Thursday, September 19, 2024

సుగ్రీవుడిని హడలెత్తించిన లక్ష్మణ ధనుష్టంకారం

రామాయణమ్ 111

వేగముగా పరుగులిడుతున్న గజెంద్రుడా?

బుసలు కొడుతూ కసిగా సాగుతున్న శేషేంద్రుడా!

 ప్రళయకాల ప్రభంజనమై సాగుతున్నది ఎవరు?

ఆతడు రామానుజుడు!

అన్నగారి వ్యధ మనసులోకి పదేపదే గుర్తుకువస్తున్నది!

Also read: రామసందేశంతో సుగ్రీవుడి దగ్గరికి బయలుదేరిన రామానుజుడు

 క్షణ క్షణానికి నడకలో వేగము హెచ్చుతున్నది.

కోపముతో పెదవులు వణుకుతున్నాయి లక్ష్మణునికి.

కిష్కింధను సమీపించిన క్రోధమూర్తి లక్ష్మణుడు ఆ నగరము వెలుపల మహాకాయులైన వానరులను చూశాడు.

ఉగ్రస్వరూపముతో వేగముగా లోనికి వస్తున్న లక్ష్మణుని చూసి ఆ వానరులు పెద్దపెద్ద పర్వతములను వృక్షములను పెళ్ళగించి చేతులలో ధరించారు. అది చూడగానే అగ్నిలో ఆజ్యము పోసినట్లయి ఆయన క్రోధము రెట్టింపు అయ్యింది. ఆ ప్రళయభయంకర తేజోమూర్తి రూపము చూసినంతనే వానరుల గుండెలు గతుక్కుమని తలో దిక్కుకూ పారిపోయారు.

కొందరు వానరులు వడివడిగా పరుగులుపెడుతూ లక్ష్మణుని ఆగమన వార్తను సుగ్రీవునకు నివేదించినారు.

ఆ సమయములో…

తారా గాఢ పరిష్వంగము అనే మరో లోకములో ఉన్నాడు సుగ్రీవుడు! వానరుల మాటలు ఆయన చెవికి ఎక్కలేదు.

అప్పుడు కొందరు మంత్రులు చేతిలో ఆయుధములు ధరించిన మహాయోధులైన వానరులతో కలసి లక్ష్మణుడున్న చోటికి వచ్చారు .వారిలో అంగదుడు కూడా ఉన్నాడు.

Also read: సుగ్రీవునికి హనుమ మేల్కొలుపు

సుగ్రీవుడు కనపడలేదు. పైగా సైనికులు వచ్చి  నిలుచున్నారు ఆయన ఎదురుగా. కోపము తారాస్థాయికి చేరుకున్నది. ఎర్రనైన ముఖముతో రక్తాంతలోచనుడై చేతిలో ధనుస్సుతో బుసలు కొడుతూన్న అయిదు పడగల పామువలె ఉన్నాడు సుమిత్రా నందనుడు.

అక్కడ కనపడ్డ అంగదుని చూసి, ‘‘అంగదా, వెళ్లి నీ పినతండ్రికి చెప్పు. రాముని సోదరుడైన లక్ష్మణుడు వచ్చి నీ భవన ద్వారము ముందు వేచి ఉన్నాడని.’’

అంత అంగదుడు పినతండ్రికి భయముభయముగా ఈ కబురు చేరవేసినాడు. అప్పుడే మేఘగర్జన వలె గంభీరముగా ఉండి గుండెలు చెదరగొట్టే ధ్వనితో ఒక ధనుష్టంకారము వినపడినది కిష్కింధావాసులకు.

Also read: వాలి దహన సంస్కారం

అది లక్ష్మణ ధనుష్టంకారము!

ఒక్క ఉదుటున ఆసనమునుండి భయపడి లేచాడు సుగ్రీవుడు.

మనస్సులో కంగారుపడుతూ తన ప్రక్కన ఉన్న తారతో, ‘‘తారా లక్ష్మణునకు కోపకారణము ఏమై ఉండునో నీవు ఊహించగలవా అని అడిగాడు.

Also read: శోక వివశులైన తార, సుగ్రీవుడు

నయనమనోజ్ఞతార

రాశీ భూత సౌందర్య  సితార!

ఆ తార!

సోలిన కన్నులతో

వాలిన నడుముతో

రేగిన జుట్టుతో

మధుపానము వలన తడబడుతున్న అడుగులతో  లక్ష్మణుని సమీపించింది.

అంతకుముందు సుగ్రీవుడు ఆమెను వేడుకున్నాడు నీవే ఎదో విధముగా రాముని తమ్ముని ప్రసన్నుడిని చేసుకొమ్మని.

దశదిసలూ పరికిస్తూ నిప్పులు చిమ్ముతున్న  లక్ష్మణుని కన్నులు తారను చూడగానే భూమికి వాలి పోయినవి.

ఆవిడను  చూడగానే కోపము కాస్త తమాయించుకొని ఉదాసీనత వహించి స్త్రీ కావున తలవంచుకొన్నాడు.

లక్ష్మణుని దృష్టి ప్రసన్నత నొందుటను గమనించిన తార ఆ అవకాశమును జారవిడుచుకోలేదు.

మద్యము సేవించియుండుట చేత సంకోచము లేకుండా బ్రతిమిలాడు ధోరణిలో మాట్లాడ సాగింది.

 ఓ రాజకుమారా!

నీ కోపమునకు కారణము ఏమి?

నీ ఆజ్ఞను పాటించని వాడు ఎవ్వడు?

పూర్తిగా ఎండిన కట్టెలతో నిండిన అడవిని దహించివేసే దావానలమును సమీపించ సాహసించిన వాడు ఎవ్వడు?

ఇలా బ్రతిమిలాడుతూ అడిగిన ఆమె మాటలకు లక్ష్మణుడు ఇలా అన్నాడు!

Also read: తార ఆక్రందన, సుగ్రీవునికి వాలి విజ్ఞాపన

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles