Sunday, April 28, 2024

దేవయ్య మళ్ళీ పుట్టాడు!

— ఒక సనాతనుడు

గల్పిక

                   ———————————–

              దేవయ్యకు మరలా, మరో జన్మనెత్తాలని ఏమాత్రం ఉండేది కాదు. ఒక జన్మలోనే, వేయి జన్మల కష్టాలతో  కాపురం చేశాడు. జన్మలెత్తడంలో అప్పుడూ తన ప్రమేయం లేదు ఇప్పుడూ లేదు.  కేవలం స్వజన సుఖానికి, పరజన దుఃఖానికి దేవయ్య ఒక ఆలంబన కావాలని, ఒంటి కాలి మీద నడిచే స్వధర్మాన్ని నాలుగు కాళ్ల మీద నడిపించాలనీ — సకల స్వజన సౌభాగ్యం కోసం — దేవయ్యను మరలా జన్మనెత్తించారు.

               ఇది యుగధర్మం కాదని కొందరు నెత్తీ, నోరూ బాదుకున్నారు. కాకాల యుగం, బాకాల యుగం,  ఆకలి యుగం అయిన ఈ కలియుగం —  ఇంకా నాలుగు లక్షల 27 వేల సంవత్సరాలు  ఉందట ! (కలియుగం మొదలై 5000 సంవత్సరాలు మాత్రమే అయిందట!) మరలా అప్పుడే సత్యయుగం ( కృతయుగం) రావడానికి వీల్లేదని,  అప్పుడే చెదలు పడుతున్న తాళపత్ర గ్రంథాలు దులిపి, అర్ధాలు తాము అనుకున్నట్లుగా రాసుకొని, తిథులు, నక్షత్ర గమనాలు గమనించి, కొంతమంది పండితులు  ఢంకాలు భజాయించి మరీ  చెప్పారు. ఆ ఢంకా శబ్దాలన్నీ  చెవిటి వాడి ముందు శంఖాలూది నట్లు అయిపోయాయి. దేవయ్యకు పునర్జన్మ నిచ్చే కార్యక్రమాన్ని నెత్తికెత్తుకున్న స్వరాజ్యమూ, సామంత రాజులూ దేశంలో — ఇలా అనుమతి లేకుండా చెడు శంఖాలూదేవారందరి దగ్గరా శంఖాలు లాక్కోమని  ఆదేశాలు పంపారు. కొందరైతే మనకెందుకు వచ్చిన గోల ఇది  అని — తమ శంఖాల్ని స్వచ్ఛందంగా రాజ్యాధికారానికి దానం చేసేశారు.

                    ఎంత చేసినా కృతయుగం మరలా అప్పుడే రాదని చెప్పిన వారి చెంపలు పగలగొడుతూ,  కలియుగ పాపాన్ని చప్పున పండించడానికి దేవయ్యను మరలా పుట్టించారు.

                   మతి లేని వాళ్ళు  ‘ దేవయ్యకు ఇల్లేది?’  అంటే — ‘ లోకమంతా ఆయనదే ‘ అంటూనే —  రాయీ, రాయీ, ఇటుకా , బెల్లం, తాపీలను,  తాపీ పనివాళ్లను లోకం నలుమూలల నుంచి పోగుచేసి, న్యాయాన్ని మధించి, కుదించి, ఒప్పించిన రాజ్య ధర్మాసనం ఆసరాతో దేవయ్యకు సర్వాంగ సుందరమైన ఇల్లు ఏర్పాటు చేశారు.

                    ఆ ఇల్లు  అలా ఇలా లేదు — ఆకాశరాజు నుండి నక్షత్రాలు తెచ్చి కుప్పలు పోసినట్లు, మెరుపులకు మెరుగులు దిద్దినట్లు ఉంది !

గాలి దేవుడు లోకంలో ఉన్న సమస్త కస్తూరి, పునుగు, జవ్వాది, కర్పూరాల రాశుల నుండి గాలి మోసుకొచ్చాడు. వరుణదేవుడు కరుణావర్షం కురిపించాడు. నేల భక్త గణాల్ని, శివతాండవుల్ని ఈనింది. లోకం సమస్తం దేవయ్య పునర్జన్మ చూడ్డానికి ప్రతి ఊరి నుండి, పట్టణాలు, నగరాల నుండి తుమ్మెదలు తండాలుగా ఎగిరి లోకాన్ని కమ్మేసినట్లు, దేవయ్య ఇంటికి వచ్చేసారు.

 ‘ హరోం హరా, హర హర హరా… ‘ అని పాడుకుంటూ, —

 పదండి ముందుకు, పదండి తోసుకు,  అని ఒకరినొకరు తోసుకుంటూ —

‘ అడవులు, కొండలు, ఎడారులా మనకడ్డంకి ‘   అని గర్జిస్తూ —

‘ పర్జన్య శంఖాలు ‘  పూరిస్తూ —

ఒక్క మాటలో చెప్పాలంటే —

 లోకమంతా శివాలెత్తింది !

                   ఎవరి కుల ధర్మం వారు పాటించాలంటూ, అన్ని కులాలకు రాజు గారి నుండి ఆదేశాలందాయి. బహుజన సోదరులు దేవయ్యకు కొత్త చెప్పులు కుట్టారు. దండోరాలు వాయించారు.

వడ్రంగి సోదరులు పాదుకలు చేసి పెట్టారు. స్వర్ణకారులు రత్నాభరణాలు చేశారు. నేతన్నలు బంగారు తీగలతో పంచెలు నేశారు. కుమ్మర సోదరులు  పాలాభిషేకాలకు కుండలు చేశారు. క్షురకసోదరులు గోళ్లు కత్తిరించి, సన్నాయి మేళం చేశారు. రజకులు దేవయ్యకు శుభ్రమైన వస్త్రాలు కట్టబెట్టారు. ఒకరనేమిటి —  అన్ని కులాల వారు (రాజ్యం కోసం, రాజు కోసం)  తమ కుల ధర్మం పాటించారు. ‘ సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు ‘ కొన్ని నెలలపాటు ఏకధాటిగా పనిచేశాయి.  విశ్వం కన్నా విశాలమైన దేవయ్యను శిలలో కుదిస్తే, కుదించారు గాక !

                  రాజుగారి కల నెరవేరింది. ‘ ఇంక లోకానికి వచ్చిన భయమేమీ లేదు.   అందరికీ ఆనందమే ఆనందం. ‘ అని రాజుగారు హామీ ఇచ్చి దేవయ్యకు మరో జన్మ ప్రసాదించారు.

                 తల్లి పాయసం తాగకుండానే, నవ మాసాలు మోయకుండానే దేవయ్య మళ్ళీ పుట్టాడు.

                  లోకం ప్రశాంతత సంతరించుకుంది.          ‘ అది తుఫాను ముందు ప్రశాంతతా? ‘  అని సంశయవాదులు అంటారు గాక ! — అది వారి ఖర్మ!

జయ దేవా ! జయ జయ దేవా !

 అయ్యా ! దేవయ్యా!

                 విశ్వమంతా ‘ ఓం’  శబ్దం నిశ్శబ్దంగా వినబడిందట ( వినగలిగిన వారికి !)

               ఆ మర్నాడు రాజుగారు మాట్లాడుతూ —

‘ ఇక మన జన్మలు ధన్యమయ్యాయి ! ‘

 ‘ మాధవసేవే మానవ సేవ ! ‘

  ‘ అందరూ సేవా దృక్పథంతో  దేవయ్యకు సేవ చేయండి’

 ‘ దేవయ్య కష్టాల ముందు మన కష్టాలు పెద్ద కష్టాలు కావు ‘ అని సందేశం ఇచ్చారు.

 కాని —

 ఎందుకో … ఎందుకో మరి

 అప్పుడే మళ్లీ పుట్టిన

  దేవయ్య కళ్ళల్లో కన్నీరు !

   ఆనందభాష్పాలా!?

 దేవయ్య  పెదాలు విషాదపు చిరునవ్వుతో

  వణికినట్లు అనిపించాయి ! —  నాలాంటి కొందరు మూర్ఖులకు!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles