Saturday, April 27, 2024

రామునికి సుగ్రీవుని పాదాభివందనం

రామాయణమ్ 113

‘‘ఓ వానరరాజా, నీవంటి వాడు మిత్రుడుగా లభించుట మా అదృష్టము. మా అన్నగారు, నీవు తప్ప సామర్ధ్యముండి కూడా తప్పిదము గ్రహించి ఈ విధముగా మాటలాడు వారు మరేవ్వరునూ లేరు.

‘‘ఓ రాజా, నీవు రామునకు తగిన వాడవు.  నీవు వచ్చి రాముని ఓదార్చుము. ఓ మిత్రుడా, భార్యా వియోగ శోకముతో రాముడు పడుతున్న బాధ చూడలేక నిన్ను పరుషముగా దూషించితిని. నన్ను క్షమింపుము’’ అని లక్ష్మణుడు సుగ్రీవునితో పలికెను.

Also read: లక్ష్మణుడిని శాంతబరచిన తార

 లక్ష్మణుని స్నేహపూర్వకమైన ఈ పలుకులు ఆయనలో ఉత్సాహాన్ని నింపాయి.

మొదట వెళ్ళిన వారిని తొందర పెట్టి వానర సేన శీఘ్రముగా కిష్కింధకు చేరునటుల వెనువెంటనే మరల ఇంకొందరు వానరులను పంపమని హనుమంతునకు ఆజ్ఞ ఇచ్చినాడు సుగ్రీవుడు.

పదిదినములలో రాని వారికి మరణ దండనే.

Also read: సుగ్రీవుడిని హడలెత్తించిన లక్ష్మణ ధనుష్టంకారం

సుగ్రీవుని ఆజ్ఞకు భయపడి కోటానుకోట్ల మంది వానరులు కిష్కింధకు తరలి వచ్చినారు.

కాటుకవలె నల్లని దేహ కాంతి కలిగిన వానరులు  మూడు కోట్లు.

శుద్ధమైన బంగరురంగు గల వానరులు పది కోట్లు.

సింహపు జూలువంటి కాంతి కలిగినవానరులు అనేక కోట్లు.

హిమాలయములు,వింధ్య పర్వతముల మీద నివసించు వానరులు భయంకరాకారులు  వేయి కోట్లు.

క్షీర సముద్రమున నివసించువారు, తమాల వనమందు నివసించు వారు, వనములనుండి, గుహలనుండి, నదీ ప్రాంతాలనుండి లెక్కకు మిక్కిలిగా వానరులు తరలి వచ్చిరి.

Also read: రామసందేశంతో సుగ్రీవుడి దగ్గరికి బయలుదేరిన రామానుజుడు

ఆ వానరులు వచ్చునప్పుడు చిత్ర విచిత్ర ఫలములను కందమూలములను సుగ్రీవునకు కానుకలుగా తెచ్చారు. అవి ఒక్కటి భుజించినఎడల ఒక నెల రోజులు ఆకలి దప్పులు ఉండవు!

ఇంకా తరలి వస్తూనే ఉన్నారు

 ఇప్పటికి వచ్చిన వానరులు  బహు తక్కువ మాత్రమే.

వచ్చిన వారందరినీ విశ్రాంతి తీసుకొమ్మని చెప్పి లక్ష్మణునితో కూడి పల్లకి ఎక్కి శ్రీరాముడు నివసిస్తున్న పర్వత ప్రాంతానికి బయలుదేరాడు సుగ్రీవుడు.

……

రాముని వద్దకు చేరి సుగ్రీవుడు దోసిలి యొగ్గి నిలుచుండగా తమ ప్రభువును ఆ విధముగా చూసిన వానరులందరూ ఎంతో భయముతో తాము కూడా దోసిలి యొగ్గి వినమ్రులై నిలుచున్నారు.

Also read: సుగ్రీవునికి హనుమ మేల్కొలుపు

అంతలో సుగ్రీవుడు రాముని పాదములపైబడి నమస్కరించినాడు.

ఆయనను రాముడు లేవదీసి ప్రేమపూర్వకముగా కౌగలించుకొని  తన ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను.

సుగ్రీవునితో కొంతసేపు రాజధర్మములు ముచ్చటించిన పిదప, ‘‘మిత్రమా, మన ప్రయత్నములు ఆరంభించవలసిన సమయము వచ్చినది. అందుచేత నీ మంత్రులతో కూడి ఆలోచింపుము’’ అని పలికాడు రాఘవుడు .

రామా, నా ఈ రాజ్యము, నా ఈ సంపద, నా ఈ వైభవము నీ అనుగ్రహమేకదా!

భూమిమీద నివసించు మహా బలశాలురైన వానరులకు కబురు పెట్టినాను.

నా ఆజ్ఞ మేరకు భయంకరాకారులైన భల్లూక వీరులు, శూరులైన గోలాంగూలములు, స్వేచ్చారూప ధారులు, మహావీరులునైన వానరులు

తమతమ సైన్యములతో వచ్చుచున్నారు. మార్గమధ్యమునందు ఉన్నారు.

రామా, వందలు వేలు లక్షలు కోట్లు శ౦కువు, అర్బుదము, అర్బుదశతము, మధ్య, అంత్య, సముద్రము, పరార్ధముగా వానరులు ఉప్పెనగా తరలి వస్తున్నారు.

సుగ్రీవుని ఈ మాటలు వినగానే  అరవింద దళాయతాక్షుడు  విచ్చుకొన్న కన్నులు గలవాడై మెచ్చుకోలుగా సుగ్రీవుని చూసేను. నల్లని కలువలు వికసించినట్లు ఆనందముతో రాముని నేత్రములు వికసించి ఒక్కసారిగా మిలమిలమెరిశాయి.

NB

భారతీయులకు సంఖ్యలగురించి అపారమైన విజ్ఞానము రామాయణ కాలం నుంచీ ఉన్నది అనటానికి ఇక్కడ పేర్కొన్న సంఖ్యలు, వాటికి  గల పేర్లు తెలియజేస్తాయి

……

నూరువేలు లక్ష

నూరు లక్షలు కోటి

పదివేల కోట్లు ఆయతము

లక్షకోట్లు శంకువు

వెయ్యి శంకువులు అర్బుదము

పది అర్బుదములు మధ్యము

పది మధ్యములు అంత్యము

ఇరవై అంత్యములు సముద్రము

ముఫ్ఫై సముద్రములు పరార్ధము

….

ఇదీ భారతీయమ్!

Also read: వాలి దహన సంస్కారం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles