Thursday, April 25, 2024

కవి, వెండితెర కవిగా మారితే – బుద్ధదేవ్ దాస్ గుప్తా

కవులూ, కళాకారులూ చాలామంది అధ్యాపకులై ఉంటారేమో కాని అధ్యాపకులైనవారందరూ కవులవుతారన్న నమ్మకం లేదు. అందులో ఏ కొద్దిమంది మాత్రమే ఆ వృత్తిలోంచి బయటపడి, తన సృజనాత్మకశక్తికి పూర్తి న్యాయం చేస్తారు. బెంగాలి చలన చిత్ర దర్శకుడు బుద్ధదేవ్ దాస్ గుప్తా (11 ఫిబ్రవరి 1944 – 10 జూన్ 2021) అలాంటివాడే! అర్థశాస్త్రం అధ్యాపకుడిగా కొనసాగి, కవిగా, రచయితగా ఎన్నో రచనలు చేసి, 1968లో చలన చిత్రరంగం లో ప్రవేశించారు. రెండున్నర దశాబ్దాలపాటు ఆయన చేసిన కృషి, భారతీయ సమాంతర సినిమా రంగంలో ఆయనను మహాదర్శకుల కోవలో చేర్చింది. సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్, మృణాల్ సేన్ ల తర్వాత బెంగాలీలో బహుశా బుద్ధదేవ్ దాస్ గుప్తా పేరే చెప్పుకోవలసి ఉంటుంది. కరోనా పాండమిక్ ఉధృతంగా ఉన్న రోజుల్లో ఆయన మూత్రపిండాలవ్యాధికి చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. తన డెబ్బయ్ ఏడవ యేట జీవిత చలనచిత్రరంగం నుంచి నిష్క్రమించారు.

Also read: ‘‘భరతమాత ముద్దుబిడ్డ నెహ్రూ:’’ అటల్ బిహారీ వాజపేయి

హైదరాబాద్ లోని మాక్స్ ముల్లర్ భవన్, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆప్ ఇంగ్లీషు అండ్ ఫారిన్ లాంగ్వేజెస్, హైదరాబాద్ ఫిలిం క్లబ్ సంయుక్తంగా సీఐఇఎఫ్ఎల్ ఆడిటోరియంలో నిర్వహించిన బద్ధదేవ్ దాస్ గుప్తా రెట్రాస్ పెక్టివ్ చలనచిత్ర ప్రదర్శన 1988 ఫిబ్రవరి మొదటివారంలో జరిగింది. అందులో ‘దూరత్వా,’ ‘నీమ్ అన్నపూర్ణ,’షోట్ గ్రిష్మర్ స్మృతి,’ ‘ఫెరా,’ ‘అంధీగలీ,’ ‘గృహజుద్దా’ వంటి కథాచిత్రాలు ప్రదర్శించారు. ప్రదర్శనలు జరిగిన ఆరు రోజుల్లో – నాలుగు రోజులు దర్శకుడు బుద్ధదేవ్ ప్రేక్షకులతో కలిసి ఉండటం విశేషం. చిత్ర ప్రదర్శనకు ముందు కొద్దిపాటి పరిచయం, ప్రదర్శన తర్వాత విపులమైన చర్చాజరిగాయి. అధ్యాపకుడైనందువల్లా, కవిగా ప్రసిద్ధుడైనందువల్లా దాస్ గుప్తాకు జీవితం మీద, సినిమా మాధ్యమం మీద స్పష్టమైన అవగాహన ఉందని తెలిసింది. ఓపికగా ఆయన ప్రేక్షకుల ప్రశ్నలకు జవాబులిచ్చారు.

Also read: ప్రకృతి శరణం గచ్ఛామి

అప్పుడు నేను ఉస్మానియా యూనివర్శిటీ జంతుశాస్త్ర విభాగంలో రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నాను. నా పరిశోధన నేను చేసుకుంటూనే, తీరిక వేళలో సమాంతర సినిమా చూడడం, విశ్లేషిస్తూ వ్యాసాలు రాయడం, ఫిలిం ఫెస్టివల్స్ కు , ఫిలిం  అప్రిసియేషన్ కోర్సులకు హాజరు కావడం చేస్తుండేవాణ్ణి. నా హాస్టల్ గదికి దగ్గర్లో ఉన్న సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ (తర్వాతకాలంలో అది యూనివర్శిటీ అయింది) ఆడిటోరియంకు దర్శకుడు బుద్ధదేవ్ దాస్ గుప్తా రావడం, ఆయనతో గడుపుతూ, ఆయన సినిమాలు చూడడం గొప్ప అనుభవం. నేను కూడా కవిని, రచయితను అని తెలుసుకుని ఆయన నాపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచడం మరువలేనిది. ఆ తర్వాత చాలా కాలానికి భారతీయ సమాంతర సినిమాపై నేను ఒక బృహద్గ్రంథం-‘‘ప్రయో‘జన’ సినిమా’’ ప్రకటించగలగడానికి బుద్ధదేవ్, గౌతమ్ ఘోష్, అరవిందన్, అదూరు గోపాలకృష్ణన్, శ్యాంబెనగల్ వంటి ప్రసిద్ధుల్ని కలుసుకున్న అనుభవం, ఆ జ్ఞాపకాలు ఎంతో స్ఫూర్తిదాయకమయ్యాయి.

Also read: దయ చేసి దిగిపోండి: అరుంధతీరాయ్

బుద్ధదేవ్ ‘ద కాంటినెంట్ ఆఫ్ లౌ’ అనే పదినిమిషాల నిడివి గల లఘుచిత్రంతో చిత్రసీమకు పరిచయమయ్యారు. 1988 నాటికి పదిహేను డాక్యుమెంటరీలు, ఆరు కథా చిత్రాలు రూపొందించారు. ‘ది కింగ్ ఆఫ్ డ్రమ్స్ ’కు 1974లో ఉత్తమ డాక్యుమెంటరీగా, ‘ద స్టోరీ ఆఫ్ గ్లాస్’కు 1986లో ఉత్తమ పారిశ్రామిక లఘుచిత్రంగా జాతీయ బహుమతులు గెలుచుకున్నారు. ‘దూరత్వా’ కథాచిత్రానికి 1979లో సిల్వర్ లోటస్ లభించింది. ‘నీమ్ అన్నపూర్ణ’కు కార్లోవి వారి ఫిలిం ఫెస్టివల్ లో స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది. అతని చిత్రాలలో ‘అంధీ గలీ’ అప్ప మిగతావన్నీ బెంగాలీ చిత్రాలే. అంధీగలీ-ఒక్కటే హిందీ చలనచిత్రం. ఆయన చిత్రాలన్నీ పలు జాతీయ, అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో పాల్గొని వచ్చినవే. దూరత్వా- గృహజుద్దా- అంధీగలీ…మూడు సినిమాలు ఒక ట్రైలోగీ అయ్యాయి.

Also read: ‘రే’ ను గూర్చి రేఖామాత్రంగా

ప్రతికవి చిత్రదర్శకుడు కాలేకపోయినా, ప్రతి చిత్రదర్శకుడు మాత్రం ఒక కవి కావాలి. అలా కాకపోతే, ఉత్తమ విలువలు గల చిత్రం నిర్మించడం వీలు కాదు. విద్యార్థి దశ నుండే కవిగా లబ్దప్రతిష్టుడైన బుద్ధదేవ్ కు దర్శకత్వం సులభంగానే అబ్బింది. తను రాయదలుచుకున్న కవితా చరణాలకు ఆయన సెల్యులాయిడ్ పై ఒక రూపమివ్వడానికి ప్రయత్నించాడు. ‘‘గోహిర్ ఎయిర్ వే,’’ ‘‘కాఫిన్ కింబ సూట్ కేస్,’’ ‘‘హిమ్ జోగ్,’’ ‘చాట కహానీ,’’ ‘‘రోబెటర్ గెన్’ వంటి ఆయన కవితా సంకలనాలు బెంగాలీ సాహిత్యలోకంలో ఉన్నత ప్రమాణాలు అందుకున్నవి. అటు కవిగానైనా…ఇటు చలనచిత్ర దర్శకుడిగానైనా మధ్యతరగతి మార్క్సిస్టు అవగాహన ఆయనలో అన్ని వేళలా ఉంది. ఆయనకు కథ ముఖ్యంకాదు. ఇతివృత్తం ముఖ్యం. ఇతివృత్తం నచ్చితేనే ఆయన కథను స్వీకరిస్తారు. కానీ, మళ్లీ యధాతథంగా చిత్రీకరించరు. సాహిత్యరంగంలోని కథ ఒక మాధ్యమంలో నడిస్తే, చలనచిత్రాలలోని కథ మరొక మాధ్యమంలో నడుస్తుంది. ఈ రెండు మాధ్యమాల గూర్చి, రెండు వేర్వేరు విధానాల గూర్చి బాగా తెలిసినవారు దాస్ గుప్తా.

Also read: భారత్ లో మిగిలింది మనువాద మార్క్సిజమా?

నీమ్ అన్నపూర్ణ: నీమ్ అన్నపూర్ణ అంటే – ‘వెగటు పుట్టించిన అన్నం ముద్ద’- అని అర్థం. ఇంతో అంతో కొద్దిపాటి ఆదాయంతో స్థిమితంగా బతికే చిన్నరైతులు, కార్మికులు, చిన్న ఉద్యోగులు పరిస్థితుల ప్రభావానికి లొంగి దరిద్రులుగా, బిచ్చగాళ్ళుగా నగరాలకు చేరుకుంటున్న క్రమాన్ని ‘నీమ్ అన్నపూర్ణ’ చిత్రం ఎత్తి చూపింది. దశాబ్దం తర్వాత దశాబ్ద గడిచిపోతూ ఉంది. ప్రణాళిక తర్వాత ప్రణాళిక కరిగి పోతూ ఉంది. భారత దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత, సాధించిన ప్రగతి గూర్చి ప్రభుత్వ ప్రచార సాధనాలు ఘనంగానే ప్రచారం చేసుకుంటాయి. ఆర్థిక  ప్రగతి కాగితాల మీద రాసుకోవడానికి బాగానే ఉంది. మరి దేశం అప్పులపాలు ఎందుకవుతోందీ? సామాన్యుడి జీవన స్థాయి ఎందుకు పెరగడం లేదు? ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉండిపోతున్నాయి. జవాబు చెప్పాల్సిన బాధ్యత గల ప్రజానాయకులు పబ్బాలు గడుపుకుని బయటపడుతున్నారు. వ్యక్తిగత ప్రాచుర్యానికి పాకులాడుతున్నారు. సినిమాల్లో నటించి సంపాదించిన అంతులేని సంపాదనతో తృప్తి పడక, మళ్ళీ రాజకీయాల్లోకి ప్రవేశించి అక్రమసంపాదనకు పూనుకున్నవారు కొందరైతే – దేశపరిస్థితుల పట్ల ఆవేదన చెంది, స్వంత ఆస్థుల్ని పెట్టుబడిగా పెట్టి – సమాజాన్ని మార్చుదామన్న ఆశయంతో సినిమాలు తీసేవారు కొందరు.  సినిమా ఒక వ్యాపారమే. అయితే దాన్ని కేవలం ఆ పరిథిలోనే ఉంచకుండా, ఒక ప్రయోజనం కోసం రూపొందించడమన్నది గొప్ప విషయం!

Also read: ‘రామ్ చరిత్ మానస్’ లో తులసీదాసు ఏమి రాశారు?

కార్లోవి వారి చలనచిత్రోత్సవంలోనూ, లొకర్నో చిత్రోత్సవంలోనూ ‘నీమ్ అన్నపూర్ణ’ 1980లో జ్యూరీ బహుమతులు గెలుచుకుంది. దక్షిణ ఆసియా – హాంకాంగ్ – చలనచిత్రోత్సవాలలో విజయఢంకా మోగించి వచ్చింది. అందుకు కారణం – దర్శకుడి కార్యదీక్ష! పట్టుదల!! చిత్రం చిన్నదే. కేవలం గంటన్నర వ్యవధిలో సాగే చిత్రమే. కాని, నాలుగు దశాబ్దాలుగా దేశం సాధించిన ప్రగతిని సూటిగా ప్రశ్నిస్తుంది. మన ఉనికిని మనకు తెలియజేస్తుంది. నీమ్ అన్నపూర్ణ కథా ఇతివృత్తం ఈ విధంగా ఉంటుంది. బ్రోజో ఒక ఊళ్ళో చిన్న ఉద్యోగి. ఉద్యోగం పోగొట్టుకుని బతకడానికి కలకత్తా మహానగరం చేరుకుంటాడు. చిత్రం ప్రారంభమయ్యేనాటికి బ్రోజో కుటుంబంతో సహా కలకత్తాకు వలస వెళుతూ రైల్లో కనిపిస్తాడు. అసన్ సోల్ ప్రాంతంలోని ఒక మురికివాడలో మకాం పెడతాడు. దినదిన గండంగా అక్కడ రెండు సంత్సరాలు గడుస్తాయి. బ్రోజోకు ఉద్యోగమేదీ దొరకదు. ఉద్యోగాన్వేషణలో ఏవో గొడవల్లో ఇరుక్కుని ఒక సారి చావు దెబ్బలు తింటాడు. బ్రోజో భార్య ప్రీతిలత మధ్యతరగతి గృహిణిగా ఏవో విలువల కోసం పాకులాడుతూ ఉంటుంది. పక్కింటి గృహిణి సరుకులు అప్పిచ్చి ఇచ్చీ… విసుగుపుట్టి, అసహనంతో నాలుగిళ్ళలో పాచిపని చూపించనా అని అడుగుతుంది. ఆ మాట మధ్యతరగతి ప్రీతిలత భరించలేకపోతుంది. ఇంట్లో కూర్చొని న్యూస్ పేపర్ కవర్లు చేస్తుంది. కాని ఆ డబ్బులు దేనికీ సరిపోవు. వారి గుడిసెలోని ఒక గది మరో వృద్ధ బిచ్చగాడికి అద్దెకిస్తారు. ఆ బిచ్చగాడు ఒకానొక సమయంలో ఉద్యోగే. మన కథానాయకుడైన బ్రోజో లాగానే ఉద్యోగం పోగొట్టుకుని, మహానగరంలో బిచ్చగాడయ్యాడు. పక్క గదిలోని అతని ఉనికీ, అతని అనారోగ్యం ప్రీతిలత సహించలేకపోతుంది. కానీ, అతడి సంచిలో బియ్యం కనిపించే సరికి ఏదో వింత కోరిక పుడుతుంది. కష్టపడి పాచిపని చేసుకోవడానికి అడ్డొచ్చిన అహం, బిచ్చగాడి బియ్యం దొంగిలించడానికి రాలేదు. దుర్భరమైన దారిద్ర్యం భరించలేక, భర్త అసహాయతను భరించలేక, ఆకలి ఆకలి అని శోషతో పడిపోయిన పిల్లలబాధ చూడలేక-ప్రీతిలత పక్కగదిలో బిచ్చగాడి బియ్యం దొంగిలిస్తుంది. అదే సమయానికి ఎటో వెళ్ళాలనుకున్న బిగ్చగాడు బయట వర్షం ప్రారంభం కావడంతో అనూహ్యంగా గుడిసెలోకి వస్తాడు. తన బియ్యం సంచిని పక్కగదిలోని గృహిణి దొంగిలించడం చూస్తాడు. చిన్న పెనుగులాట తర్వాత వృద్ధబిచ్చగాడు కిందపడిపోతాడు. ప్రీతిలత బియ్యం సంచీతో వెళ్ళిపోతుంది. వృద్ధబిచ్చగాడు చనిపోతాడు.

Also read: మహామానవతావాది – సర్ చార్లీ చాప్లిన్

బియ్యం వండి ఆ రాత్రి ప్రీతిలత అందరికీ అన్నం పెడుతుంది. సంపాదించడం చేతగాని బ్రేజో బియ్యం ఎక్కడివని కూడా అడగడు. భార్య చీరమీద రక్తం మరకలు గమనిస్తాడు. కానీ చూడనట్టే ఉంటాడు. పిల్లలతో కలిసి ఆదరాబాదరాగా తినేస్తాడు. తన బాధ్యత తను నిర్వర్తించలేకపోతున్నానని మరో వైపు నిరంతరం కృంగిపోతుంటాడు. భర్త బ్రోజో రక్తం మరకలు గమనిస్తాడేమోనని భార్య ప్రీతిలత జాగ్రత్త పడుతూ ఉంటుంది. చావుకు సిద్ధంగా ఉన్న బిచ్చగాడితో పెనుగులాడి బియ్యం సంపాదించానన్న భావం ఆమెలో సుళ్లు తిరిగి తిరిగి, ఒక రకమైన వెగటు పుట్టిస్తుంది. అందరితో పాటు ఆమెకు ముద్ద దిగదు. లోపలి నుంచి అసహ్యం తన్నుకు రాగా, అపరాధ భావంతో లేచి బయటికి వెళ్ళి భళ్ళున వాంతి చేసుకుంటుంది. ఆమె బతుకు మీద ఆమె వాంతి చేసుకున్నట్టుగా ప్రేక్షకులు భావిస్తారు. బ్రోజో భవిష్యత్తు పక్కగదిలోని వృద్ధబిచ్చగాడిలా మారబోతోందా? అని కూడా ప్రేక్షకులు భావిస్తారు. ఈ దంపతుల పెద్ద కూతురు ఒక సారి రొట్టెకు ఆశపడి ఒక టీకొట్టువాడికి తన అందాన్ని అర్పించుకుంటుంది. చిన్న కూతురు పక్కింట్లో పంజరంలోని చిలకకు వేసిన శనగపిండి గింజలు ఏరుకొని తింటుంది. గ్రామాలు వదిలి మహానగరాలకు వలస వెళ్తున్న బ్రోజోలు మన దేశంలో ఎంతమంది? అని చిత్రదర్శకుడు  బుద్ధదేవ్ ప్రశ్నిస్తున్నారు.

Also read: బౌద్ధ మార్క్సిస్టు – రాహుల్ సాంకృత్యాయన్

(జూన్ 10 కన్నుమూసిన మహాదర్శకుడికి నివాళులర్పిస్తూ)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles