంటివి నిర్ధారిస్తారు. చెప్పుకోవాల్సింది ఏమంటే వ్యాయామానికి ఒక ధ్యేయం ఉంటుంది. ఏం కావాలనుకుంటున్నాం-ఏం సాధించాలనుకుంటున్నాం అనేదానిమీద ఎక్సర్ సైజ్ ప్రోగ్రాంలుంటాయి. వైవిధ్యభరితంగా ఇన్ని ఆటలు, క్రీడలు, వ్యాయామాలు ఉండగా యోగా ఎందుకు? దాని వల్ల ఒనగూరే ప్రయోజనమేముందీ? అనేది సీరియస్ గా ఆలోచిస్తే విషయం అర్థమవుతుంది. చదువుల్లో కూడా అంతే కదా? మనం ఏం కావాలనుకుంటున్నామో, దాన్ని బట్టే కోర్సులుంటాయి.

Also read: ప్రకృతి శరణం గచ్ఛామి

డాక్టర్ అశోక్ రాజ్ గోపాల్ మోకాలి చిప్ప మార్పిడి చేసే ప్రత్యేక నిపుణుడు – నీ రిప్లేస్ మెంట్ సర్జన్. ఆయన చెప్పిన విషయాల్ని ‘ద డెయిలీ టెలిగ్రాఫ్’ ప్రకటించింది. న్యూదిల్లీకి చెందిన డీన్ నెల్సన్ కూడా కొన్ని వివరాలు అందించాడు. ఈ భారతీయ వైద్య నిపుణులు ఇచ్చిన వివరాలను, వివరణలను బట్టి మనం తెలుసుకోగలిగేది ఏమంటే – చాలా మంది యోగా గురువులు మోకాలి చిప్ప మార్పిడికోసం సర్జరీ చేయించుకున్నవారే! ఇంకా చాలామంది ఇప్పటికీ సర్జరీ లైన్లో నిలబడుతున్నవారే. ‘థండర్ బోల్ట్’ అనే వజ్రాసనం వేసేవారికి  ఈ మోకాలి చిప్ప ఆపరేషన్ లు తప్పని సరి అవుతున్నాయి. ఇంతకూ వజ్రాసనం ఎలా వేస్తారు? అంటే మోకాళ్ళు రెండూ వెనక్కి మడిచి, మడిమెల మీద కూర్చుంటారు. దాని వల్ల మోకాళ్ళు ఒత్తిడికి గురై నాడులూ, జాయింట్స్ దెబ్బతింటాయి. ఫలితంగానే యోగా గురువులు, వారి శిష్యులూ కలసికట్టుగా సర్జరీలు చేయించుకోవాల్సి వస్తోంది. ఈ విషయం మీద ఇంటర్ నెట్ లో చాలా సమాచారం ఉంది. కావల్సిన వాళ్ళు వెతుక్కోవచ్చు. మరో ముఖ్యవిషయమేమంటే ఈ యోగా గురువులు ఎవరికీ మానవ శరీర నిర్మాణానికి సంబంధించిన అవగాహన ఏమాత్రం ఉండదు. ఇష్టం వచ్చినట్టుగా కాళ్ళూ, చేతులూ, మెడ, భుజాలు వంచి విచిత్రమైన భంగిమలలో జనాన్ని ఆకర్షిస్తుంటారు.

Also read: కరోనా నేర్పిన కొత్త పాఠాలు

యోగా వల్ల కీళ్ళ నొప్పులు వస్తాయని, ముందే నొప్పులు ఉన్నవారికి అవి అధికమౌతాయనీ ఆర్థొపెడిక్ డాక్టర్లు వివరణ ఇస్తున్నారు. వెన్నెముకను విల్లులా వెనకకు వంచడం వల్ల అనేక అనర్థాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. మనిషి వెన్నెముక ముందుకు వంగడానికి అనువుగా నిర్మాణమై ఉంది. మరి అందుకు విరుద్ధంగా వెనకకు వంచడమంటే రిస్కు తీసుకోవడమే కదా? నడుముకు పై భాగాన ఉన్న అవయవాలన్నీ వెన్నెముక ఆధారంగా నిలబడి ఉన్నాయి. అసలు మనిషి నిటారుగా నిలబడాలంటేనే – వెన్నెముక బలంగా ఉండాలి. శరీరాన్ని నిలబెట్టాలి. మనిషి బరువంతా కాళ్ళమీద, నడుము మీద, వెన్నెముక మీద ఉంటుంది. ఆవు, గేదె, పులి, పిల్లి వంటి జంతువుల్లాగా కాదు. ఆ జంతువు వెన్నెముక భామికి సమాంతరంగా ఉంటుంది. బరువంతా నాలుగు కాళ్ళమీద ఉంటుంది. మనిషికి ఆ వసతి లేదు. మనిషి వెననెముక భూమికి నిటారుగా ఉంటుంది. మనిషనే జెండాను ఎగరేస్తున్నట్టు మనిషి వెన్నెముక జెండా కర్రలాగా, భూమికి తొంభయి డిగ్రీల కోణంలో నిలబడి ఉంటుంది. అంటే భూమ్యాకర్షణ శక్తిని ఎదుర్కొంటూ వెన్నెముక మనిషిని నిలబెడుతుంది. అలాంటి ముఖ్యమైన భాగాన్ని ఇష్టం వచ్చినట్టు వంచడం అనేది తెలివైన పని కాదు. బాల్యం నుండే ఆసనాలు అభ్యాసం చేసేవారి విషయం వేరు. మధ్యవయస్సులో, వృద్ధాప్యంలో ప్రారంభించేవారు సమస్యలు ఎదుర్కోక తప్పదు. ప్రతివాడూ మల్లయోధుడో, సర్కస్ కళాకారుడో కానవసరం లేదు. ప్రతి జీవికి కొన్ని సౌలభ్యాలుంటాయి. కొన్ని అవరోధాలుంటాయి. వాటిని గమనించుకుంటూ జీవించడం మంచిది.

Also read: దయ చేసి దిగిపోండి: అరుంధతీరాయ్

ప్రాణాయామంలో గట్టిగా శ్వాసపీల్చి, వదిలేయాల్సిన గాలిని, అంటే కార్బన్ డై ఆక్సైడ్ ను వదిలివేయకుండా ఎక్కువ సేపు ఊపిరి తిత్తుల్లో బలవంతంగా ఆపడం జరుగుతుంది. అది మంచిది కాదని నిపుణులు చెపుతారు. ఎక్కువ ఆక్సీజన్ పీల్చుకుంటే ఆరోగ్యం చేకూరుతుంది. కానీ కార్బన్ డై ఆక్సైడ్ సత్వరం వదిలేయాల్సిన వాయువు. శరీరంలోని జీవన క్రియల్ని నిర్వర్తించడానికి మొత్తానికి మొత్తంగా శారీరక ధర్మాల్ని పర్యవేక్షించడానికి మెదుడుకు ఎక్కువ రక్తం అవసరమౌతుంది. శరీరానికి అందే ఆక్సీజన్ లో 20 శాతం మెదడే ఉపయోగించుకుంటుంది. యోగా చేసేప్పుడు మెదడుకు తగినంత ఆక్సీజన్ అందదు. అందుకే మెదడు స్తబ్దుగా అయిపోయి, భ్రమలు కలగడం ప్రారంభమౌతాయి. అలాగే సుష్టుగా భోజనం ముగించాక చూడండి ఒళ్ళంతా బరువుగా, బద్ధకంగా, స్తబ్దుగా ఉంటుంది. అలా ఎందుకూ అంటే – జీర్ణాశయం నిండిన ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఎక్కువ మొత్తంలో రక్తం జీర్ణవ్యవస్థకు చేరుతుంది. ఫలితంగా మెదడుకు ఆక్సీజన్, రక్తప్రసరణా తాత్కాలికంగా తగ్గుతాయి. కాలో, చెయ్యో తిమ్మిరెక్కడం అలాంటిదిదే – రక్త ప్రసరణలో అంతరాయమే- యోగ, ధ్యానం చేయడం వల్ల, సమాధిలోకి పోవడం వల్ల జరుగుతున్నదీ అదే! ఆలోచనల్ని అరికట్టి, మెదడును మొద్దుబారించి, భ్రమల్లొకి, కల్పనల్లోకి పోవడమే!

Also read: ‘రే’ ను గూర్చి రేఖామాత్రంగా

‘శ్వాస మీద ధ్యాస’ అని చెపుతారు కొందరు. అంటే ఏమిటీ? కళ్ళుమూసుకుని, శ్వాసమీద ధ్యాస పెట్టి ఇష్టదైవాన్ని తలచుకోవడం. అట్లా అట్లా భ్రమల్ని ఊహల్ని పెంచి పోషించుకుని దైవదర్శనమయ్యిందని సంతృప్తిని పొందవచ్చు. ఈ ఐహిక బంధాల్లోంచి బయటపడి ఒక స్థాయికి ఎదిగి తపస్సు చేస్తే – ఆధ్యాత్మికశక్తిని సాధించగలమని సాధువులు చుపుతుంటారు. అసలు విషయమేమంటే మెదడుకు తగినంత ఆమ్లజని అందక, కలిగే భ్రమలే అవి! మనకు సాధువులు, మహర్షులు ఉన్నారు. ఇన్నివేల ఏళ్ళలో వీరిలో ఎవరైనా తపస్సు చేసి, వాస్తవంగా దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నారా? తమ దేవుణ్ణి పక్కవారికెవరికైనా చూపించి పరిచయం చేశారా? లేదే – మెదడును పనికిరాని పదార్థంగా మార్చుకోవడం గొప్పపని కాదు.దాన్ని నిరంతరం వాడుతూ కొత్త కొత్త అన్వేషణలు, ఆవిష్కరణలు చేయడమే మనిషి ధ్యేయం కావాలి. చురుకైన అవయవాన్ని మరింత చురుకుగా చేసుకోవడమే విజ్ఞుల పని!

 ‘జ్ఞాన సాధన పేరుతో మెదడును తిమ్మిరెక్కించి, భ్రమల్లో తేలిపోయి, దివ్య లోకాల సందర్శనం అంటూ, దైవదర్శనమయ్యిందనే భ్రమలో జనానికి తప్పుడు సమాచారమిచ్చేవారిని పిచ్చివాళ్ళకింద జమకట్టాలి. మహానుభావులెప్పుడూ తోటివారికి పనికొచ్చే పని చేస్తారు. తమను తాము వ్యర్థులుగా మార్చుకునే ప్రక్రియలు చేపట్టరు. జనానికి తప్పుడు దారులు చూపంచరు. వాస్తవంలోనే భవ్యమైన భవితకు దారులు వేస్తారు.

Also read: భారత్ లో మిగిలింది మనువాద మార్క్సిజమా?

(జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం)

Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles