Sunday, April 28, 2024

‘న్యూట్రల్’ ఓటరు కీలకం కానున్న 2024 ఎన్నికలు

జాన్ సన్ చోరగుడి  

రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లకు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పార్టీల ఎన్నికల రాజకీయాల దృష్టి నుంచి కాకుండా,’పొలిటికల్ సైన్స్’ దృష్టి నుంచి చూసే ప్రయత్నమే ఈ వ్యాసం

క్కడైనా ‘మ్యాప్’ అనేది నదులు, పర్వతాలు, వంటి భౌతిక అంశాలను చూపుతూ ఎలా ఉంటుందో, అలాగే- ‘పొలిటికల్ మ్యాప్’ కూడా ప్రతి దేశానికీ, రాష్ట్రాలకు ఉంటుంది. అలా పదేళ్ల క్రితం 2 జూన్ 2014న- ‘ఎపి పొలిటికల్ మ్యాప్’ మీద గీసిన విభజన రేఖతో రాష్ట్రం రెండు అయింది. ఇప్పుడు ఆ గీత లోపల జరిగే రాజకీయాలు వాటి స్వభావం ఎలా ఉంది? ‘పొలిటికల్ సైన్స్’ లో ఉండే ‘థియరీ’ల్లో ఈ రాజకీయాలు ఎంత మేర ఇముడుతున్నాయి? ఈ ప్రాథమిక పరిశీలనకు పదేళ్ల కాలం అంటే, అది సరిపడినంత వ్యవధి అవుతుంది. 

Also read: కొన్నాళ్ళు ‘చిత్రం’ ఇలా అస్పష్టంగానే ఉంటుంది…  

‘సెట్టింగ్’   

వందేళ్లు పైబడిన కాంగ్రెస్, ఎనభై దశకం మొదట్లో (1982) పుట్టిన టిడిపి, ‘మిలీనియం’ (2000) మొదలైన పదేళ్ల తర్వాత 2011లో పుట్టిన వైఎస్.ఆర్.సి.పి. ఈ మూడు రాజకీయ పార్టీలు- ‘స్టేక్ హోల్డర్స్’గా 2014 తర్వాత విభజిత ఎపి రాజకీయాలు మొదలయ్యాయి.

వీటిలో- ‘అప్డేట్’ కావడం అంటే ఏమిటో తెలియని ప్రాంతీయ పార్టీ- ‘టిడిపి’కి నలభై ఏళ్ళు వయస్సు అంటే, అది వృద్ధాప్యం క్రింద లెక్క. అందుకే అది ‘జనసేన’ అనే ఊతకర్ర ఆసరాను 2014 నుంచి శాశ్వతంగా వినియోగించుకుంటూ ఉంది.

అదక్కడ ఆగలేదు. బీజేపీ వంటి జాతీయ రాజకీయ పార్టీ ఆసరా తీసుకుని కొన్నిసార్లు; ‘మళ్ళీ తీసుకుంటా…’ అని మరి కొన్నిసార్లు, ఇలా అధికారంలో ఉన్నా లేకున్నా ఇటువంటి ‘సపోర్టింగ్ సిస్టం’తో అది రోజులు నెట్టుకొస్తున్నది.  

అయితే 1989లో ఎన్టీఆర్ పై కాంగ్రెస్ గెలిచాక, 1994 ఎన్నికల తర్వాత మళ్ళీ అది తిరిగి పైకి లేవలేకపోయింది. కానీ డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి- ‘సోషల్ ఇంజనీరింగ్’తో 2004లో అది పునర్జీవం పొంది, ఇక్కడ గెలిచి కేంద్రంలో వరసగా రెండుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కారణం అయింది.

Also read: ‘వైఎస్’ పిల్లల రాజకీయాలతో మనకేంటి మేలు?

అయితే డా. రాజశేఖర రెడ్డి మరణానంతరం, కాంగ్రెస్ నుంచి విడిపోయిన జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో- ‘వైఎస్సార్ కాంగ్రెస్’ పేరుతో 2011లో మరో ప్రాంతీయ పార్టీ ఏర్పడింది. ఆవిర్భావం నుంచి అది కేంద్ర రాష్ట్ర రాజకీయాలపై బలమైన ముద్ర వేయగలిగింది.  

చురుకైన ‘ప్లేయర్స్’

ఇటువంటి ‘పొలిటికల్ సెట్టింగ్’లో ఇక్కడ చురుకైన ‘ప్లేయర్స్’గా- జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ‘ఎరీనా’లో కనిపిస్తుంటే, 2024 జనవరి మూడవ వారం నాటికి వైఎస్ కుమార్తె షర్మిల రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చి, అదనంగా ఆమె నాలుగవ పోటీదారు అయ్యారు.

అయితే, ‘పవర్ పాలిటిక్స్’ అన్నిసార్లు- ‘పొలిటికల్ థియరీ’ల ప్రకారం ఉండాలనే రూలు ఏమీ ఉండదు. కానీ ‘థియరీ’ ఉన్న ప్రతిచోటా దాని ‘అప్లికేషన్’ లేదా అన్వయానికి కొన్ని- ‘టూల్స్’ విధిగా ఉంటాయి. కొంచెం శ్రద్దగా గమనిస్తూ ఉంటే, ‘పవర్ పాలిటిక్స్’లో ఎవరు ఎటువంటి ‘టూల్స్’ను వాడుతున్నారు అనేది మనకు కూడా తెలుస్తూనే ఉంటుంది.

కాకపోతే, మనం దాన్ని ఇంతగా శాస్త్రీయంగా చూడం. దాని గురించి మాట్లాడం. ఇప్పుడైనా ఎందుకు ఇది అంటే, రాష్ట్రం విడిపోయాక- ‘ఎరీనా’ చిన్నదై, పోటీపడుతున్న ‘ప్లేయర్స్’ ఎక్కువమంది అయినప్పుడు- ఎవరు ఎటు, ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారు వంటివి అర్ధం చేసుకోవడానికి సూక్ష్మపరిశీలన తప్పదు.

 ‘టూల్స్’ ఎంపిక…

ఈ విషయంలో జాతీయ స్థాయి విజేతగా డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి నిలుస్తారు. ఆయనది- ‘ఆల్ టైం రికార్డ్’ ఎందుకంటే, అప్పటికి పదేళ్ల క్రితం 1991లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో దేశంలో ఆర్ధిక సంస్కరణలు అమలు మొదలయ్యాక, 1995లో సీఎం అయిన చంద్రబాబు విచక్షణా రహితంగా వాటిని అమలు చేశారు.

పర్యవసానంగా జరిగిన అలిపిరి ఘటన తర్వాత, సానుభూతి ఉంటుందని ఆయన ముందస్తు ఎన్నికలకు వెళితే, ఫలితం ఆశించిన దానికి భిన్నంగా వచ్చింది. 

‘ఆప్షన్స్’ ఉంటాయి

సీఎం గా తన ‘పవర్ ఎంట్రీ’ వైనం మర్చిపోయేట్టుగా చేయడానికి కొత్త ‘టూల్’ దొరికింది కదా అని చంద్రబాబు ‘టెంప్ట్’ అయ్యి, వెనుకా ముందు చూసుకోకుండా ‘ఆర్ధిక సంస్కరణల’ను పట్టుకుని ‘ఆ విధంగా ముందుకు పోతున్నాం…’ అన్నాడు.

నిజానికి ఈ ‘టూల్స్’ ఎంపికకు మనకు ‘ఆప్షన్స్’ ఉంటాయి. ఏదో ఒక్కటే కాదు, ఒకేసారి రెండు మూడు ఎంచుకుని వాటి- ‘మిక్స్’తో మనమే మరొక క్రొత్తదాన్ని కూడా  ‘డిజైన్’ చేసుకోవచ్చు. అప్పట్లో వైఎస్సార్ అదే పనిచేశారు.

అందుకే దేశంలో ఆర్ధిక సంస్కరణలు అమలు మొదలైన కాలంలో పివి కేబినెట్లో ఆర్ధిక మంత్రిగా పనిచేసిన డా. మన్మోహన్ సింగ్, ఆ తర్వాత కాలంలో ప్రధాన మంత్రిగా వైఎస్సార్ పరిపాలనా శైలిని- ‘రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్’ అంటూ దానికి ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు.

జగన్స్ ఛాయిస్

భారత ప్రభుత్వం కోసం పనిచేస్తున్న- ‘నీతి ఆయోగ్’ రాష్ట్రాల పనితీరు సమీక్ష కొరకు-  ‘Cooperative and Competitive Federalism’ విధానాన్ని అనుసరిస్తున్నది. ఆ విధానం ప్రాతిపదికగా అది- Sustainable Development Goals సాధనలో ముందున్న రాష్ట్రాలకు ‘ర్యాంకులు’ ప్రకటిస్తున్నది.

నిరుపేద మహిళను పలకరిస్తున్న జగన్ మోహన్ రెడ్డి

తన పార్టీ అధికారంలోకి వస్తే ఎంపిక చేసుకోవలసిన- ‘టూల్స్’ విషయంలో ముందుగానే మేల్కొన్న జగన్ మోహన్ రెడ్డి నాన్న సంక్షేమ పరిపాలనా శైలిని- ‘హైబ్రిడ్ మోడల్’ చేసి, మొదటి ‘టర్మ్’లోనే దేశం దృష్టిని ఆకర్షించాడు. ఆయన ఇటువంటి పద్దతి ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

రాజకీయాల్లో మొదటి నుంచి ఏదో ఒక ‘డ్రైవ్’తో నెట్టుకెళ్ళడం మాత్రమే తెలిసిన చంద్రబాబుకు జగన్ సిఎం అయ్యాక, ప్రభుత్వంలో ఏమి జరుగుతున్నది మొదట్లో అర్ధం కాలేదు. చివరికి ఆయన మేలుకునే సరికి, అప్పటికే ఆలస్యం అయిపోయింది.  ఇప్పటికీ తన- ‘పొలిటికల్ పాలసీ’ ఇది అని ఆయన చెప్పలేకపోతున్నాడు.

కనుక ఇప్పుడు ఎన్నికలకు ప్రజల వద్దకు వెళ్ళడానికి కొత్తగా ‘టూల్స్’ ఏమీ ఆ పార్టీ వద్ద లేవు. దాంతో ఏవేవో ప్రత్యామ్నాయాలు ఆయన వెతుక్కుంటున్నాడు. తమకంటూ ఒక ‘పబ్లిక్ పాలసీ’ లేకుండా ఇంతకాలం రాజకీయాల్లో నెట్టుకొస్తున్న ‘పొలిటీషియన్’గా ఈయనది దేశంలో ఒక అరుదైన ‘రికార్డు’ అవుతుంది.

ఇక ‘జనసేన’ విషయంలో అది పెద్దగా ‘సీరియస్’ పొలిటికల్ పార్టీ కాదు కనుక, దానికి ఇటువంటి ‘పబ్లిక్ పాలసీ’ ఏమిటి? అనే బాదరబందీ లేదు. 

పనికి రాలేదు 

రాజకీయాల్లో ‘థియరీ’ వేరు ‘పొలిటికల్ టూల్స్’ వేరు అనే సూత్రం వద్ద మరింత స్పష్టత కోసం ఈ తెలంగాణ ప్రస్తావన. 2014లో అక్కడ కేసీఆర్ ఇక్కడ బాబు ఇద్దరూ ఒకేసారి పని మొదలుపెట్టారు. అయితే, అప్పటికి కేసీఆర్ ది ప్రత్యేకమైన ‘స్టేటస్’. ఉద్యమించి తెలంగాణ సాధించిన నేపథ్యంతో ఆయన సీఎం కుర్చీ పై కూర్చోవడంతో, మొదటి ‘టర్మ్’లో పెద్దగా ‘టూల్స్’ వెతుకులాట అవసరం అక్కడ లేకపోయింది.

అయితే ఎపి పరిస్థితి వేరు. 2014 జూన్ లో చంద్రబాబు గెలుపు, ఏడాదికే అది నైతిక ఓటమిగా ముగిసింది. దాంతో ఆయన పదేళ్ల ఉమ్మడి రాజధాని హక్కును వదిలి బెజవాడ వచ్చి బస్సు నుంచి ఆఫీస్ నడపాల్సి వచ్చింది.

Also read: ఢిల్లీకి ఇక్కడ ఐదేళ్ళలో అమిరిన ‘సెట్టింగ్’ ఇది…

అలా ఆయనకు ‘అమరావతి’ రాజధాని అంశం పైకి చెప్పడానికి- ‘పొలిటికల్ టూల్’ అయింది. దానితోనే ఆయన ‘టర్మ్’ ముగిసింది. అయితే అటువంటివి ప్రజలతో నాయకుణ్ణి ‘కనెక్ట్’ చేయవు కనుక, ఆయనకు అవి పనికిరాలేదు. చిత్రం- ఇప్పటికీ ‘రాజధాని’ మినహా మరొక ‘ప్రోగ్రామ్’ ఆ పార్టీ వద్ద లేదు!  

‘స్టేక్స్’ ఏమిటి? 

ఇక ఎన్నికల ముందు వచ్చింది షర్మిల. యువ పిసిసి ప్రసిడెంట్ గా ఆమెకు ఎఐసిసి పెద్దలు ఒక ‘పొలిటికల్ లైన్’ ఇచ్చి ఆమెను ఇక్కడకు పంపివుంటే, ఇద్దరి మర్యాద మిగిలేది. అది జరగలేదు. ఈ మాట అంటుంటే ఇక్కడ ఒక పాత నానుడి గుర్తుకు వస్తున్నది. ‘పార్కులో పర్స్ పారేసుకుని మార్కెట్లో వెతికితే ఎలా?’ అని! రాష్ట్ర విభజన చేశాక, మొదటిసారి ‘పబ్లిక్’ ముందుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, ముందుగా కాంగ్రెస్ చేయాల్సింది ఏమిటి?

అది- విభజన ఎందుకు చేయాల్సి వచ్చింది మొదట మనకు చెప్పాలి కదా? మనకున్న పరపతిని మనం ఎక్కడ పారేసుకున్నామో దాన్ని- ‘అడ్రెస్’ చేయకుండా,  రానున్న ఎన్నికల కోసం ఇక్కడ ప్రజలు ఎన్నికున్న ప్రభుత్వాన్ని తప్పు పడతాను అంటే ఎలా? ఈ ఐదేళ్ల మధ్యలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల విజయాలతో ఆ పార్టీ సూక్ష్మ స్థాయికి బలంగా చేరిన వాస్తవం కాంగ్రెస్ మర్చిపోతే ఎలా?  

ఏమికావాలి?   

రెండు ‘టర్మ్’ల ‘యుపిఎ’ ప్రభుత్వంలో కాంగ్రెస్ దేశం కోసం చేసింది ఏమిటి? తెచ్చిన చట్టాలు ఎంత గొప్పవి? చివరికి దిగిపోయే ముందు దేశం భౌగోళిక అవసరాల కోసం తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు కేంద్రం ఎందుకు ఇవ్వవలసి వచ్చింది, కాంగ్రెస్ కాకుండా మరెవరు చెప్పాలి? చెప్పింది ప్రజలు సమ్మతిస్తారా లేదా అనేది తర్వాతి సంగతి.

మీరు చేసింది తప్పు అని ఇక్కడ ప్రజలు అనుకొంటున్నప్పుడు, అది సరైన రాజకీయ నిర్ణయం అని మీరు అనుకున్నప్పుడు, రేపటి తరం వ్యక్తిని ఇక్కడ పిసిసి ప్రసిడెంట్ గా పంపి, ఆమెకు ఇక్కడ ఏమి మాట్లాడాలో తెలియక సొల్లు మాట్లాడుతుంటే, వందేళ్ల పైబడిన పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పరపతి ఇక్కడ ఏమికావాలి?   

ఎన్నికల కోసం సరైన ‘టూల్’ వెతుక్కునే ముందు, 2024-29 మధ్య ఏపీలో కాంగ్రెస్ పార్టీ ‘రిలవెన్స్’ ఏమిటో షర్మిలతో ఎఐసిసి చెప్పించకపోతే, దాన్ని ఇక్కడ అందరు అనుమానిస్తున్నట్టుగా మరెవరి కోసమో పనిచేయడానికి, జగన్ మోహన్ రెడ్డి విజయ అవకాశాల్ని దెబ్బతీయడానికి జరుగుతున్న ప్రయత్నం ఇది అని స్పష్టం అవుతున్నది కదా?

భిన్నంగా

సరిగ్గా ఇక్కడే ‘ఏరినా’లో జగన్ మోహన్ రెడ్డి మిగిలిన అందరికంటే భిన్నంగా కనిపిస్తున్నాడు. అసెంబ్లీ వొదిలి బయటకు వెళ్ళాక, అందుకు ఆయన ఎంత ‘టైం’ తీసుకున్నాడో, ఎవరితో సంప్రదింపులు చేశాడోగాని, ‘టూల్స్’ ఎంపికలో ఒక స్పష్టమైన ‘లైన్’ తీసుకున్నాడు. ఫలితంగా ఎపి ప్రభుత్వం పని తీరును, ఒక్క భారత ప్రభుత్వమే కాదు, ఐక్యరాజ్య సమితి ఉపాంగం యు.ఎన్.డి.పి. కూడా మదింపు చేస్తున్నది.

దావోస్ లో యూనిసెఫ్ సదస్సుతో మిట్లాడుతున్న జగన్ మోహన్ రెడ్డి

జగన్ మోహన్ రెడ్డి మే 2022 దావోస్ పెట్టుబడుల సదస్సు సందర్భంగా ‘ఎపి’ పై జరిగిన ‘యునిసెఫ్’ ప్రతినిధుల సదస్సులో ఇక్కడ బాలల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పై జరిగిన చర్చలో, మన రాష్ట్రంలో బాలల ఆరోగ్య రంగంలో జరుగుతున్న మార్పుల్ని అంతర్జాతీయ సంస్థలు చాలా దగ్గరగా సమీక్షిస్తున్న విషయం స్పష్టమైంది. 

అయినా…

మా పార్టీకి అవకాశం ఇస్తే, భంగపడ్డ రాష్ట్రానికి మేము ఇది చేస్తాం అని జగన్ తో సహా ఎవ్వరూ చెప్పడం లేదు. గెలవడం కోసం ఓటర్లను పార్టీలు లబ్ధిదారులుగా ప్రేమించడం వరకు అర్ధం చేసుకోవచ్చు. కానీ ఈ రాష్ట్రాన్ని ప్రేమించడం గురించి జగన్ వంటి యువ నాయకులు మాట్లాడాలి. మున్ముందు అది కొత్త తరాలకు ‘కనెక్ట్’ అవ్వాలి. అప్పడే 2030 లక్ష్యాలు సాధన చేసే ‘ఫీల్ గుడ్’ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ‘న్యూట్రల్’ ఓటరు కూడా పోలింగ్ బూత్ వైపు కదులుతారు.   

Also read: ఈ ప్రభుత్వం ఆ పని పూర్తిచేసింది!

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles