Thursday, April 25, 2024

లేని అధికారాలను వినియోగించి నదులు స్వాధీనం చేసుకుంటున్న కేంద్రం

కృష్ణా జలాలు – 7

  • నదీ జలాలలో వాటా తేల్చమంటే నదులనే స్వాధీనం చేసుకుంటోంది
  • కోట్లు ఖర్చుచేసి రాష్ట్రాల నిర్మించుకున్న ప్రాజెక్టులను కేంద్రం హస్తగతం చేసుకుంటోంది

నదులనూ, వాటిపైన ఉన్న ప్రాజెక్టులనూ కేంద్రం స్వాధీనం చేసుకోవడానికి కారణం రాష్ట్రాన్ని విభజించినప్పుడు తెచ్చిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఇచ్చిన అధికారమేనని బుకాయిస్తున్నారు.

నదీ జలాల నిర్వహణ మండళ్ళను (రివర్ మేనేజ్ మెంట్ బోర్డులు) నియమించే అధికారాన్ని చట్టం (పార్లమెంటు) కేంద్రానికి ఇచ్చింది. ఆ బోర్డుల పరిధులు నిర్ణయించే అధికారం, బాధ్యత కూడా కేంద్రానిదే. గోదావరి, కృష్ణా నదీజలాల నిర్వహణనూ, నదీజలాల నిర్వహణ బోర్డుల  కార్యకలాపాలనూ నియంత్రించేదుకు ఒక ఉన్నత స్థాయి సంస్థ (ఎపెక్స్ బాడీ)ని నియమించే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ఇచ్చింది. ఈ ఎపెక్స్ సంస్థకు నీటిపారుదల మంత్రి అధ్యక్షుడుగా ఉంటారు. అందులో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ సభ్యులుగా ఉంటారు. వివాదాలను సామరస్యంగా పరిష్కరించే బాధ్యతను ఎపెక్స్ సంస్థకు అప్పగించారు.

Also read: జలవివాదానికి ఉత్తమ పరిష్కారమార్గం సూచించిన ప్రధాన న్యాయమూర్తి

సబ్ సెక్షన్ 3 ఇలా చెబుతోంది: 1. గోదావరి నదీ నిర్వహణ మండలి, కృష్ణా నదీ నిర్వహణ మండలి (రివర్ మేనేజ్ మెంట్ బోర్డుల) పనులను పర్యవేక్షించడం. 2. రెండు నదులపైన ఏమైనా కొత్త ప్రాజెక్టులు నిర్మించాలని ప్రతిపాదిస్తే ఆ ప్రతిపాదనలను నదుల నిర్వహణ మండళ్ళకూ, కేంద్ర జలమండలికీ నివేదించి, వాటి ఆమోదం పొందిన తర్వాత తన ఆమోదం తెలియజేయడం. 3. విభజిత రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి సంబంధించి ఏమైనా వివాదాలు తలెత్తితే వాటిని సమాలోచనలూ, సంప్రతింపుల ద్వారా సామరస్యంగా పరిష్కరించడం. 4. కృష్ణాజలాల వివాదాల ట్రిబ్యూనల్ పరిధిలోకి రాని వివాదాలు ఏమైనా ఉంటే వాటిని అంతర్ రాష్ట్ర జల వివాదాల చట్టం 1956 (33 ఆఫ్ 1956) కింద ఏర్పాటు చేసే ట్రిబ్యూనల్  కు నివేదించడం.

Also read: విభజన రాజ్యాంగపరమైన అవసరం

ఇదీ 2014 ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం గురించిన అవగాహన అయితే, రెండు నదులనూ, వాటిపైన ప్రాజెక్టులనూ కేంద్రం ఎట్లా స్వాధీనం చేసుకుంటుంది? వాటి నిర్వహణకు అయ్యే ఖర్చును రాష్ట్రాలు భరించాలని ఎట్లా అంటుంది? 2014 చట్టం ద్వారా పార్లమెంటు ఇచ్చిన నిర్ణయానికి ఇది పూర్తి విరుద్ధం. విచిత్రం ఏమంటే తనకు 2014 చట్టంలోని 84వ సెక్షన్ ఇచ్చిన అధికారాలను అనుసరించే ఈ రెండు నోటిఫికేషన్లనూ జారీ చేశానని కేంద్ర ప్రభుత్వం బుకాయిస్తున్నది.

Also read: నదుల నిర్వాహక మండళ్ళ నిర్వాకం

మండళ్ళను 2014లోనే ఏర్పాటు చేశారు

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 85వ సెక్షన్ ను అనుసరించి 2014లోనే నదీజలాల నిర్వహణ మండళ్ళను ఏర్పాటు చేశారు. ఈ మండళ్ళకు కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి లేదా సంయుక్త కార్యదర్శి హోదాలో పని చేసే అధికారి అధ్యక్షత వహిస్తారు. ఆ అధికారిని కేంద్రం నియమిస్తుంది. ఈ మండలిలో రెండురాష్ట్రాలూ నియమించే ఇద్దరు సభ్యులూ కాకుండా కేంద్రం నియమించే ప్రవీణుడు ఉంటారు. ఈ బోర్డులో సభ్యుడిగా ఉంటూ  బోర్డు కార్యదర్శిగా పనిచేసే అధికారి చీఫ్ ఇంజనీర్ హోదా కలిగిన వ్యక్తి ఉంటారు. అతడిని లేదా ఆమెను కేంద్రమే నియమిస్తుంది. ప్రాజెక్టుల నుంచి నీటి సరఫరాను క్రమబద్దీకరించడం, అవార్డులను అమలు చేయడం బోర్డుల బాధ్యత. కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి వచ్చే ప్రతిపాదనలను పరిశీలించి వాటిపైన అభిప్రాయం తెలియజేయాలి.

Also read: నదులను కాజేయడం రాజ్యాంగబద్ధమా?

బోర్డుల పరిధి గురించి చట్టంలోని 87వ సెక్షన్ ప్రస్తావిస్తుంది. గోదావరి, కృష్ణా నదులపైన హెడ్ వర్క్స్ (బరాజ్ లు, డామ్ లు, జలాశయాలు, నీటిని క్రమబద్ధీకరించే నిర్మాణాలు వగైరా)కు సంబంధించిన అంశాలన్నీ, కాల్వల పనులన్నీ, రాష్ట్రాలకు నీరు లేదా విద్యచ్ఛక్తి సరఫరా లైన్స్ కు సంబంధించిన పనులన్నీ బోర్డుల పరిధిలోకి వస్తాయి. ఈ పనులన్నింటినీ కేంద్రం నియమించే ట్రిబ్యూనళ్ళు ఇచ్చే అవార్డులకు అనుగుణంగా చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయాలు ప్రకటిస్తే అప్పుడు ఆ నిర్ణయాలను విధిగా అమలు చేయాలి.  2014 చట్టంలో చెప్పిన అధికారాలూ, బాధ్యతలూ ఇవే.

కేంద్రానికి  స్వీయసార్వభౌమత్వాన్ని అప్పగించిన ఆంధ్రప్రదేశ్

ఈ బోర్డుల పరిధులను నిర్ణయించాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి 2020లో వచ్చింది. అంటే బోర్డులను నెలకొల్పిన తర్వాత ఆరేళ్ళకు ఈ ఆలోచన వచ్చింది. నదులను స్వాధీనం చేసుకుంటూ నోటిఫికేషన్లను కేంద్రం 15 జులై 2021న జారీ చేసింది. పరిధులను నిర్ణయించడం అంటే రెండు నదులూ ఏ రాష్ట్రాల నుంచి ప్రవహిస్తున్నాయో ఆ రాష్ట్రాలకు ఆ నదులపైన అధికారం బొత్తిగా లేకుండా సర్వహక్కులనూ కేంద్రం తన ఖాతాలో దఖలు పరచుకోవాలని కాదు. ప్రతికూలమైన ఈ స్వాధీనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాగతించడం దిగ్భ్రాంతికరమైన విషయం. దిల్లీ చక్రవర్త పాదకమలాల దగ్గర తమ సార్వభౌమత్వాన్ని సమర్పించుకోవడమే అవుతుంది. కొత్త రాష్ట్రం ఏర్పడి నదీజలాల వాటాలను పున:పరిశీలించి, తన వాటా తనకు  కేటాయించాలని అడుగుతున్నప్పటికీ నీటి వాటాను పునర్విభజన చేయకుండా నదులను స్వాధీనం చేసుకోవడం ఏమిటని తెలంగాణ రాష్ట్రం కేంద్రాన్ని ప్రశ్నించింది.

Also read: అంతర్ రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం నిష్ఫలం

మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు నదీజలాల బిల్లులను ప్రవేశపెట్టింది. ఈ బిల్లులు చట్టాలైతే రాష్ట్రాల అధికారాలు హరించుకొని పోతాయి. బాబులు (ప్రభుత్వాధికారులు) నిర్వాహకులూ, యజమానులూ అయిపోతారు. వివాదాలను సామరస్యంగా పరిష్కరించడం, నదీజలాలను శుద్ధి చేయడం, నదులను పునరుద్ధరించడం, నదీజాలలను పరిరక్షించడం వంటి బాధ్యతలు ఏవీ వారికి ఉండవు. రాష్ట్రాలు పెద్ద మొత్తాలను ఖర్చు చేసి నిర్మించుకున్న ప్రాజెక్టులు రాష్ట్రాల అధీనంలో ఉండవలసిన ఆస్తులు. వాటిని కేంద్రం ఎట్లా స్వాధీనం చేసుకుంటుంది? రెండు లేదా మూడు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తితే వాటిని సామరస్యంగా పరిష్కరించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. రాజ్యాంగం అప్పగించిన ఈ బాధ్యత నుంచి తప్పించుకొని రాష్ట్రాల సార్వభౌమత్వాన్నీ, స్వీయనిర్ణయాధికారాలనూ కాలరాసి నదులను సొంతం చేసుకోవడం కుదరదు.

ఇప్పుడు నదులను స్వాధీనం చేసుకోవడంతో ఇది సంపూర్ణంగా రాజకీయ సమస్యగా మారింది. వచ్చే ఎన్నికలలో బీజేపీ విజయావకాశాలను పెంచే పక్షంలోనే ఏదైనా నిర్ణయాన్ని ఎన్ డీ ఏ సర్కార్ తీసుకుంటుంది. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్లను తెలంగాణ ప్రభుత్వం లాంఛనప్రాయంగా వ్యతిరేకించింది. నదీ జలాలలో తన వాటా కోసం, రాజ్యాంగం ఇచ్చిన స్వయంనిర్ణయాధికారాలను కాపాడుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా పోరాడుతుందో తెలియదు.

Also read: రాష్ట్రాల నుంచి నదులను కేంద్రం దోచుకోవచ్చునా?   

(సమాప్తం)

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles