Friday, September 20, 2024

సమరయోధులను రక్షించిన ‘బల్లఈత’

రామాయణ చరిత్రలో శ్రీ రాముడు లంక నగర అధినేత రావణాసురుని పై యుద్ధం చేయటానికి సముద్రంపై వారధి నిర్మాణం లో వానరుల పాత్ర తో పాటు శ్రీ రాముడి సేవ కోసం  ” ఉడుత ” భక్తిగా చిన్న చిన్న రాళ్ల ముక్కలు తెచ్చి  అందించి చేసిన సహాయం చేసింది.  నేటికి ఎవరైనా కొద్దిపాటి సహాయం చేస్తే ఉడతా భక్తిగా సహాయం చేశారని అంటారు. రామాయణ ప్రవచనంలో ఈ అంశం శ్రోతలను ఆకట్టుకుంటుంది.

అయితే బ్రిటిష్ పాలకుల నుంచీ, నైజాం రాజు నుంచీ విముక్తి కోసం జరిగిన స్వాతంత్ర సమర పోరాటంలో ప్రాణ త్యాగాల తీరుతెన్నుల గురించి నేటికీ నిత్యం మననం చేసుకుంటూనే ఉన్నాం.  అయితే,  దేశానికి స్వాతంత్రం వచ్చిన  1947 ఆగస్టు 15 న మన భారతీయ జెండా ఎగరవేసిన ఇద్దరు స్వాతంత్ర సమరయోధులను నిజాం ప్రభుత్వం అరెస్టుకు యత్నించగా, నిజాం పోలీసులకు, ప్రభుత్వానికి చిక్కకుండా వారిని కాపాడిన చరిత్ర “బల్ల ఈతది” అని  అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు.  35 సంవత్సరాల లోపు వయసు వారికి దీని చరిత్ర తెలియకపోవచ్చు, స్వాతంత్ర పోరాట చరిత్రలో ఈ”బల్ల ఈత” గురించి వివరాలు ఉండకపోవచ్చు.

బల్ల ఈత” పుట్టుపూర్వోత్తరాలు

గోదావరి నదిలో ఉధృత  నీటి ప్రవాహం ఏటవాలుగా ఓ పొడవాటి చెక్క పై అభిముఖంగా పడుకొని దాదాపు 40,50 కిలోమీటర్లు దూరం ఆయాసం లేకుండా ఈతగాళ్ళు ఈదుతూ  ఉంటారు. గోదావరి నదిపై వంతెనల నిర్మాణం కాని రోజుల్లో  ( బ్రిటిషు పాలనలో రైలు పట్టాలు, నిజాం ప్రభుత్వ హాయంలో నదిపై నిర్మించబడిన వంతెనలు మినహా )ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి,  బీర్పూర్, రాయికల్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల పరిధిలోని నదీ తీర ప్రాంత గ్రామీణులకు, ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి, జన్నారం, ఖానాపూర్, ద్వారక, లక్షత్ పెట్, మంచిర్యాల్ వంటి నదీతీర గ్రామ ప్రాంతాల ప్రజలకు ఈ బల్ల గీత గురించి తెలుసు. ఈ బల్లఈత ద్వారా ఆదిలాబాద్ పరిసర గ్రామీణులు కరీంనగర్ జిల్లాలో ఈ ప్రాంతాలకు కూలి పనులకూ, పాలూ పెరుగూ కూరగాయలు లాంటి నిత్యవసరాలు  అమ్మేందుకు ఈ బల్లఈత ద్వారా గోదావరి నదిపై రాకపోకలు సాగించేవారు. గోదావరి నీటి ప్రవాహం లో కొట్టుకుని పోతున్న పశువులను, గొర్రెలు, మేకలనూ,  ప్రమాదవశాత్తు మనుషులూ, యాత్రికులను బల్ల ఈతగాళ్ళు కాపాడిన చరిత్ర ఉంది. స్థానిక బోయలు   చేపలు పట్టడానికి, ప్రవాహంలో కొట్టుకు వస్తున్న చెట్లను వంట చెరకు కోసం తీరం అవతలకు తరలించడానికి బల్లఈతను వినియోగించుకునేవారు

సమరయోధులను అరెస్టు కాకుండా కాపాడిన తీరు

1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్రం ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.  తెలంగాణలో నైజాం ప్రభుత్వం ఎలాంటి ఉత్సవాలు నిర్వహించరాదనీ, జాతీయ జెండాను ఎగురవేయ రాదనీ  హుకుం  జారీ చేసింది. ధర్మపురి క్షేత్రానికి చెందిన  స్వాతంత్ర సమరయోధులు  స్వర్గీయులు మాజీ మంత్రి కెవి కేశవులు, ప్రముఖ వేద శాస్త్ర పండితుడు సంగనభట్ల మాణిక్య శాస్త్రి ( ప్రముఖ సినీ డైరెక్టర్ హరీష్ శంకర్ తాతగారు)  వీరు నైజాం ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరిస్తూ గోదావరి నదీతీరంలో గల మాజీ మంత్రి కెవి కేశవులు ఇంటిపై భారతదేశ జాతీయ జెండాను 1947 ఆగస్టు 15 న ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి మాణిక్య శాస్త్రి అధ్యక్షత వహించారు. అయితే, నైజాం ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరిస్తూ జెండా ఎగురవేసిన సమాచారం నైజాం పోలీసులకు తెలిసింది. వారి అరెస్టు కోసం నైజం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజా కంటకుడిగా  పేరుపొందిన నైజాం పోలీస్ అధికారి సుజా ఉద్దీన్ పోలీసు బలగాలను, జగిత్యాల నిజామాబాద్ వైపు రాయపట్నం ,కరీంనగర్ వైపు నిఘా ఉంచారు.

కరీంనగర్ ,ఆదిలాబాద్ సరిహద్దు ధర్మపురి ని అనుకొని గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. వారు అటువైపు నుంచి తప్పించుకోలేరు  అనే ధీమా నైజాం పోలీస్ అధికారికి ఉండింది. మరుసటి రోజు ఆగస్టు 16న రాత్రి వీరి అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్టు సమరయోధుల బంధువులు వివరించారు.  నైజాం పోలీసులు వీరిని పట్టుకోవడానికి రావడంతో కెవి కేశవులు మాణిక్య శాస్త్రి లు గోదావరి నది వైపు పరిగెత్తారు. అక్కడ రెండు బల్లలపై గజ ఈతగాళ్లు మేర అంతయ్య ,  మల్లయ్య (పేరు సరిగ్గా గుర్తు రావడం లేదని ఓ సందర్భంలో సమరయోధుడు మాణిక్య శాస్త్రి కుమారుడు ప్రముఖ హిందీ పండితులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత నరహరిశర్మ వివరించారు) ఇద్దర్నీ ఎక్కించుకొని ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నీటి ప్రవాహం ద్వారా రాత్రికి రాత్రే  ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల తీరప్రాంతానికి చేరుకొని మంచిర్యాల నుంచి మహారాష్ట్ర కు వెళుతున్న “భూసవలి” రైలులో నాగపూర్ కు చేరుకొని అక్కడ క్యాంపు లో తలదాచుకున్నట్టు మాణిక్య శాస్త్రి తనయుడు నరహరిశర్మ వివరించారు.

ఇదీ చదవండి:ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మంగా మారిన సాగర్ ఉపఎన్నిక

బల్ల” అంటే…

బల్ల ఆరున్నర అడుగుల పొడవు, 10 లేదా 11 అంగుళాల  వెడల్పు, ఐదు లేదా ఆరు అంగుళాల మందం ఉంటుంది.  ఎండిన” బూరుగు” చెట్టు కలప తో దీన్ని తయారు చేస్తారు.  ఉధృత నీటి ప్రవాహం లో ఈ చెక్క బల్ల పై ఈతగాళ్ళు సగ భాగం పడుకొని మిగతా సగభాగం నదీ ప్రవాహానికి కొంచెం పైగా నిలబడి ఉండేలా చూసుకుంటారు. బల్లకు ఏటవాలుగా నాభి వరకు పడుకొని రెండు చేతులు కాళ్ళు నీటిలో ఈతకు అనువుగా ఉంచుకుంటారు. బల్ల చెక్క  సైతం వీరి శరీరానికి  ఏటవాలుగా ఏర్పాటు చేసుకుంటారు. నది  ఉధృతి నీటి ప్రవాహం ప్రయాణిస్తున్న దిశగా బల్లపై ఈత కొడుతూ ఉంటారు. ఎలాంటి ఆయాసం రాకుండా దాదాపు నలభై యాభై కిలోమీటర్లు దూరం వరకు ఈదుతూ వుంటారు. ఈ బల్లపై మరొకరిని కూడా తమ వీపుపై ఎక్కించుకొని ఈతగాళ్ళు  ఈదడం ప్రత్యేకత. నది ఉధృత ప్రవాహంతో రాయపట్నం వంతెన మునిగిన సందర్భాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తూ నిత్యం రాకపోకలు కొనసాగించే కరీంనగర్ జిల్లా ఉద్యోగులను జిల్లాలో విధులు నిర్వహించే ఆదిలాబాద్ జిల్లా ఉద్యోగులను ఈ బల్ల ద్వారా గజ ఈతగాళ్లు గతంలో ఒడ్డుకు చేర్చేవారు.  నేటికి ధర్మపురి క్షేత్రం లోని బోయ వారి ఇళ్లలో వందలాదిగా ఈ బల్లలు ఉన్నాయి.50 సంవత్సరాలు పై బడిన వారికి మాత్రమే ఈ బల్లఈత గూర్చి, వాటి మెలుకువలు గురించి తెలుసు. ప్రస్తుతం ధర్మపురి క్షేత్రంలో గోదావరి నదిలోకి  ఎల్లంపల్లి ప్రాజెక్టు వల్ల బ్యాక్ వాటర్ నిలువ నీటిలోనే చేపల వేటకు ధర్మాకోల్ తెప్పను బోయవారు  వినియోగిస్తున్నారు  తప్ప  బల్లఈతను వారు వినియోగించడం లేదు.  

ఇదీ చదవండి: సాగు చట్టాల అమలుకు సుప్రీంకోర్టు బ్రేక్

Surendra Kumar
Surendra Kumar
Sakalam Correspondent, Dharmapuri

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles