Thursday, September 19, 2024

వీరోచిత ఉపదేశం – నేనూ, నా దేశం!

పుస్తక సమీక్ష

“ఇది సంధియుగం. గడిచిన 36 సంవత్సరాల రాజకీయ జీవితంలో నాలుగు సార్లు జైళ్ళలో నిర్భంధించారు. రెండు సార్లు విదేశీ ప్రభువులు, రెండు సార్లు ప్రజాప్రభుత్వము మొత్తం ఎనిమిది జైళ్ళలో పెట్టగా ఎనిమిది సంవత్సరాల జీవితం గడిచి పోయింది. బ్యాంకాక్, సింగపూర్, కలకత్తా, లాహోరు, ఢిల్లీ, కన్ననూరు, కోయంబత్తూరు, వెల్లూరు  జైళ్ళలో ఉన్నాను. సింగపూరు మిలటరీ జైలులో ఆరు నెలలు ఏకాంతవాసం వల్ల కలిగిన నరముల వ్యాధిచే ఇప్పటికీ బాధ పడుటయేకాక నా జీవిత కాల మంతా కష్టపడక తప్పదు. కొన్ని పర్యాయములు చేతులతో, కాళ్ళతో, బూట్సుతో, లాఠీలతో దెబ్బలు తిన్నాను. కొన్ని రోజులు నా బట్టలన్నీ తీసేసారు. ఎన్నో బాధలకు గురైంది ఈ శరీరం. నేను కోరిన సంపూర్ణ స్వరాజ్యం కాని, ప్రజా ప్రభుత్వం కాని ఇంకా ఏర్పడ నేలేదు. కాని, నా జీవిత కాలంలో ఏర్పడుతుందనే నమ్మకం నాకు ఇప్పటికీ ధృడంగానే వున్నది.”

తెలుగు నేల మీద నడయాడిన ఏకైక గదర్ వీరుడు దరిశి చెంచయ్య తన విలక్షణమైన స్వీయచరిత్ర ‘నేనూ, నా దేశం’ లో చివర్న అన్న మాటలివి. ఎంతో విశిష్టమైన ఉత్కంఠ భరిత జీవితానుభవం గల ఆయన తన గురించి అత్యంత నిరాడంబరంగా చెప్పిన తీరు మనకి అబ్బుర మనిపించక మానదు. తెలుగులో అంత మహోద్యమ విప్లవాత్మక చారిత్రక ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులు అరుదు.  ఆచరణాత్మకంగా కూడా అసలు అంతటి ప్రగతిశీల అభ్యుదయ నేపథ్యం గల వారు లేరనే చెప్పవచ్చు. అయినప్పటికీ, ఆయన ఏ రాజకీయ పార్టీ జెండా మోయకుండా అందరి శ్రేయస్సే తన ఎజెండాగా  సొంతంగా పని చేసుకుంటూ పోయాడు కనుక దరిశి చెంచయ్య గారి జీవితం ఈ రోజు అన్ని ప్రగతిశీల, ప్రజా తంత్ర శ్రేణులకి సైతం ఒక కాలంచెల్లిన విస్మృత గ్రంథం!

Also read: మద్యమా? మానవ మనుగడా?

ప్రపంచ ప్రఖ్యాత అనార్కిస్ట్ తత్వవేత్త ప్రిన్స్ క్రోప్ట్కిన్ రాసిన ‘పరస్పర సహాయం'(Mutual Aid) , ‘పొలాలు, ఫ్యాక్టరీలు, కార్ఖానాలు’  (Fields, Factories and Workshops), చదవడం మొదలు మహోన్నత ఘదర్ పార్టీ స్థాపకుడైన లాలా హర్ దయాళ్ వంటి యోధుడితో స్వయంగా పని చేయడం దరిశి చెంచయ్య గారి జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపాయి. అందుకే తీవ్ర విప్లవోద్యమ నిర్మాణం నుండి స్వాతం త్ర్యోద్యమ పోరాటం వరకూ, మితవాద సంఘసేవ మొదలు అతివాద వామపక్ష రాజకీయ కార్యాచరణ దాకా ఆనాడు సమాజానికి మంచివని అనిపించిన ప్రతీ మార్గంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. నాకు తెలిసీ తెలుగు సాహిత్యంలో అరాజకత్వాన్ని సైద్ధాంతికంగా అధ్యయనం చేసిన మొట్టమొదటి వ్యక్తీ, అరాజకవాద విప్లవ రాజకీయాల్లో అంతర్జాతీయ స్థాయి నాయ కులతో భుజం భుజం కలిపి పని చేసిన ఏకైక తెలుగు వ్యక్తీ చంచయ్య గారే!

Also read: ప్రాచీన భారతీయ చరిత్ర, సంస్కృతి, చింతన

“తుపాకులకు గుండె చూపించి ‘కాల్చండిరా’ అని గర్జించిన టంగుటూరి ప్రకాశం పంతులు మనకు ‘ఆంధ్రకేసరి’ అయ్యాడు. చీరాలలో అద్వితీయమైన పేరాల ప్రజా ఉద్యమాన్ని నడిపిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మనకు ‘ఆంధ్రరత్న’ అయ్యాడు. కాని జాతీయ స్థాయిలో దేశ స్వాతంత్ర్యానికై తుపాకులకు ఎదురు నడిచి, తెల్లవాడి జైళ్లలో అష్టకష్టాలు పడి మరణం అంచులకు వెళ్ళి వచ్చి, మళ్ళీ జీవితమంతా సమాజ సేవకే అంకితం చేసిన మరో తెలుగు తేజాన్ని మనం విస్మరించాం..” అంటూ ‘మనం మరచిన మహనీయుడు దరిశి చెంచయ్య’ పేరిట ముందుమాట రాసిన అన్న, నల్లూరి వెంకటేశ్వర్లు గారు, “50వేల మంది జీవితాలకు ఆధారమైన బీడీ, చుట్ట పరిశ్రమలో కార్మికులకు యూనియన్ పెట్టాడు చెంచయ్య. 1500 కార్మికులు పనిచేస్తున్న మద్రాసు సింప్సన్ కంపెనీ కార్మిక సంఘానికి అధ్యక్షు డయ్యాడు. 1200 మంది కార్మికులు ఉన్న స్పెన్సర్ కంపెనీ కార్మికులతో 3 నెలలు సమ్మె చేయించాడు. మద్రాసు కార్పోరేషన్ లో పదివేల మంది కార్మికులని సంఘటితం చేసి యూనియన్ పెట్టాడు. అమానుషమైన, హేయమైన పాకీ పని చేసే వారికి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సంఘం పెట్టినవాడు చెంచయ్య” అంటారు!

Also read: సమానత్వమే సైన్సు ఉద్యమ లక్ష్యం!

ఇంతటి అపురూపమైన ఆత్మకథని జయంతి పబ్లికేషన్స్ తర్వాత తెలుగులో ఐదవ ముద్రణ గా బొమ్నిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్, గుంటూరు వారు ముద్రించి తక్కువ ధరకే పంపిణీ చేసి కూడా మూడేళ్ళవుతోంది. అద్వితీయమైన ఈ పుస్తకానికి ఈ ఏడాది  70వ జయంతి. జాతి ఉన్నతికి తోడ్పడిన మనుషుల ఆలోచనలకి ప్రతిబింబాలే మహోన్నతమైన ఇటువంటి అక్షరాలు. వాటిని స్మరించుకోవడం వ్యవస్థ నిర్లిప్తతని నిష్కర్షగా ఖండించే మహనీయుల కార్యాచరణని గౌరవించు కోవడమే. ఇంతటి అపురూపమైన ఆత్మకథని చదవడం, వీలైనంతలో చర్చించడం ఉత్తమ పౌర సమాజం కొరకు చేసే ప్రయత్నాల్లో ఒక విశిష్టమైన భాగం. అందుకే 1952 లో మొదటి ముద్రణనొందిన ఈ గ్రంథానికి పీఠిక రాసిన నార్ల వారు దీనిని, “సర్వోత్కృష్ట” మైన స్వీయచరిత్ర అనే కితాబునిచ్చారు. అటువంటి మహా గ్రంథాన్ని మరోసారి కనీసం వారి కార్యకర్తల వరకైనా తీసికెళ్ళే పనిని విభేదాలకతీతంగా అన్ని ప్రజాసంఘాలు, ప్రగతిశీల కూటములు చేయలని కోరుకుంటూ ముగిస్తున్నాను!

Also read: ఆయన పేరలింగం కాదు, ప్రేరణ లింగం

గౌరవ్

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles