Saturday, April 20, 2024

చరిత్ర అంటే కొందరికి ఎందుకు భయం?

ఆర్యుల దండయాత్రను సూచించే చిత్రం, ప్రసిద్ధ చరిత్రకారిణి రొమిల్లా థాపర్

దేశ చరిత్ర అనేది ఒక యూనివర్శిటీకీ లేదా ఒక పరిశోధకుడి పరిశోధనకూ సంబంధించిన విషయం కాదు. ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులంతా సంవత్సరాల తరబడి పరిశోధనలు చేస్తే వచ్చే ఫలితమే చరిత్రగా నిలుస్తుంది. ఎంతో మంది చరిత్రకారులు ఆర్కియాలజిస్ట్ లు, ఇండాలజిస్ట్ లు పరిశోధించి చెప్పిన దానికి ఆర్ఎస్ఎస్ వారు ఎందుకు బెంబేలెత్తుతున్నారూ? అసలు చరిత్ర పుస్తకాల్ని మార్చి తిరగరాయించాలనే కోరిక బీజేపీ ప్రభుత్వ పెద్దలకు ఎందుకొచ్చిందీ? ఇప్పుడున్న చరిత్ర గ్రంథాలంటే వారికెందుకంత గుబులూ? ఇది ఇలా ఉంటే ప్రపంచ ప్రసిద్ద యూనివర్శిటీల్లో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉంటూ, ప్రపంచ మేధావుల్లో ఒకరైన భారతీయ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ (83) పుస్తకాల్ని తగులబెట్టాలని ఎందుకు పిలుపునిస్తున్నారూ? తన కృషిని గుర్తించి ఇచ్చే అకడమిక్ అవార్డులు తప్ప, మరే ఇతర అవార్డులూ తీసుకోనని, భారత ప్రభుత్వం ఇచ్చే పద్మభూషణ్ ని రెండుసార్లు నిరాకరించిన విశిష్ట వ్యక్తిత్వం కదా ఆమెది? అత్యంత ప్రతిష్ఠాత్మకమైన  ‘అమెరికన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ క్లూగ్ చైర్’కి నియమితులైనవారు కదా ఆమె? అలాంటి నిజాయితీ, నిబద్ధత గల చరిత్రకారులంటే ఆర్ఎస్ఎస్-బీజేపీలకు ఎందుకంత వణుకూ? వారి ఉనికికి భంగం కలిగించే పరిశోధనా ఫలితాలు వారు వెల్లడిస్తున్నందుకా? బహుశా ఆర్యన్ దండయాత్రే వారి భయానికి కారణమై ఉంటుంది.

Also read: సైన్స్ ఫిక్షన్ మాంత్రికుడు – అసిమోవ్

యూరేషియా నుంచి వలసలు

ఆర్యులు – అంటే ఇప్పుడు భారతీయ సమాజంలో ఉన్నత వర్గాలవారు, ఒకప్పుడు విదేశాల నుండి వలస వచ్చారన్న సిద్ధాంతం – బహుశా వారికి మింగుడుపడడం లేదేమో! ఆర్య బ్రాహ్మణ, ఆర్య క్షత్రియ, ఆర్యవైశ్యగా చెప్పుకునే ఆర్యులు, ఒకప్పుడు ఇరాన్ ప్రాంతం నుండి వలస వచ్చినవారు. ఇక్కడ సింధూ నాగరితను అభివృద్ధి పరుచుకున్న ఈ దేశ మూలవాసుల్ని ఆర్యులు విభజించారు. శూద్రులుగా, చండాలురుగా చేసి కులవ్యవస్థను స్థిరపరిచారు. ఆనాడు భూమి ఉన్న రైతుల్ని ఊరి బయటికి పంపి, అంటరానితనాన్ని అంటగట్టారు. బలవంతంగా బెదిరించి, వారి భూముల్లో పంటలు పండించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్కియాలజిస్ట్ లు, మానవశాస్త్రవేత్తలూ, భాషాశాస్త్రవేత్తలూ, చరిత్రకారులూ, ఇంకా ఇతర పరిశోధకులంతా గత రెండు వందల ఏళ్ళుగా ఎన్నోతవ్వకాలు జరిపి, ఎంతో శ్రమించి, పరిశోధించి వెలికి తీసిన విషయమిది.

Also read: మానవత్వాన్ని మంటగలుపుతున్న పుతిన్

‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ దినపత్రిక 21 మే 2001నాడు ప్రచురించిన వార్తాకథనం ప్రకారం, అమెరికా ఉట్టా (UTAH) విశ్వవిద్యాలయం  – బయో టెక్నాలజీ డిపార్టుమెంట్ హెడ్ మైఖెల్ బమ్ శాద్ పరిశోధించి చెప్పిందేమంటే – భారత్ లోని బ్రాహ్మణులు ఈ దేశ మూలవాసులు కాదనీ, వారు యూరేషియనులనీ తేల్చాడు. ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు మరికొంతమంది శాస్త్రవేత్తలు కూడా ఆ పరిశోధనలో పాలుపంచుకున్నారు. ఆ బృందంలో డా. జయదీక్షిత్ కూడా ఒకరు. ఈయన పుణెకి చెందినవాడు. అమెరికాలో స్థిరపడ్డ భారతీయ బ్రాహ్మణుడు. మైఖెల్ బమ్ శాద్ వలె ఇదే విషయం మీద పరిశోధనలు చేసి ఆ విషయాన్ని ధృవపరిచాడు.

Also read: విశ్వసించలేని విశ్వాసం – ఆత్మద్రోహమే

ఆర్ఎస్ఎస్, బీజేపీ వారు ఎవరి వారసులు?

ఇప్పుడు యదార్థాలు తెలుసుకొని ఆలోచిస్తే ఆర్ఎస్ఎస్-బీజేపీలు ఎక్కడివీ? యూరేషియా నుండి వలస వచ్చినవారి వారసత్వాన్ని అంటే ఆర్యుల వారసత్వాన్ని ఫుణికిపుచ్చుకున్నవారివన్నమాట! అందుకే చూడండి వారికి భారత రాజ్యాంగం కన్నా మనుస్మృతే విలువైంది. వారికి జాతీయ పతాకం  కన్నా వారి ఆర్ఎస్ఎస్ జెండానే ముఖ్యమైంది. ఆర్యుల వర్ణ చరిత్ర మాత్రమే ఉన్న వేదాల్ని గొప్పవిగా భావిస్తారు. అందుకే వీరి పుట్టుపూర్వోత్తరాల గూర్చి చెప్పే చరిత్రకారులంటే వీరికి వెన్నులో వణుకు పుడుతుంది. ఈ విషయాలన్నీ తెలిస్తే, ప్రజలు ఎలా స్పందిస్తారోనని భయపడుతుంటారు. క్రీ.పూ. వైదిక మతంలో విగ్రహారాధన లేదు. బ్రాహ్మణులు మాంసాహారులు. యజ్ఞయాగాదులలో ఆవుల్ని బలి ఇచ్చి తిని, తాగి వేడుకలు చేసుకునేవారు. అప్పటి నుండీ అగ్నిని దేవుడిగా, ఇంద్రుణ్ణి దేవుడిగా, వరుణుణ్ణి దేవుడిగా గుర్తిస్తూ దేవతల సంఖ్య పెంచుకుంటూ పోయారు.

Also read: అంధవిశ్వాసాలను త్యజిస్తూ, విజ్ఞానపథంలోకి పయనిస్తూ…

హేతుబద్ధంగా ఆలోచించాలన్న బౌద్ధం

క్రీ.పూర్వమే బౌద్ధం దేశమంతా వ్యాపించి స్వేచ్ఛ, సమానత్వాల గురించి చెప్పింది. అహింసను బోధించింది. ఆత్మ, పరమాత్మలు లేవని చెపుతూ అందరూ హేతుబద్ధంగా ఆలోచించాలని చెప్పింది. బుద్ధుడి ప్రభావాన్ని, అతడి బోధనల ప్రభావాన్ని తట్టుకోలేక, హిందూ మతవాదులు తమ మతంలో, తమజీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవలసి వచ్చింది. నేరుగా బుద్ధుణ్ణి తమ దశావతారాల్లో చేర్చుకోవడం, మాంసభక్షణ మానేయడం, బౌద్ధారామాల్ని హిందూ దేవాలయాలుగా మార్చుకోవడం వగైరా జరిగాయి. బుద్ధుడి వ్యక్తిత్వానికి దీటుగా రాముడు, కృష్ణుడు వంటి కల్పిత పాత్రల్ని సృష్టించి, కథలల్లడం జరిగింది. బౌద్ధ జాతక కథల స్ఫూర్తితో హిందూపురాణాల్లోని ఎన్నో ఘట్టాలు రాసుకోవడం జరిగింది. సునిశితంగా విశ్లేషించుకుంటే ఆ విషయాలు గ్రహించొచ్చు. ఇక వైదిక మతం క్రమంగా రూపాంతరం చెందుతూ బ్రాహ్మణమతంగా మారింది. క్రీ.పూ. ఒకటో శతాబ్దంలో అంటరానితనాన్ని ప్రవేశపెట్టి సమాజంలో తమదే అత్యున్నతమైన స్థానమని ఆర్య బ్రాహ్మణులు ప్రకటించుకున్నారు. కులాలు, వర్ణాలు సజావుగా వర్థిల్లేటట్లు కట్టడి చేశారు. ఇతర కులాలవారిని విద్యకు, సంపదకు దూరం పెట్టి – వారు విధిలేక కులవ్యవస్థను, వర్ణవ్యవస్థను పాటించాల్సిన దుస్థితిని ఏర్పరిచారు. ఒక దశలో శూద్రుల దేవుడైన శంకరుడికి బ్రహ్మ, విష్ణులతో సమామైన స్థాయి కల్పించారు. గోవుకు పవిత్రత ఆపాదించి గోవధ నిషేధించారు.

Also read: దైవశక్తి లేదు, ఉన్నదంతా మానవశక్తే

చిత్రహింసలకు గురైన మూలవాసులు

ఈ దేశ మూలవాసులైన శూద్రులు, పంచములు ఆర్యబ్రాహ్మణుల వల్ల విపరీతమైన చిత్రహింసలకు గురయ్యారు. ఊపిరి మెసలని కట్టుబాట్లు, నిబంధనలతో విసిగిపోయారు. పన్నెండో శతాబ్దంలోదేశంలోకి ముస్లింలు రావడంతో వారిలో కొందరు ముస్లిం మతంలోకి మారారు. 1792లో విలియం కేర్ దేశంలో అడుగుపెట్టినప్పుడు మరికొందరు క్రైస్తవం స్వీకరించారు. ఆర్యబ్రాహ్మణులు హిందూమతంలో విధించినన్ని కఠినమైన నిబంధనలు ఇతర మతాల్లో లేకపోవడం వల్ల, ఇక్కడ లేని సౌకర్యాలు, సౌలభ్యాలు, వెసులుబాట్లు అక్కడ ఉండడం వల్ల కొంతమంది ముస్లిం మతంలోకి, మరికొంతమంది క్రైస్తవంలోకి మారడం జరిగింది. జైన, బౌద్ద మతాలు అప్పటికే తగ్గుముఖం పట్టాయి. అసలైతే ముస్లిం, క్రైస్తవ మూలాలు భారత దేశంలో లేవు. ప్రస్తతం దేశంలో ఉన్న ముస్లిలైనా, క్రైస్తవులైనా ఈ దేశ మూలవాసులే. బహుజనులే. విదేశీయులు కాదు. దానికి తోడు సుదీర్ఘకాలం దేశం ముస్లిం చక్రవర్తుల పాలనలోనూ, బ్రిటిష్ రాణి పాలనలోనూ ఉండడం వల్ల కూడా మత మార్పిడులు వేగవంతమయ్యాయి.

Also read: వైద్యం వేరు, మత విశ్వాసాలు వేరు కదా నాయనా?

ఆర్యసమాజ్ అంటే యూరేషియన్ సమాజం

ఆర్యసమాజ్ అంటే అది యూరేషియన్ సమాజం. అంటే విదేశీ సమాజం. భారత దేశంలో బ్రాహ్మణులు ‘ఆర్యులు’ అని పిలవబడేవారు. అందువల్లే దయానంద్ సరస్వతి ఆర్యసమాజ్ స్థాపించాడు. దేశంలోని ఇతర కులాలవారు, వర్ణాలవారు బ్రాహ్మణుల్ని ‘ఆర్యా’ అని సంబోధించాలన్న నియమం ఉండేది. ఇటీవలి కాలం వరకకు ఆర్య అనే పదం వాడుకలో ఉన్న విషయం మనకు తెలుసు. ముస్లింలు దండయాత్ర చేసి భారతదేశాన్ని ఆక్రమించుకున్నట్టు, బ్రిటిష్ వారు ఆక్రమించుకొని రాజ్యమేలినట్టు, ఇంకా ఇంకా చాలా యేళ్ళ క్రితం ఆర్యబ్రాహ్మణులు కూడా యూరేషియా నుండి అంటే ఇరాన్ ప్రాంతం నుండి వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారని పరిశోధకులు ధృవీకరించారు. మనం చిన్నప్పుడు ఆర్యుల ప్రవేశం, ఆర్యావర్తనం లాంటివి చరిత్రలో చదువుకున్నవే కాని అప్పుడు ఇంత విపులంగా విషయాలు తెలియలేదు. ఇప్పుడు హిందూమతంగా పిలువబడే బ్రాహ్మణిజం ఎప్పుడో ఇరాన్ ప్రాంతం నుండి వచ్చినవారు రూపొందించింది. మనుషులు మాట్లాడుకోవడానికి ఏర్పరచుకున్న భాషని కర్మ-ధర్మ సిద్ధాంతాల మాటున మంత్రాలు, తంత్రాలుగా మార్చి తమదైన ముద్ర వేసుకున్నారు. శ్రమించి, ప్రకృతిని మనిషికి అనువుగా మార్చుకునే పనిని తక్కువదిగా చేశారు. తోటి మనుషుల్ని అంటరానివాళ్ళుగా, గుణం తక్కువవాళ్ళుగా, శూద్రులుగా, పంచములుగా ప్రకటించారు. ఒక పందిని దేవుడి అవతారంగా వర్ణించారు. రుగ్వేదం (3:9:11) ప్రకారం దేవుళ్ళను 3339 వర్గాలుగా, మనుషుల్ని ఆరువేల కులాలుగా విడగొట్టారు. దేవుడి పేరుతో ఆచారాలు ఏర్పరచి ఒక ‘పవిత్రమైన’ పురోహిత వర్గాన్ని ఏర్పరిచారు. సమాజంలో తొంభయి శాతంగా వున్న శూద్రుల్ని, అంటరానివారిని ఆత్మన్యూనతా భావానికి లోనుచేశారు. తమకులం ఏమిటో చెప్పుకోవడానికి సిగ్గుపడేలా చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని ఒక వర్ణవ్యవస్థని, ఒక మానసిక రుగ్మతని భారతీయ సమాజంలో ప్రవేశపెట్టి స్థిరపరిచారు. ఆ దుష్ప్రభావంలోంచి శతాబ్దాలు గడిచినా మన సమాజం కోలుకోలేకపోతోంది. ఇరాన్ ప్రాంతమంటే (యూరోప్+ఆసియా=యురేషియా) ఇప్పటి ఇరాన్ అని కాదు. వేల వేల ఏళ్ళ క్రితం ఆ ప్రాంతం ఇస్లామీకరించబడక పూర్వం ఉన్న ప్రాంతం. అప్పుడు అక్కడ మాట్లాడిన భాషలు అవెస్తన్-సంస్కృతం. ఇవి వేరు వేరు భాషలు కావు. ఒక మూల భాషకు ఏర్పడ్డ రెండు మాండలికాలు.

Also read: రామానుజ విగ్రహ ప్రతిష్ఠాపన ఒక రియాల్టీ షో!

 పాతపుస్తకాల పాండిత్యమింతెరా…

అన్ని భాషల్లాగా సంస్కృతం అంతవరకు ఒక మామూలు భాషే. కాని, దాని స్థాయిఅనూహ్యంగా పెంచి, దాన్ని దైవభాషగా, వేదభాషగా ప్రకటించుకున్నారు. పైగా శూద్రులు ఆ భాష చదివితే నాలుకలు కోశారు. ఆ భాష వింటే చెవుల్లో సీసం పోశారు. వేదాల సృష్టకర్తలయిన నాటి ఆర్యబ్రాహ్మణుల అకృత్యాల జాబితా చాలా పెద్దది. కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, గోత్రాల పక్కన పెట్టి, ఆధునిక యుగవైజ్ఞానిక స్పృహతో ఆలోచించగల మానవవాదులకు విషయం స్పష్టంగా ఆర్థమవుతుంది. ఇంకా ఎదగలేనితనంలో కొట్టుమిట్టాడుతున్నవారికి గత చరిత్ర విప్పి చెప్పితే కోపాలే వస్తాయి. అందుకే చరిత్ర గ్రంథాలన్ని తిరగరాయించాలన్న కోరిక కొందరిలో బలంగా ఉంది. పుస్తకాలు, సిలబస్ లు మార్చుకున్నంత మాత్రాన అసలు చరిత్ర మారదు కదా? ప్రస్తుత పరిస్థితుల్లో మైనార్టీల మీద విపరీతంగా జరుగుతున్న దాడుల్ని రోజూ మనం చూస్తున్నాం. హిందూత్వను బలోపేతం చేయాలనుకునేవారు మైనార్టీలను హింసిస్తే లాభమేమిటి? వారే ఆలోచించుకోవాలి. హిందూమత ఛాందసానికి తట్టుకోలేకే వారి వారి పూర్వీకులు ఒకప్పుడు మతాలు మార్చుకున్నారు.వారి వారసుల్ని ఇప్పుడు అదిరించి, బెదిరించి, హింసకు గురిచేస్తే వారు హిందుత్వనెలా సమర్థిస్తారు? ‘‘ఘర్ వాపసీ’’ ఎలా సాధ్యం? విశాల దృక్పథంతో స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పాల్సింది పోయి, సంకుచితత్వంతో హత్యలు చేస్తూపోతే ఎవరైనా గాని హిందుత్వ వైపు ఎలా ఆకర్షించబడతారూ? దేశంలో అధికార పార్టీ నిర్వహిస్తున్న ఒక రకమైన ఉగ్రవాద చర్యల్ని హిందువులే వ్యతిరేకిస్తున్నారు కదా? అందుకే పురాణగాథల్ని ఎద్దేవా చేస్తూ నార్ల ఇలా అన్నారు: ‘‘భూమి బల్లపరుపు/పాము దానిని మోయు/పాలకడలి కలదు పాడె కలదు/పాతపుస్తకాల పాండిత్యమింతెరా/నవయుగాల బాట నార్లమాట!’’

Also read: నిత్య జీవితంలో వైజ్ఞానిక స్పృహ

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ విజేత, బయాలజీ ప్రొఫెసర్)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles